విరాట్.. ఈ రకంగానూ సచిన్ తో సమానుడే!

ఇప్పటికే వన్డే సెంచరీల రికార్డు విషయంలో సచిన్ రికార్డు ను తిరగ రాసే దిశగా ముందుకు వెళుతున్నాడు విరాట్ కొహ్లీ. టీమిండియాలో ప్రధాన ఆటగాడిగా మారిన విరాట్ రానున్న రోజుల్లో ఇదే ఫామ్ నే…

ఇప్పటికే వన్డే సెంచరీల రికార్డు విషయంలో సచిన్ రికార్డు ను తిరగ రాసే దిశగా ముందుకు వెళుతున్నాడు విరాట్ కొహ్లీ. టీమిండియాలో ప్రధాన ఆటగాడిగా మారిన విరాట్ రానున్న రోజుల్లో ఇదే ఫామ్ నే కంటిన్యూ చేస్తే… వన్డేల్లో సచిన్ రాసి పెట్టి వెళ్లిన సెంచరీల రికార్డు అలవోగా ఇతడి వశం అవుతుంది. ఎవరికీ అందదనుకున్న రికార్డును విరాట్ తన పేరుకు ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఇలా సెంచరీల విషయంలో రెచ్చిపోవడమో, ఎమ్ ఆర్ ఎఫ్ బ్యాట్ ను వాడటం ద్వారానో కాదు… జట్టుకు చుక్కానిగా మారడం ద్వారా కూడా విరాట్ ఇప్పుడు సచిన్ స్థాయికి చేరాడు.

90 వ దశకంలో టీమిండియాలో అరివీరభయంకరమైన బ్యాట్స్ మన్లు ఉన్నారు.. అయితే జట్టు మొత్తం సచిన్ మీదే ఆధారపడే పరిస్థితి ఉండేది. అజహరుద్దీన్, అజయ్ జడేజా… గంగూలీ, ద్రావిడ్ వంటి క్లాస్ ప్లేయర్లు, స్ట్రోక్ ప్లేయర్లు ఉన్నా… ఇండియన్ టీమ్ అంటే సచిన్, సచిన్ అంటే టీమిండియా అన్న పరిస్థితే రాజ్యమేలింది. చాలా మ్యాచ్చుల్లో సచిన్ ఆడితే విజయం, లేకపోతే లేదన్న పరిస్థితే కొనసాగింది. దాదాపుగా 2002 వరకూ అదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత జట్టులోకి యువ ఆటగాళ్లు రావడంతో పరిస్థితి కొంచెం మారింది. అక్కడికీ 2003 ప్రపంచకప్ లో ప్రధానంగా సచిన్ రాణింపుతోనే ఇండియా ఫైనల్ వరకూ వెళ్లింది. 

ఇక నిన్నటి మ్యాచ్ లో ఆసీస్ నిర్దేశించిన 161 రన్నుల టార్గెట్ లో విరాట్ వంతు 82! కొట్టాల్సిన రన్నుల్లో సగానికి పైగా విరాట్ బ్యాట్ నుంచినే జాలువారాయి. ఇక టీమిండియాలోని ఇతర ధనాధన్ లు కలిసి అలసి సొలసి 79 రన్నులను సాధించాయి. నిన్నటి మ్యాచ్ లో ఏదశలో విరాట్ చిన్న పొరపాటు చేసి ఉన్నా… టీమిండియా విజయానికి బోలెడంత దూరం లోనే ఆగిపోయేది. లీగ్ దశ తోనే ఇంటి ముఖం పట్టేది. కేవలం నిన్నటి మ్యాచ్ మాత్రమే కాదు… చాలా మ్యాచ్ లను పరిశీలించినా వాటిల్లో విరాట్ విహారమే టీమిండియాకు విజయాన్ని తెచ్చి పెట్టిందనేది సుస్పష్టమైన అంశం. 

చేజింగ్ సమయాల్లో సచిన్ అయినా చాలా సార్లు ఫెయిలయ్యాడేమో కానీ.. ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొని అలవోకగా దూసుకుపోవడంలో విరాట్ కు సాటి వచ్చే సమకాలీకుడు కనపడటం లేదిప్పుడు. ఏదో ధోనీలా విన్నింగ్ షాట్ కొట్టి క్లాప్స్ కొట్టించుకోవడం లా కాకుండా మ్యాచ్ గెలిపించడాన్ని ఆసాంతం తన బాధ్యతగా తీసుకునే విరాట్ ను చూసి యావత్ భారతావణి గర్విస్తోంది. అయితే విరాట్ ఆడితేనే టీమిండియా సునాయాసంగా గెలిచే సంప్రదాయం మాత్రం అంత ఆనందించదగ్గ పరిణామం కాదు. పాక్ తో మ్యాచ్ లో విరాట్ చక్కగా ఆడాడు టీమ్ ను విజయతీరాలకు చేర్చాడు. ఇక బంగ్లాతో మ్యాచ్ లో ఇతడు ఫెయిలవ్వడంతో టీమిండియాకు బంగ్లా వణుకు పుట్టించగలిగింది. 

ఒకవేళ టీమిండియా గనుక ఈ సారి ప్రపంచ విజేతగా నిలవాలంటే మాత్రం దారుణమైన ఫామ్ తో జట్టులో కొనసాగుతున్న ధావన్, రోహిత్, జడేజా వంటి వాళ్ల ఆటతీరు లో చాలా మార్పు రావాల్సి ఉంది. సెమిస్ లో విండీస్ మీద గెలవాలన్నా, ఆ ఆటంకం దాటుకుని ఫైనల్ లో సత్తా చూపాలన్నా బ్యాటింగ్ లో టీమ్ ఎఫర్ట్ అవసరం. ఏక వ్యక్తి సైన్యంగా వ్యవహరించే సందర్భాల్లో ఏ జట్టు అయినా.. విజేతగా నిలవలేదని వేరే చెప్పనక్కర్లేదు. రైనా వంటి వాళ్లు జట్టులో ఎందుకు ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. టీమ్ గా చూస్తే.. ఇలాంటి ఆటతీరును కొనసాగించే జట్టుకు ఛాంపియన్ గా నిలిచే అర్హత అయితే ఉండదు. ఎంతసేపూ విరాటే ఆడాలంటే కుదరదు. అందులో మార్పు వస్తేనే.. ఈ సారి టీ20 లో భారత్ ప్రపంచ విజేత. లేకపోతే లేదంతే.