ఇంతకీ ఆ రోజు కన్నయ్య చేసినదేమిటి? మీటింగు ఆర్గనైజ్ చేశాడా? నినాదాలిచ్చాడా? విదేశీ శక్తులతో చేతులు కలిపి కుట్ర చేశాడా? అసలలాటి మీటింగు అక్కడ ఎందుకు జరిగింది? దీనిలో ఎబివిపి చేసినదేమిటి? వీటన్నిటికి కార్యక్షేత్రం అయిన జెఎన్‌యు నిజంగా దేశద్రోహుల, అసాంఘిక శక్తుల అడ్డానా? దాన్ని మూసేస్తే తప్ప దేశంలో దేశభక్తి పెరగదా? ఇవన్నీ తెలియాలంటే ముందుగా ప్రతిష్ఠాత్మకమైన జెఎన్‌యు గురించి, అక్కడి వాతావరణం గురించి తెలియాలి. పేరున్న విద్యాసంస్థ అనగానే ధనికుల పిల్లలు చేరేది అయి వుంటుందనే ఊహ పోతుంది. కానీ జెఎన్‌యు దానికి పూర్తిగా విరుద్ధమైన ఆదర్శాలతో స్థాపించబడింది. దేశంలోని వివిధ వర్గాల, ప్రాంతాల నుండి విద్యార్థులను ఆకర్షించాలని, వారిని సమానస్థాయిలో, ఒత్తిడిలేని చదువు చదువుకోనివ్వాలని, చదువుతో బాటు రాజకీయ, సాంఘిక దృక్పథాలను అలవర్చుకుని తమ ఆలోచనలను యితరులతో స్వేచ్ఛగా చర్చించే వాతావరణం అక్కడ కల్పించాలని, యూనివర్శిటీ బయటకు అడుగుపెట్టేసరికి దేశ పునర్నిర్మాణంలో పాలు పంచుకునే స్థాయిలో వారు ఎదిగేట్లా చూడాలనే లక్ష్యంతో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ చట్టం 1966లో రూపొందించబడింది. దానికి అనుగుణంగా 1019 ఎకరాలకు విస్తరించిన పెద్ద క్యాంపస్‌లో 1969లో యూనివర్శిటీ ప్రారంభించబడింది. ఈ 47 ఏళ్లల్లో అది దేశానికి ఎందరో మేధావులను అందించింది. వారు దేశవిదేశాల్లో ఎకడమిక్ సర్కిల్స్‌లో రాణిస్తున్నారు. రాజకీయ నాయకులైతే అందరికీ పరిచితులు కాబట్టి వారి పేర్లు చూసినా – సిపిఎంకు చెందిన సీతారాం యేచూరి, ప్రకాశ్ కారట్, బిజెపికి చెందిన నిర్మలా సీతారామన్, ఆప్‌కు చెందిన అశుతోష్ రాణా, ఎన్‌సిపికి చెందిన డిపి త్రిపాఠి, కాంగ్రెసుకు చెందిన…, యిలా ఎందరో వున్నారు. ఈ పేర్లు చెప్పగానే అది రాజకీయనాయకులను తయారుచేసే ఫ్యాక్టరీ అని తీర్మానించకూడదు. చదువులో దాని క్వాలిటీ గురించి చెప్పాలంటే నేషనల్ ఎక్రెడిషన్ అండ్ ఎసెస్‌మెంట్ కౌన్సిల్ (నాక్) 4 పాయింట్ల స్కేలుపై దానికి 3.91 పాయింట్లు యిచ్చింది. దేశం యీ విద్యాసంస్థను గర్వకారణంగా భావిస్తుంది కాబట్టి 7300 మంది విద్యార్థులను యీ సంస్థపై ఏటా రూ.163 కోట్లు ఖర్చు పెడుతోంది. అంటే ఒక్కో విద్యార్థిపై రూ.2.33 లక్షలన్నమాట!
నూటికి 95% మార్కులు పైబడి వచ్చినవారిని మాత్రమే తీసుకుని వారిని సానబెట్టి యీ గ్రేడ్ తెచ్చుకుందని అనుకోకూడదు. ఎడ్మిషన్‌కు వారు అవలంబించే విధానం విలక్షణమైనది. ఉదాహరణకి ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తే 'రీజనల్ డిప్రైవేషన్ ఇండెక్స్' కింద నాలుగు మార్కులు కలుపుతారు. కశ్మీరీ శరణార్థులైనా, తక్కువ ఆర్థికస్థాయి కుటుంబాల నుంచి వచ్చినా, యుద్ధంలో మరణించిన సైనికుల పిల్లలైనా, మహిళలైనా, వెనకబడిన కులమైనా, తలిదండ్రులు హైస్కూలు చదువు దాటకపోయినా మార్కులు కలుస్తాయి. కన్నయ్య సంగతే తీసుకుంటే అతను బిహార్‌లోని బెగుసరాయి జిల్లాలోని బిహాత్ గ్రామానికి చెందినవాడు. తండ్రి టెన్త్ క్లాసు దాటలేదు, తల్లి ఆంగన్‌వాడీ కార్యకర్త. కేసులో యిరుక్కున్న యితర విద్యార్థుల గురించి చెప్పినపుడు మీరు గమనించవచ్చు – ఏయే వర్గాల నుంచి, ఏయే ప్రాంతాల నుంచి, ఏయే స్థాయి కుటుంబాల నుంచి వారు వచ్చారో! ''క్రీమీ లేయర్'' గురించి నేను రాసిన వ్యాసంలో యిటువంటి రిజర్వేషన్ సిస్టమ్ వుండాలని వాదిస్తూ యోగేంద్ర యాదవ్ ఫార్ములా గురించి ప్రస్తావించాను. ఆయనా యిటువంటి సెలక్షన్ ద్వారానే యీ యూనివర్శిటీలో చదివి మేధావిగా వినుతికెక్కాడు.
ఏ రకమైన రిజర్వేషన్ వల్లనైనా సరే ప్రతిభకు చేటు వాటిల్లుతుందని వాదించేవారు జెఎన్‌యు ప్రయోగాన్ని గమనించాలి. దాన్ని ఒక ''రిపబ్లిక్ ఆఫ్ ఐడియాస్''గా రూపొందించిన ఘనత తొలి గురువులదే. జర్నలిస్టుగా కెరియర్ ప్రారంభించి యునైటెడ్ నేషన్స్‌లో 1965 నుంచి 69 వరకు భారత ప్రతినిథిగా పనిచేసిన జి.పార్థసారథి దాని తొలి వైస్‌ఛాన్సెలర్. అంతర్జాతీయ స్థాయిలో స్కాలర్‌గా పేరు తెచ్చుకున్న మూనిస్ రజా జెఎన్‌యుకు మొదట్లో ఆఫీసరు ఆన్ స్పెషల్ డ్యూటీగా, తర్వాత రెక్టర్‌గా పనిచేశారు. అక్కడ చదువును ఒక చట్రంలో బిగించకుండా విదేశీ యూనివర్శిటీల తరహాలో ప్రొఫెసర్ల ఆలోచనల మేరకు విద్యార్థుల భాగస్వామ్యంతో సిలబస్ రూపొందిస్తారు. విద్యార్థిని బట్టి కోర్సు కొత్తగా తయారుచేసే విధానం కూడా వుంది. పరీక్షా విధానంలో కూడా విద్యార్థులను సంప్రదిస్తారు. యూనివర్శిటీ కట్టినపుడే టీచర్ల క్వార్టర్లు, విద్యార్థుల హాస్టళ్లు పక్కపక్కన వుండేట్లు కట్టారు. ఒకరితో మరొకరికి సంపర్కం ఎక్కువగా వుండేట్లు చూశారు. యూనివర్శిటీలో శాఖలుండవు. వేర్వేరు స్కూళ్లు వుంటాయి. వాటన్నిటికి యూనివర్శిటీ ఎకడమిక్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో చోటిచ్చి వివిధ విభాగాల మధ్య సమన్వయం సాధించారు. చాలా మంది విద్యార్థులు ప్రొఫెసర్లగా మళ్లీ జెఎన్‌యుకు వచ్చి అదే పంథా కొనసాగిస్తున్నారు.
అక్కడ విద్యార్థి యూనియన్ ఎన్నికలు కూడా అమెరికా అధ్యక్ష ఎన్నిక తరహాలో వాదోపవాదాల తరహాలో జరుగుతాయి. విద్యార్థి సమూహాలను ఉద్దేశించి ప్రసంగించి, అందర్నీ ఒప్పించగలిగినవాడే నాయకుడిగా ఎన్నికవుతాడు. రకరకాల భావజాలాలకు చెందిన విద్యార్థి సంఘాలు అక్కడ వర్ధిల్లాయి. వాటిలో వామపక్ష సంస్థలు ఎక్కువన్నది వాస్తవం. కాలేజీల్లో, యూనివర్శిటీల్లో వామపక్షాలు తిష్ట వేసుకుని కూర్చున్నాయని చాలామంది వాపోతూ వ్యాఖ్యలు రాస్తూ వుంటారు. మధ్యవయసుకి ముందు కమ్యూనిస్టుగా వుండనివాడు, ఆ వయసు దాటాక కూడా కమ్యూనిస్టుగా మిగిలినవాడు యిద్దరూ కాస్త తేడా మనుషులే అని సామెత. విద్యార్థిదశలో వుండగా ఆదర్శాలలో మునిగి తేలడం వుంటుంది. డాక్టరై పేదలకు వుచితంగా వైద్యం చేయాలని, నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలని, గొప్పాబీదా భేదం లేకుండా అందర్నీ సమానంగా చూడాలని, సమసమాజం ఏర్పడాలని కలలు కంటారు. ఇప్పుడున్న సమాజంపై, టీచర్లపై, తలిదండ్రులపై, సాంఘిక మర్యాదలపై తిరుగుబాటు చేయాలని ఉబలాటపడతారు. మధ్యవయసు వచ్చేసరికి దగ్గర డబ్బు చేరుతుంది, దాన్ని యితరులతో పంచుకోవడానికి మనసు రాదు, మడి గట్టుకుని కూర్చుంటే పనులు జరగవనే లోకంతీరు బోధపడుతుంది, సమసమాజమా తొక్కా, నేను కష్టపడలేదా, వాణ్నీ కష్టపడమను, నా వాటా వాడికెందుకు యివ్వాలి? అనే వాదన మొదలెడతాడు.
విద్యార్థి దశలో వ్యవస్థకు వ్యతిరేకంగా తిరగబడేవాళ్లకు వామపక్ష భావజాలమే నచ్చుతుంది. వ్యవస్థను, పాతకాలపు విలువలను, రక్షిద్దామనే ఎబివిపి భావజాలం కిక్కు నివ్వదు. అందుకని విద్యార్థి సంఘాల్లో లెఫ్ట్ సంఘాలే ఎప్పుడూ ముందంజలో వుండేవి. ఇటీవలి కాలంలో సోషలిజానికి మోజు తగ్గింది. కార్మిక హక్కులకై పోరాడడంలో మజా కనబడటం లేదు. పెట్టుబడిదారుడు కార్మికచట్టాలు వర్తించని స్పెషల్ జోన్స్ చూపిస్తేనే పెట్టుబడి పెడతానంటూ కేంద్రాన్ని, రాష్ట్రాలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. యువత కూడా ఉద్యోగం వచ్చినపుడు 'యూనియన్లు లేకపోతే నష్టమేమిటి, అవి వుండడం వలన ప్రగతికి అడ్డు కూడా' అనే ఆలోచనలో వుంటూ, యజమాని హఠాత్తుగా ఉద్యోగంలోంచి తీసేసినపుడు మాత్రమే యూనియన్ అవసరాన్ని, యాజమాన్యం, యూనియన్ అనే రెండు శక్తులూ సమతూకంగా వుంటేనే మంచిదనే వాస్తవాన్ని గుర్తిస్తున్నారు. కానీ విద్యార్థిదశలో, నిరుద్యోగ దశలో కాపిటలిజంవైపే వుంటున్నారు. మీడియా కూడా అదే భావజాలాన్ని ప్రచారం చేయడం వలన దేశంలో ప్రస్తుతం కాపిటలిస్టు, రైటిస్టు శక్తుల విజృంభణ కారణంగా చాలా యూనివర్శిటీల్లో లెఫ్ట్ యూనియన్లు నీరసించాయి. ఆరెస్సెస్ విద్యార్థి విభాగమైన ఎబివిపి ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ ముందుకు దూసుకుపోతోంది.
1948లో స్థాపింపబడిన ఎబివిపికి ప్రస్తుతం 33 లక్షల మంది సభ్యులున్నారు. దేశంలోని 18 పెద్ద యూనివర్శిటీలలో యూనియన్లు వారి చేతిలోనే వున్నాయి. వాటిలో ఢిల్లీ యూనివర్శిటీ ఒకటి. అక్కడ నాలుగు కీలకమైన పోస్టులు గెలిచారు. ప్రతి యూనివర్శిటీలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం జరుగుతోంది. 2013లో ముజఫర్‌నగర్ జిల్లాలో 60 మంది చనిపోయిన ఘర్షణలకు సమాజ్‌వాదీ, బిజెపి పార్టీలే బాధ్యులంటూ తీసిన ''ముజఫర్‌నగర్ బాకీ హై'' అనే సినిమాను ఢిల్లీలోని కిరోరిమల్ కాలేజీలో గత ఆగస్టులో ప్రదర్శించబోతే ఎబివిపి అడ్డుకుంది. అలహాబాద్ యూనివర్శిటీ నిర్వహిస్తున్న సెమినార్‌కు సిద్దార్థ వరదరాజన్ అనే జర్నలిస్టును ఆహ్వానించబోతే 'అతను నక్సల్ సానుభూతిపరుడు, దేశద్రోహి, పిలవడానికి వీల్లేదు' అంటూ వైస్ ఛాన్సలర్ యింటి వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. చివరకు సెమినార్ జరిగే స్థలాన్ని మార్చవలసి వచ్చింది. ఎబివిపికి కొరుకుడు పడని యూనివర్శిటీల్లో జెఎన్‌యు ఒకటి – అది మితవాదం నుంచి అతివాదం దాకా అన్ని రకాల యూనియన్లు అక్కడున్నాయి. మార్క్సిస్టులు, లెనినిస్టులు, మార్క్సిస్ట్-లెనినిస్టులు, గాంధేయవాదులు, ఆంబేడ్కర్‌వాదులు, లోహియావాదులు యిలా రకరకాల జనాలున్నారు. రైటిస్టులకు కాలూనడానికి జాగా దొరకలేదు. మండల్ – మందిర్ వివాదసమయంలో మాత్రం కొందరు ఆ తరహాలో మాట్లాడారు. మళ్లీ 2001లో కేంద్రంలో వాజపేయి ప్రభుత్వం వున్నపుడు కొన్ని సీట్లు గెలిచి అధ్యక్షపదవిని కైవసం చేసుకుంది. మళ్లీ గత ఏడాది రెండు సీట్లు గెలిచి జాయింటు సెక్రటరీ పదవి దక్కించుకుంది. ఎంతైనా తక్కిన చోట వున్న ఎబివిపి యూనిట్లకు, యిక్కడ వున్న యూనిట్లకు తేడా వుంది. చర్చ, వాదన అనే జెఎన్‌యు సంస్కృతికి లోబడే యీ యూనిట్ పనిచేసింది. ఇటీవలి కాలంలో మోదీ ప్రధాని అయ్యాక ఎబివిపి మళ్లీ పుంజుకోసాగింది. (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)