నా ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది అని మోదీ యిచ్చిన ప్రసంగం కాస్త గందరగోళం సృష్టించింది. సర్వశక్తిమంతుడని, అవినీతిని దునుమాడి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, అంతర్జాతీయంగా దేశప్రతిష్ఠ పెంచుతాడని ఆశలు పెట్టుకుని గెలిపించిన వ్యక్తి యిలా బేలగా మాట్లాడడం అభిమానుల్లో నిరాశ కలిగించింది. 'నాపై కుట్ర పన్నుతున్నారు' అన్నారు. ఎవరు? ప్రతిపక్షాలా? వాళ్ల కంత శక్తేదీ? కాంగ్రెసు పార్టీ చూడబోతే తల్లికి నీరసం, కొడుక్కి నిరాసక్తత. తప్పదురా దేవుడా అన్నట్టు ఓ సారి కనిపించి ఏదో అవకతవకగా మాట్లాడి మాయమై పోతాడు. ఒక నిర్మాణాత్మక కార్యక్రమం లేదు, ఒక మార్గదర్శకత్వం లేదు. ఎక్కడైనా కాంగ్రెసు పార్టీ బతికి బట్టకడుతోందంటే స్థానికంగా వున్న నాయకుల కృషి వలనే తప్ప, అధిష్టానం ప్రమేయం వలన కాదు. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇక వాళ్లేం కుట్ర పన్నుతారు? ఇక లెఫ్ట్ – కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుందామా వద్దా అని వాళ్లల్లో వాళ్లే కుమ్ములాడుకుంటున్నారు. జనతా పరివార్ చూద్దామా అంటే అదెక్కడుందో వాళ్లకే తెలియదు. తృణమూల్, బియస్పీ, ఎడిఎంకె వగైరాలు ఎవరి ధ్యాసలో వాళ్లున్నారు. ఎడిఎంకె యిటు వచ్చేసినా వచ్చేస్తుంది. అందువలన ప్రతిపక్షాల నుంచి భయపడవలసినది ఏమీ లేదు. మరి విదేశీ శక్తులా? మోదీగారు మ్యాప్‌లో కనబడే దేశాలన్నీ చుట్టబెట్టి వాళ్లతో చెట్టాపట్టాలు వేసుకుని, సెల్ఫీలు దిగి వచ్చారు. వాళ్లకు పాపం యీయన మీద కసెందుకుంటుంది?
తన మీద కక్ష కట్టి కుట్ర పన్నుతున్నవారిలో రెండు వర్గాల వారిని ఆయన పేర్కొన్నాడు. యూరియా కంపెనీవాళ్లు, ఎన్జీఓలు (స్వచ్ఛంద సంస్థలు). దేశంలోని పెద్దపెద్ద పరిశ్రమలతో పోలిస్తే యూరియా కంపెనీల సత్తా ఎంత? వాళ్లు ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దామనుకుంటే, స్థిరపరచడానికి దాని బాబుల్లాంటి కంపెనీలు లేవా!? ఇక ఎన్జీఓలు. వాటి వ్యవహారం ఎప్పణ్నుంచో అనుమానాస్పదమే. వాటిలో చాలా భాగం నల్లధనాన్ని తెలుపు చేసుకునేందుకు ఉద్దేశించినవి. మరి కొన్ని తమ తరఫున పనిచేయడానికి విదేశీ గూఢచారి సంస్థలు, విదేశీ కంపెనీలు, మతశక్తులు నియమించుకున్నవి. వాటిలో మన దేశప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసేవి చాలా వుంటాయి. వీటికి తోడు పోటీ కంపెనీ ప్రాజెక్టులకు పర్యావరణం పేరో, మానవహక్కుల పేరో అడ్డుపడడానికి మన కంపెనీలే సృష్టించిన ఎన్జీవోలు వుంటాయి. ఇవన్నీ ఇవాళ పుట్టుకొచ్చినవి కావు, ప్రధానిగా ఎవరున్నా వాటి దుశ్చర్యలు సాగుతూనే వుంటాయి. వాటి నిర్వహణపై ఆరోపణలు, విచారణలు సాగుతూనే వుంటాయి. సిబిఐ కితం ఏడాది యిచ్చిన నివేదిక ప్రకారం దేశంలో 31 లక్షల ఎన్జీవోలున్నాయి. అంటే ప్రతి 400 మంది భారతీయులకు ఒకటన్నమాట! దేశంలో వున్న మొత్తం స్కూళ్ల కంటె యిది రెట్టింపు, ఆస్పత్రుల కంటె 250 రెట్లు! ఇవన్నీ పొద్దస్తమానం సమాజసేవ చేసేస్తూ వుంటే మరి సమాజం యింకా యిలా వుందేం అనుకుంటున్నారా, వీటిలో 1.5% మాత్రమే పనిచేస్తున్నాయట. పనిచేసినా, చేయకపోయినా ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి కానీ వాటిలో 10% కంటె తక్కువ మందే ఫైల్ చేస్తున్నారు. విదేశీ సాయం గురించి చెప్పాలంటే 23,712 వాటికి విదేశీ విరాళాలు ఏటా 11 వేల కోట్లకు పైగా అందుతున్నాయి. దానిలో అమెరికా వంతు 30%్ల. ఇదంతా చూసి యుపిఏ ప్రభుత్వ హయాంలోనే 2010లో చట్టాన్ని సవరించి వాటికి ముకుతాడు వేసి, బ్లాక్‌లిస్టు చేయడం జరిగింది. మోదీ సర్కారు వచ్చాక మరింత వేగంగా ఆ పని జరుగుతోంది. అవి ప్రభుత్వంపై కుట్ర పన్నేసి, పడగొట్టే స్థాయికి వచ్చాయనుకుంటే అంతవరకు రానిచ్చినందుకు ఇంటెలిజెన్సు వైఫల్యం అని చెప్పుకోవాలి. దానికి మోదీ సర్కారే సంజాయిషీ చెప్పుకోవాలి.
నాయకుడనేవాడికి కుట్రలు, పన్నాగాలు తప్పవు. బయటి దేశాలే కాదు, దేశంలోని శత్రువులే కాదు, పార్టీలో వుండే శత్రువులు కూడా ఏవో ఒక ప్రయత్నం చేస్తూనే వుంటారు. వాళ్లను అదుపు చేస్తూనే పైకి 'అలాటిదేమీ లేదు, మీరేం భయపడనక్కరలేదు, నేనున్నాను, నీకేం కాదు' అని నమ్ముకున్నవారికి ధైర్యం చెపుతూ వుండాలి. అలాకాకుండా నాపై ఎవరో కుట్ర పన్నారు, ఎవరో బలహీన పరచడానికి చూస్తున్నారు అని చెప్పడం దేనికి సంకేతం? మన్మోహన్ లాటి బిడియస్తుడు కాదు, ఇటుక బెడ్డకు కంకర్రాయితో జవాబు చెప్పగల 50 యించిల ఛాతీ మోదీ వంటివాడే ప్రస్తుత తరుణంలో మన దేశానికి కావాలి అనుకునే కదా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఏకపక్షంగా బిజెపికి పట్టం కట్టారు. ఎవరి సాయం లేకుండా సొంతకాళ్లపై నిలబడే దర్జాను కొన్ని దశాబ్దాల తర్వాత ప్రస్తుత ప్రభుత్వం అనుభవిస్తోంది. ఏం చేసినా, ఏం చేయకపోయినా అడిగేవాడు లేడు, అడిగినా ఖాతరు చేసేవాడు లేడు. ఇలాటి టైములో యిలాటి ఉపన్యాసం ఎందుకు? ఇక్కడే ఇందిరా గాంధీ గుర్తుకు వస్తుంది. ఇందిరకు, మోదీకి యిప్పటికే చాలా పోలికలు కనబడ్డాయి. సామర్థ్యం, ప్రతిక్షకులను అణచివేయడం, విమర్శలు లెక్కచేయకపోవడం, అధికారమంతా గుప్పిట్లో పెట్టుకుని సహచరులకు ప్రాముఖ్యత యివ్వకపోవడం… యిలా! ఇప్పుడు యిదో పోలిక కనబడుతోంది. ఇందిర కూడా మాట్లాడితే 'విదేశీ హస్తం', 'సిఐఏ కుట్ర', 'మతతత్వవాదుల, వేర్పాటువాదుల, విచ్ఛినశక్తుల, పెట్టుబడిదారుల వ్యూహం' 'పేదల పక్షపాతిగా వున్నానని నన్ను సహించలేకపోతున్నారు, నన్ను చంపడానికి చూస్తున్నారు' లాటి ఉపన్యాసాలు యిస్తూ వుండేది. ఇదంతా ప్రధాని అయ్యాక నియంతగా మారే దశలో వినబడేది. మోదీ వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. అప్పుడే పాట మొదలెట్టేశారు. ఈయనా ఇందిరలాగానే 'ఈ శక్తులను నియంత్రించాలంటే, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే యిప్పుడున్న చట్టాలు సరిపోవు, దేశంలో అసాధారణ పరిస్థితి ఏర్పడింది కాబట్టి పరిష్కారం కూడా అసాధారణంగా వుండాలి' అంటాడేమో. ఆవిడా యిలాగే కొత్తకొత్త చట్టాలు పెట్టి, తనకు ఎవరూ ఎదురాడకుండా చేసుకునేది. చివరకు ఎమర్జన్సీ విధించింది. మోదీ యిప్పుడే ఎమర్జన్సీ బాట తొక్కకపోవచ్చు కానీ తన చేతిలో మరింత శక్తిని కేంద్రీకరించుకునేందుకు కొత్త చట్టాలు చేస్తారేమో! ఈ ఊహాగానం నిజం కాకూడదని కోరుకుందాం.
ఇందిర తను మహిళ కాబట్టి అవమానాలు ఎదుర్కోవలసి వస్తోందని వాపోయేది. మోదీకి ఆ సౌలభ్యం లేదు కాబట్టి, చాయ్‌వాలా పాట మళ్లీ పాడారు. చాయ్‌వాలా ప్రధాని కావడం కొందరు సహించలేకపోతున్నారుట. చాయ్‌తో పాటు దేశాన్ని అమ్మడం గురించి ఓ కాంగ్రెసు నాయకుడు ఓ వ్యాఖ్య చేస్తే దాన్ని పట్టుకుని ఎన్నికల సమయంలో రాపాడించారు సరే, యిప్పుడు 20 నెలలగా పదవిలో వుంటూ దాన్ని ప్రస్తావించడం అవసరమా? చాయ్‌వాలా నేపథ్యానికి అభ్యంతరం వుంటే ప్రజలు అంత మెజారిటీ కట్టబెట్టేవారా? ఇందిర మరణం తర్వాత రాజీవ్ పోటీ చేసినపుడు బిజెపి వారు అతన్ని ఎయిర్‌హోస్టెస్‌లతో ముచ్చట్లాడే పైలట్, రాజకీయాలేం తెలుస్తాయి అని ఎద్దేవా చేశారు. అతనికి సహాయకులుగా వున్న అరుణ్ నెహ్రూ, అరుణ్ సింగ్‌లను వాళ్ల పాత ఉద్యోగాల పేరు పెట్టి పెయింట్వాలా, పాలిష్‌వాలా అని వెక్కిరించారు. రాజీవ్ కోరికపై బహుగుణపై పోటీ చేసిన అమితాబ్ బచ్చన్‌ను నౌటంకీవాలా అన్నారు. (సినిమాతారలు రాజకీయాల్లోకి రావడం దక్షిణాదిన జీర్ణించుకున్నట్లు ఉత్తరాదిన చాలాకాలం జీర్ణించుకోలేకపోయారు. ఉత్తరాది కుటుంబాలలో సంగీతం, నృత్యం నేర్చుకోవడం మర్యాదస్తుల లక్షణం కాదు. ఇటీవలే వారి దృక్పథంలో మార్పు వస్తోంది.) ఎవరేమన్నా ప్రజలు వారందరినీ ఆదరించారు. రజనీకాంత్ రేపు తమిళనాడు రాజకీయాల్లోకి వస్తే 'నువ్వు ఒకప్పుడు బస్ కండక్టరు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి కావడం మేం సహించలేం' అంటారా? దొంగలు, స్మగ్లర్లు కూడా మేం వృత్తి మానేశాం, మంచివాళ్లమై పోయాం అంటే వాళ్లకీ ఓట్లేస్తున్నారు.
ఈ 'చాయ్‌వాలా' యిమేజి మోదీ ప్రధాని పబ్లిసిటీ కాంపెయిన్లో డిజైన్ చేసిన రూపం. గుజరాత్ ఎన్నికలలో మోదీ ఎన్నడూ చాయ్‌వాలా కథ చెప్పలేదు. సోనియా, రాహుల్‌ల హై ఫ్లయి స్టయిల్‌కు కాంట్రాస్టుగా 'అండర్డాగ్' యిమేజి ఎలా బిల్డ్ చేయాలా అనుకుని ఆలోచించి తయారుచేసిన మోడల్ యిది. ఎన్నికల సమయంలో 'చాయ్‌పై చర్చా' అంటూ ఊదరగొట్టి టీ తాగినప్పుడల్లా మోదీ గుర్తుకు వచ్చేట్లు చేసి విజయం సాధించారు. నెగ్గి ప్రధాని అయ్యాక చాయ్‌వాలా వేషం యిప్పేసి, రోజుకు మూడు డ్రస్సులు మార్చే పూలరంగడు అయిపోయారు. హరేరామ హరేకృష్ణ పేర్లు వరుసగా రాసి వున్న శాలువాలు రాముడు, కృష్ణుడు ఎన్నడూ ధరించి వుండరు కానీ తన పేరు ఫుల్‌గా రాసి వున్న సూటులో మోదీ సూట్వాలాగా అవతరించారు. బుద్ధిమంతుడు రాముడు, కొంటెతనాల కృష్ణుడు ఒక్కరే అనే దేవరహస్యం కనుక్కోలేని భక్తగణం తత్తరపడడంతో ఆ సూటు వేలం వేసేశారు. జాంబవంతుడుకి కాస్సేపు రాముడి గెటప్‌లో కనబడి కన్విన్స్ చేసి మణిని, కన్యామణిని స్వీకరించిన కృష్ణుడిని గుర్తు చేసుకుని, ఒరిజినల్‌గా నేను చాయ్‌వాలానే అని మనకు గుర్తు చేయడానికి మళ్లీ యీ పల్లవి ఎత్తుకున్నారు. అయినా చాయ్‌ని మరీ మరిగించేస్తే వికటిస్తుంది. ఇటీవల యుకెలో చెప్పారు – మోదీ పర్యటనకు ఏడాది ముందు నుంచి అక్కడ మోదీ అభిమానులు, ముఖ్యంగా గుజరాతీలు లాబీయింగు మొదలుపెట్టారట. ఇండియన్ హై కమిషన్ ద్వారా భారతీయుల సాంస్కృతిక సంఘాల వివరాలు, ఆఫీసు బేరర్ల పేర్లు, వివరాలు సేకరించి వారిని సంప్రదించారట. 'మీ సంఘంలో 'చాయ్ పే చర్చా' అని కార్యక్రమం నిర్వహించి దాన్ని వీడియో తీసి మాకు పంపించండి. ఆ క్లిప్పింగులతో మేం డాక్యుమెంటరీ తయారుచేసుకుంటాం' అని కబురు పెట్టారట. అంటే వాటిలోంచి మోదీని హైలైట్ చేస్తూ మాట్లాడినవి ఏరుకుని తమకు కావలసిన ప్రచారచిత్రం చేసుకుంటారన్నమాట.
ఇది విని ''చాయ్ పే చర్చా' అని పెట్టం కానీ, 'పెట్రోల్ పే పేశ్కశ్' (విన్నపం) అని పెడితే ఓకేనా?' అని అడగాల్సింది'' అన్నా. ఎందుకంటే మోదీ గాఢాభిమానులకు కూడా పెట్రోలు విషయంలో మోదీ ఎకనామిక్స్ మింగుడు పడటం లేదు. గతంలో అంతర్జాతీయంగా పెట్రోలు ధర పెరిగినప్పుడల్లా యిక్కడా పెరిగేది, అదొక్కటేనా, పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహన, వాహనేతర రంగాలన్నిటిపై ఆ ప్రభావం పడేది. బస్సు టిక్కెట్లు పెరిగేవి, రవాణా ఖర్చు పెరిగిందంటూ సకల వస్తువుల ధరలు పెరిగేవి. ఇవన్నీ దశాబ్దాలుగా చూస్తూ వచ్చాం. ఇప్పుడు అక్కడ చమురు ధరలు 30%కు పడిపోయాయి. మరి యిక్కడ పడవేం? మిగుల్చుకున్న డబ్బంతా ప్రభుత్వం ఏం చేస్తోంది? పాత బకాయిలు తీరుస్తున్నాం అంటారు. అవన్నీ అంతర్గతమైనవే కదా, కాస్త కాస్త తీరుస్తూ సగం బెనిఫిట్టయినా ప్రజలకు అందిస్తే సంతోషిస్తారు కదా. మిగిల్చిన డబ్బుతో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు చేపట్టి, పర్యావరణం, ప్రజారోగ్యం కాపాడతారా అంటే అదీ లేదు. దానికి మళ్లీ వేరే సెస్సు! మరి పెట్రోలుతో మిగిలిన డబ్బు సర్దార్ పటేల్ విగ్రహానికి, బుల్లెట్ ట్రెయిన్లకు యిలాటి హంగులకు పోతోందన్నమాట! చాయ్‌వాలా స్థాయి నుంచి పైకి వచ్చిన మనిషి కాస్సేపు సామాన్యుడిలా మారి ఆలోచిస్తే దేనికి ప్రాధాన్యత యివ్వాలో తెలుస్తుంది. సామాన్యులకు ఉపయోగపడే బజెట్ తయారుచేసి అమలు చేస్తే చాలు, నాపై కుట్ర జరుగుతోంది లాటి హారర్ స్టోరీల వలన మాకు ఒరిగేది ఏమీ లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)