టీఆర్‌ఎస్‌కు భయమా?

టీఆర్‌ఎస్‌కు భయం కలుగుతోందా?  ప్రభుత్వం పడిపోతుందేమోననే భయం అంతర్గతంగా ఉందా? అందుకే ఇతర పార్టీల నాయకుల కోసం గాలం వేస్తోందా? ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ ప్రధాన వ్యూహం అదేనా? …ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు ‘అవును’ అనే…

టీఆర్‌ఎస్‌కు భయం కలుగుతోందా?  ప్రభుత్వం పడిపోతుందేమోననే భయం అంతర్గతంగా ఉందా? అందుకే ఇతర పార్టీల నాయకుల కోసం గాలం వేస్తోందా? ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ ప్రధాన వ్యూహం అదేనా? …ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు ‘అవును’ అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాస్త లోతుగా తరచి చూస్తే ఇది  నిజమేననిపిస్తుంది. ఎందుకంటే టీఆర్‌ఎస్‌కు తెలంగాణ సాధించిందన్న పేరు, ఘనత వచ్చినప్పటికీ బంపర్‌ మెజారిటీ మాత్రం రాలేదు. మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే నాలుగైదు సీట్లు ఎక్కువొచ్చాయి. 63 సీట్ల బొటాబొటి మెజారిటీతో టీఆర్‌ఎస్‌ సర్కారు ఏర్పడిరది. ఏ కారణాలవల్లనైనా ఐదారుగురు ఎమ్మెల్యేలు బయటకు పోతే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు సర్కారుకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కాని భవిష్యత్తులో ఎప్పుడైనా విపత్తు ముంచుకురాదని గ్యారంటీ ఇవ్వలేం కదా…! రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. దీంతో కేసీఆర్‌ ముందు జాగ్రత్త చర్యగా ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నాయకులకు గాలం వేస్తున్నారు. అందుకే మంత్రివర్గంలో మిగిలిన సీట్లు భర్తీ చేయకుండా వదిలేశారు. కేసీఆర్‌ వ్యూహంలో రెండు కోణాలున్నాయి. ఒకటి మొత్తం మీద పార్టీ బలం పెంచుకోవడం, రెండు పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాల్లో బలోపేతం చేయడం. టీఆర్‌ఎస్‌ బలమంతా ఉత్తర తెలంగాణలోనే ఉంది. ఎన్నికల్లో అక్కడే ఎక్కువ సీట్లు వచ్చాయి. మరోమాటలో చెప్పాలంటే ఆ జిల్లాల్లో స్వీప్‌ చేసింది. 

కాని రాజధాని హైదరాబాద్‌తో పాటు మిగిలిన జిల్లాల్లో తక్కువ స్థానాలే వచ్చాయి. రెండు మూడు జిల్లాల్లో నామమాత్రమనే చెప్పాలి. కాబట్టి తెలంగాణ సాధన తమ ఘనతే అని టీఆర్‌ఎస్‌ చెప్పుకున్నా అది వంద శాతం ఎన్నికల్లో ప్రతిఫలించలేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ టీఆర్‌ఎస్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడితే ప్రభుత్వానికి ముప్పు వాటిల్లుతుంది. అందుకే కాంగ్రెసు, టీడీపీ, వైకాపాల నాయకులను లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇలా లాక్కోవాలంటే ఆయా పార్టీల్లో నాయకుల మధ్య జరుగుతున్న ఘర్షణలను గమనిస్తూ, అధినేతలపై వారి అసంతృప్తిని గ్రహిస్తూ వారిని ప్రలోభాలకు గురిచేసి బయటకు లాక్కురావాలి. ఆ నాయకులు సొంత పార్టీలను వదలి బయటకు రావాలంటే వారికి తగిన ప్రతిఫలం అందచేయాలి. ఆ నాయకుల స్థాయిని బట్టి మంత్రి పదవులు, పార్టీ పదవులు, కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వంటి పదవులు ఇవ్వాలి.

ఇదే సమయంలో బయటి పార్టీల్లోని నాయకుల రాకను టీఆర్‌ఎస్‌లోని నాయకులు అడ్డుకుంటారు. వారికి నచ్చచెప్పాలి. ఎందుకంటే వీరు వచ్చినందువల్ల పదవుల్లో, ప్రాధాన్యంలో వారికి అన్యాయం జరుగుతుంది. టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి రాకను టీఆర్‌ఎస్‌ నాయకుడు కడియం శ్రీహరి తీవ్రంగా వ్యతిరేకించారు. వీరద్దరిదీ వరంగల్‌ జిల్లానే. ప్రస్తుతానికి ఎర్రబెల్లి జంపింగ్‌ చేయడంలేదనుకోండి అది వేరే విషయం. ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావును లాగేసిన టీఆర్‌ఎస్‌ అంతకు మించిన బలమైన టీడీపీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావును రప్పించుకుంది. ఇది టీఆర్‌ఎస్‌ సాధించిన గొప్ప విజయంగా చెప్పుకోవాలి. జిల్లాలో వైకాపాకు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. వారిని కూడా లాగాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలాగే ఇతర జిల్లాల్లోనూ ప్రయత్నాలు సాగిస్తోంది.

టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పటికీ రాజధానిలో బలం లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌ కార్పొరేషన్  ఎన్నికల్లో ఘన విజయం సాధించి నగర పాలక సంస్థను చేజిక్కించుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది. అందుకే ఇతర పార్టీల్లో నగరానికి చెందిన నాయకుల కోసం చూస్తోంది. టీడీపీలో తలసాని శ్రీనివాస యాదవ్‌, ఆర్‌ కృష్ణయ్య, ఇంకా కొందరిని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీని దెబ్బ తీయడమే టీఆర్‌ఎస్‌ లక్ష్యం. టీడీపీతో ఏనాటికైనా తనకు ముప్పు వుండొచ్చని టీఆర్‌ఎస్‌ భయపడుతోంది. తెలంగాణలో అట్టడుగు సామాజిక వర్గాలవారిని రాజకీయంగా పైకి తీసుకువచ్చింది టీడీపీయే. మొన్నటి సాధారణ ఎన్నికల్లోనూ టీడీపీ గణనీయమైన స్థానాలు సాధించి టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరింది. దీంతో టీడీపీని ధ్వంసం చేస్తే తాను రాజకీయంగా బలం పెంచుకోవచ్చని, వచ్చే ఎన్నికల్లోనూ విజయపతాక ఎగరేసి అధికారం చేపట్టవచ్చని టీఆర్‌ఎస్‌ అనుకుంటోంది. 

ఎం. నాగేందర్