10 కోట్లు ఏ మూలకి.?

‘లింగ’ సినిమా వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సినిమా అంచనాల్ని అందుకోలేక బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డంతో, డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ల ఆందోళనతో నిర్మాత ఇప్పటికే గగ్గోలు పెడ్తుండగా, మధ్యలో…

‘లింగ’ సినిమా వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సినిమా అంచనాల్ని అందుకోలేక బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డంతో, డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ల ఆందోళనతో నిర్మాత ఇప్పటికే గగ్గోలు పెడ్తుండగా, మధ్యలో రజనీకాంత్‌ కల్పించుకుని, ఇంకొందరు సినిమా పెద్దలు మధ్యవర్తిత్వం వ్యవహరించి పది కోట్లు చెల్లించడానికి ఒప్పందం కుదిర్చారు. అలా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్‌ మధ్య వివాదం కాస్త సద్దుమణిగింది.

అయితే, ‘లింగ’ బాధితుల్లో ముగ్గురు మాత్రం తమతో సంప్రదించకుండా తిరుపూర్‌ సుబ్రహ్మణ్యం మొత్తం వ్యవహారాన్ని నడిపించారనీ, తమ నష్టాల సంగతేంటని ప్రశ్నిస్తూ మీడియాకెక్కారు. ఈ ముగ్గురూ సుమారు 14 కోట్ల రూపాయలు నష్టపోయారు ‘లింగ’ సినిమా పేరుతో. తిరుపూర్‌ సుబ్రహ్మణ్యం గతంలో రజనీకాంత్‌ సినిమాలతో కోట్లు గడిరచి, ఈ సందర్భంలో తమను నట్టేట్లో ముంచుతున్నారన్నది ఆ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్ల ఆరోపణ.

ఆ ముగ్గురే చెంగల్‌ పట్టు డిస్ట్రిబ్యూటర్‌ మన్నన్‌, ఉత్తర, దక్షిణ అర్కాడు డిస్ట్రిబ్యూటర్‌ కృష్ణమూర్తి, నెల్లై డిస్ట్రిబ్యూటర్‌ రూపన్‌. ఇప్పుడు ‘లింగ’ నిర్మాతలకు ఈ ముగ్గురూ కొత్తగా తలనొప్పి అయ్యారు. తమ డిమాండ్లపై స్పందించకపోతే నిర్మాత ఇంటిముందూ, హీరో ఇంటి ముందూ, తిరుపూర్‌ సుబ్రహ్మణ్యం ఇంటి ముందూ ఆందోళనలు చేయడమే కాదు, నిరాహార దీక్షలూ చేస్తామంటున్నారు.

మరోపక్క, డిస్ట్రిబ్యూటర్లతోపాటు, వారి వద్దనుండి సినిమాని కొనుక్కున్న కిందిస్థాయి పంపిణీదారులు, ఎగ్జిబిటర్లూ తమ నష్టాలకు సమాధానం చెప్పాలంటూ ఆందోళనకు సిద్ధమవుతుండడం గమనార్హం.