ఓటముల్లో ధోనీసేన డబుల్‌ హ్యాట్రిక్‌

గొప్పదైనా, చెడ్డదైనా రికార్డు రికార్డే కదా. ధోనీసేన టెస్టుల్లో డబుల్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసింది. ఆగండాగండీ.. ఇది గెలుపు హ్యాట్రిక్‌ కాదు.. ఓటముల హ్యాట్రిక్‌. మొత్తంగా ఆరు టెస్ట్‌ సిరీస్‌లను ఓడిపోయింది టీమిండియా. ఈ…

గొప్పదైనా, చెడ్డదైనా రికార్డు రికార్డే కదా. ధోనీసేన టెస్టుల్లో డబుల్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసింది. ఆగండాగండీ.. ఇది గెలుపు హ్యాట్రిక్‌ కాదు.. ఓటముల హ్యాట్రిక్‌. మొత్తంగా ఆరు టెస్ట్‌ సిరీస్‌లను ఓడిపోయింది టీమిండియా. ఈ ఏడాదిలో అయితే టీమిండియా ఒక్క టెస్ట్‌ సిరీస్‌ కూడా గెలవకుండా అభిమానుల్లో పూర్తిస్థాయి నిరాశను మిగిల్చింది.

ఆస్ట్రేలియాలో ఇప్పటికే రెండు టెస్టుల్ని కోల్పోయిన టీమిండియా, ముచ్చటగా మూడో టెస్ట్‌నీ కోల్పోయే ప్రమాదంలో పడినా, చివరి నిమిషంలో ధోనీ టీమిండియాను గట్టెక్కించాడు.. అంటే గెలిపించలేదుగానీ, డ్రా అవడంలో కాస్త కష్టపడ్డాడు. ఇదే కష్టం, రెండో టెస్ట్‌లో ధోనీ ప్రదర్శించి వుంటే ఏమన్నా ఉపయోగముండేదేమో.

మూడో టెస్ట్‌ డ్రా అవడంతో, నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ని ఇంకో మ్యాచ్‌ మిగిలి వుండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. వాస్తవానికి తొలి టెస్ట్‌ పూర్తిగా టీమిండియా వైపే మొగ్గుచూపింది. చివరి నిమిషంలో టీమిండియా చేతులెత్తేయగా, రెండో టెస్ట్‌లోనూ అదే పరంపర కొనసాగించింది. మూడో టెస్ట్‌లోనూ దాదాపు అదే పరిస్థితి.

ఏదిఏమైనా, ఈ ఏడాది భారత క్రికెట్‌కి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. వన్డేల్లోనూ పరాజయాలున్నా అవి ఓ మోస్తరుగానే. టెస్ట్‌ పరాజయాలే మరీ దారుణంగా అభిమానుల్ని ఆవేదనకు గురిచేశాయి. ఈ ఏడాదిలో ఏడు టెస్ట్‌ల్లో టీమిండియా వైఫల్యం చవిచూసింది. రెండింటిని డ్రా చేసుకుంది.