రివ్యూ: బూచమ్మ బూచోడు
రేటింగ్: 2/5
బ్యానర్: స్నేహ మీడియా అండ్ హేజస్ ఎంటర్టైన్మెంట్
తారాగణం: శివాజీ, కైనాజ్ మోతివాలా, బ్రహ్మానందం, తాగుబోతు రమేష్, పోసాని కృష్ణమురళి, చంద్ర తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
కూర్పు: ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం: విజయ్ మిశ్రా
నిర్మాతలు: రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్ రెడ్డి
దర్శకత్వం: రేవన్ యాదు
విడుదల తేదీ: సెప్టెంబర్ 5, 2014
‘కాంచన’, ‘ప్రేమకథా చిత్రమ్’, ‘గీతాంజలి’ వంటి హారర్ కామెడీలు విజయవంతం కావడంతో ప్రేక్షకులు ఈ జోనర్‌ని ఎంజాయ్ చేస్తున్నారనే విషయాన్ని గుర్తించిన వారు ఈ రూట్లో వెళితే సక్సెస్ ఈజీగా దొరుకుతుందని వాటిని ఫాలో అయిపోతున్నారు. ‘బూచమ్మ బూచోడు’ కూడా హారర్ పేరిట జనాన్ని భయపెడుతూ, అదే సమయంలో నవ్వించడానికి చేసిన ప్రయత్నమే. అయితే నవ్వించడం ఎలాగో తెలియక దెయ్యాలతో మగాళ్లని రేప్ చేయించే సన్నివేశాలు, వాటి పర్యవసానాలతో చీప్ కామెడీ చేసి గిలిగింతలు పెట్టాలని చూసారు.
కథేంటి?
భార్యాభర్తలైన కార్తీక్ (శివాజీ), శ్రావణి (కైనాజ్) కొత్తగా కొనుక్కున్న ఫామ్ హౌస్‌లో ఏకాంతంగా గడపడానికి వెళతారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ ఇద్దరూ ఒక రాత్రి అకారణంగా ఒకర్నొకరు కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకున్నారనేది ఇద్దరికీ తెలియదు కానీ ఆ ఇంట్లోనే ఏదో ఉందనే సంగతి మాత్రం అర్థమవుతుంది. కార్తీక్ భయపడ్డట్టుగానే ఆ ఇంట్లో అదృశ్య శక్తులు తమని అధీనంలోకి తీసుకుని వేధిస్తుంటాయి. అక్కడ్నుంచి బయటపడడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఒకర్నొకరు ఫలానా రోజున చంపుకుంటామని సవాల్ చేసుకుంటారు కార్తీక్, శ్రావణి.
కళాకారుల పనితీరు:
శివాజీ తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా అలరించాడు. విసిగించే ఈ చిత్రంలో కొన్ని నవ్వుకోదగ్గ మొమెంట్స్ అందించాడు. అయితే తన టాలెంట్‌ని వాడుకునేంతగా సన్నివేశాలు లేకపోవడంతో శివాజీ కూడా చాలా సేపు చేష్టలుడిగి చూస్తుండిపోయాడు. కైనాజ్ మోతివాలా ఇంతకుముందు ‘రాగిణి ఎంఎంఎస్’లో ఇలాంటి పాత్రనే చేసింది. దాదాపుగా అలాంటి సన్నివేశాలే మళ్లీ చేయాల్సి రావడంతో ఆమె పని ఈజీ అయిపోయింది. కాస్టూమ్స్ విషయంలో కూడా ఆమెకి కొత్త ఫీలింగ్ రానివ్వలేదు. ‘రాగిణి’ చిత్రంలోని వార్డ్రోబ్నే వాడినట్టున్నారు. నవ్వించడం కోసం కొందరు ప్రముఖ కమెడియన్లని, జబర్దస్త్ బ్యాచ్‌ని దించారు. కానీ బ్రహ్మానందంని కూడా వాడుకోవడం రాలేదంటే మిగతా వారితో ఏమాత్రం కామెడీ పండించగలరు?
సాంకేతిక వర్గం పనితీరు:
సంభాషణలు హారిబుల్‌గా ఉన్నాయి. కామెడీ సీన్లలో, పేరు మోసిన కమెడియన్లతో కూడా నవ్వించే సంభాషణలు రాయలేకపోయాడంటే రచయితకి బొత్తిగా సెన్సాఫ్ హ్యూమర్ లేదనిపిస్తుంది. చాలా హారర్ సినిమాల్లానే కేవలం ఒక లొకేషన్లోనే దాదాపుగా సినిమా మొత్తం జరుగుతుంది. అందుబాటులో ఉన్న వనరులతో డీసెంట్ అవుట్‌పుట్ ఇచ్చాడు సినిమాటోగ్రాఫర్. ప్రథమార్థంలో అసలు లింక్ లేకుండా సాగిపోయే సన్నివేశాలని ఒక దారిన పెట్టడానికి ఎడిటర్ చాలా కష్టపడి ఉండాలి. నేపథ్య సంగీతం ఫర్వాలేదు.
దర్శకుడి అనుభవ రాహిత్యం బాగా కనిపిస్తుంది. నిజానికి కథలో కాస్తో కూస్తో విషయం ఉంది. భయపెట్టడానికి, నవ్వించడానికి సరిపడా సరంజామా సమకూరింది. అయితే అటు భయపెట్టడంలోను విఫలమై, నవ్వించడంలోను చాలా సందర్భాల్లో ఫెయిలైన రేవన్ యాదు డీసెంట్ కాన్సెప్ట్‌ని వేస్ట్ చేసుకున్నాడు.
హైలైట్స్:
- శివాజీ
- కాన్సెప్ట్
డ్రాబ్యాక్స్:
- వల్గర్ కామెడీ
- స్క్రీన్‌ప్లే
విశ్లేషణ:
అసలు పాయింట్ ఏంటనేది ఇంటర్వెల్ సీన్ దగ్గర కానీ రివీల్ చేయరాదని ఫిక్సయి ఫస్ట్ హాఫ్ ఏవేవో సీన్లతో కానిచ్చేసారు. ఇంటర్వెల్ పాయింట్లో కానీ మనం ఏమి చూస్తున్నామనే సంగతి అర్థం కాదు. అందాకా టైమ్ ఎలా స్పెండ్ చేయాలో తెలియక దర్శకుడు తనకి తోచింది తీసుకుంటూ పోయాడు. దారీ తెన్నూ లేకుండా సాగే ప్రథమార్థం నిడివి ఒక గంట మాత్రమే అయినా కానీ నిముషాలు యుగాల్లా గడుస్తాయి. ‘బూచమ్మ బూచోడు’ భయపెట్టకపోయినా మరో గంట పాటు ఈ గోల ఎలా భరించాలనే ఆలోచన ఎక్కువ భయపెడుతుంది.
ఇంటర్వెల్ సీన్ చూసాక ఇకనుంచి అయినా గాడిన పడుతుందని ఆశిస్తే… కామెడీ కోసమని ఏవేవో పాత్రలని ఆ ఇంట్లోకి ప్రవేశ పెడుతూ నవ్వించడానికి దర్శకుడు విఫలయత్నం చేస్తాడు. ఆ పాత్రలు వచ్చి చేసిన దాని కంటే.. శివాజీ, కైనాజ్ మధ్య వచ్చే సిట్యువేషనల్ కామెడీనే కాస్తో కూస్తో అలరిస్తుంది. దెయ్యాలని ఫూల్ చేయడానికి శివాజీ, కైనాజ్ వాడే ట్రిక్కులు.. అవి బెడిసికొట్టే సన్నివేశాలు సోకాల్డ్ కామెడీ సీన్లకంటే బెటర్‌గా అనిపిస్తాయి. నవ్వించడానికి ఆఖరు ప్రయత్నంగా కమెడియన్లని దెయ్యాలతో రేప్ చేయించి దర్శకుడు తన ‘టేస్ట్’ చాటుకున్నాడు. ఇలాంటివి ఎంజాయ్ చేసే వాళ్లు కూడా ఉండొచ్చు కానీ ‘బిలో ది బెల్ట్’ స్టఫ్ భరించడం సెన్సిబుల్ ఆడియన్స్ వల్ల కాదు.
ఇక పతాక సన్నివేశం అయితే అన్-ఇంటెన్షనల్ కామెడీతో నవ్వించకపోగా టోటల్ సినిమానే నవ్వుల పాలు చేస్తుంది. దెయ్యాలకి హీరో మెసేజ్ ఇవ్వడం… అవి ‘తెల్ల’ మొహాలేసుకుని చూడడం.. ‘బూచమ్మ బూచోడు’కి నాక్ అవుట్ పంచ్ ఇస్తుంది. శివాజీ ఈ చిత్రాన్ని కాపాడ్డానికి చాలా వరకు ప్రయత్నించాడు కానీ పరిమితులు దాటిపోయి అతడిని కూడా నిస్సహాయుడ్ని చేసేయడంతో ‘బూచమ్మ బూచోడు’ కేవలం లో సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వారికి, చీప్ కామెడీకి విరగబడి నవ్వేవారికి పరిమితమవుతుంది.
బోటమ్ లైన్: హారర్‌తో నవ్వించి.. కామెడీతో భయపెట్టిన ‘బూచమ్మ బూచోడు’!
– గణేష్ రావూరి