13 జిల్లాలు.. 170 ప్రాజెక్టులు… 7 మిషన్లు… 5 గ్రిడ్లు… 4 వినూత్న కార్యక్రమాలు.. అబ్బో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో చెప్పిన లెక్కలు అన్నీ ఇన్నీ కావు. గ్రిడ్లు, స్మార్ట్ సిటీలు, మెగా సిటీలు, ఎయిర్‌పోర్ట్‌లు, విమానాశ్రయాలు, హబ్‌లు, ఫుడ్ పార్క్, టెర్మినల్స్, కారిడార్స్, కాంప్లెక్స్‌లు.. ఒకటేమిటి కొత్త కొత్త పేర్లు చంద్రబాబు చాలానే చెప్పారు. విచిత్రమేంటంటే, మిత్రపక్షం భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ శాసనసభ్యుడికి వీటిల్లో చాలా పదాలే అర్థం కాలేదు. అందుకే వాటిని మార్చే ఆలోచన చేయమని ఓ సలహా కూడా అసెంబ్లీలోనే చంద్రబాబుకి ఇవ్వడం గమనార్హం. ఓ శాసనసభ్యుడికి, అది కూడా మిత్రపక్షానికి చెందిన శాసనసభ్యుడికి అర్థం కాని భాషలో చంద్రబాబు ‘మిషన్’ వుందంటే, సామాన్యులకి ఇది ఎలా అర్థమవుతుంది.? ‘ఇక్కడ కావాల్సింది అర్థం కావడం కాదు.. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. ఆ అభివృద్ధి కోసమే కొత్త కొత్త ప్రాజెక్టులు, వాటికి కొత్త కొత్త ప్రాజెక్టులు.. ప్రపంచం దృష్టిని ఆకర్షించాలంటే ఆ మాత్రం టెక్నికల్‌గా వ్యవహరించాలి..’ అని అధికార పార్టీ నేతలు అధినేతను వెనకేసుకురావొచ్చుగాక, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు.. ఎన్నికలయ్యాక కూడా అవే హామీలు ఇస్తే, ‘మాక్కావాల్సింది హామీలు కాదు..’ అని జనం నిలదీసే పరిస్థితులు వస్తాయి. ఆద్యంతం చంద్రబాబు ప్రసంగం ఎన్నికల హామీల ప్రసహనాన్ని తలపించిందంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే, మొత్తంగా 13 జిల్లాలుంటే, ఆయా జిల్లాలకు సంబంధించి సుమారు 170 ప్రాజెక్టుల్ని ప్రకటించేశారు. లోటుబడ్జెట్‌తో ఏర్పడ్డ కొత్త రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులు.. ఇవి కూడా లక్షల కోట్లు ఖర్చు చేస్తే తప్ప, ఏళ్ళు గడిస్తే తప్ప పూర్తికాని ప్రాజెక్టుల్ని ప్రకటించడం విస్మయం కలిగించకమానదెవరికైనా.
స్మార్ట్.. ఇదేం పబ్లిసిటీ స్టంట్.?
ఎన్నికల సమయంలో ఏ హామీలైనా ఇవ్వొచ్చుగాక. అది ఎన్నికల ప్రసహనంలోకి వెళ్ళిపోతుంది. ముఖ్యమంత్రి అయ్యాక ఉత్తుత్తి హామీలిస్తే, ఆ ఎఫెక్ట్ ఆయనపై చాలా గట్టిగానే వుంటుంది భవిష్యత్‌లో. అసలే విశ్వసనీయత విషయంలో చంద్రబాబుకి చాలా గొప్ప (?!) పేరుంది. దాన్ని ఇప్పుడాయన పూర్తిగా కోల్పోయే పరిస్థితిని తనంతట తానే కొనితెచ్చుకున్నారేమో అన్పిస్తోంది.. అసెంబ్లీలో ఆయన చేసిన ప్రకటనని చూస్తే, మొత్తం పదమూడు జిల్లాల్లో 14 స్మార్ట్ సిటీలు నిర్మించేస్తారట. 3 మెగా సిటీలు నిర్మిస్తారట. అసలు స్మార్ట్ అంటే ఏమిటి.? మెగా అంటే ఏమిటి.? దీనర్ధం గురించి సామాన్యులు ఇంటర్నెట్లోకి వెళ్ళి మరీ దేవులాడాల్సి వస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని కొన్ని నగరాలకు మాత్రమే ‘స్మార్ట్ సిటీ’ అన్న గుర్తింపు దక్కింది. మన దేశం విషయానికొస్తే ఒక్క నగరం కూడా ఇంకా స్మార్ట్ సిటీ అనే గుర్తింపుని సొంతం చేసుకోలేదు. గుజరాత్లో ఒకటి, ముంబైలో ఒకటి, ఢిల్లీ – ముంబై కారిడార్‌లో ఇంకొకటి స్మార్ట్ సిటీని నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవే మన దేశంలో భవిష్యత్‌లో స్మార్ట్ సిటీలన్పించుకోదగ్గ నగరాలు. అలాంటిది, ఆంధ్రప్రదేశ్‌లో 14 స్మార్ట్ సిటీలను నిర్మించడమంటే అదేమన్నా చిన్న విషయమా.? స్మార్ట్ సిటీల పరిస్థితే ఇలా వుంటే, మెగా సిటీల గురించి ఆలోచించడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యాశ అవుతుందేమో.
గాల్లో తేలినట్టుందే.!
కలలు కనాలి.. ఆ కలల్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. కానీ, వాస్తవాల్ని విస్మరించి, ఊహల్లో విహరించడమంటే దానివల్ల ఉపయోగం వుండదు సరికదా, అభివృద్ధి స్థానంలో అనర్థమే ఎక్కువగా జరిగే ప్రమాదం పొంచి వుంటుంది. నోటికి ఏ మాట వస్తే ఆ మాట చెప్పేశాం.. అని సరిపెట్టుకోడానికి లేదిక్కడ. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో 13 జిల్లాల ప్రజానీకం తీవ్రంగా నష్టపోయారు. వారి ఆశలు అడియాశలైతే, ఆ తర్వాతి పరిణమాలు చాలా తీవ్రంగా వుంటాయి. తొమ్మిదేళ్ళు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ విషయం తెలియదని అనుకోలేం. ‘మీకంటే మాకు చాలా ఎక్కువ తెలుసు..’ అని అసెంబ్లీలో తన గొప్పలు తానే చెప్పుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు స్మార్ట్ సిటీలు, మెగా సిటీల జపం చేస్తున్న చంద్రబాబు.. హైటెక్ సిటీని తానే డెవలప్ చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఆ హైద్రాబాద్‌ని స్మార్ట్ సిటీ దరిదాపుల్లోకి తీసుకెళ్ళలేకపోయారెందుకు.? అన్న ప్రశ్నకు ఆయన వద్ద అయినా సమాధానం వుందా.? వుండదు. ఎందుకంటే ఆయన ఇప్పటికీ తనను తాను హైటెక్ సీఎం అనుకుంటున్నారే తప్ప, హైటెక్ సిటీ – సైబరాబాద్ అన్నది హైద్రాబాద్‌లో ఓ ప్రాంతం మాత్రమే తప్ప, అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా చాలా నగరాలు, పట్టణాలు, గ్రామాలు వున్నాయన్న విషయాన్ని ఎప్పుడు గుర్తెరిగారు గనుక.!
వంద కిలోమీటర్ల దూరంలో నాలుగు ఎయిర్పోర్టులేమిటో.?
శ్రీకాకుళం జిల్లాలో ఓ ఎయిర్ పోర్ట్. విజయనగరం జిల్లాలోనూ ఓ ఎయిర్ పోర్ట్. విశాఖలో అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్. ఇదీ చంద్రబాబు వరస. ఆ మాటకొస్తే అన్ని జిల్లాలకీ ఎయిర్ పోర్ట్‌లు ప్రకటించేశారనుకోండి. అది వేరే విషయం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలది వింత పరిస్థితి. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం మధ్యలో వంద కిలోమీటర్ల దూరం వుంటుంది. జర్నీ జస్ట్ టూ అవర్స్. రెండు గంటల్లో విశాఖ చేరుకోవచ్చు శ్రీకాకుళం నుంచి. మధ్యలో కొంతవరకు విజయనగరం జిల్లాకు చెందిన ప్రాంతం టచ్ అవుతుంది. ఒకవేళ విజయనగరం మీదనుంచే శ్రీకాకుళం నుంచి విశాఖకు వెళ్ళినా, ఇంకో అరగంట జర్నీ పెరుగుతుందేమో తప్ప, పెద్దగా తేడా రాదు. కానీ, విశాఖలో ఇప్పుడున్న ఎయిర్‌పోర్ట్‌తోపాటు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలకు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు వస్తాయంటే, అటూ ఇటూగా వంద కిలోమీటర్ల దూరంలోనే ఏకంగా నాలుగు ఎయిర్ పోర్ట్‌లు అవుతాయన్నమాట. విమనయానం చేసేందుకుగాను ఎయిర్‌పోర్ట్‌లో అవసరమయ్యే చెకిన్, చెకవుట్ టైమ్‌లో ఎంచక్కా రోడ్డు మార్గానో, రైలు మార్గానో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయానికే ప్రయాణీకుల తాకిడి సరిగ్గా లేదన వాదనలు విన్పిస్తోంటే, జిల్లాకొక ఎయిర్పోర్ట్ పెట్టేసి ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబుగారికే తెలియాలి.
ఐటీ హబ్‌లు.. పండగే పండగ
ఒకటి కాదు, రెండు కాదు.. ప్రాంతానికో ఐటీ హబ్‌ని చంద్రబాబు ప్రకటించేశారు. ఉత్తరాంధ్రకొకటి, రాయలసీమకొకటి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకటి, రాజధాని విజయవాడలో మరొకటి.. ఇలా ఐటీ హబ్‌లు అనౌన్స్ చేశారు సరే, కంపెనీలెక్కడ.? ప్రపంచ వ్యాప్తంగానూ ఐటీ ఇండస్ట్రీ అంత ఆశాజనకంగా ఏమీ లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, విశాఖలో అయినా ఇంకెక్కడైనా ఒక్కటంటే ఒక్క ఐటీ పరిశ్రమ కూడా రాలేదంటే, భవిష్యత్ ఏమిటన్న భయం ప్రజల్లో వుండడం సహజమే. కానీ ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండానే ఆయనగారు ప్రాంతానికో ఐటీ హబ్‌ని ప్రకటించేశారు.
మెట్రోరైల్, రైల్వే జోన్.. అన్నీ ఆశల పల్లకీలే
రైల్వే బడ్జెట్లో అసలు ప్రత్యేక రైల్వే జోన్‌పైన స్పష్టతే ఇవ్వలేదు కేంద్రం. కానీ, బాబుగారి విజన్‌లో విశాఖకు రైల్వే జోన్‌ని కేటాయించేశారు. అదివ్వాల్సింది కేంద్రం కదా.? మెట్రోరైల్ వ్యవహారానికి వస్తే, విశాఖ, విజయవాడ, తిరుపతిలలో మెట్రో రైల్ ప్రాజెక్టుల్ని చేపడతారట. ఆయా నగరాల్లో మెట్రోరైలు అవసరపడేంతగా జనం లేరన్నది తెలిసీ చంద్రబాబు, తన విజన్‌లో మెట్రో రైలు ప్రాజెక్టుల్ని చేర్చడమూ పలు అనుమానాలకు తావిస్తోంది. రెండు లైన్లు, నాలుగు లైన్లు, ఆరు, ఎనిమిది.. అవసరమైతే పది లైన్లు.. అని ఆవేశంగా ప్రసంగించేశారు చంద్రబాబు. వందలు, వేలు, లక్షల కోట్లు ఎలా వస్తాయి.? అన్న ప్రశ్న ఎవరన్నా వేస్తే, వారందరిపైనా అభివృద్ధి ‘కంటకులు’ అన్న ముద్ర వేసేయడానికీ చంద్రబాబు అండ్ కో వెనుకాడదేమో. పాత పోర్టుల అభివృద్ధికే వేల కోట్లు వెచ్చించాల్సి వున్నప్పుడు కొత్త పోర్టుల నిర్మాణం పరిస్థితేమిటి.? పర్యావరణ అనుమతుల మాటేమిటి.? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే ఏళ్ళకు ఏళ్ళు సమయం పట్టేస్తుంది. ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలంటే దశాబ్దాలు గడచిపోవాల్సిందే. కేంద్రంలో ఒకప్పుడు చక్రం తిప్పానని చెప్పుకున్న చంద్రబాబు కనీసం కాకినాడ – సామర్లకోట రైల్వే లైనుని డబ్లింగ్ కూడా చేయించుకోలేకపోయారు. అలాంటి చంద్రబాబు రైల్వే జోన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగానే అన్పిస్తోంది.
చెప్పుకుంటూ పోతే మాటలు చంద్రమండలం దాటేసి, సూర్యమండలందాకా వెళ్ళిపోతున్నాయిగానీ, ఏదీ నేలమీద కార్యరూపం దాల్చేలా కన్పించడంలేదు. నౌకాశ్రయాలైనా, జాతీయ సంస్థలైనా, మెరైన్ ఇన్స్టిట్యూట్లు అయినా, ఇంకోటయినా ఒక్కొక్కటీ కార్యరూపం దాల్చాలంటేనే దశాబ్దాల సమయం పట్టేస్తుందేమో అన్న అనుమానం కలుగుతోంది అందరికీ. కేంద్రం చేపట్టనున్న జాతీయ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టుని కూడా, తన విజన్‌లో చేర్చేసుకున్న చంద్రబాబు, తాను చేతల ముఖ్యమంత్రినని ఎప్పటికి నిరూపించుకుంటారో, అసలు ఆ పరిస్థితే వస్తుందో రాదోగానీ, ప్రస్తుతానికైతే గొప్పలడప్పా ముఖ్యమంత్రి అన్పించేసుకున్నారు ఇప్పటికే. సకల సౌకర్యాలున్న హైద్రాబాద్మీద తనదైన ముద్ర వేయడానికే తొమ్మిదేళ్ళ సమయం తీసుకున్న చంద్రబాబు (ఆయన చెప్పిందే నిజమనుకున్నాగానీ), ‘జీరో నుంచి’ మొదలు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి (చంద్రబాబు విజన్ ఇదే కదా) ఎన్ని దశాబ్దాలు తీసుకుంటారు.? చంద్రబాబు తీసుకుంటారు సరే, ఇచ్చే ఓపిక జనానికి వుండొద్దూ.! మిగతావన్నీ తర్వాత.. ముఖ్యమంత్రి అయ్యి మూడు నెలలైనా, ఆంధ్రప్రదేశ్‌కి దక్కాల్సిన స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీని కేంద్రం నుంచి రాబట్టుకోలేకపోయిన చంద్రబాబు, తొలుత రాష్ట్ర ప్రజలకు ఈ విషయంలో సమాధానం చెప్పాల్సి వుంది. ఎనీ డౌట్స్.?
– సింధు