ఏమిటీ ట్విస్ట్? మురళీ మోహన్?

మా కార్యవర్గ ఎన్నికలు మాంచి మలుపు తిరిగాయి. ఏకగ్రీవం అవుతుందనుకుని సంబరపడిన రాజేంద్ర ప్రసాద్ కు షాక్ ఇస్తూ, సహజనటి జయసుధను రంగంలోకి దింపారు మురళీ మోహన్. నిజానికి మురళీమోహన్ మళ్లీ పోటీ చేస్తారనుకున్నారంతా.…

మా కార్యవర్గ ఎన్నికలు మాంచి మలుపు తిరిగాయి. ఏకగ్రీవం అవుతుందనుకుని సంబరపడిన రాజేంద్ర ప్రసాద్ కు షాక్ ఇస్తూ, సహజనటి జయసుధను రంగంలోకి దింపారు మురళీ మోహన్. నిజానికి మురళీమోహన్ మళ్లీ పోటీ చేస్తారనుకున్నారంతా. ఆది నుంచీ మురళీ మోహన్ ఎంపీగా, ఇంకా పలు వ్యవహారాలతో బిజీగా వున్నారు కాబట్టి పోటీ చేయకూడదనే అనుకున్నారు. అలాగే వుండిపోయారు. 

కానీ ఈ జయసుధను ఎందుకు తెరమీదకు తెచ్చినట్లు? అంటే రాజేంద్ర ప్రసాద్ ను అడ్డుకోవాలనేనా? ఈ ఇద్దరి నడుమ ఎందుకు తేడా వచ్చిందో మరి. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో కూడా రాజేంద్ర ప్రసాద్ ఆఫ్ ది రికార్డుగా కొన్ని కామెంట్ల చేసినట్లు వినికిడి. అన్ని పదవులు ఈయనకే కావాలి అన్నటైపులో కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. 

ఇదిలా వుంటే రాజేంద్ర ప్రసాద్ కు మెగా క్యాంప్ నకు చెందిన నాగబాబు మద్దతు పలికారు. దాంతో సహజంగానే రాజేంద్రుడికి, ఒకవేళ పోటీ చేస్తే మురళీ మోహన్ కు మధ్య గట్టిపోటీ వుంటుదని అనుకున్నారు. ఎందుకంటే, తెలుగు సినిమా పరిశ్రమలో కమ్మ, కాపు ఓట్లు ఎక్కువగా వున్నాయి కనుక. కమ్మ ఓట్లు కొన్ని వచ్చినా, కాపు ఓట్లు రాజేంద్రుడికి వస్తాయని అనుకున్నారు. 

కానీ ఇప్పుడు మురళీమోహన్ తెలివిగా జయసుధను రంగంపైకి తెచ్చారు. దీని వెనుక చాలా పెద్ద స్ట్రాటజీ వున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా చూస్తే జయసుధ తెలుగదేశం కాదు. ఎప్పుడూ కూడా. కాంగ్రెస్, వైకాపాతోనే వున్నారు. అలాంటి ఆమెను తెలుగుదేశానికి చెందిన మురళీ మోహన్ ఎన్నికల బరిలోకి దింపారు. అంటే నగరంలోని కీలక ప్రాంతంలో జయసుధకు ఓట్ బ్యాంకు వుంది. రేపటి నగర పాలక ఎన్నికల్లో అవి పనికివస్తాయి.

ఇదిలా వుంటే జయసుధను మురళీ మోహన్ ఎంపిక చేయడం వెనుక, ఆ ఇద్దరికి గురుతుల్యుడైన దాసరి నారాయణ రావు వున్నారని వినికిడి. దాసరి మద్దతు జయసుధకు బహిరంగంగా దొరికితే, ఇక గెలుపు సునాయాసమవుతుంది. ఎందుకంటే టాలీవుడ్ లోని కాపు సామాజిక వర్గ ఓట్లపై దాసరి పట్టు దాసరికి వుంది. ఇక మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందినా, ఓట్లు మాత్రం ఎక్కువగా మురళీ మోహన్ వర్గానికే దక్కుతాయి. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు కూడా తోడవుతాయి. 

మొత్తానికి దానా దీనా, ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధ్యక్ష పదవి చేపట్టాలనుకున్న, రాజేంద్ర ప్రసాద్ ఆశలు నెరవేరడం కష్టంగానే అనిపిస్తోంది..ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.