Advertisement

Advertisement


Home > Articles - Chanakya

కిలో బియ్యం రూ 100?

కిలో బియ్యం రూ 100?

మానసికంగా రెడీ అయిపోండి...ఈ ధరలో బియ్యం కొనుక్కోవడానికి. ఇప్పుడు ఒరిజనల్ సోనా మసూరి, లేదా నెల్లూరు సన్నాలు బియ్యం కొనాలంటే యాభై అయిదు రూపాయిల నుంచి అరవై రూపాయిలకు దొరుకుతున్నాయి. త్వరలో వంద రూపాయిలకు చేరతాయి. మిర్యాలగూడ, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం ప్రాంత బియ్యం నలభై రూపాయిలకు దొరుకుతున్నాయి. ఇవి ఎనభైకి చేరినా ఆశ్చర్యపోనక్కరలేదు.  డ్వాక్రా సంఘాల పేరు చెప్పి, బినామీ జనాలకు ఇసుక ర్యాంప్ లు అందేసాయి. దాంతో ఇసుక రేటు పెరిగింది. ఇప్పుడు రైతుల పేరు చెప్పి, ఇలాంటి మరో బినామీలకు పనికివచ్చే నిర్ణయమే ఆంధ్ర ప్రభుత్వం తీసుకుంది. దాని ఫలితంగా ఇక త్వరలో బియ్యం ధరలకు రెక్కలు రానున్నాయి.

ఇటు రైతులకు, అటు వినియోగదారులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవడం అన్నది సాధారణంగా సాధ్యం కాదు. రైతులకు లాభం కలిగేలా చూస్తే ధరలు పెరిగి వినియోగదారుడు ఇబ్బంది పడతాడు. అలా కాదు ధరలు పెరగకూడదనుకుంటే, రైతు నష్టపోతాడు. ఇది ఎప్పుడూ వుండే సమస్యే. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడంలోనే వుంటుంది పాలకుల గొప్పతనం..పాలనా దక్షత. ఇప్పుడు తెలుగుదేశం సారధ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవిచూస్తోంది. ఒక పక్క రుణమాఫీ, మరోపక్క రాజధాని వ్యవహారాలు ప్రభుత్వానికి రైతులకు మధ్య గ్యాప్ ను పెంచుతున్నాయి. అందుకే వాళ్లని చల్లార్చుతున్నట్లు ఈ నిర్ణయం తీసుకుంది. కానీ అసలు కథ వేరు.

ఏటా జరిగే తంతు ఒకటి వుంది. రైతుల దగ్గరి బియ్యం మిల్లర్ల వద్దకు చేరిపోయాక, రాజకీయ పార్టీల చోటా మోటా నాయకుల బుడిబుడి ఏడుపులు ప్రారంభమవుతాయి. రైతుల దగ్గర ధాన్యం మురిగిపోతున్నాయి. నష్టపోతున్నారు..అంటూ హడావుడి చేస్తారు. నిజంగా రైతుల  మీద ప్రేమ కారిపోయినట్లు. నిజానికి అదంతా మిల్లర్ల మాయాజాలం. సరే రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం అంతర్రాష్ట్ర బియ్యం అమ్మకంపై నిషేధం ఎతేస్తుంది..మిల్లర్లు పిచ్చహ్యాపీ. మన బియ్యం మనకు లేకుండా పోతాయి..ధరలు ఆకాశాన్నంటుతాయి.

సరే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి? రైతుల సంక్షేమం దృష్ట్యా, ఏడాది పొడవునా వారు తమ తమ ఐడెంటిటీ రుజువు చేసుకోకుండానే, ఏ రాష్ట్రంలో కావాలంటే ఆ రాష్ట్రానికి బియ్యం పట్టుకెళ్లి అమ్మేసుకోవచ్చు. సెంట్రల్ టాక్స్ కడితే చాలు. బియ్యం అమ్మేసుకోవచ్చు. సరే, రైతులు తమ బియ్యం పట్టుకెళ్లి అమ్ముకుంటారు..వారికి మంచి ధర వస్తుంది. .రైతులకు లాభమేగా అని అనేయడం సులువే.

ఇక్కడ రెండు సమస్యలు వున్నాయి. ఒకటి ఇక్కడ బియ్యం మంచి రేటువస్తోంది కదా అని పక్క రాష్ట్రాలకు తరలిపోతే, ధరలు ఏ రేంజ్ లో పెరుగుతాయో ఒక్కసారి ఊహించుకోండి. డిమాండ్ సప్లయి సిద్దాంతం తెలిసిందే కదా. ముఖ్యంగా మన బియ్యం పక్కరాష్ట్రాలకు వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు వెళ్లడం మామూలే.

ఇక రెండో సంగతి. అసలు నేరుగా పక్క రాష్ట్రాలకు పట్టుకెళ్లి అమ్ముకోగల రైతులు మన రాష్ట్రంలో ఎంతమంది వున్నారు. ఎక్కువ శాతం మంది రైతులు చిన్న కమతాల వారే. చిన్న, సన్నకారు రైతులే. రాజధాని రైతుల లెక్కలు తీసినపుడు కానీ, రుణమాఫీ లెక్కలు తీసినపుడు కానీ ఈ వైనమే బయటపడింది.

సగటున ఎకరాకు 15బస్తాల బియ్యం రావడం కష్టం. అంటే ముఫై బస్తాల ధాన్యం అనుకోవచ్చు. చాలా మంది రైతులు ఎకరా , రెండు ఎకరాల వారే. వాళ్లకు వచ్చిన పాతిక, ముఫై బస్తాల బియ్యాన్ని పట్టుకెళ్లి ఏ రాష్ట్రంలో అమ్ముకోగలరు? పైగా పాతబియ్యానికే గిరాకీ. రైతు అంతకాలం ధాన్యం నిల్వ వుంచే పరిస్థితి లేదు. అందుకు తగ్గ సదుపాయమూ లేదు, ఆర్థిక స్తోమతా లేదు. ఇలా ధాన్యం రాగానే అలా దళారుల ద్వారా మిల్లర్లకు చేర్చకపోతే, చేసిన బాకీలు తీరవు, ఖర్చులకు డబ్బులు వుండవు.

కేవలం కొద్ది శాతం  వుండే బడా రైతులకు మాత్రమే ఇది ఉపయోగకర నిర్ణయం. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని కొద్దిశాతం బడా భూస్వాములకు పనికి వచ్చే నిర్ణయం. అది కాక మిల్లర్లకు మాంచి లాభదాయమైన నిర్ణయం. తెలంగాణ, ఆంధ్రగా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక, మిర్యాలగూడ (తెలంగాణ)మిల్లర్లకు, ఆంధ్రలోని మిల్లర్లకు మధ్య కాస్త ఇబ్బందులు వస్తున్నాయి. భవిష్యత్ లో ఇవి మరీ పెరుగుతాయి. ఇక ఇప్పుడు ఏ సమస్య వుండదు. ఇక్కడి ధాన్యం అక్కడకు పట్టుకుపోవచ్చు. లేదా చెన్నయ్ కు చేర్చి, ఓడల్లో విదేశాలకు పంపించుకోవచ్చు. మిల్లర్ల పని ఇక మూడు బస్తాలు..ఆరు లాభాలు అన్నట్లు వుంటది.

దీనికి రైతుల సంక్షేమం అని పేరు. ఇంక ఎవరు ఏం మాట్లాడతారు. పొరపాటున మాట్లాడినా..అదిగో రైతుల సంక్షేమం పట్టడం లేదు. రైతులకు మంచి చేసి, వ్యవసాయాన్ని లాభసాటి చేద్దామంటే అడ్డం పడుతున్నారు అంటారు.

మిల్లర్లకు లాభం వస్తే, రైతులకు ఎక్కువ ధర చెల్లిస్తారుకదా అని పాయింట్ లాగొచ్చు ఎవరైనా. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అలా వుండదు. పంటకు ముందే మిల్లర్ల దగ్గర అడ్వాన్స్ ను అప్పు రూపంలో తీసుకున్నపుడే ధర ఫిక్సయిపొతుంది. ఆపైన ఎంత పెరిగినా మిల్లర్ కు, దళారికే తప్ప, రైతుకు  ఉపయోగం వుండదు. మళ్లీ మాట్లాడితే మిల్లర్లు కుమ్మక్కై ధాన్యం కొనుగోలు ఆపేస్తారు. ఇంకేం చేస్తాడు రైతు..అయినకాడికి అమ్ముకోక.

బాబు గారి తెలివితేటలు ఇవి. డ్వాక్రా గ్రూపుల పేరు చెప్పి, రైతుల పేరు చెప్పి వేరే వారికి లబ్ధి కలిగేలా చేయడం..ఇది అనుభవంలోకి రావడానికి ఎంతో కాలం పట్టదు,. ఇప్పటికే ఇసుక రేటు భగ్గుమని, అది అవసరమైన వారికి తెలిసి వస్తోంది. బియ్యం రేటు భగ్గుమన్నాక అసలు వైనం బయటకు వస్తుంది.

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?