Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

కాంగ్రెస్ పై పడి ఏడిస్తే ఏమొస్తుంది మోడీ సాబ్!

కాంగ్రెస్ పై పడి ఏడిస్తే ఏమొస్తుంది మోడీ సాబ్!

మొత్తానికి మూడురోజులుగా సాగిస్తున్న ఆందోళనలతో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒక్క చిన్న విజయం సాధించగలిగారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలియజేయడానికి లోక్ సభలో ప్రధాని మోడీ ప్రసంగానికి ఎజెండాని వీరి ఉద్యమమే ప్రేరేపించినట్లుగా వ్యవహారం సాగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం సంగతేమోగానీ.. ప్రధానమంత్రి మోడీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత అరాచకంగా అన్యాయంగా వ్యవహరించిందనే అంశం మీదనే తన దృష్టి కేంద్రీకరించారు.

పార్లమెంటు తలుపులు మూసేసి అరాచకంగా రాష్ట్రాన్ని విభజించారని, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తద్వారా దేశాన్ని కూడా మోసం చేశారని మోడీ అన్నారు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని, అదే వాజపేయి హయాంలో సహేతుకమైన రాష్ట్రాల విభజన జరిగిందని మోడీ చెప్పుకున్నారు.

అంతా బాగానే ఉంది. ప్రధాని ప్రసంగం డైవర్ట్ కావడం వరకు బాగానే ఉంది. ఇదంతా గమనించి.. ప్రజల మదిలో మెదలుతున్న సందేహాలు కొన్ని ఉన్నాయి.

మోడీ సాబ్ ! ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందనే సంగతి, ఆపాపం.. కాంగ్రెస్ దే అనే సంగతి ఈరాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఆ అన్యాయాన్ని సరిదిద్దుతారనే నమ్మకంతోనే ఇక్కడి ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారు. పదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తాం అని చెప్పిన మీ మాటలను ఈరాష్ట్ర ప్రజలు నమ్మారు. కానీ మీరేం చేశారు.

కాంగ్రెస్ పార్టీ హఠాత్తుగా ఈరాష్ట్రం గొంతుకోసి రోడ్డున పడేసింది. మీరు నయవంచనకు పాల్పడ్డారు. నమ్మించి రాష్ట్రం గొంతుకోశారు. మాయమాటలు చెప్పి.. ప్రత్యేకహోదా పదేళ్లు ఇస్తాం అని చెప్పి మీ ప్రభుత్వంలో ఇప్పుడు కేటాయింపులు చేసే హోదాలను అనుభవిస్తున్న జైట్లీ వంటి వారు రాజ్యసభలో ఏపీ కోసం, హోదాకోసం నాటకాలు ప్రదర్శించి.. ప్రజలను నమ్మించారు. ఏపీ ప్రత్యేకహోదా కోసం ఇంతగా మాట్లాడుతున్న మీలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే చాలా మంచి జరుగుతుందని ప్రజలు అనుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఉన్నపళంగా అన్యాయం చేస్తే.. మీరు నమ్మించి అన్యాయం చేశారు. ఇప్పుడు ఏపీ ప్రజానీకానికి మీకంటె వాళ్లే మేలు అనిపిస్తోంది. ఎందుకంటే.. వారి వైఖరిలో కనీసం అన్యాయం ఒక్కటే కనిపిస్తుంది.. తాము మోసపోలేదు అన్యాయానికి మాత్రమే గురయ్యాం అనే భావన ఈప్రజలకు ఉంటుంది.

మోడీ సాబ్! కాంగ్రెస్ ను నిందించడం ద్వారా వక్ర రాజకీయ ప్రయోజనాలను బావుకునే ధోరణి తప్ప వాస్తవంగా మీకు ఏపీ గురించి చిత్తశుద్ధి ఉంటే.. ఈమాటలు కట్టిపెట్టండి. ముందు ప్రత్యేకహోదా ఇవ్వండి.. ఏపీకి అన్యాయం జరిగిందని ప్రజలు కూడా ఏడ్చి, పాలకులుగా మీరు కూడా ఏడిస్తే విలువేముంటుంది.

మీరు వారి కన్నీళ్లను తుడవడానికి ఏం చేయగలరో చెప్పండి? మాయ వద్దు. మర్మం వద్దు. ఏపీ పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నదో లేదో నిరూపించుకోండని... తెలుగు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మోడీ ప్రభుత్వం ఈవేదనను అర్థం చేసుకుంటుందో లేదో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?