Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

ముద్దుకు నివాళి: అంతిమ కోరిక తీరనే లేదు!

ముద్దుకు నివాళి: అంతిమ కోరిక తీరనే లేదు!

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తెలుగు రాష్ట్రం రాజకీయాల్లో కీలకభూమిక పోషిస్తూ.. తనదైన ముద్ర కలిగి ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు కన్నుమూశారు. ఎంతో సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న ముద్దుకృష్ణమ నాయుడు.. తెలుగుదేశంలో ఎంతో కీలకభూమిక పోషిచిన నాయకుడు అయిఉండి కూడా.. జీవితంలో అంత్యదశ సమీపించే సమయానికి.. లూప్ లైన్ నాయకుడిగా మిగిలిపోయారు. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవ ఎంతో ఎక్కువ... అయినప్పటికీ.. తన అంతిమ కోరిక కూడా తీరకుండానే ఆయన కన్నుమూయడం ఆయన అభిమానుల్ని కంటతడి పెట్టిస్తోంది.

ముద్దుకృష్ణమ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన వారే అయిన్పటికీ.. గుంటూరు జిల్లాలో లెక్చరర్ ఉద్యోగంలో ఉన్నప్పుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తటస్థుల్ని, కొత్తవారిని ఎందరినో ప్రోత్సహించారు. అప్పటి యువరక్తంగా తెలుగుదేశం రాజకీయాల్తో ప్రస్థానం ప్రారంభించి వివిధ స్థాయులకు ఎదిగిన ఎంతోమందిలో గాలి ముద్దుకృష్ణమ కూడా ఒకరు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో తాను ఉంటూ.. పార్టీలో అప్పుడు కీలకంగా ఉన్న చంద్రబాబునాయుడును ధైర్యంగా ఢీకొన్న శైలి ఆయనది.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. కొన్నాళ్లు ఎన్టీఆర్ తెలుగుదేశంలో లక్ష్మీపార్వతితో పాటు ఉన్న గాలి.. చంద్రబాబునాయుడు అవినీతి బాగోతాలను ఎండగట్టడంలో కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు.. ‘సింగపూర్ బాబు’గా ముద్రపడడం గాలి కృషే. సింగపూర్ లో చంద్రబాబుకు బినామీ ఆస్తులు ఉన్నాయంటూ అప్పట్లో బయటపెట్టి సంచలనాలు సృష్టించారు. బాబుతో తీవ్రంగా విభేదించి.. చిత్తూరుజిల్లా రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అనే స్థితిలో ఉన్నారు.

కానీ రాజకీయంగా ఆయన సెకండిన్నింగ్స్ అంత వైభవంగా ఏమీ గడవలేదు. ఎన్టీఆర్ తెలుగుదేశంతో భవిష్యత్తు ఉండదని తేలిపోయిన తర్వాత.. గాలి ముద్దుకృష్ణమ.. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పుత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గానీ.. మంత్రి పదవులు ఇవ్వకుండా వైఎస్ దూరంపెట్టారు. దీనితో మనస్తాపం చెంది 2008లో మళ్లీ తెలుగుదేశంలో చేరారు.

కానీ.. 2009 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.. కానీ ఆ పార్టీ నెగ్గలేదు. 2014లో పార్టీ నెగ్గింది. కానీ ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు. కాకపోతే.. రికార్డు స్థాయిలో ఆరుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఆయనకు ఉండిపోయింది.

ముద్దుకృష్ణమ సీనియారిటీని గుర్తించిన చంద్రబాబునాయుడు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. సీనియారిటీ అనుభవాన్ని బట్టి ఆయన మంత్రిపదవి కూడా ఆశించారు గానీ.. ఆయన వయోభారం, కులసమీకరణాల నేపథ్యంలో అది సాధ్యంకాలేదు.

అంతిమ కోరిక ఇదీ...

రాజకీయంగా ఎన్నో కీలక పదవులు కూడా అనుభవించిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు.. శేషజీవితాన్ని కొన్నాళ్లపాటూ అయినా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో గడపాలని కలగన్నారు. టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని చంద్రబాబును అడిగారు. వయసులో కూడా సీనియర్ అయిన గాలి ముద్దుకృష్ణమ నాయుడుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వడానికి చంద్రబాబునాయుడు కూడా మొగ్గు చూపించినట్లు వార్తలు వచ్చాయి.

ఆయన మాట ఇచ్చారు కూడా! మంత్రిపదవి కూడా ఇవ్వడంలేదు గనుక, ఎలాగైనా ముద్దుకే పదవి ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నప్పటికీ.. టీటీడీ బోర్డు ఏర్పాటులో కుల సమీకరణల ఒత్తిడిలో ఆయన ఆ పనిచేయలేకపోయారని కొందరు చెబుతుంటారు. జీవితంలో చివరి అంకంలో ‘ముద్దు’లో ఆ అసంతృప్తి, మనస్తాపం మిగిలిపోయింది. ఆ రకంగా భగవత్సేవలో శేష జీవితం గడపాలనే చివరి కోరిక తీరకుండానే.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించిన ముద్దుకృష్ణమ నాయుడు.. పరమపదించారు.

- కపిలముని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?