Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

అధికారం పంచితే... అవకాశం పెరుగుతుందా...?

అధికారం పంచితే... అవకాశం పెరుగుతుందా...?

కొన్ని పంచితే పెరుగుతాయి... మరికొన్ని పంచితే తరుగుతాయి. అయితే పంచడం అనేది జరిగితే అవకాశాలు పెరుగుతాయా... ఏమో? ప్రస్తుత రాజకీయాల్లో పంచితే పెరుగుతాయనే చెప్పుకోవాలేమో. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను గమనిస్తే ఓవైపు మజ్లిస్ పార్టీ, మరోవైపు తెరాసలు అధికారం పంచుకుంటే గెలిచే అవకాశాలు పెరుగుతాయనే భావిస్తున్నాయి.

రానున్న ఎన్నికల్లో ఏకపక్షంగా తమ గెలుపు ఖాయం అని తెరాస ఘంటాపథంగా చెప్పుకుంటూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలలో తెరాసకు తామే అధికారంలోకి వస్తామా అనే విషయంలో పెద్ద అనుమానం లేకపోయినా... ఎందుకైనా మంచిదని మజ్లిస్ పార్టీని కూడా తమతోపాటు కలుపుకుంటే మరింత శక్తివంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని భావిస్తోంది. అందుకే పొత్తులు అనేవి లేకున్నా మజ్లిస్ పార్టీ వారు తమకు మిత్రపక్షమే అని కేసీఆర్ బాహాటంగానే ప్రకటించారు. కలిసి పోటీచేయడం లేదు గానీ, ఒకరికొకరు సహకరించుకుంటాం అనేది గులాబీ బాస్ మాట.

ఇది ఇలావుంటే మరోవైపు మజ్లిస్ పార్టీనేతలు కూడా తమ ఏడు సీట్లల్లోనూ గెలుపు ఎటూ తమదే ఖరారు అనుకుంటున్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. మొన్నటివరకూ తెరాసకు మిత్ర పక్షంగానే ఎంఐఎం ఉంది. అయితే ఇలా మిత్రపక్షంగా ఉండడం వల్ల ఆ పార్టీకి ఒరిగింది ఏమీలేదనే చెప్పాలి. దీంతో రానున్న ఎన్నికల్లో తాము తెరాసకు మిత్రపక్షమే అయినా... తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత తాము కూడా అధికారంలో ఎంతోకొంత భాగం కోరాలని మజ్లిస్ భావిస్తోంది.

ఇటీవల జరిగిన తాజా పరిణామాలలో మజ్లిస్ నేత అసదుద్దీన్ తెరాస అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి అనే విషయాన్ని పక్కటబెడితే, భేటీ అనంతరం అసదుద్దీన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెరాసదే విజయమని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ప్రకటించారు. ఇది ఇలా ఉంటే మరోవైపు తాజాగా ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ తాము కూడా అధికారం కోరితే తప్పేంటి అనే ప్రశ్నను తెరపైకి తీసుకువచ్చారు.

కర్ణాటకలో అతి తక్కవ స్థానాలను కైవసం చేసుకున్న కుమారస్వామి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, మనం మాత్రం ఎందుకు అధికారంలోకి రాలేం.. అని అక్బరుద్దీన్ అంటున్నారు. తమకున్న ఏడుస్థానాల మద్దతు తెరాసకు ఇవ్వడం వల్ల తాము కూడా అధికారంలో వాటా అడగడం సబబేననే విషయాన్ని అక్బరుద్దీన్ తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం ఎన్నికల్లో తెరాసను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ మహాకూటమి పేరుతో తెలుగుదేశం, తెజస, సీపీఐ పార్టీలను కలుపుకుని ఎన్నికల బరిలో దిగుతుండగా, మరోవైపు బిజెపి కూడా తెరాస ఓటమికి, తమ గెలుపునకు అవిరళ కృషి చేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో తెరాస తమకు గెలుపు ఖాయమనే నమ్మకం ఉన్నా కూడా అతి నమ్మకం కూడా అన్ని వేళలా మంచిది కాదనే ఉద్దేశ్యంతో ఎంఐఎం తమకు మిత్రపక్ష పార్టీ లాంటిదేనని ప్రకటించింది. ఇలా ప్రకటించడంలో కేసీఆర్ రాజకీయం లేకపోలేదు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలోనూ ముస్లిం ఓటర్ల అభిమానం చూరగొనవచ్చు, ఫలితంగా ఎన్నికల్లో మరిన్ని ఓట్లను తన గెలుపు ఖాతాలో వేసుకోవచ్చని భావిస్తున్నారు.

మరోవైపు తెరాసకు మద్దకు అవసరం లేకపోతే సరే... మిత్రపక్షంగా తాము కొనసాగడం ఎటూ జరుగుతుంది. ఒకవేళ వారికి తమ మద్దతు అవసరం అయితే గనుక తాము ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు మరో మంత్రి పదవిని కూడా డిమాండ్ చేయడానికి మజ్లిస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. తమకున్న ఏడుస్థానాల్లో తమదే విజయం. ఇందులో ఎలాంటి సందేహం ఎవరికీ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడు స్థానాల్లోనూ వారి విజయాన్ని మరే పార్టీ అడ్డుకోలేకపోతోంది.

దీంతో ఆ ఏడు స్థానాలను వదిలేసే మిగిలిన సీట్లను మాత్రమే అవి పంచుకోవడం జరుగుతోంది. ఇటు మహాకూటమి అయినా కూడా ఉన్న నూట పంతొమ్మిది స్థానాలలోనూ ఏడింటిని వదిలేసి, మిగిలిన నూట పన్నెండు స్థానాలను మాత్రమే పంచుకోవడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. తెరాస కూడా ఏడు స్థానాలను వదిలేసే పోటీచేసే విషయం గురించి ఆలోచిస్తోంది. ఇలా అన్ని పార్టీలు కూడా మజ్లిస్ బలంగా ఉన్న ఏడు స్థానాలను వారికే వదిలేసి, ఆ స్థానాలు వారివే అనే భావంతో ఉన్నాయి.

దీంతో ఆ ఏడు స్థానాలలోనూ మజ్లిస్ కు ఎదురులేకుండా వారి గెలుపు అలా నల్లేరు మీద బండి నడకలా సాగుతూ వస్తోంది. ఇలా ఏడు స్థానాలను కైవసం చేసుకున్న ఎంఐఎం పార్టీ ఎన్నికల్లో తెరాసకు గనుక తమ మద్దతు అవసరమైతే అధికారంలో కూడా తాము వాటా అడగడానికి పథకాలు రూపొందించుకుంటోంది. మరోవైపు కేసీఆర్ మజ్లిస్ మద్దతు అవసరమైతే వారికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినా ఇవ్వవచ్చు. ఇదే జరిగితే మిగిలిన ప్రాంతాలలోని ముస్లిం ఓట్లు వేరే ప్రత్యామ్నాయం లేకుండా తెరాసకే పడతాయనే విషయం చెప్పాల్పిన అవసరం లేదు.

తమ వర్గానికి చెందిన వ్యక్తికి అధికారం వస్తుందంటే సహజంగానే ఆ వర్గం ఓట్లు చీలిక లేకుండా తెరాసకే పడతాయని వేరే చెప్పనక్కర్లేదు. ఈ వాతావరణంలో ప్రస్తుతం కీలక అంశం ఏంటంటే.. మజ్లిస్ కు అధికారంలో వాటా ఇస్తాం అనే సంగతిని ముందుగానే ప్రకటిస్తే అదనపు లాభం ఉంటుందా? అనేచర్చ! ఎందుకంటే.. మజ్లిస్ తమ మద్దతు పార్టీనే అని చెప్పుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల ఓట్లు అడగడం వేరు- మజ్లిస్  కూడా తమతో పాటూ కేబినెట్ ను పంచుకుంటుంది అని ప్రకటించి- ఓట్లు అడగడం వేరు.

రెండో పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా మజ్లిస్ పట్ల సానుకూలత ఉండే ముస్లింలు అందరూ ఎగబడి తెరాసకు అనుకూలంగా ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రతిపాదనను కూడా తెరాస పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల తెరాస గెలుపు మరింత సులువవుతుంది. అలాగే అవసరం అయితే మజ్లిస్ అండ ఉండనే ఉంటుంది.  మరోవైపు మజ్లిస్ కూడా తమ స్థానాలు తమకు ఎంటూ ఉండనే ఉంటాయి. అందులో ఎలాంటి ఢోకాలేదు.

అలాగే తెరాస కోరితే తమ మద్దతు ఇచ్చే విషయంలో మాత్రం కాస్త తెలివిగా ముందుకు సాగాలని భావిస్తున్నారు. తమ మద్దతు ఇవ్వాలంటే తమ పార్టీ నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు మంత్రివర్గంలో మంత్రి పదవిని కూడా కట్టబెట్టాలని డిమాండ్  చేయడానికి పథకాలు రూపొందించుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?