Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: యూత్‌ఫుల్ దేవ్ ఆనంద్ 01

ఎమ్బీయస్‍: యూత్‌ఫుల్ దేవ్ ఆనంద్ 01

ఈ సెప్టెంబరు 26న దేవ్ ఆనంద్‌ శతజయంతి. అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి ఉత్సవాలు సెప్టెంబరు 20న ప్రారంభమై వచ్చే ఏడాది సెప్టెంబరు 20 నాటికి ముగుస్తాయి. దేవ్ విషయంలో యివాళ్టితో శతజయంతి అయిపోయింది. అతనిపై సీరియల్ రాయాలని రెండేళ్ల క్రితమే ప్లాన్ చేశాను. కానీ వాయిదా వేస్తూ వచ్చాను. ఈ మధ్య సీరియల్స్ రాసే అలవాటు తప్పడంతో పూర్తి చేస్తానా లేదాన్న అధైర్యం కలిగింది. ఇవాళ మాత్రం గట్టిగా సంకల్పం చెప్పుకున్నాను. ఎంతో కొంతైనా రాయాలని. ఇది పాఠకుల్లో ఒక వర్గానికి మాత్రమే నచ్చుతుందని నాకు తెలుసు. అతని నటన గురించి పాఠకుల్లో ఎక్కువ మందికి తెలియకపోయినా అతని సినిమాల్లో పాటలు యిప్పటికీ పాప్యులర్ కాబట్టి, యూట్యూబులో అవైనా చూసి ఉంటారు కాబట్టి కాస్త ఫెమిలియర్‌గా అనిపిస్తాడు. నటుడిగా కంటె వ్యక్తిగా సైతం నేటి తరాన్ని కూడా మెప్పించగల లక్షణాలు అతనిలో ఉన్నాయి. అతని ఆశావహ దృక్పథం, పరాజయాలను తట్టుకునే స్థయిర్యం, ఎప్పుడూ యూత్‌ఫుల్‌గా ఉండడం, కొత్తగా ఆలోచించే తత్త్వం, ఏటికి ఎదురీదగల సాహసం.. యివన్నీ పాఠకులను ఆకట్టుకోవచ్చని నా ఆశ.

హిందీ చిత్రసీమలో అగ్ర హీరోలుగా చెప్పదగినవారు దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, కాస్త వెనుకగా రాజేంద్ర కుమార్ యిత్యాదులు. దిలీప్ మంచి నటుడు. కానీ మెథడ్ యాక్టింగ్ అంటూ మరీ పట్టిపట్టి యాక్ట్ చేయడం గమనించవచ్చు. డైలాగు ఫాలో కావడం కాస్త కష్టంగానే ఉంటుంది. ట్రాజెడీ కింగ్ అని పేరు వచ్చినా కామెడీ చాలా బాగా చేస్తాడు. రాజ్ కపూర్ కూడా మంచి నటుడు కానీ చాప్లిన్ మాయలో, ఛాయలో పడ్డాడు. అంతిమంగా నటుడిగా కంటె దర్శకనిర్మాతగా ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. రాజేంద్ర కుమార్ దిలీప్‌ను కాస్త అనుకరించేవాడు. నటిస్తున్నాను కాస్కో అన్నట్లు ఉండేది. దేవ్ ఆనంద్ ఏ శ్రమా పడకుండా, అలవోకగా నటించినట్లు ఉండేది. మరీ ఎమోషనల్ పాత్రలు వేయకుండా ఆహ్లాదంగా ఉండే పాత్రలు ఎంచుకునేవాడు.

ఇంకో విశేషం ఏమిటంటే, అప్పట్లో హీరోలందరూ ‘రాముడు మంచి బాలుడు’ పాత్రలు వేస్తూ ఉంటే దేవ్ నెగటివ్ పాత్రలు కూడా నిరభ్యంతరంగా వేసేవాడు. రాజ్ కపూర్ ‘ఆవారా’, ‘శ్రీ 420’ వంటి పాత్రలు వేసినా పరిస్థితుల ప్రభావం వలన.. అంటూ బోల్డు బిల్డప్ ఉండేది. దేవ్ విషయంలో అలాటిదేమీ లేకుండానే, బ్లాక్‌లో సినిమా టిక్కెట్లు అమ్మేవాడు, స్మగ్లర్, హంతకుడు, మోసగాడు, పరాయివాడి భార్యను వశపరుచుకునేవాడు... యిలాటి పాత్రలు వేసేసేవాడు. కొన్ని సినిమాల్లో అతని హీరోయిన్ మరొకర్ని ప్రేమించేది. ఇలాటివి తక్కినవారి సినిమాల్లో కనబడేది కాదు. అతను వేసిన మరో రెండు దశాబ్దాలకు కానీ అగ్ర హీరోలు అలాటి పాత్రలు వేయలేదు. కొత్త రకం థీమ్స్‌తో తన దగ్గరకు వచ్చిన దర్శకులకు అవకాశాలు యిచ్చేవాడు. తనే దర్శకుడిగా మారి తీసిన సినిమాల్లో అనేకం పరాజయం పొందినా, కొన్ని సినిమాలు మాత్రం విజయవంతమయ్యాయి. ముందుచూపుతో, విభిన్నమైన అంశాలతో సినిమాలు తీశాడు. హిప్పీ సమస్యతో ‘‘హరేరామ హరేకృష్ణ’’, ఇంగ్లండులో అక్రమ వలసదారుల సమస్యతో ‘‘దేశ్ పర్‌దేశ్’’ వంటి కొన్ని సినిమాలు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి.

చాలా చిన్న వయసులోనే నిర్మాతగా మారాడు. రాజ్ కపూర్‌కి తండ్రి అండ, యిమేజి ఉంది. ఇతనికి లేదు. అయినా నిర్మాతగా మారాడు. సాహసంతో చాలా సినిమాలు తీశాడు. కెరియర్ చివరి దశలో పరాజయాలే పరాజయాలు. అయినా కృంగిపోలేదు. వాటిని ఆమోదిస్తూ పోయాడు. అదీ గొప్పతనం! నాకు యిష్టమైన దర్శకుల్లో గురుదత్ ఒకడు, గాయకుల్లో కిశోర్‌ కుమార్ ఒకడు. సంగీతదర్శకుల్లో ఎస్‌డి బర్మన్ ఒకరు. వీళ్లందరూ దేవ్ క్యాంపుకి చెందినవారే! అదో ప్రత్యేక అభిమానం. వ్యక్తిగా అతను ఎవరితోనూ వివాదాల్లో చిక్కుకోలేదు. జంటిల్‌మన్ అనిపించుకున్నాడు. దిలీప్‌లాగ దర్శకుణ్ని పక్కకు నెట్టేసి తనే దర్శకత్వం చేయడం లాటివి చేయలేదు. ఇక దేవ్‌కి రాజకీయ స్పృహ కూడా ఉంది. యాక్టివ్ పాలిటిక్స్‌లోకి దిగకపోయినా ఎమర్జన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన వారిలో అతనూ ఉన్నాడు. విద్యాధికుడు. ఇంగ్లీషు లిటరేచర్‌లో బిఏ చేశాడు.

అతని జీవిత చరిత్రను మొదలుపెట్టడానికి నేను ‘‘గైడ్’’ (1965) సినిమాను ఎంచుకుంటున్నాను. దేవ్ నటన పరాకాష్టకు చేరిన సినిమా అది. ఆ సినిమా నిర్మాణమే ఒక రసవత్తరమైన కథ. ఇంగ్లీషు-హిందీ రెండు భాషల్లోనూ తయారైన భారతీయ చిత్రం అదొకటే అనుకుంటున్నాను. దానికి విత్తనం 1961 బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పడింది. 1962 జూన్‌లో జరిగిన ఆ చిత్రోత్సవానికి దేవ్ ద్విపాత్రాభినయం వహించి, అమర్‌జీత్ దర్శకత్వంలో నిర్మించిన ‘‘హమ్ దోనోఁ’’ (1961) సినిమాను భారత ప్రభుత్వం తన అఫీషియల్ ఎంట్రీగా పంపించింది. ఆ సందర్భంగా దేవ్ తన భార్య మోనాతో సహా అక్కడకు వెళ్లాడు. మొదటి రోజు వివిధ దేశాల నుంచి వచ్చిన నటీనటులతో సహా వేదికను పంచుకున్నాడు. సినిమా నటుడు కావాలనుకున్న కలతో తన 23వ ఏట 1946లో ‘‘హమ్ ఏక్ హైఁ’’ సినిమాతో రంగప్రవేశం చేసి, ‘‘జిద్దీ’’ (1948)తో తొలి హిట్ కొట్టి, రొమాంటిక్ హీరోగా, స్టార్‌గా పేరుబడిన తను 15 ఏళ్లలోనే అంతర్జాతీయ స్థాయిలో ‘నటుడి’గా గుర్తించబడడం అతనికి ఎంతో ఆనందాన్నిచ్చింది.

అనుకోకుండా లిఫ్ట్‌లో అతని అభిమాన హాలీవుడ్ నయుడు జేమ్స్ స్టీవార్ట్ తారసిల్లాడు. వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నాడు.

‘‘ఔనౌను, స్టేజీ మీద చూశాను. ఇప్పటికి ఎన్ని సినిమాల్లో వేశారు?’’ అని అడిగాడు స్టీవార్ట్.

‘’61. ఈ ఏడాది యింకో రెండు విడుదలవుతాయి.’’

‘‘మై గుడ్‌నెస్. మా హాలీవుడ్‌లో అయితే కెరియర్ మొత్తంలో అన్ని సినిమాలు వేసినవాళ్లు తక్కువ. మీరు ఎన్నాళ్ల నుంచి వేషాలు వేస్తున్నారు? అసలు మీ వయసెంత? చూడబోతే చిన్నవాడిలా కనబడుతున్నారు.’’

దేవ్ చిరునవ్వు నవ్వి ‘’వయసు 38. పంజాబ్‌లో పుట్టాను. మా ఇండియాలో సినిమాలు త్వరగా తయారవుతాయి లెండి. నా సహచర నటులు యిన్ని సినిమాలు వేయలేదు. నేను సినీనిర్మాణంలో దిగడం చేత దానికి డబ్బు సంపాదించడానికి కాస్త ఎక్కువగానే వేశాను. ఇకపై తగ్గించుకుంటాను.’’ అన్నాడు.

‘‘ఓహ్, అప్పుడే సినిమాలు కూడా తీశారా? ఎన్ని తీశారేమిటి?’’

దేవ్ కాస్త ఆగి, మనసులో లెక్క పెట్టుకుని ‘’10 తీశాం. అంటే నేనూ, మా అన్నయ్య చేతన్ ఆనంద్ కలిసి నవకేతన్ అని సంస్థ పెట్టుకుని తీశాం. తను ప్రధానంగా డైరక్టరు అయినా, నటుడు కూడా. మా తమ్ముడు విజయ్ ఆనంద్ మంచి రచయిత. సినిమా కథే కాదు, స్క్రీన్‌ప్లే కూడా బాగా రాస్తాడు. నటిస్తాడు కూడా. అందరం కలిసి కుటుంబ సంస్థగా నడుపుతున్నాం.’’ అని జవాబిచ్చాడు.

‘‘ఓహ్, అంటే మీ నాన్నగారు చిత్రరంగానికి చెందినవారా?’’

‘‘అబ్బెబ్బే, ఆయన గురుదాస్‌పూర్ జిల్లా కోర్టులో అడ్వకేట్. మా పెద్దన్న మన్‌మోహన్ కూడా వకీలే. మా చేతన్ అన్న నా కంటె ఎనిమిదేళ్లు పెద్ద. ఆయన లాహోర్‌లో ఇంగ్లీషు లిటరేచర్ చేసి, కొంతకాలం బిబిసిలో పని చేసి, తర్వాత దెహరాదూన్‌లో ఓ స్కూల్లో టీచరుగా పని చేశాడు. సినిమాలకు కథలు రాయాలనే కోరికతో బొంబాయి చేరి, ఓ దర్శకనిర్మాతను కలిస్తే ఆయన తన సినిమాలో హీరో వేషం యిచ్చాడు. వేషాలు వేస్తూనే 1946లో ‘‘నీచా నగర్’’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అది 1946లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎవార్డు గెల్చుకుంది. అంతర్జాతీయ బహుమతి గెల్చుకున్న ప్రథమ భారతీయ చిత్రం అదే!’’

‘‘ఓహ్, నైస్. ఆయన్ని చూసి మీరు సినిమాల్లోకి వచ్చారా?’’

‘‘నేను లాహోర్‌లో ఇంగ్లీషు లిటరేచర్ చేసి, ఉద్యోగం కోసం బొంబాయి చేరాను. మా అన్నయ్య గారి వద్దే ఉంటూ, సినిమాల్లో వేషాలకై ప్రయత్నించాను. మీకు తెలియనిదేముంది, వేషాల కోసం శ్రమ పడాల్సి వచ్చింది. కాస్త నిలదొక్కుకోగానే అన్నయ్యతో కలిసి 1950లో తొలి సినిమా ‘‘అఫ్సర్’’ తీశాం. బాగానే ఆడింది. మా సంస్థ నిలబడింది.’’

‘‘బాగుంది. ‘‘హమ్ దోనోఁ’’ నిర్మాతగా కూడా మీకు అభినందనలు.’’

‘‘ఇక్కడ చెపితే కుదరదు, సాయంత్రం మేము అంతర్జాతీయ సినీ ప్రముఖులందరికై ఒక పార్టీ ఏర్పాటు చేస్తున్నాం. జర్మన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు మాకు సహకరిస్తున్నారు. జర్మన్ సినిమాల్లోనే కాక హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన మాక్సిమిలియన్ షెల్, ఆయన చెల్లెలు, జర్మన్ సినిమాల్లో హీరోయిన్ మారియా షెల్ వస్తున్నారు. వాళ్లిద్దరికీ ఆస్కార్ ఎవార్డులు వచ్చాయని మీకు గుర్తుండే ఉంటుంది. అలాగే ఇంగ్లీషు చిత్రసీమ నుంచి హాలీవుడ్‌కి వెళ్లి విజయపతాకాన్ని ఎగరేసిన జేమ్స్ మాసన్, క్రిస్టియన్ డోయర్‌మెర్ అనే జర్మన్ హీరో, యింకా అనేకమంది వస్తున్నారు. మీరూ వస్తే మాకెంతో ఆనందం.’’ అన్నాడు దేవ్.

‘‘తప్పకుండా.’’ అన్నాడు స్టీవార్ట్. పార్టీకి వెళ్లాడు కూడా. పార్టీ చాలా గ్రాండ్‌గా జరిగింది. అక్కడ యితర ప్రముఖులతో పాటు సినిమాలో దేవ్ సరసన హీరోయిన్లగా నటించిన నందా, సాధన, డైరక్టరు అమర్‌జీత్, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాసిన విజయ్ ఆనంద్ అందరూ కలిశారు. ఇండియా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తందూరీ చికెన్ అతిథులందర్నీ మెప్పించింది. ఇంచుమించు తెల్లారేదాకా పార్టీ జరిగింది.

అక్కడ స్టీవార్ట్‌కి 41 ఏళ్ల టాడ్ డెనియలెవస్కీ అనే డైరక్టరు తారసిల్లాడు. అతను పోలండ్‌లో పుట్టాడు. నాజీ క్యాంపుల్లో అవస్థలు పడి, మిత్ర సైన్యాల చేత విడిపించబడి, 1948లో అమెరికాకు వచ్చి స్థిరపడ్డాడు. లండన్‌లోని రాయల్ ఎకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్‌లో చదువుకుని, న్యూ యార్క్‌లో నటులకు శిక్షణ యివ్వడం మొదలుపెట్టాడు. నాటకాలు, టీవీ కార్యక్రమాలు నిర్మించసాగాడు.

ఇతని పని తీరు పెర్ల్ ఎస్. బక్ అనే విశ్వవిఖ్యాత రచయిత్రిని ఆకర్షించింది. 1892లో అమెరికాలో పుట్టిన ఆమెను తలిదండ్రులు నాలుగు మాసాల వయసులోనే చైనాకు తీసుకుని వెళ్లిపోయారు. వాళ్లు క్రైస్తవ మత ప్రచారకులు. పెర్ల్ బాల్యం అక్కడే గడిచింది. 18వ ఏట అమెరికా వచ్చి వర్జీనియాలోని ఓ కాలేజీలో మూడేళ్లు చదివి గ్రాజువేట్ అయింది. మళ్లీ చైనా వెళ్లి జాన్ బక్ అనే అతన్ని పెళ్లాడింది. తనూ క్రైస్తవ మతప్రచారకురాలిగా పని చేసింది. చర్చి నడిపే యూనివర్శిటీలో పాఠాలు చెప్పింది. 42 ఏళ్ల వయసులో ఆమెకు తన వృత్తిపై విసుగు పుట్టి, అమెరికాకు తిరిగి వచ్చేసింది. భర్త జాన్ బక్‌కి విడాకులు యిచ్చి, తన నవలలు పబ్లిష్ చేస్తున్న రిచర్డ్ వాల్ష్‌ను పెళ్లాడింది. పాతికేళ్ల దాంపత్యం తర్వాత 1960లో అతను చనిపోయాడు. వాల్ష్‌ను పెళ్లాడినా రచయిత్రిగా తన పేరు పెర్ల్ ఎస్. బక్‌నే కొనసాగించింది. మహిళా హక్కులు, జాతివివక్షతపై పోరాటం యిత్యాది ఉద్యమాలలో పాల్గొంది.

బాల్యం చైనాలో గడపడం చేత ఆమెకు చైనా సంస్కృతి సంప్రదాయాలపై చక్కటి అవగాహన ఉంది. చిన్నప్పుడు సాహిత్యంపై యిష్టంతో చిన్న చిన్న కథలు రాసేది, ఇంగ్లీషులోనే! ఆ అనుభవంతో చైనా వైవాహిక వ్యవస్థ గురించి ‘‘ఈస్ట్ విండ్, వెస్ట్ విండ్’’ అనే నవలను 1930లో రాసింది. ఆ తర్వాతి ఏడాది చైనా గ్రామీణుల కష్టాల గురించి వెలువడిన ‘‘ద గుడ్ ఎర్త్’’ అనే నవల ఆమెకు శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టింది. 1932లో పులిట్జర్ బహుమతిని ఆర్జించింది. పెర్ల్‌కు 1938లో సాహిత్యానికి నోబెల్ బహుమతి వచ్చింది. అలా అందుకున్న తొలి అమెరికన్ మహిళ ఆమెయే. తర్వాత ఎన్నో ఎన్నో నవలలు, కథాసంపుటాలు, పిల్లల పుస్తకాలు, ఆత్మకథ రాసింది. ‘‘గుడ్ ఎర్త్’’ నవలను ఎంజిఎమ్ వారు 1937లో సినిమాగా మలిచారు. అది హిట్ అయింది. తర్వాత ‘‘డ్రేగన్ సీడ్’’ (1944) అనే నవలనూ సినిమాగా తీశారు. ఆ తర్వాత మరోటి, మరోటి. దీంతో ఆమెకు సినీరంగంపై ఆసక్తి కలిగింది.

1960లో రెండవ భర్త పోయాక తన 68వ ఏట ఆమె సినీనిర్మాణంలో దిగుదామనుకుంది. జపాన్‌ తీరంలో సునామీ వచ్చినపుడు ఒకమ్మాయిని ప్రేమించిన యిద్దరబ్బాయిలు ఏం చేశారు అనే థీమ్ మీద తను రాసిన ‘‘ద బిగ్ వేవ్’’ నవలను సినిమాగా మలచడానికి ఆమె టెడ్‌తో చేతులు కలిపింది. నిర్మాణవ్యయాన్ని యిద్దరూ కలిసి భరించారు. టెడ్ దర్శకత్వం వహించాడు. 1961లో సినిమా విడుదలై, ఓ మాదిరిగా ఆడింది. ఆ తర్వాతి ఏడాది టెడ్ ‘‘నో ఎగ్జిట్’’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. జీన్ పాల్ సాత్రే అనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ రాసిన నాటకం ఆధారంగా ఆ సినిమా తయారైంది. నిర్మాతలు వేరే వారు. దాన్ని యీ చిత్రోత్సవంలో ప్రదర్శనకు అనుమతించడంతో టెడ్ ఆ సందర్భంగా బెర్లిన్‌కు వచ్చి ఉన్నాడు.

టెడ్‌ను చూస్తూనే స్టీవార్ట్ ‘‘మీరు తీసిన ‘‘నో ఎగ్జిట్’’ సినిమాను యివాళ ప్రదర్శించారు కదా. బాగుంది. ముఖ్యంగా ఆ నటీమణులిద్దరూ చాలా బాగా నటించారు. వారిలో ఎవరో ఒకరికి ఉత్తమ నటి ఎవార్డు తథ్యం అనిపిస్తోంది. ఎవరికి యిస్తారో ఊహించడం కష్టం. ఇద్దరికీ ఉమ్మడిగా యిస్తారేమో. (నిజానికి అదే జరిగింది)’’ అన్నాడు. టెడ్ థ్యాంక్స్ చెప్పాక ‘‘మీకు దేవ్ ముందే తెలుసా?’’ అని అడిగాడు.

‘‘తెలుసు, నేనూ పెర్ల్ ఒకసారి దేవ్‌ను ఇండియాకి వెళ్లి కలిశాం. ఒక ఇండియన్ రైటర్ రాసిన ఇంగ్లీషు నవల ఆధారంగా అమెరికన్ ఫిల్మ్ తీద్దామనుకుని, దానిలో ఒక పాత్రను అతనికి యిద్దామనుకుని, వెళ్లి మాట్లాడాం. అతను ఆ నవల చదవలేదంటే, యిచ్చి చదివించాం కూడా. చదివి పెదవి విరిచాడు. ‘ఇండియాలో నాకు స్టార్ స్టేటస్ ఉంది. కాబట్టి నేను వేసే మొదటి విదేశీ చిత్రంలో పాత్ర ఛాలెంజింగ్‌గా ఉండాలి. ఈ పాత్ర చూడబోతే నేను కాకపోతే మరొకరైనా వేసేట్టు ఉంది.’ అన్నాడు. దాంతో ఆ ప్రాజెక్టు మూలపడింది. పోనీ ఆ నవల కాకపోతే మరొకటేదైనా చూడమని రిక్వెస్టు చేయడానికే పార్టీకి ప్రత్యేకంగా వచ్చాను.’’ అన్నాడు టెడ్.

అప్పటికి తల ఊపి ఊరుకున్న స్టీవార్ట్ పార్టీ ముగిసి, వెళ్లిపోతూ దేవ్‌ను పిలిచి ‘‘ఈ రోజు వేసిన మీ సినిమాలో నీ అభినయం చూశాను. చాలా స్టయిలైజ్‌డ్‌గా ఉంది. నువ్వు హాలీవుడ్‌కు సరిపోతావు. పైగా నీ ఇంగ్లీషు ఉచ్చారణ అద్భుతంగా ఉంది. పెర్ల్ బక్, టెడ్ కలిసి నీకేదో ఆఫర్ యిస్తున్నారని విన్నాను. ఒప్పుకో. మంచి సబ్జక్టు చూసుకుని ముందుకు వెళ్లు. బెస్టాఫ్ లక్.’’ అని చెప్పాడు.

అతను వెళ్లిపోయిన చాలా సేపటిదాకా అతని మాటలు దేవ్‌ చెవుల్లో గింగురుమన్నాయి. మంచి కథ దొరికితే తప్పకుండా చేయాలని నిశ్చయించుకున్నాడు. అవేళే ‘‘గైడ్’’ సినిమాకు బీజం పడింది. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?