Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: ఐవైఆర్‌ ఆర్టికల్‌పై స్పందన

 

       ఐవైఆర్‌ కృష్ణారావుగారి ఉదంతంపై నేను రాసిన వ్యాసంపై చాలా వ్యాఖ్యలు వచ్చాయి. సందర్భరహితంగా నా కులం గురించి, జగన్‌ గురించి చేసిన వ్యాఖ్యల గురించి స్పందించేందుకు ఏమీ లేదు. హిందువులు బాధితులుగా వున్న సంఘటనలపై నేను స్పందించనని, బ్రాహ్మణులు బాధితులైనప్పుడే స్పందిస్తానని ఒకాయన ఆరోపిస్తూ బ్రాహ్మణులు కూడా హిందువులను గుర్తించాలని కోరారు. ఈ ఆర్టికల్‌లో నేను ఎక్కడైనా బ్రాహ్మణులు బాధితులని, కృష్ణారావుగారిని అర్ధాంతరంగా తీసివేయడం వలన వాళ్లకు నష్టం వాటిల్లిందని రాశానా? ఈయన ఉద్యోగం పోయినంత మాత్రాన వాళ్లందరికీ ఉద్యోగాలు పోతాయని, యిక ఋణాలు మంజూరు కావని రాశానా? కృష్ణారావుగారిని తీసేస్తే ఏం, మరో బ్రాహ్మణ్ని వేశారుగా, బ్రాహ్మలకు అన్యాయం ఎక్కడ జరిగింది అని ఒకరు అడిగారు. బ్రాహ్మణ కార్పోరేషన్‌ చైర్మన్‌గా బ్రాహ్మణ్నే వేయాలన్న రూలేమీ లేదు. ఎస్సీ కార్పోరేషన్‌ ఎండీలుగా ఎస్సీయేతర ఐఏఎస్‌లు పనిచేసిన సందర్భాలున్నాయి. కార్పోరేషన్‌ నడిపేవాళ్లు ఎవరైనా కావచ్చు, అది పెట్టిన లక్ష్యం నెరవేరిందా లేదా అన్నదే ముఖ్యం. బ్రాహ్మణ కార్పోరేషన్‌ పెట్టినపుడు హర్షిస్తూ రాయలేదని మరొకరి ఫిర్యాదు. నాకేం పని? ప్రభుత్వం ఏదైనా పని తలపెట్టగానే జయజయధ్వానాలు పలుకుతూ రాయడానికి నేను వారి పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారిని కాను. ఏదైనా స్థాపించాక, కొన్నాళ్లు గడిచాక దాని పని తీరుతెన్నులపై అవసరమైతే వ్యాఖ్యానిస్తాను. ఆ ఆర్టికల్‌లో కూడా యీ కార్పోరేషన్‌, తెలంగాణ బ్రాహ్మణ కార్పోరేషన్‌ చురుగ్గానే పనిచేస్తున్నాయని రాశాను. పాఠకుల్లో ఒకరు ఆంధ్ర బ్రాహ్మణ కార్పోరేషన్‌లో పైరవీలకు అవకాశం లేకుండా, చాలా ప్రొఫెషనల్‌గా నడుపుతున్నారని రాశారు. ఇప్పుడీయన్ని తీసేసి ఆనందసూర్యను పెట్టినంత మాత్రాన అవన్నీ పోతాయని నేనేమీ ఊహాగానాలు చేయలేదు. ఆనందసూర్య ఎంత సమర్థుడో ఓ ఏడాది పోయాక తెలుస్తుంది అని రాశాను. 

ఆ మాట కొస్తే యీ ఉద్యోగం పోవడం వలన కృష్ణారావుగారికీ నష్టం లేదు. దీనిలో ఆయనకి వచ్చే జీతమేమీ లేదన్నారు. ఇక తన కులానికి సేవ చేసే అవకాశమంటారా, దీన్ని చాలా ప్రొఫెషనల్‌గా నిర్వహించారు కాబట్టి డబ్బున్న బ్రాహ్మణులెవరైనా పేద బ్రాహ్మణుల కోసం ట్రస్టు పెట్టి యీయనను నిర్వహించమని కోరవచ్చు. అప్పుడు నిధుల కోసం సిఎం ఆఫీసు చుట్టూ తిరిగే టైము మిగులుతుంది. అందువలన ఆయనను నేను బాధితుడిగా చిత్రీకరించలేదు. అసలు నా ఆర్టికల్‌ మెయిన్‌ థీమ్‌ ఏమిటి? కృష్ణారావుగారిపై చేసిన ఆరోపణల సంగతేమైంది? అవి నిజమైతే చర్యలెందుకు తీసుకోలేదు? నిజం కాకపోతే ఎందుకు చేశారు? అని ప్రశ్నలు వేశాను. వాటికి టిడిపి ప్రభుత్వం ఎలాగూ జవాబు చెప్పలేదు. కనీసం పాఠకులైనా చెప్పలేదు. చాలామంది కృష్ణారావుగారి ఫేస్‌బుక్‌ పోస్టింగ్స్‌ గురించే కామెంట్‌ చేశారు. వాటిని నేనెలా సమర్థిస్తానని ప్రశ్నలు సంధించారు. నేను వాటిని సమర్థించానా? వ్యాసం మళ్లీ ఓ సారి చదవండి. '...సోషల్‌ మీడియాలో కామెంట్లు పెట్టడం ఔచిత్యభంగమా? చట్టవిరుద్ధమా? అనేది ఆంధ్ర పాలకులు చెప్పవలసిన సమాధానం. ఔచిత్యభంగం కనక అయితే ఆయన్ని పిలిచి మందలించవచ్చు, సంజాయిషీ అడగవచ్చు. ఉన్నపళంగా చెప్పాపెట్టకుండా పదవీకాలానికి ఏడాదిన్నర ముందుగా తీసేయనక్కరలేదు. ఇక చట్టవిరుద్ధమే అయితే తీసేయడంతో వదిలిపెట్టకూడదు. కేసులు పెట్టి శిక్ష పడేట్లా చేయాలి.' అని స్పష్టంగా రాశాను. ఇక ఔచిత్యభంగం గురించి కూడా ఏం రాశాను? 'ఇక ఔచిత్యభంగం జరిగిందా లేదా అన్నదానిపై నిర్వచనం యివ్వడం కష్టం. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది.' అనే అన్నాను తప్ప ఆ పోస్టింగులు భేష్‌ అనలేదు. వ్యక్తిగతంగా అడిగితే అవి నాకు రుచించలేదు, ముఖ్యంగా కులప్రస్తావన ఉన్నవి! కానీ వాటి కారణంగా ఎవరినీ డిస్మిస్‌ చేయను. పిలిచి ఏమిటండీ యిది అని అడుగుతాను. ప్రభుత్వం వారు వీటివలన తీసేశామని లిఖితపూర్వకంగా చెప్పలేకపోయారంటేనే తెలుస్తోంది అవెంత ఫ్లిమ్జీ గ్రౌండ్సో! పైగా అవి తాజాగా పెట్టిన పోస్టింగులు కాదు. 

తీసివేతకు ముఖ్యకారణం బాబు పొలిటికల్‌ మైలేజీకి యీయన దోహదపడడం లేదన్న ఫిర్యాదే అని నా నమ్మకం. అదే వ్యాసంలో రాశాను. ఈ ఆనందసూర్య హయాంలో కార్పోరేషన్‌ కార్యకలాపాలు ఎన్టీయార్‌ ట్రస్టు భవనం నుంచే జరుగుతాయని నా సందేహం. అలా జరక్కపోతే వచ్చే ఏడాదికి ఆయన కూడా ఉద్యోగంలో వుండడు - ఆయనకు ఫేస్‌బుక్‌ ఖాతా వున్నా లేకపోయినా! ఆయన కాలంలో కార్పోరేషన్‌కు ఎక్కువ నిధులు కురుస్తాయా? వేచి చూడాలి. నా ఉద్దేశం ప్రకారం జనరల్‌ ఎన్నికలు దగ్గరపడినప్పుడు, బ్రాహ్మణులను దీని ద్వారా ఆకట్టుకోవచ్చనే ఐడియా వచ్చినపుడు రాలతాయి. ఇప్పుడు నంద్యాల చూడండి, ఉపయెన్నిక అనగానే ఎంత డబ్బు కురిపిస్తున్నారో! మామూలుగా అయితే పేద రాష్ట్రం, తాహతుకి మించి అప్పులు చేయనీయండి, విదేశీ ఋణాన్ని ఋణంగా లెక్క వేయకండి అంటూ కేంద్రాన్ని బతిమాలుతూంటారు. ఇప్పుడు నంద్యాలలో ఎడాపెడా తాయిలాలు ప్రకటించారు. భూమా నాగిరెడ్డి బతికే వుంటే నంద్యాలకు యీ భోగం పట్టేదా? 

బ్రాహ్మణులకు టిడిపి టిక్కెట్లు యివ్వలేదు అనే పరిశీలనపై ఒకరు వ్యాఖ్యానిస్తూ వారంతట వారు రాజకీయంగా ప్రతిభావంతులు అవ్వాలి అంటూ నేతకు కావలసిన లక్షణాలు వర్ణించారు. అవి ఏ కులానికైనా వర్తిస్తాయి. ఆ లక్షణాలు లేవు కాబట్టే బాబు బ్రాహ్మణులకు యివ్వలేదన్నారాయన. అంతకంటె వారిలో బాబుకి అవి కనపడలేదు అనడం కరక్టు. ఎందుకంటే వైసిపికి కనబడింది కాబట్టే రఘుపతికి టిక్కెట్టిచ్చారు. ఆ లక్షణాలు వున్నాయి కాబట్టే ఆయనా గెలిచారు. కాంగ్రెసుకు, బిజెపికి కూడా గోచరించాయి కాబట్టి వాళ్లూ టిక్కెట్లు యిచ్చారు. ఎన్టీయార్‌కూ గోచరించాయి. బాబుకి మాత్రమే గోచరించలేదు. అంతేకాదు, ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచే లక్షణాలే కాదు, లెజిస్లేచర్‌, రాజ్యసభలకు కూడా పనికి వచ్చేవారిగా ఆయనకు తోచలేదు. ఇదేమీ ఫిర్యాదు కాదు. ఆయన పార్టీ. ఆయన యిష్టం. తక్కిన నాయకులూ, ఆ పార్టీకి ఓటేసిన ఓటర్లూ ఆమోదించిన నిర్ణయం. కాదనడానికి మనమెవరం? 

ఇక పథకాలకు చంద్రబాబు పేరు గురించి - వైయస్‌ రాజీవ్‌, ఇందిరల పేర్లు పెట్టలేదా అని కొందరు వాదించారు. ఇక్కడ గమనించవలసిన దేమిటంటే వైయస్‌ ఆ స్కీములకు తన పేరు పెట్టుకోలేదు. జాతీయ నాయకులు, దివంగతులు అయినవారి పేరు పెట్టాడు. అఫ్‌కోర్స్‌, తన పార్టీ వాళ్ల పేర్లే పెట్టాడు. అలా అని బతికున్న సోనియా పేరు పెట్టలేదు, ఆవిడ వలననే తన పదవి నిలిచినా! ఇప్పుడు మోదీ కూడా కేంద్రపథకాలకు తన పేరు పెట్టుకోలేదు. తన పార్టీ లీడరైన దీన్‌దయాళ్‌ పేరు పెట్టాడు. ముఖ్యమంత్రి తన పేరే పథకాలకు పెట్టుకోవడం విడ్డూరం. ఎన్టీయార్‌  సైతం తెలుగుగంగ అన్నాడు తప్ప రామగంగ అనలేదు. బస్‌స్టాండ్‌లను శాతవాహన ప్రాంగణాలన్నాడు తప్ప తారకప్రాంగణాలనలేదు. కిరణ్‌కుమార రెడ్డి 'ఉద్యోగకిరణాలు' అంటూ అన్యాపదేశంగా తన పేరు పెట్టుకున్నాడు. అలాగే బాబు 'చంద్రోదయం' అనో మరోటో పెట్టుకుంటే ఎత్తిచూపనవసరం లేదు. కానీ డైరక్టుగా తన పేరే పెట్టుకోవడంతో కెసియార్‌ కూడా ఇన్‌స్పయిరయ్యాడు. గర్భిణులకు  యిచ్చే కిట్స్‌ను కెసియార్‌ కిట్స్‌ అన్నాడు. ఈ ఆలోచన ముందే వచ్చి వుంటే 'మిషన్‌ భగీరథ'కు బదులు 'మిషన్‌ చంద్రశేఖరగంగ' అని పెట్టేవాడేమో! తెలంగాణ బ్రాహ్మణ కార్పోరేషన్‌ పథకాలకు కూడా కెసియార్‌ పేరు యిప్పటిదాకా లేదు. ప్రభుత్వ పథకాలకే కాదు, కులభవనాలకు కూడా బాబు పేరు పెట్టడం చిత్రాతిచిత్రం. ఇంజనీరింగ్‌ అసోసియేషన్‌ భవనానికి విశ్వేశ్వరయ్యగారి పేరు పెడతారు. డాక్టర్ల కిచ్చే ఎవార్డుకు డా. బిసి రాయ్‌ పేరు పెడతారు. డాక్టర్లకు విశ్వేశ్వరయ్య పేర అవార్డు యివ్వరు. కమ్మసంఘం భవనానికి రెడ్డిగారి పేరు పెట్టరు - ఆయన భూరివిరాళం యిస్తే తప్ప! విరాళాల సంగతేమీ లేకుండా ప్రభుత్వనిధులతో కట్టే మాటైతే ఆ కులంలో విఖ్యాతులైన వారి పేరు పెడతారు. కాపుల్లో పేరు స్మరించుకోదగ్గ మహానుభావులు ఎవరూ లేరా, చంద్రన్న పేరు పెట్టారు!? 

నిజానికి మన దేశంలో ప్రతిదానికీ గాంధీ, నెహ్రూ, ఇందిర, రాజీవ్‌ల పేర్లు పెట్టి చంపుకు తిన్నారు, దేశంలో మరో నాయకుడంటూ పుట్టలేదన్నట్లు! ఇప్పుడు ఎన్‌డిఏ హయాంలో కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్టీయార్‌ జిఎచ్‌ఎంసి భవన్‌కు బూర్గుల వారి పేరు పెట్టినప్పుడు సంతోషించాను. అలాగైనా ఆ మహానుభావుడి పేరు అందరికీ తెలుస్తుంది కదాని. భావితరాలకు పూర్వకాలంలోని తేజోమూర్తుల గురించి తెలియాలంటే పేర్లు పెట్టడం ఒక పద్ధతి. కాపు భవనానికి రఘుపతి వెంకటరత్నం నాయుడిగారి లాటి వారి పేరు పెట్టి వుంటే ఔచిత్యం వుండేది. ఏదైనా ప్రయివేటు ట్రస్టు వాళ్లు సొంత నిధులతో కట్టుకున్న భవంతులకు వాళ్లకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఎవరూ మార్చలేరు. ఇవన్నీ ప్రభుత్వనిధులతో కడుతున్నవి. ఫలానా పేరు పెట్టాలని నిర్ణయించడానికి యీ ప్రభుత్వానికి ఎంత హక్కు వుంటుందో, మార్చడానికి తర్వాతి ప్రభుత్వానికీ అంతే హక్కు వుంటుంది. తమిళనాడులో కరుణానిధి పాలించేటప్పుడు 5 చ.కి.మీ.ల ప్రాంతంలో ఒక శాటిలైట్‌ సిటీ కట్టి దానికి తన పేరే 'కలైజ్ఞర్‌ కరుణానిధి నగర్‌' అని పెట్టుకున్నాడు. అతను ఓడిపోయి ఎమ్జీయార్‌ అధికారంలోకి వచ్చాక దాన్ని పొట్టి చేసేసి 'కెకె నగర్‌' అని మార్చేశాడు. ఇప్పుడు అందరూ కెకె నగర్‌ అనే అంటున్నారు. అలాగే చంద్రన్న కాపు భవన్‌ భవిష్యత్తులో సికె భవన్‌గా మారిపోదన్న గ్యారంటీ ఏమీ లేదు. 

చాలామంది కృష్ణారావు గారి విషయంలో లేవనెత్తిన అంశం ఏమిటంటే - బాస్‌కు ఎదురు తిరగవచ్చా? అని. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ఉద్యోగి అంటే బానిస కాదు. ఒక ప్రభుత్యోద్యోగి ప్రభుత్వవిధానం వలన తను నష్టపోయానని అనుకున్నపుడు తన ఎంప్లాయర్‌, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తాడు. తన పై ఉద్యోగులను బోనులో నిలబెడతాడు. ప్రభుత్వోద్యోగి అనే కాదు, ప్రయివేటు రంగంలో సైతం ఉద్యోగులు యూనియన్లగా ఏర్పడతారు. మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలను, విధానాలను విమర్శిస్తారు, విభేదిస్తారు, వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు, కేసులు పెడతారు. సమ్మె చేస్తారు. పని ఆపేస్తారు. ఇవన్నీ ప్రజాస్వామ్యయుతమైనవే. తన డబ్బుతో నడిపే ఫ్యాక్టరీ వర్కరే తనను విమర్శిస్తున్నా యజమాని ఊరుకుంటున్నపుడు, ప్రజల డబ్బుతో నడిచే ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు మాత్రమే నడిపే ప్రభుత్వాధినేత సహించలేకపోతే ఎలా? ఉద్యోగి ముఖ్యమంత్రి యింటి నౌకరు కాదు. ఇద్దరూ ప్రజాసేవకులే. ఉద్యోగుల పని తీరు గురించి ముఖ్యమంత్రి బహిరంగంగా విమర్శించరా? ఈ లాజిక్‌ అందరు మంత్రులకు, అందరు ఉద్యోగులకు వర్తిస్తుంది. అయినా ఉద్యోగి స్వతంత్రభావాలను సహించలేని మంత్రులు వారిని బదిలీ చేయిస్తూంటారు. కృష్ణారావుగారి విషయంలో ఆయన కాంట్రాక్టు ఉద్యోగి కాబట్టి హఠాత్తుగా టెర్మినేట్‌ చేశారు. అంతవరకు అర్థం చేసుకోవచ్చు. కనుబొమ్మలెగరేసి ఊరుకోవచ్చు. కానీ ఆరోపణలు గుప్పించడం దేనికి? మళ్లీ వాటిని కడదాకా తీసుకుపోకుండా మధ్యలో వదిలేయడం దేనికి? నా వ్యాసం యీ ప్రశ్నలు లేవనెత్తింది. జవాబులు తెలిస్తే చెప్పగోర్తాను.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2017)

mbsprasad@gmail.com