cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీ స్నిప్పెట్స్‌- సావిత్రి- జెమినీ గణేశన్‌ దాంపత్యం

సినీ స్నిప్పెట్స్‌- సావిత్రి- జెమినీ గణేశన్‌ దాంపత్యం

సావిత్రి తెలుగువారికి అభిమాన నటీమణి. ఆమె అంత్యదశ చాలా దారుణంగా గడిచిందని అందరికీ తెలుసు. దానికి కారణం ఆమె భర్త జెమినీ గణేశనే అని చాలామంది గాఢంగా నమ్ముతారు. సావిత్రి జీవితచరిత్రలు రాసినవారు కూడా ఆమెను అన్ని విధాలా దోచుకున్న విలన్‌గా అతన్ని  చిత్రీకరిస్తారు. అయితే సావిత్రి పిల్లలు తమ తండ్రిని అలా చూడరు.  వాళ్ల కాపురం అలా కావడానికి కారణం ఎవరు? ఎవరి పొరపాటు ఎంత వుంది? ఇది తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలామందికి వుంది. సాంసారికమైన విషయాలు పబ్లిగ్గా చర్చించడం సబబు కాదు. కానీ సావిత్రి సెలబ్రిటీ కాబట్టి అది చర్చకు వస్తోంది. వీరిద్దరి విషయాలూ క్షుణ్ణంగా తెలిసినవారు మాత్రమే బాలన్స్‌డ్‌ వ్యూ యివ్వగలరు. అలాటి ఎనాలిసిస్‌ ఎక్కడైనా దొరుకుతుందా అని వెతుకుతున్న నాకు పసుపులేటి రామారావుగారు రాసిన ''వెండితెర విషాద రాగాలు'' పుస్తకంలో కొంత సమాచారం లభించింది. దాని గురించి చెప్పేముందు అందరికీ తెలిసున్న విషయాలు ముందర చెప్పేస్తాను. 

సావిత్రి భర్త జెమినీ గణేశన్‌. సావిత్రి పేదరికం నుంచి, విద్యాగంధం లేని నేపథ్యం నుంచి వస్తే యీయన నేపథ్యం దానికి పూర్తి వ్యతిరేకం. పేరు గణేశన్‌. ఊరు పుదుక్కోటై. జెమినీలో పనిచేశాడు కాబట్టి జెమినీ గణేశన్‌ అయ్యాడు. సైన్సు గ్రాడ్యుయేట్‌.  మద్రాసులో లెక్చరర్‌గా పనిచేశాడు. స్పోర్ట్స్‌మన్‌. అందగాడు. మంచి నటుడు. అనేక హిట్‌ సినిమాల్లో హీరోగా, తర్వాతి రోజుల్లో కారెక్టర్‌ యాక్టర్‌గా నటించాడు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. జంటిల్‌మన్‌గా పేరు. సహ నటీనటులతో, సాంకేతిక నిపుణులతో ఎవరితో ఎలాటి వివాదాలు లేవు. సరదా మనిషి. మాటకారి. సంగీతప్రియుడు. కర్ణాటక, హిందూస్తానీ సంగీతం బాగా పాడేవాట్ట. తనకు యిష్టమైన కీర్తన 'ఎన్నగాను రామభజన..' అని సావిత్రి ఒకసారి చెప్పారు. మంచి లక్షణాలు ఎన్ని వున్నా కానీ ఉమనైజర్‌గా. తమిళ రంగంలో అతనికి 'కాదల్‌ మన్నన్‌' అని బిరుదు. అంటే 'ప్రేమకు రారాజు' అన్నమాట. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. జీవిత చరమాంకంలో 79 వ యేట సెక్రటరీని పెళ్లాడితే ఆమె అతన్ని హింసించి వదిలిపెట్టింది. మొదటిభార్య సంప్రదాయబద్ధంగా పెళ్లాడినావిడ బాబ్జీ. ఆమెతో ఐదుగురు కూతుళ్లు. రెండో భార్య (ఈమెను పెళ్లి చేసుకున్నాడో లేదో స్పష్టత లేదు) నటీమణి పుష్పవల్లి. రేఖ తల్లి. మూడో భార్య సావిత్రి.

జెమినీ గణేశన్‌ 1948 ప్రాంతాల్లో జెమినీ స్టూడియోలో కాస్టింగ్‌ డిపార్టుమెంటులో పనిచేసేవాడు. సావిత్రి వేషాలకోసం వెతుకుతూ జెమినీ స్టూడియోకి వచ్చింది. 'మూణ్రు పిళ్లయిగళ్‌' అనే తమిళ సినిమాలో వేషం యిద్దామనుకున్నారు. కానీ వయసు, పొడుగు చాలదని ఫెయిలయింది. ఫైనల్‌గా జానకిని బుక్‌ చేశారు. జెమినీ స్టూడియోలోనే గణేశ్‌ సావిత్రిని చూడడం జరిగింది. తర్వాత కొన్నాళ్లకి అతను వేషాలిప్పించే వుద్యోగం మానేసి సినిమాల్లో వేషాలు వేయడం మొదలెట్టాడు. పి.పుల్లయ్య గారు తీసిన 'మనం పోల్‌ మాంగల్యం' అనే 1952 సినిమాలో ఇద్దరూ కలిసి వేశారు. అక్కడ మనసులు కలిసాయి. మాంగల్యం వైపు ఊహలు పోయాయి. అప్పటికే గణేశ్‌ వివాహితుడు, పిల్లల తండ్రి. అయినా గుట్టు చప్పుడు కాకుండా గుళ్లో పెళ్లి చేసేసుకున్నారు. అది 1952. 'మిస్సమ్మ' ప్లాను చేసినపుడు తమిళ వెర్షన్‌లో జెమినీగణేశ్‌ హీరో. హీరోయిన్‌ భానుమతి. భానుమతిని తీసేసి సావిత్రిని ప్రమోట్‌ చేయడంతో జెమినీకి పక్కన వేయడానికి, ఎక్కువ సమయం గడపడానికి సావిత్రికి అవకాశం చిక్కింది. మిస్సమ్మలో పాట వుంది చూడండి 'ఏమిటో ఈ మాయా' అని, పాత్రే కాదు, పాత్రధారిణి కూడా ఆ మాయలో పడిపోయింది. మాడరన్‌ థియేటర్స్‌ వాళ్లు సేలంలో సినిమా తీస్తూ వీళ్లను తీసుకెళ్లారు. అక్కడ మరింత సన్నిహితం అయ్యారు.           

నటీమణులు పెళ్లి చేసుకుంటానన్నపుడు యింట్లో వాళ్లు అభ్యంతర పెడుతూంటారు. సినిమా తారల విషయంలో వాళ్ల డబ్బు ఒక మెయిన్‌ ఫ్యాక్టర్‌. కామధేనువు విడిచి వెళ్లిపోతుంటే ఎవరు ఊరుకుంటారు? సావిత్రికీ అదే అనుభవం. అందునా బినామీ ఆస్తులూ అవీ వుంటాయి కదా! అవన్నీ సార్ట్‌ అవుట్‌ చేసుకుని ఫైనల్‌గా 1956లో పెళ్లి ఎనౌన్స్‌ చేసేసి, కలిసి జీవించడం మొదలెట్టారు. జెమినీ పూర్వ భార్యలను వదిలిపెట్టలేదు. వీళ్లిద్దరికీ విజయ చాముండేశ్వరి అనే అమ్మాయి, సతీష్‌ అనే అబ్బాయి పుట్టారు. కానీ ఈ బంధం జెమినీని కట్టిపడేయ లేకపోయింది. సావిత్రికి దూరమయిపోయాడు. 200 సినిమాలు వేసి బోల్డంత సంపాదించిన సావిత్రి అన్నీ కోల్పోయింది. అప్పట్లోనే మద్రాసులో ఆవిడకు నాలుగిళ్లు. ఊటీలో ఓ బంగళా. హైదరాబాదులో, విజయవాడలో ఆస్తులు. అన్నీ పోయాయి. ఇన్‌కమ్‌టాక్స్‌ రెయిడ్స్‌ జరిగి, కొన్ని కోర్టులో ఇరుక్కుపోయాయి. ఈవిడ అద్దె యింట్లో వుండాల్సి వచ్చింది. కష్టకాలానికని డైమండ్‌ నెక్లెసు, నగలు ఆప్తుల వద్ద దాచుకుంటే, వాళ్లు అది దిగమింగేసి, నువ్వెక్కడిచ్చావ్‌ అన్నారు. భరించలేని నిరాశ. జెమినీ అలవాటు చేసిన తాగుడికి క్రమంగా సావిత్రి బానిస అయింది. మత్తు సరిపోకపోతే కాంపోజ్‌ మాత్రలు కలుపునేది. ఆరోగ్యం నాశనమైంది. చివరి దశలో సినిమాల్లో వేషాలు వేసింది. అంతటి మహానటికి యింతటి దుస్థితి వస్తే భర్త ఏం చేశాడన్న సందేహం వస్తుంది? 

ఇప్పుడు పైన ఉదహరించిన పుస్తకంలోని సంగతి రాస్తాను. పసుపులేటి రామారావుగారు, ఆయన కంటె సీనియరైన జివిజి అనే జర్నలిస్టు (సినిమారంగం మాసపత్రికకు యిన్‌చార్జి) మద్రాసులో పని చేసే రోజుల్లో దీనావస్థలో సావిత్రి అణ్నా నగర్‌ యింటిలో వుండగా వెళ్లారు. జివిజి సావిత్రిపై పుస్తకం రాస్తున్నారు. ఏమైనా మేటరు చెప్తే రాసుకుని పుస్తకం పూర్తి చేస్తా అని జివిజి అంటే 'మీకు తెలిసింది మీ వెర్షన్‌లో రాసుకోండి. నా స్టేటుమెంటుగా ఏమీ యివ్వను. నా గురించి నేను చెప్పి బావుకునేదేమిటి? అంతా అయిపోయాక ఎవరి మీద కసి తీర్చుకోను?'' అన్నారు సావిత్రి. ఇంతలో బయట కారు ఆగింది. జెమినీ గణేశన్‌ లోపలకి వచ్చి వీళ్లను పలకరించి కుర్చీలో కూర్చున్నాడు. సావిత్రి అతన్ని చూసి లేవలేదు. 'షూటింగు లేదా?' అని అడిగాడు జెమినీ. 'షూటింగు వుంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? అసలు నేను బ్రతికున్నానా లేదా అనేది కూడా మీకు అవసరం లేదు కదా, అది సరే, యిప్పుడు ఎందుకు వచ్చినట్లు?' అంది సావిత్రి. 'రోజూ రావటం ఎక్కడ కుదుర్తుంది? పనులుంటాయి కదా' - 'అవును, రాత్రింబవళ్లు షూటింగులు చేస్తున్నారు కదూ, అమ్మాయిలతో... నాకు తెలీదనుకుంటున్నారా? వెధవ్వేషాలు..నన్నింకా మోసం చేద్దామనేనా? నేను చచ్చిపోయే స్థితికి వచ్చినా నన్నింకా మోసం చేయాలనుకుంటున్నారా? నేను మీ నుండి దూరంగా వచ్చేసినా యింకా ఎందుకు యిక్కడకు రావడం?' అంటూ సావిత్రి ఎమోషనల్‌ అయిపోతూ వుంటే జెమినీ ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. 

బయటకు వచ్చాక రామారావు, జివిజిని వారిద్దరి మధ్య బంధం గురించి అడిగితే జివిజి చెప్పినది యిది -  ''జెమినీ దుర్మార్గుడు  చెడ్డవాడు కాడు, అమ్మాయిల బలహీనత. తాగుడు బలహీనత. రెండిటికి అతను దాసుడు. సావిత్రి అంటే యిప్పుడు అతనికి యిష్టం లేదు, అయిష్టమూ లేదు. మెకానికల్‌ తయారయ్యాడు. ఎప్పుడైనా గాలి మళ్లినపుడు అలా వచ్చి యిలా వెళ్లిపోతూంటాడు. వాళ్లిద్దరూ హృదయపూర్వకంగా ప్రేమించుకున్న మాట నిజమే. పెళ్లికి ముందు సావిత్రికి అప్పట్లో యింటా బయటా సమస్యలు. తనకు సరైన గైడెన్స్‌ లేకపోవడం, నేనున్నాననే మనిషి లేకపోవడంతో మగదిక్కుకోసం జెమినీని తొందరపెట్టి పెళ్లి చేసేసుకుంది. పెళ్లయిన చాలా రోజుల వరకు సంతోషంగానే వున్నారు. జెమినీ సరదాకి తాగుడు అలవాటు చేస్తే సావిత్రి రోజూ మందు తీసుకుని యింటికొచ్చిన జెమినితో కోపతాపాలకు దిగేది, అరిచేది, దెబ్బలాడేది. దానికి కారణాలు అనేకం. 1970 తర్వాత ఆమెకు హీరోయిన్‌ వేషాలు తగ్గి సైడ్‌ కారెక్టర్స్‌ రావడంతో నిర్మాత, దర్శకురాలిగా మారింది. అది జెమినీకి యిష్టం లేదు. అయినా ఆమె ఖాతరు చేయలేదు. ఆమె తీసిన సినిమాలన్నీ ఫ్లాప్‌ కావడంతో అప్పులపాలై అవి తీర్చడానికి ఆస్తులు అమ్ముతూండడంతో, యీ అప్పులు తనకు చుట్టుకుంటాయన్న భయంతో యీవిడకు ఎంత దూరంగా వుంటే అంత మంచిదనుకున్నాడు. 

''సావిత్రి కంటె ముందే జెమిని హీరోగా ఫేడవుట్‌ అయ్యాడు. అందువలన అతనికి సావిత్రే స్వయంగా డబ్బు యిచ్చేది. అతను పట్టుకెళ్లేవాడు. ఇప్పుడు సావిత్రి సినీనిర్మాణంలో డబ్బు పోగొట్టుతూండడంతో అతను రావడం తగ్గించాడు. అతను అనేకమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం వలన అతని పట్ల ద్వేషం పెంచుకుంది. నిజానికి యిద్దరూ బాగున్నపుడు కూడా అతని ప్రవర్తన అలాగే వుండేది. అన్ని విషయాలూ ఎవరో ఒకరు సావిత్రికి చెప్పేవారు. కొన్నాళ్లు సర్దుకుపోయినా, చాలామంది యివే విషయాలు చెప్తూండడంతో ఆమె తట్టుకోలేకపోయేది. అతను యింటి కొచ్చాక గొడవ పెట్టుకునేది. దాంతో రావడం కొద్దికొద్దిగా తగ్గించాడు. తను కష్టాలలో వున్నపుడు ఆదుకోవడానికి, సమస్యలు పరిష్కరించడానికి, కనీసం ఓదార్చడానికి అతను రావడం లేదన్న బాధతో సావిత్రి యింకా కోపం తెచ్చుకునేది. జెమినీ గురించి బాగా తెలిసుండి అతన్ని పెళ్లాడి ఆమె తప్పు చేసింది. ఇలా వివాహితుణ్ని పెళ్లి చేసుకున్నవారెవరూ నాకు తెలిసి సుఖంగా లేరు.'' అన్నారాయన. -  (సశేషం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015)

mbsprasad@gmail.com

 


×