Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: పవన్ లాజిక్

ఎమ్బీయస్‍: పవన్ లాజిక్

సాధారణంగా గందరగోళంగా మాట్లాడే పవన్ మూడు రోజుల క్రితం తన విధానం గురించి స్పష్టత యిచ్చారు. నేను ప్రస్తుతానికి సిఎం కాలేను. కృష్ణా నుండి శ్రీకాకుళం జిల్లా దాకా 25శాతం ఓట్లున్నా అది పోటీ చేయడానికి పనికి వస్తుంది తప్ప, సొంతంగా ప్రభుత్వాన్ని స్థాపించే బలం కాదు. త్రిముఖ పోటీ అంటే బలి కాక తప్పదు. ప్రజాదరణ ఎంతో ఉన్నా పది సీట్లు కూడా తెచ్చుకోలేకపోతే ఏం లాభం? పొత్తు అనివార్యం. అయితే యింత తక్కువ బలం పెట్టుకుని, సిఎం పదవి యిమ్మనమని భాగస్వామిని అడగడం భావ్యం కాదు, అడిగినా యివ్వరు. నేనే టిడిపి అధ్యక్ష స్థానంలో ఉన్నా యిచ్చి ఉండేవాణ్ని కాను, మనం స్థాయి సంపాదించుకుని అప్పుడు అడగాలి అంటూ చెప్పారు.

మాకు గత ఎన్నికలలో కంటె బలం రెట్టింపు అయింది. బలం ఉన్న చోట 18,20,30 శాతం వరకూ ఉంది. పొత్తు భాగస్వాములు అది గుర్తు పెట్టుకుని మాకు తగినంత గౌరవం యివ్వాలి అని చెప్పారు. ప్రస్తుతానికి నేను సిఎం రేసులో లేను, కింగ్‌మేకర్‌ (కెఎం)ని మాత్రమే. పొత్తులు పెట్టుకుని వేరేవార్ని కింగ్‌ను చేయడానికి మాత్రం పనికి వస్తాను, ఆ దిశగా పని చేస్తాను అని కుండబద్దలు కొట్టి చెప్పడం లౌక్యం కాకపోవచ్చు. రాజకీయజ్ఞత కాకపోవచ్చు. కానీ రాజకీయనాయకులకు సహజంగా ఉండే హిపాక్రసీ ఏ మాత్రం లేకుండా ఉన్నదున్నట్లు, సొంతబలం ఎంతుందో తెలుసుకుని మాట్లాడినందుకు హర్షించాను. కానీ మర్నాడే తన పార్టీ కార్యకర్తలు సమావేశంలో మాట్లాడుతూ ‘టిడిపి నేతలను సిఎం చేయడానికి జనసేన లేదు.’ అని ఒక స్టేటుమెంటు యిచ్చి నన్ను ఆలోచనలో పడేశారు.

ఆయన పొత్తుల గురించి మాట్లాడినప్పుడల్లా టిడిపితో పొత్తు అనే మనందరికీ అర్థమౌతోంది. బిజెపి కూడా వీళ్లిద్దరితో కలిసి వస్తుందా రాదా అన్నది యింకా తేలలేదు. వాళ్లు టిడిపితో పొత్తుకి యిష్టపడటం లేదని, గణాంకాలు చూపించి వాళ్లని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని పవనే చెప్పారు. ఈ ముగ్గురి పొత్తు ఏర్పడితే ఆ కూటమికి బాబే నాయకత్వం వహిస్తారని, అయితే గియితే సిఎం అవుతారని అనుకుంటున్నాం. కానీ జనసేన పని చేసేది టిడిపి నేతలను సిఎం చేయడానికి కాదు అన్నారు పవన్. అంటే బిజెపి వాళ్లని సిఎం చేస్తారా!? నిజమా? సాధ్యమా? సిఎంగా తనూ అవ్వక, కెఎం పాత్ర ధరించి టిడిపి వాళ్లనీ అవ్వనీయక మరేం చేస్తారు? ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం కింగ్‌గా ఉన్న జగన్‌ని గద్దె దింపి కింగ్‌బ్రేకర్ (కెబి) మాత్రం కచ్చితంగా అవుదామనుకుంటున్నారు!

తాను కింగ్ ఎందుకు అవలేరో పవన్ చక్కగా వివరించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా మనమెలాగూ లేము. కర్ణాటకలో జెడిఎస్ తరహాలో 30, 40 సీట్లు చేతిలో ఉంటే, త్రిశంకు సభ ఏర్పడిన సందర్భంలో ‘మాకు రెండున్నరేళ్ల టెర్మ్ సిఎం పోస్టు యివ్వండి’ అని బేరమాడి పుచ్చుకోవచ్చు’ అనే అర్థంలో మాట్లాడారు. ఈ వాదన అక్షరాలా నిజం. కుమారస్వామి ఆ తరహాలోనే రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో మనకు 30, 40 సీట్లు వచ్చి ఉంటే అలా అడగగలిగేవాళ్లం అన్నారు పవన్. ఇక్కడ ఆయన మర్చిపోతున్నదేమిటంటే యీయనకు 30-40 సీట్లు వచ్చినా లాభమేమీ ఉండేది కాదు. ఎందుకంటే 2019లో త్రిశంకు సభ ఏర్పడలేదు. టిడిపి 23, యీయన 30 కలిసినా ప్రభుత్వం ఏర్పరచలేక పోయేవారు. వైసిపికి బంపర్ మెజారిటీ వచ్చేసింది. 2024 నాటికి వైసిపి, టిడిపిలకు చెరో 70 వచ్చి, జనసేనకు 30 వస్తే ఆయన ఎవరికి మద్దతిస్తే వాళ్లే ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. 30 ఎందుకన్నానంటే 224 స్థానాల కర్ణాటకలో 40 లోపు స్థానాలు (37) చేతిలో పెట్టుకునే 2018లో కుమారస్వామి ముఖ్యమంత్రి అయిపోగలిగాడు. ఆంధ్రలో ఉన్నవి 175 స్థానాలు మాత్రమే కాబట్టి 30 స్థానాలు చేతిలో ఉన్నా అతని పాత్ర పోషించవచ్చు.

ఇక్కడ గమనించాల్సిందేమిటంటే కుమారస్వామి ఆ 37 స్థానాలు సొంతబలంతో, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా గెలిచాడు. అందుకే ఎన్నికల అనంతరం బేరాలాడి ముఖ్యమంత్రి అయిపోయాడు. 80 స్థానాలున్న కాంగ్రెసు ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవలసి వచ్చింది. కుమారస్వామి వంటి పరిస్థితి మనకు లేదు కదా అంటారు పవన్. నిజమే, టిడిపితో పొత్తు పెట్టుకుని ఓట్ల బదిలీ చేయించుకుంటే తప్ప యీ అంకె జనసేనకు వచ్చే పరిస్థితి లేదు. 2019లో లేదు సరే, 2024లో కూడా లేని పరిస్థితి తెచ్చుకోవడం ఎవరి తప్పు? 2019లో ఎన్నికల రణక్షేత్రంలో జనసేన స్థాయి ఏమిటో అందరికీ తెలిసిపోయింది. 137 స్థానాల్లో పోటీ చేసి 5.53% ఓట్లు తెచ్చుకున్నారు. ఒకే ఒక్క దానిలో గెలిచింది. పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోయారు.

ఇది చూశాక, పార్టీ నిర్మాణానికి నడుం బిగించి జిల్లాల వారీగా, గ్రామాల వారీగా, బూత్‌ల వారీగా కార్యకర్తలను ఏర్పరచుకుని పటిష్టం చేసుకోవాలి కదా. అదేమీ చేయకుండా పిక్నిక్‌కు వచ్చినట్లు అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి, సభలో కుర్రాళ్లను, మీడియా కవరేజిని చూసి మురుసుకుని వెళ్లిపోతే ఎలా? యువత ఉత్సాహాన్ని ఓట్లగా మార్చే మెకానిజం తయారు చేసుకోవాలి కదా! తక్కిన ఓటర్ల ఆదరణ పొంది, రెండు ప్రధాన పార్టీలతో విసిగిన తటస్థ ఓటర్లను ఆకర్షించాలి కదా! అదేమీ చేయకుండా మనకు పది కూడా గెలిచే శక్తి లేదని, సిఎం కావాలని అడిగితే అవతలివాళ్లు మొండిచెయ్యి చూపిస్తారని యిప్పుడు అంగలారిస్తే ఏం ప్రయోజనం? మొదటిసారి మోసపోతే మోసగించిన వాడిది తప్పు, రెండోసారి మోసపోతే మోసపోయిన వాడిది తప్పు అంటారు. 2019లో ప్రజల ఉత్సాహం చూసి, పవన్ బోల్తా పడి తప్పుడు అంచనాలు వేసుకున్నారని అనుకోవచ్చు.

కానీ ఫలితాలు చూశాక తత్వం బోధపడింది కదా. ఆ మాట ఆయన పదేపదే చెప్తున్నాడు - మీరు కేకలు వేస్తారు తప్ప ఓట్లు వేయరు. గజమాలలు వేస్తారు తప్ప సీట్లు యివ్వరు. అందుకే నాకు విరక్తి. ఒంటరి పోరాటంపై నమ్మకం చిక్కటం లేదు. పొత్తులకు వెళ్లక తప్పటం లేదు అని. తను సీరియస్ పొలిటీషియన్ అని, ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళుతున్నాననీ తన అభిమానుల్లో నమ్మకం పుట్టించకపోవడం జనసేనాని వైఫల్యం. అందుకే తను సిఎం కాలేని, సిఎం పదవి కొంతకాలానికైనా యివ్వండి అని తన భాగస్వాములను అడగలేని పరిస్థితిలో ఉన్నాడాయన. ఇదంతా స్వయంకృతం. 2019లోనే పవన్ సిఎం, సిఎం అని కేరింతలు కొట్టిన అభిమానులు 2024లో కూడా నిరాశ పడవలసినదే. 2029 మాటేమిటి? అప్పటికైనా జెడిఎస్ స్థాయికి వస్తారా?

జెడిఎస్ చరిత్ర ఒక్కసారి చూస్తే 1999లో 203 స్థానాల్లో పోటీ చేసి 10.4% ఓట్లతో 10 సీట్లు గెలిచింది. 2004లో 220 స్థానాల్లో పోటీ చేసి 20.8% ఓట్లతో 58 సీట్లు గెలిచింది. 2008లో 219 స్థానాల్లో పోటీ చేసి 19% ఓట్లతో 28 సీట్లు గెలిచింది. 2018లో 199 స్థానాల్లో పోటీ చేసి 18.3% ఓట్లతో 37 సీట్లు గెలిచింది. 2023లో 209 స్థానాల్లో పోటీ చేసి 13.3% ఓట్లతో 19 సీట్లు గెలిచింది. అంటే అర్థమేమిటి? గెలిచేది తక్కువ సీట్లే కావచ్చు, ఒక ప్రాంతంలోనే బాగా పట్టు ఉండి ఉండవచ్చు. కానీ రాష్ట్రంలో 90 కంటె ఎక్కువ శాతం సీట్లలో పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవటం లేదు. గెలిచాక ‘ఇదిగో నా దగ్గర యిన్ని సీట్లున్నాయి, నాకేమిస్తారు?’ అని అడుగుతున్నారు. లబ్ధి పొందుతున్నారు. జనసేన పరిస్థితి అది కాదు కదా!

మీ బలాన్ని నిరూపించుకోవాలంటే అతి సీరియస్‌గా, ఒంటరిగా పోటీ చేసి చూపించాలి. అప్పుడే భాగస్వామి మీకు గౌరవం యిస్తాడు. గాలి లెక్కలు వేసి పొత్తులో భాగంగా యిన్ని సీట్లు యివ్వండి అంటే ఎవరిస్తారు? టిడిపి, జనసేన యిద్దరికీ ఒకరి అవసరం మరొకరికి ఉంది. అందువలన తప్పకుండా పొత్తు కుదుర్చుకుంటారు. కానీ గౌరవప్రదమైన ఒప్పందం కుదరాలని జనసేన అనుకుంటోంది. ఆఫరిచ్చే సీట్ల సంఖ్య సబబుగా ఉండాలని దాని అర్థం. ఏది సబబైన అంకె? గెలిచాక జనసేన చేతిలో 30 సీట్లుంటే (మొత్తం సీట్లలో 17%) మర్యాద ఉంటుంది అనుకుందాం. 30 సీట్లు గెలవాలంటే ఎన్ని సీట్లలో పోటీ చేయాలి?

ఎన్నిటిలో పోటీ చేస్తే ఎన్ని గెలిచారు అనేదాన్ని స్ట్రయిక్ రేట్ అంటారు. నిన్న కర్ణాటకలో కాంగ్రెసు అద్భుతంగా గెలిచింది. దాని స్ట్రయిక్ రేట్ ఏమిటి? 223లో పోటీ చేస్తే 135 గెలిచింది. అనగా 60.5%. పోనీ 60% అనుకుందాం. జనసేనకు కూడా అంతటి స్ట్రయిక్ రేటు ఉంటుందనుకున్నా 30 సీట్లలో గెలవాలంటే 50 సీట్లలో పోటీ చేయాలి. కూటమి నాయకుడైన బాబు వాళ్లకు అన్ని స్థానాలు యివ్వాలి. ఇద్దామనుకున్నా రనుకోండి. ఎక్కడ యిస్తారు? జనసేన బలం ఎక్కడ ఎక్కువుంటే అక్కడ యిస్తారు. ఎందుకంటే జెడిఎస్ రాష్ట్రమంతటా పోటీ చేసినా, లింగాయతు ఓట్లు, ముస్లిము ఓట్లు సంపాదించుకున్నా పాత మైసూరు ప్రాంతంలోనే, ఒక్కళిగ కులస్తులలో కంచుకోట కట్టుకుని ఉంది. ఈసారి కాంగ్రెసు హవాలో 19యే వచ్చాయి కానీ కితం సారి దానికి రెట్టింపు వచ్చాయి. అలా జనసేనకు బలం ఉన్న ప్రాంతం ఆంధ్రలో ఏది? 2019 ఎన్నికలలో అది దాదాపు ఒంటరిగా పోటీ చేసిన 2019 నాటి గణాంకాల కోసం వెతికాను. సర్వే సంస్థ లోకనీతి  జిల్లాల వారీ పార్టీ ఓటింగు సరళి యిస్తూ యిచ్చిన పట్టిక కనబడింది. చాలా ఉపయుక్తంగా ఉంది.

దీని ప్రకారం జనసేనకు రాయలసీమలో వచ్చిన ఓట్లు 2%. కోస్తాలోనే 7.2 వచ్చి సగటు మీద 5.53 అయింది. రాయలసీమలో టిడిపి ఓట్లు 38.3%. అందువలన టిడిపి జనసేనకు రాయలసీమలో సీట్లివ్వదు. ఇచ్చినా తనకు బాగా బలముండి 41.3% ఓట్లు తెచ్చుకున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓట్ల బదిలీ కచ్చితంగా జరుగుతుందనుకున్న చోట 1, 2 సీట్లు యిస్తుందేమో! ఇక కోస్తాకు వస్తే విశాఖపట్టణం జిల్లాలో (నేను పేర్కొంటున్నవన్నీ ఉమ్మడి.. అని గుర్తు పెట్టుకోవాలని మనవి) జనసేనకు 8.6% వచ్చాయి. అక్కడ జెడి లక్ష్మీనారాయణ, పవన్ యిద్దరూ పోటీ చేశారు కాబట్టి వారి ప్రభావం వలన అంత ఓటింగు వచ్చిందనుకోవచ్చు. ఇప్పుడు జెడి జనసేనలో లేరు. పవన్ ఆ జిల్లా నుంచి మళ్లీ పోటీ చేసి రిస్కు తీసుకుంటారని అనుకోలేము. టీవీలో వచ్చి మాట్లాడే జనసేన ప్రతినిథులు తమకు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో 15-20 % ఓటింగు ఉందని చెప్తున్నారు తప్ప విశాఖ గురించి మాట్లాడటం లేదు. ఆ నాలుగు జిల్లాలు, విశాఖ తప్పిస్తే కోస్తాలోని తక్కిన జిల్లాలలో జనసేన ఓటింగు 3% కంటె తక్కువుంది కాబట్టి వాటి గురించి చర్చించటం లేదు.

తూర్పు గోదావరి జిల్లాలో 19 సీట్లుంటే జనసేనకు 14.8% ఓట్లు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లుంటే జనసేనకు 11.7% ఓట్లు వచ్చాయి. కృష్ణా జిల్లాలో 16 సీట్లుంటే జనసేనకు 5.3% ఓట్లు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 17 సీట్లుంటే జనసేనకు 6% ఓట్లు వచ్చాయి. అంటే మొత్తం 67 సీట్లలో సగటున 9.4% ఓట్లు వచ్చినట్లు! గోదావరి జిల్లాలు మాత్రం తీసుకుంటే 34 సీట్లలో 13.3%, కృష్ణా, గుంటూరులు తీసుకుంటే 33 స్థానాల్లో 5.6%! జనసేన బలం ప్రధానంగా యిక్కడే ఉంది. ఇక్కడున్న 67 స్థానాల్లో కనీసం 45 స్థానాలిచ్చి, తక్కిన చోట 5 యిస్తే జనసేనకు తను అనుకున్న 30 వస్తాయి. మరి టిడిపి యిస్తుందా? దాని బలమూ అక్కడే ఉంది మరి!

2019లో తూర్పు గోదావరిలో దాని బలం 36.8% (జనసేన కంటె 2.5రెట్లు హెచ్చు), పశ్చిమలో 36.3% (జనసేన కంటె 3.1 రెట్లు హెచ్చు). కృష్ణలో 41.5% (జనసేన కంటె 7.8 రెట్లు హెచ్చు), గుంటూరులో 41.9% (జనసేన కంటె 6.8% హెచ్చు). తమలో 7 వంతు బలం ఉన్న జనసేనకు టిక్కెట్టిచ్చి, మీరీసారికి ఊరుకోండి అని టిడిపి నాయకులు, కార్యకర్తలకు బాబు చెప్పగలరా? అందువలన ఉభయగోదావరుల్లో తేడా తక్కువుంది కాబట్టి అక్కడ జనసేనకు ఎక్కువ యిచ్చి, కృష్ణ గుంటూరులలో తక్కువ యివ్వవచ్చు. ఉభయగోదారుల్లో 34 సీట్లలో 25 సీట్లు, కృష్ణా, గుంటూరులలో 33లో 20 సీట్లు యిస్తేనే లెక్క తెగుతుంది. ఈ మేరకు టిడిపి సమ్మతిస్తుందా? వాళ్ల కార్యకర్తల రియాక్షన్ ఏమిటి అనేది నాకూ, మీకూ తెలియదు.

ఇవన్నీ 2019 నాటి లెక్కలు. జనసేనకు యీ నాలుగు జిల్లాలలోనూ గతంలో కంటె రెట్టింపు అయ్యాయని పవన్ అన్నారు. తన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు సరాసరిన 25% ఓట్లున్నాయని చెప్పారు. తమకు బలం ఉన్న చోట్ల 30 శాతం కూడా ఉందన్నారు. ఈ 6 జిల్లాలలో 2019లో వారికి వచ్చిన ఓట్లు 9.1%. ఇవి యీ ఐదేళ్లలో 2.7 రెట్లు పెరిగాయట! పవన్ హీరో అవుతాడని ఆశ పెట్టుకున్నపుడే అన్ని వస్తే కారెక్టర్ పాత్ర వేస్తానంటే ఓట్లు పెరుగుతాయా? వైసిపి వ్యతిరేకత పెరిగితే ఆ లాభం దాని ప్రధాన ప్రత్యర్థి ఐన టిడిపికి కూడా వస్తుంది కదా. 2019లో ఉన్న వారి ఓటింగు శాతం 39.1 కూడా ఆ నిష్పత్తిలో 105% అయిపోతుందా? కనీసం 70% అవుతుందనుకున్నా టిడిపి జనసేనకు మరో భాగస్వామితో అవసరమేముంది అనే ప్రశ్న వస్తుంది. వేర్వేరు చోట్ల బలాలున్నవారు పొత్తు పెట్టుకుంటే పరస్పరపూరకాలుగా మారి, బలాన్ని పెంచుకుంటారు కానీ యిక్కడ యిద్దరికీ ఒకే చోట బలం ఉన్నపుడు పొత్తు వలన సాధించేముంది అనుకోవచ్చు. కానీ యిక్కడే బాబు ఓ లాజిక్ ఉపయోగించారు.

తమకు బలం ఉన్నచోటే జనసేనకూ బలముంది. నిజానికి జనసేనకున్న బలమంతా అక్కడే. ‘వాళ్లు మనతో పోటీపడి ఓట్లు చీలిస్తే వైసిపికి లాభం. ఆ ఓట్ల చీలిక నివారించడానికై పొత్తు అనివార్యం. కానీ అదే సమయంలో జనసేనకు అన్నేసి సీట్లు యివ్వడం ఆత్మహత్యాసదృశం. అందువలన యీ నాలుగు జిల్లాలలోని 67 సీట్లలో 30 టిక్కెట్లు (ఇలా అనడం కూడా గొప్పే!) యిస్తాను, తక్కిన 20 రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో పోటీ చేసుకోండి. అక్కడ మా ఓట్ల బదిలీతో నెగ్గినా నెగ్గవచ్చు’ అనుకుని ఉంటారు బాబు. ఇదే కనుక జరిగితే 60% స్ట్రయిక్ రేటుతో పై నాలుగు జిల్లాలలో జనసేనకు 18, తక్కిన చోట్ల ఏ రెండో గెలిచి 20 దగ్గర బండి ఆగవచ్చు. ఈ ధోరణిలో ఆలోచిస్తే జనసేనకు 2024లో 20 కంటె ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడటం లేదు. దీన్ని గౌరవంగా పవన్ భావిస్తారో, లేక ప్రాక్టికల్‌గా ఉండాలంటూ తనకు తాను నచ్చచెప్పుకుంటారో తెలియదు.

ఆయన మనోభావాల సంగతి ఎలా ఉన్నా యీ 4 జిల్లాల్లోని 67 సీట్లలో ఏకంగా 30 సీట్లు జనసేనకు యివ్వడమంటే బాబుకి కష్టమే. దానికై ఉన్న ఉపాయమేమిటంటే టిడిపి వాళ్లనే జనసేన టిక్కెట్టుపై నిలబెట్టడం. ఇదేమంత బ్రహ్మవిద్య కాదాయనకు. విజేతల విధేయత ఎవరి పట్ల వుంటేనేం, తర్వాతి సారికి బేరమాడడానికి జనసేనకు యీ సంఖ్య ఒక స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. అసలిలాటి పరిస్థితి రాకుండా పవన్ 2019 నుంచి యీ 67 సీట్ల మీద బాగా ఫోకస్ పెట్టి కార్యకర్తల్ని, నాయకుల్ని తయారు చేసుకుని, తనే సొంతంగా పోటీ చేసి ఓ 30 తెచ్చుకుని పెట్టుకుంటే బాగుండేది. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగి బాబు పాప్యులారిటీ పెరిగి యిద్దరూ 70-75 దగ్గర ఆగిపోతే మీరు చెప్పినదే వేదమౌతుంది. కామన్ మినిమమ్ ప్రోగ్రాంను మీరే డిక్టేట్ చేయవచ్చు. ముఖ్యమంత్రి లేదా ఉపముఖ్యమంత్రి పదవి అడగ గలిగేవారు.

అది చేయకపోవడం చేత యిప్పుడీ దీనాలాపాలు చేయాల్సి వస్తోంది. మనలాటి తటస్థులకు యిప్పటికైనా నిజం చెప్పాడు సంతోషం అనుకోవచ్చు కానీ ఆయనపై ఆశలు పెట్టుకున్న ఓటర్లకు, ఎప్పటికో అప్పటికి జూలు విదిల్చి ఎరీనాలోకి దుముకుతాడని ఆశించిన కార్యకర్తలకు, టిక్కెట్లాశించిన నాయకులకు ఆశాభంగం కలిగి ఉంటుంది. ఇప్పటికైనా పవన్ యిలా బయపడడానికి ఆ నాయకుల ఒత్తిడే కారణమని నాకనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తక్కిన పార్టీలు సమరసన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇటు రాహీ (యాత్రికుడు) కోసం వారాహి ఎదురుచూస్తూ షెడ్‌లో పడి ఉంది. జనసేన-బిజెపి పొత్తు అమలులో లేదు. అలా అని పవన్ బహిరంగంగా బిజెపి పొత్తు తెంపుకోడు, టిడిపితో కుదుర్చుకోడు.

అందుకే ఈ నాలుగు జిల్లాలలోని జనసేన టిక్కెట్టు ఆశావహులు అయోమయంలో పడి కొట్టుకుంటున్నారు. తమ స్థానం జనసేనకు మిగులుతుందా, పొత్తు ఒప్పందంలో భాగంగా టిడిపికి పోతుందా తెలియకుండా ఉంది. ఎందుకైనా మంచిదని పవన్ యాత్రలకు, లోకేశ్ యాత్రలకు కూడా డబ్బు యిస్తూ పోతూ ఉంటే తాడు తెగుతోంది. ఇంతా చేసి ఈనగాచి నక్కలపాలవుతుందాన్న భయమూ ఉంది. వాళ్లంతా సంగతి తేల్చమని ఒత్తిడి పెట్టడం చేతనే పవన్ యీ క్లారిటీ యిచ్చి ఉంటారు. మన పరిస్థితి యింతే, ఉంటే ఉండండి, లేకపోతే పొండి అని చెప్పేశారు. ఇక యిప్పణ్నుంచి సిఎం పవన్ అని సభలో ఎవరైనా అరిస్తే తెనాలి చెప్పుతో కొడతానని పవనే అనవచ్చు, జాగ్రత్త.

పవన్ చేసిన యీ ప్రకటనకు సర్వత్రా హర్షామోదం వ్యక్తమైంది. పొత్తు షరతుల్లో భాగంగా పవన్ సిఎం పదవి అడిగితే ఎలా అని టిడిపి శ్రేణులు చింతిస్తున్న యీ సమయంలో పవన్ యిలా చెప్పి వారి భయాలు దూరం చేశారు. పొత్తుకు దారి సుగమం చేశారు. సిఎం కాలేనందుకు పవన్‌కు చింతేమీ లేదు. నిజానికి ఆయన కంత తీరికా లేదు. సినిమా ఆఫర్లు వచ్చి మీద పడుతున్నాయి. కానీ పవన్ అభిమానులకు మాత్రం నిరాశ కలిగింది. దానికి తోడు వైసిపి వాళ్లు ‘మీ అందర్నీ టిడిపి పల్లకీ మోయమంటున్నాడు మీ బాస్’ అని గేలి చేయసాగారు. ఇలా అయితే పని చేయడానికి మాకేం ఉత్సాహం ఉంటుంది? అని వాళ్లంతా గోల పెట్టి వుంటారు. అది గ్రహించిన పవన్ మర్నాడు పార్టీ కార్యకర్తల సమావేశంలో ‘టిడిపి నేతలను సిఎం చేయడానికి జనసేన లేదు.’ అని ప్రకటించారు. ‘ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికల తర్వాత మాట్లాడదాం’ అంటూ  ఓ రంగుల బుడగ ఎగరేశారు.  

వెంటనే సభలో హర్షధ్వానాలు. చప్పట్లు కొట్టడం ఆపాకైనా కార్యకర్తలకు సందేహం వచ్చి ఉండాలి. ‘ఈయన తను సిఎం అవనంటున్నాడు. టిడిపి వాళ్లను చేయడానికై మనమెందుకు శ్రమించాలి? అంటున్నాడు. అంటే మరి ఎవర్ని సిఎం చేస్తాడు? కింగ్‌మేకర్ అంటే ఎవరో ఒకర్ని కింగ్ చేయాలి కదా! తనూ కాక, టిడిపి వాళ్లనీ చేయక, మరి వైసిపి వాళ్లను చేస్తాడా?’ ఈ సందేహం ఆ సమావేశంలో ఎవరూ వెలిబుచ్చలేదు. పవన్ యిప్పట్లో సిఎం (చీఫ్ మినిస్టర్) కాలేనని చెప్పారు కానీ ఆయన ఎప్పణ్నుంచో మరో రకమైన సిఎం (కన్‌ఫ్యూజన్ మాస్టర్). ఆయన చెప్పేదానిలోంచి అర్థం లాగడం చాలా కష్టం. తను కింగ్‌నూ కాను, కింగ్ మేకర్నూ కాను అంటున్నాడు. కానీ జగన్‌ను గద్దె దింపుతానని చెప్తున్నాడు. అందుచేత కింగ్‌బ్రేకర్ కావడమే ఆయన లక్ష్యం అని అర్థం చేసుకోవాలి. మంచిదే, ఏదో ఒకటి చేయనివ్వండి. అప్పుడే ఆయనంటే జనాలకు గౌరవం పెరుగుతుంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?