Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఎన్నికల ఫలితాల విశ్లేషణ- యుపి 03

ఎమ్బీయస్: ఎన్నికల ఫలితాల విశ్లేషణ- యుపి 03

యోగికి విపరీతంగా పేరు తెచ్చిన యింకో అంశం – బుల్‌డోజరు. అక్రమనిర్మాణాలు కనబడితే కోర్టుల్లో కేసులు వేయించి, తీర్పు వచ్చేదాకా ఆగడాలు లేవు. బుల్‌డోజరు పెట్టి కూల్చివేయడమే. దాన్ని నెగటివ్‌గా చూపించబోయిన ప్రతిపక్షం కంగు తింది. అవును, కూల్చివేస్తామంతే అని బాహాటంగా ప్రచారం చేసుకుంటూ యోగి ముందుకు వచ్చారు. అతని అనుచరులు ‘‘సోచ్ ఇమాన్‌దార్, కామ్ దమ్‌దార్’’ (ఆలోచనలో నిజాయితీ ఉంది, ఆచరణలో దమ్ముంది) అనే నినాదంతో ముందుకు వెళ్లారు. ప్రజలు సాహో యోగి, మాకు యిదే కావాలి అన్నారు. ఎందుకంటే అక్రమనిర్మాణాల విషయంలో పేదలు గుడిసెలు వేసుకుంటే, మోతుబర్లు చెరువులు, రోడ్లు, నదీగర్భాలు ఆక్రమించి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసుకుంటారు. వారిపై మధ్యతరగతి వాళ్లకు కసి ఉంటుంది. యోగిపై అసమర్థత, ఆశ్రితపక్షపాతం వంటి ఆరోపణలున్నాయి తప్ప అవినీతి ఆరోపణలు యిప్పటిదాకా బయటకు రాలేదు. అందువలన డబ్బు తీసుకుని కొందరి అక్రమ కట్టడాలను కూల్చకుండా ఆపాడు అనడానికి లేకుండా పోయింది.

జగన్‌తో పోలిక తెస్తే ప్రజావేదిక కూల్చివేసి, అక్రమ కట్టడాల నిర్మూలన దీనితో ప్రారంభం అన్నపుడు నాబోటి వాళ్లు హర్షించారు. కానీ తర్వాత ఆ కార్యక్రమం చప్పబడింది. కొందరు కమ్మ కులస్తులు ఆక్రమించిన వాటిపై చెదురుమదురుగా దాడులు జరిగాయి తప్ప, రాష్ట్రమంతటా ఒక డ్రైవ్‌లా చేపట్టలేదు. దాంతో దాన్ని రాజకీయ కక్షసాధింపుగానే చూశారు తప్ప చిత్తశుద్ధితో చేపట్టిన పనిగా చూడలేదు. న్యాయస్థానాలు అడ్డుపడినా సరేననుకుని యోగి తరహాలో బుల్‌డోజర్లతో కూల్చివేసి, ప్రభుత్వానికి భూమి సమకూరిస్తే సాధారణ ప్రజలు హర్షిస్తారు. కేంద్రంలో మోదీ ఎంతటి నియంతో, రాష్ట్రంలో యోగి కూడా అదే తరహా నియంత. మొండిగా వ్యవహరించి, కొన్ని వర్గాలను దూరం చేసుకున్నాడు కూడా. బిజెపి కేంద్ర నాయకత్వం కలగజేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టవలసి వచ్చింది. ఏది ఏమైనా సాధారణ ఓటరు దృష్టిలో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో యోగి ఒక్కలాటి వారే. వారి జోడీ చక్కగా కుదిరింది. అందుకే ఎన్‌డిఏకు 68% సీట్లు కట్టబెట్టి గెలిపించారు.

మోదీ హిందూత్వవాది ఐతే, యోగి వీరహిందూత్వవాది. నాలుగాకులు ఎక్కువ చదివాడు. దేశాన్ని 80-20గా చీల్చి చూస్తాడు. ముస్లిములను సహజశత్రువులుగానే చూస్తాడు. ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లినా అక్కడ ముస్లిములపై విషం చిమ్ముతాడు. అయినా యుపి హిందువుల్లో మెజారిటీ ప్రజలు దాన్ని పట్టించుకోలేదు. మనకు ఏం చేస్తున్నాడు అనేదే చూశారు. యుపి ఫలితాల తర్వాత బిజెపిలో 49 ఏళ్ల యోగిని 71 ఏళ్ల మోదీ వారసుడిగా చూస్తున్నారు. 2025కి నాటికి మోదీ 75 ఏళ్ల నిండి రిటైరైతే, అయితే, యోగి ఆ స్థానంలో వస్తాననవచ్చు. దేశంలో హిందూత్వం యింకా ప్రబలితే ఆ లోపునే మోదీకి ప్రత్యామ్నాయంగా యోగి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఆడ్వాణీని ఒకప్పుడు తీవ్రభావాలున్న నాయకుడిగా చూసేవారు, మోదీ వచ్చాక ఆయన సాఫ్ట్ అనిపించాడు. యోగీ బ్రాండ్ పాలిటిక్స్ వచ్చాక మోదీ ఉదారవాదిగా అనిపించినా ఆశ్చర్యం లేదు. సిఎస్‌డిఎస్-లోకనీతి సర్వే ప్రకారం యుపి ఓటర్లలో 44% మంది ఓటేసేటప్పుడు మోదీని దృష్టిలో పెట్టుకుని ఓటేశామని చెప్పారు. కేవలం 2% మంది మాత్రమే ఎమ్మెల్యే పనితీరును లెక్కలోకి తీసుకున్నామన్నారు.

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో యోగి కలిసి యుపిలో యీ ఫలితాలను తీసుకుని వచ్చారన్నది నిర్వివాదాంశం. అయితే వారివారి పాలన పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది? సిఎస్‌డిఎస్-లోకనీతి సర్వే ప్రకారం నెట్ శాటిస్ఫాక్షన్ రేట్, అంటే సంతృప్తిగా ఉన్నవారి శాతం లోంచి అసంతృప్తిగా ఉన్నవారి శాతాన్ని తీసివేస్తే వచ్చేది, మోదీ విషయంలో 2017లో 51, 2019లో 45 ఉంటే 2022లో 24 అయింది. రాష్ట్రస్థాయిలో విషయంలో 2017లో 36, 2019లో 27 ఉంటే 2022లో అది 7కి పడిపోయింది. అందువలన విజయంలో మోదీ పాలే ఎక్కువ. యోగి ప్రభుత్వం కొనసాగాలని కోరుకున్నవారు 44% మంది ఉన్నారు. వారిలో 89% బిజెపికి, 6% ఎస్పీకి ఓటేశారు. ప్రభుత్వం మారాలని 39% మంది కోరుకున్నారు. వారిలో 68% ఎస్పీకి, 22% బియస్పీకి ఓటేశారు. చివరిదాకా తేల్చుకోలేని 17% మందిలో 43% మంది ఎస్పీకి, 24% బిజెపికి, 22% బియస్పీకి ఓటేశారు.

నాలుగైదేళ్ల క్రితం బిజెపి సమర్థకులుగా ఉన్నవారిలో 87% మాత్రమే బిజెపికి ఓటేశారు. 8% ఎస్పీకి మళ్లారు. నాలుగైదేళ్ల క్రితం ఎస్పీ సమర్థకులుగా ఉన్నవారిలో 85% మాత్రమే ఎస్పీకి ఓటేశారు. 9% బిజెపికి మళ్లారు. నాలుగైదేళ్ల క్రితం బియస్పీకి సమర్థకులుగా ఉన్నవారిలో 71% మాత్రమే బియస్పీకి ఓటేశారు. 12% ఎస్పీకి, 12% బిజెపికి మళ్లారు. నాలుగైదేళ్ల క్రితం కాంగ్రెసు సమర్థకులుగా ఉన్నవారిలో 43% మాత్రమే కాంగ్రెసుకి ఓటేశారు. 20% బిజెపికి, 30% ఎస్పీకి మళ్లారు.

ఇక ఫలితాల విశ్లేషణకు వస్తే, ఫేజ్‌ల వారీగా వచ్చిన సీట్ల సంఖ్యను ముందు చూద్దాం. మొదటి ఫేజ్‌లో 58 సీట్లుంటే బిజెపికి 46, ఎస్పీకి 12 వచ్చాయి. రెండో దానిలో 55 ఉంటే బిజెపికి 30 (54%), ఎస్పీకి 25. మూడో దానిలో 59 ఉంటే బిజెపికి 44 (75%), ఎస్పీకి 15. నాల్గవ దానిలో 59 ఉంటే బిజెపికి 49 (83%), ఎస్పీకి 10. ఐదో దానిలో 61 ఉంటే బిజెపికి 37(61%), ఎస్పీకి 25. ఆరవ దానిలో 57 ఉంటే బిజెపికి 40 (70%), ఎస్పీకి 15. ఏడవ దానిలో 54 ఉంటే బిజెపికి 27, ఎస్పీకి 27. అంటే ఆఖరి దానిలో మాత్రమే ఎస్పీ బిజెపితో సమానంగా తూగింది.  

ఎస్పీ కూటమి 39 స్థానాలు నిలుపుకుని, బిజెపి కూటమి నుంచి 69, కాంగ్రెసు నుంచి 4, బియస్పీ నుంచి 13 గెలుచుకుని మొత్తం 125 తెచ్చుకుంది. బిజెపి 252 నిలుపుకుని ఎస్పీ నుంచి 13, కాంగ్రెసు నుంచి 2, బియస్పీ నుంచి 5, ఇతరుల నుంచి 1 గెలుచుకుని మొత్తం 273 తెచ్చుకుంది. కాంగ్రెసు 1 నిలుపుకుని మరొకటి బిజెపి నుంచి గెలుచుకుంది. బియస్పీ ఒకటి నిలుపుకుంది. ఎస్పీ, బియస్పీల మధ్య జరిగిన యీ ద్విముఖ పోటీలో అనేక సీట్లలో రెండూ కనీసం 35% ఓట్లు తెచ్చుకున్నాయి. అయితే బిజెపి 80 సీట్లలో 50% కంటె ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకుంది. ఎస్పీ 15టిలో మాత్రమే అలా గెల్చుకోగలిగింది. 20% కంటె తక్కువ తేడాతో గెలిచిన సీట్లు బిజెపికి 5 ఉంటే, ఎస్పీకి 14 ఉన్నాయి.

సిఎస్‌డిస్-లోకనీతి సర్వే ప్రకారం కులాలవారీ ఓట్లు యీ విధంగా పడ్డాయి. జనాభాలో 7% ఉన్న బ్రాహ్మణులు గతంలో కంటె 6% ఎక్కువగా 89% మంది బిజెపి కూటమికి ఓటేశారు. గతంలో కంటె 1% తక్కువగా 6% మంది ఎస్పీ కూటమికి ఓటేశారు. యోగి ప్రభుత్వం బ్రాహ్మణ వ్యతిరేకి అనే భావన వారిలో ఉందన్నది అబద్ధమని తేలిపోయింది. అఖిలేశ్ పరశురామనామాన్ని జపించినా బ్రాహ్మణులు యిటు మొగ్గలేదు. యుపి బ్రాహ్మణులు దక్షిణాది బ్రాహ్మణుల వంటి వారు కారు. వారిలో మోతుబర్లు, క్రిమినల్స్, విపరీతమైన పలుకుబడి ఉన్నవారు, రాజకీయ నాయకులూ కూడా ఉన్నారు. జనాభాలో 7% ఉన్న ఠాకూర్లు గతంలో కంటె 17% ఎక్కువగా 87% మంది బిజెపి కూటమికి ఓటేశారు. గతంలో కంటె 4% తక్కువగా 7% మంది ఎస్పీ కూటమికి ఓటేశారు. 2017 నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు. తర్వాత ఠాకూర్ అయిన యోగిని చేయడం, అతను ‘ఠాకూర్ రాజ్’ నడిపించడం వారిని మెప్పించిందనాలి. ఠాకూర్లలకు సంఖ్యాబలం కంటె ఎన్నో రెట్లు భుజబలం ఉంది. భూమిబలం ఉంది. ఓట్లు వేయడమే కాక, యితరుల చేత నయానోభయానో వేయించగలరు కూడా!

జనాభాలో 2% ఉన్న వైశ్యులు గతంలో కంటె 12% ఎక్కువగా 83% మంది బిజెపి కూటమికి ఓటేశారు. గతంలో కంటె 1% ఎక్కువగా 12% మంది ఎస్పీ కూటమికి ఓటేశారు. జనాభాలో 2% ఉన్న ఇతర అగ్రవర్ణాలు గతంలో కంటె 8% ఎక్కువగా 78% మంది బిజెపి కూటమికి ఓటేశారు. గతంలో కంటె 2% ఎక్కువగా 17% మంది ఎస్పీ కూటమికి ఓటేశారు. సర్వే చేసినవాళ్లు చెప్పేదేమిటంటే హిందూత్వ, జాతీయవాదం, రామాలయం, విశ్వనాథ మందిరం వగైరా అంశాలు అగ్రవర్ణాలను కదిలించినట్లుగా దళితులను, పేదలను కదిలించటం లేదు. ఉచిత రేషన్లు లేకుండా కేవలం యిటువంటి అంశాలనే నమ్ముకుని ఉంటే బిజెపికి యిన్ని సీట్లు వచ్చేవి కావు. హిందూత్వ ఆకర్షణ క్షీణిస్తోందని గ్రహించింది కాబట్టే బిజెపి సంక్షేమపథకాలను నమ్ముకుందంటున్నారు. యోగి ప్రభుత్వం నుండి యిన్ని పథకాలను పొందినా, లబ్ధిదారులందరూ పోలింగుకు రాలేదు. ఓటింగు శాతం 2017 కంటె పెరగలేదు.

జనాభాలో 2% ఉన్న జాట్లు గతంలో కంటె 16% ఎక్కువగా 54% మంది బిజెపి కూటమికి ఓటేశారు. గతంలో కంటె 16% తక్కువగా 33% మంది ఎస్పీ కూటమికి ఓటేశారు. రైతు ఆందోళన కారణంగా జాట్లు బిజెపి పట్ల ఆగ్రహంతో ఉన్నారన్న వాదన తప్పని దీని ప్రకారం తేలుతోంది. జనాభాలో 11% ఉన్న యాదవులు గతంలో కంటె 2% ఎక్కువగా 12% మంది బిజెపి కూటమికి ఓటేశారు. గతంలో కంటె 15% ఎక్కువగా 83% మంది ఎస్పీ కూటమికి ఓటేశారు. ఎస్పీ యాదవుల పార్టీగా పేరుబడినా వారిలో 12% మంది బిజెపికి ఓటేయడం విశేషం. జనాభాలో 5% ఉన్న కూర్మీలు గతంలో కంటె 3% ఎక్కువగా 66% మంది బిజెపి కూటమికి ఓటేశారు. గతంలో కంటె 9% ఎక్కువగా 25% మంది ఎస్పీ కూటమికి ఓటేశారు.

జనాభాలో 4% ఉన్న కోరి, మౌర్య, కుశావహా, సైనీలు గతంలో కంటె 8% ఎక్కువగా 64% మంది బిజెపి కూటమికి ఓటేశారు. గతంలో కంటె 4% ఎక్కువగా 22% మంది ఎస్పీ కూటమికి ఓటేశారు. జనాభాలో 4% ఉన్న కేవట్, కాశ్యప్, మల్లా నిషాద్‌లు గతంలో కంటె 9% తక్కువగా 63% మంది బిజెపి కూటమికి ఓటేశారు. గతంలో కంటె 19% ఎక్కువగా 26% మంది ఎస్పీ కూటమికి ఓటేశారు. చిన్నాచితకా పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ఎస్పీకి యీ విషయంలో లాభించింది. జనాభాలో 16% ఉన్న ఇతర బిసిలు గతంలో కంటె 4% తక్కువగా 68% మంది బిజెపి కూటమికి ఓటేశారు. గతంలో కంటె 8% ఎక్కువగా 23% మంది ఎస్పీ కూటమికి ఓటేశారు. జనాభాలో 12% ఉన్న జాతవులు గతంలో కంటె 13% ఎక్కువగా 21% మంది బిజెపి కూటమికి ఓటేశారు. గతంలో కంటె 6% ఎక్కువగా 9% మంది ఎస్పీ కూటమికి ఓటేశారు. బియస్పీకి ఆధారమైన జాతవులు మాయావతి రంగంలో లేకపోవడంతో తమ ఓట్లను బిజెపి, ఎస్పీల మధ్య 2:1 నిష్పత్తిలో పంచారన్నమాట. జనాభాలో 8% ఉన్న ఇతర ఎస్సీలు గతంలో కంటె 9% ఎక్కువగా 41% మంది బిజెపి కూటమికి ఓటేశారు. గతంలో కంటె 12% ఎక్కువగా 23% మంది ఎస్పీ కూటమికి ఓటేశారు.

జనాభాలో 19% ఉన్న ముస్లిములు గతంలో కంటె 2% ఎక్కువగా 8% మంది బిజెపి కూటమికి ఓటేశారు. గతంలో కంటె 33% ఎక్కువగా 79% మంది ఎస్పీ కూటమికి ఓటేశారు. బియస్పీ, కాంగ్రెసు రంగంలో లేకపోవడంతో బిజెపి యింత ముస్లిము వ్యతిరేకత చూపుతున్నా 8% మంది ఆ పార్టీకి ఓటేస్తున్నారు. కానీ ముస్లిములందరూ ఎస్పీకే ఓటేస్తున్నారనే ప్రచారం సాగడంతో మతపరమైన పోలరైజేషన్ జరిగి, హిందువుల్లో అత్యధికులు బిజెపికి ఓటేశారు. అందువలన ముస్లిముల మద్దతు అఖిలేశ్‌కు లాభించిందా లేదా అనే ప్రశ్న వస్తుంది. కానీ అఖిలేశ్ ఓటమికి గల అనేక కారణాల్లో యిది కూడా ఒకటి అని చెప్పాలి తప్ప యిదే కారణమని చెప్పకూడదు. (సమాప్తం) (ఫోటో- యోగి ప్రమాణస్వీకారం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా