Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: విజన్‌తో లింకెందుకు?

ఎమ్బీయస్‍: విజన్‌తో లింకెందుకు?

చంద్రబాబుపై కేసులను, ఆయన అరెస్టును ఖండిస్తూ హైదరాబాదులో, బెంగుళూరుల, విదేశాల్లో ప్రదర్శనలు చేస్తున్న ఐటీ ఉద్యోగులు ‘ఆయన విజనరీ, ఆయన వలననే మేం యీనాడు యీ స్థితిలో ఉన్నాం. ఆయనపై యీ కేసులేమిటి?’ అంటూ వాదిస్తున్నారు. బాబుకి కానీ మరెవరికి కానీ విజన్ ఉన్నంత మాత్రాన నేరం చేయరన్న రూలుందా? విజనరీ కాని వారిపై కేసులు పెట్టవచ్చా? అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు విజనరీలు కాకపోవడం చేతనే వారు అరెస్టయినపుడు విదేశాల్లో ప్రదర్శనలు జరగలేదా? నిజానికి నేరం చేయాలన్నా ఆ రకమైన విజన్ ఉండాలి. కన్నం వేసేవాడు కూడా యింటి ఆనుపానులు క్షుణ్ణంగా పరిశీలించి, ఏ రోజు ఆ యింట్లో వాళ్లు లేరో, ఉన్నా గాఢనిద్రలో ఉంటారో గమనించి మరీ పనికి పూనుకుంటాడు. ఇక కార్పోరేట్ మోసాలైతే ఎంతో ప్లానింగుతో పకడ్బందీగా జరుగుతాయి. చేసిన నేరానికి ఆనవాళ్లు లేకుండా తుడిచేస్తారు. ఎక్కడా సంతకాలు పెట్టకుండా, యితరులను యిరికిస్తూ తను లబ్ధి పొందుతారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ విషయంలో బాబుపై ఆరోపణ వచ్చింది. ఆయన విచారణ ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ వారంలోనే బయటకు వచ్చేయవచ్చు. కేసులో పస లేకపోతే కోర్టులో కొట్టేస్తారు. ఈ లోపున ఆయన విజనరీ కాబట్టి కేసులొద్దు అనే పల్లవి ఎత్తుకోవడం దేనికి? భారత రాజకీయ నాయకుల్లో ఒక విషయం స్పష్టంగా కనబడుతోంది. సమర్థత, అవినీతి రెండు కలిసి ఉంటున్నాయి. కాలక్షేపం ముఖ్యమంత్రుల కాలంలో పెద్దగా అభివృద్ధి జరగదు. ఎవరైతే చురుగ్గా వ్యవహరిస్తారో, పెద్ద పెద్ద ప్రణాళికలు వేసి అమలు చేస్తారో వారిలో అవినీతి కోణం కూడా ఉంటుంది. బన్సీలాల్ ఒక ఉదాహరణ. అతని హయాంలో హరియాణా చాలా అభివృద్ధి చెందింది. కానీ అవినీతి ఆరోపణలూ దండిగా ఉన్నాయి.

వైయస్ హయాంలో జలయజ్ఞం, సైబరాబాదు విస్తరణ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ వంటివి ఉన్నాయి, అవినీతి ఆరోపణలూ ఉన్నాయి. ఈనాడు గొప్ప పేపరే, అయితే ఆ గ్రూపుకే చెందిన మార్గదర్శి ఫైనాన్స్ చట్టవిరుద్ధమైన పనులు చేసింది. ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా నియమోల్లంఘన చేసినట్లు కనబడుతోంది. ఇలా రెండు కోణాలు కనబడుతున్నపుడు రెండిటినీ పరామర్శించి తప్ప, ఒక సైడే చూస్తాను అంటే ఎలా? బ్యాంకుల్లో కూడా కొందరు మేనేజర్లు చాలా చురుకైనవారిగా పేరుబడతారు. డిపాజిట్ల సేకరణలో, ఋణవితరణలో టార్గెట్లను మించి సాధిస్తారు. వారిని చూసి నేర్చుకోమని మేనేజ్‌మెంట్ తక్కినవారిని చివాట్లు పెడుతుంది. కట్ చేస్తే కొన్నాళ్లకు వాళ్లు అవినీతికి పాల్పడ్డారంటూ సస్పెండ్ అవుతూంటారు! ఇదో వైచిత్రి!

ప్రదర్శనకారుల్లో కొంతమంది ‘బాబు వలననే యీ స్థితిలో ఉన్నాం, ఈ రోజు అన్నం తింటున్నామంటే అంతా ఆయన చలవే, అలాటాయన మీద కేసులా?’ అని వాపోతున్నారు. కృతజ్ఞతాభావం ఉండడం మంచిదే. దాని వ్యక్తీకరణలో మితిమీరితేనే ఎబ్బెట్టుగా ఉంటుంది. ‘బాబు హయాంలో చదివిన వారందరూ నేనున్న స్థితిలో ఉన్నారా? నా క్లాసుమేట్స్ అందరూ అమెరికాలో ఆస్తులు కొంటున్నారా? లేదే! నా బోటివాళ్లు కొందరు మాత్రమే ఎందుకు బాగుపడ్డాం? అంటే మాలో స్వయం ప్రతిభ ఉందన్నమాట, దానితో బాబు హయాంలో కల్పించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నా మన్నమాట. అసలు డిగ్రీ దాకా ఎలా వచ్చాం? స్కూలు, జూనియర్ కాలేజీ దాటుకుని కదా! ఆ స్కూళ్లు కట్టించినవారు, వాటికి రోడ్లు వేసి, మౌలిక సదుపాయాలు సమకూర్చి, విద్యుత్ సౌకర్యం వంటివి కల్పించినవారు, పాఠాలు చెప్పిన అయ్యవార్లు... వీళ్లందరికీ నా విజయంలో వాటా ఉంది కదా! అసలు వీళ్లందరినీ మించి కూలిపనికి పంపకుండా బడికి పంపిన మా అమ్మానాన్న మాటేమిటి? వారు లేకపోతే నేనెక్కడ? మరి వీరందరిని విస్మరించి యావత్తు ఘనతను బాబుకే కట్టబెడితే ఎలా?’ అని ఆత్మవిమర్శ చేసుకోవాలిగా!

వైయస్ ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం కారణంగా లబ్ధి పొంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారున్నారు. వైయస్ పై అవినీతి కేసులు పెట్టగానే వాళ్లంతా బయటకు వచ్చి ‘ఆయన వలననే మాకు చదువు, ఉద్యోగాలు వచ్చాయి. కేసులు పెట్టడం అన్యాయం’ అని నినదిస్తే..? రేపు జగన్ మళ్లీ అరెస్టయితే ‘ఆయన అమ్మ ఒడి పథకం వలననే మా అబ్బాయి స్కూలుకి వెళ్లి యిప్పుడు ఐఐటికి ప్రిపేరవుతున్నాడు. ఆయనపై కేసులు పెట్టడం అన్యాయం.’ అంటే..? ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వలన చదువుల్లో, ఉద్యోగాల్లో ఎందరో లాభపడ్డారు. వాళ్లంతా ‘ఫలానా వారి హయాంలో నాకు రిజర్వేషన్ సౌకర్యం లభించింది, వారిపై కేసులు పెట్టకూడదు’ అని ప్రదర్శనలు చేస్తే..? అలాగే బిసి హాస్టళ్లలో ఉండి చదువుకున్నవారు...? ప్రభుత్వం అన్నాక ఏవో పథకాలు పెడుతూనే ఉంటుంది. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుని బాగు పడేవారుంటారు. వాళ్లంతా ‘సమాజానికి ఋణపడి ఉన్నాం, దానికి తిరిగి ఏదైనా చేయాలి’ అనే భావనతో ఉండాలి తప్ప, ఏ వ్యక్తి హయాంలో జరిగిందో ఆయనకే మేం ఋణపడి ఉండాలి అనుకోవడం సరి కాదు.

కేసులనేవి రాజకీయ నాయకులకే కాదు, ప్రభుత్వోద్యోగులకు కూడా ఆక్యుపేషనల్ హజార్డ్స్. బ్యాంకు ఉద్యోగుల్లో కూడా విచారణ ఎదుర్కున్నవారు, ఖర్మ కాలితే సస్పెండ్ అయినవారు, అరెస్టయినవారూ ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో అవినీతిపరులు కొందరున్నా, అమాయకులూ ఉన్నారు. పై అధికారి నోటిమాటగా యిచ్చిన ఆదేశాలను సుగ్రీవాజ్ఞగా పాటించి, తర్వాత చిక్కుల్లో పడినవారెందరో! పై అధికారి ‘ముందు అర్జంటుగా చేసేయి, ఇన్ రైటింగ్ నేను కన్‌ఫమ్ చేస్తాను’ అని నమ్మబలికి, వెనక్కి తగ్గిన సందర్భాలెన్నో! వీటిలో క్రింది అధికారికి లంచం వాటా ముట్టి ఉండకపోవచ్చు, అతనికి డబ్బు చేరిందని రుజువు చేయలేక పోవచ్చు, కానీ అతను శిక్షించబడుతున్నాడు. సహజమైన వివేకం ఉపయోగించ లేదని, డిపాజిటర్ల డబ్బు దుర్వినియోగం అవుతూంటే ఒక కస్టోడియన్‌గా నివారించ లేదని శిక్షలు వేస్తున్నారు. ఇది ఒక మంత్రికి కూడా వర్తిస్తుంది. అధికారి ప్రజాధనాన్ని అడ్డంగా తినేస్తూ ఉంటే ఆపకపోతే తప్పు అతనిదే కదా!

సేవకుడి చర్యలకు యజమాని బాధ్యుడు అని చాణక్యనీతి. ఏజంటు చర్యలకు ప్రిన్సిపల్ బాధ్యుడు అని నేటి మర్కంటైల్ లా. బ్యాంకు మేనేజరు (గతంలో ఏజంటు అనేవారు) డిపాజిటర్ల డబ్బు తినేస్తే యాజమాన్యమే చెల్లిస్తుంది. దానికి ముందు ఇన్‌స్పెక్షన్ డిపార్టుమెంటు వాళ్లను, ఆడిటర్లను కూడా విచారించి నిర్లక్ష్యానికి శిక్ష వేస్తుంది. సీమెన్స్ (ఎఐఎస్‌డబ్ల్యు) ఉద్యోగిగా ఉండగా సుమన్ బోస్ చర్యలకు సీమెన్స్ హెడాఫీసు తనకు సంబంధం లేదని తప్పించుకో జాలదు. అలాగే ప్రభుత్వాధికారుల చర్యలకు సంబంధిత మంత్రీ, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లి ఉంటే వారూ బాధ్యులవుతారు. ఒక నాయకుడి  హత్య జరిగిందనుకోండి, సెక్యూరిటీగా ఉన్న ఆఫీసరుకి శిక్ష పడుతుంది. నేను చంపలేదుగా అని అతను వాదించలేడు. నాయకుణ్ని కాపాడడం నీ బాధ్యత, దానిలో నీవు విఫలమయ్యావు అంటారు.

ప్రజాధనం కూడా అలాటిదే! ప్రజా ప్రతినిథిగా ఉన్న మంత్రి లేదా ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని కాపాడవలసినదే. నాదేం లేదు, అధికారులదే బాధ్యత అంటే ఒప్పదు. వాళ్లు బాగా చేసినప్పుడు క్రెడిట్ వీళ్లకు వస్తోందిగా! బాబు విషయంలో ఐటీ డెవలప్మెంట్ కూడా అధికారుల ద్వారానే జరిగిందిగా! దాని ఘనతను బాబు ఖాతాలో వేసినప్పుడు అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని తేలితే అది ఎవరి ఖాతాలో వేయాలిట? చెప్పవచ్చేది, యివన్నీ వృత్తిపరమైన సమస్యలు. వీటికి సిద్ధపడే ఉద్యోగాల్లోకి, రాజకీయాల్లోకి దిగుతారు. నేను విజనరీ కదా, నన్ను అరెస్టు చేయరు అని బాబు అనుకోలేదు. ఆర్నెల్లగా సిద్ధపడుతూనే ఉన్నారు. పైకి చెప్తూనే ఉన్నారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రతివ్యూహాన్ని రచించే ఉంటారు. అందుచేత మనమందరం ఆందోళన పడనక్కరలేదు, ఆందోళనలు చేయనూ అక్కర్లేదు. సంఘీభావం తెల్పడానికి ఒకవేళ చేసినా, విజనరీ యాంగిల్‌ను కలపనక్కరలేదు.

ప్రతీ నాయకుడూ ఏదో రకంగా విజనరీయే. కౌన్సిలర్‌గా ప్రారంభమైనవాడు మంత్రిగా తేలితే, అతనికి విజన్, దూరదృష్టి లేదని అనగలమా? ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టాలన్న విజన్ వైయస్‌కు ఉందిగా! అందరూ మర్చిపోయిన ప్రత్యేక తెలంగాణ ఒకనాటికి సాకారం అవుతుందన్న విజన్  కెసియార్‌కు ఉందిగా! వైయస్‌పై కేసులు పెట్టినపుడు అవి సక్రమంగా లేవని వాదించిన వారున్నారు తప్ప, ఆయనకు ఆరోగ్యశ్రీ విజన్ ఉంది కాబట్టి కేసు పెట్టకూడదు అని ఎవరూ అనలేదు. రేపు కెసియార్ అరెస్టయినా తెలంగాణ విజనరీ కాబట్టి నేరస్తుడనకూడదు అంటారనుకోను.

పోనీ విజన్ అనేది ఐటీ పరిశ్రమకే వర్తిస్తుంది అనుకున్నా, బాబుకి ముందే ప్రారంభించిన నేదురుమల్లి జనార్దనరెడ్డి నుంచి, బాబు తర్వాత విస్తరింప చేసిన వైయస్‌కు, కొనసాగించిన రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి, యిప్పుడు యింకా యింకా ఐటీ పరిశ్రమలు తెస్తున్న కెసియార్‌కు అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. బాబు హయాంలో ఐటీ పరిశ్రమ నడిచింది ఐదేళ్ల పాటు మాత్రమే! 2004 తర్వాత 19 ఏళ్లగా ఐటీ నడుస్తోంది, పరిగెడుతోంది కూడా! ఇప్పుడు ప్రదర్శనలు చేస్తున్న వారందరూ ఆ ఐదేళ్లలో ఉద్యోగాల్లో చేరినవారే అయివుండరు. తర్వాతి కాలంలో కూడా చేరినవారు కూడా ఉంటారు. వైయస్ కేసుల గురించి వారు యీ విధంగా స్పందించలేదు. కిరణ్ కుమార్, కెసియార్‌లపై రేపుమర్నాడు కేసులు పెడితే వాటి గురించి స్పందిస్తారన్న నమ్మకమూ లేదు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు మనకంటె ఐటీలో ముందంజలో ఉన్నాయి. అక్కడ ఐటీ విజనరీ అని ప్రత్యేకంగా ఎవర్నీ పేర్కొని పట్టం కట్టటం లేదు. ఆ భజనంతా బాబుకే! ఆయన ముందూవెనక వారెవరికీ యీ హోదా లేదెందుకో!

ఏది ఏమైనా బాబుతో ఐటీ ఉద్యోగులే ఐడెంటిఫై అయ్యారు. రాష్ట్రంలో ప్రధాన వృత్తిని ఎంచుకున్న రైతులు కాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన హయాంలో అగ్రికల్చర్‌లో నెగటివ్ గ్రోత్. వైయస్ దాన్నే ఎన్‌క్యాష్ చేసుకుని, సాగునీరు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ గురించి మాట్లాడి 2004లో నెగ్గారు. 2009లో మళ్లీ నెగ్గారు. ఇప్పుడూ బాబుకి మద్దతుగా రైతులు రోడ్ల మీదకు రాలేదు. వాళ్లే కాదు, చిన్న వ్యాపారస్తులు, చేతివృత్తుల వాళ్లు యిలాటి వారెవరూ రాలేదు, నిరుద్యోగులూ రాలేదు. నంద్యాల నుంచి చిలకలూరిపేట వరకు కాన్వాయ్ నిరాటంకంగా వచ్చేసింది. మధ్యతరగతి వాళ్లు యింట్లో కూర్చుని టీవీ చూస్తే చ్చొచ్చొచ్చొ అనడమే తప్ప, వీధుల్లోకి వచ్చి జండా పట్టుకోరు. పరరాష్ట్రాల్లో, విదేశాల్లో ఐటీ ఉద్యోగులు టీవీ కెమెరాల ముందు ప్రదర్శనలు నిర్వహిస్తే ప్రయోజన మేముంది? ఆంధ్రలో ఓట్లున్నవారిలో చలనం లేనప్పుడు!

అమెరికాపై యుద్ధంలో గెలిచి, రెండు వియత్నాంలు ఏకమయ్యాక కంపూచియాపై దాడి చేసినప్పుడు హైదరాబాదు మావోయిస్టులు గోడల మీద ఎఱ్ఱ యిటిక రాయితో ‘‘కంపూచియా ప్రజలారా, వియత్నాం దాడిని తిప్పికొట్టండి’ అని రాసేవారు. ఈ నినాదాలతో కంపూచియా వారికి ఏ మేలు కలుగుతుందను కున్నారో నాకర్థమయ్యేది కాదు. హైదరాబాదులో కెబియార్ పార్కు దగ్గర ఐటీ నిపుణులు ప్రదర్శన చేస్తూ ఉంటే ‘ఇక్కడ కాదు, ఆంధ్రలో ఊళ్ల కెళ్లి చేయండి’ అని బండ్ల గణేశ్ అన్నారట. కార్యక్షేత్రం ఆంధ్ర. అక్కడ ఆందోళనలను చేయటం లేదని వారిని నిందించీ ప్రయోజనం లేదు. అవిభక్త రాష్ట్రం ఉన్పపుడు అన్ని చోట్ల నుంచి డబ్బు పట్టుకెళ్లి హైదరాబాదుకే దోచిపెట్టారు. ఆంధ్రను దిక్కుమాలినదానిగా విడిచి పెట్టారు. ఏ సౌకర్యాలూ లేవు. ఉద్యోగం కావాలంటే హైదరాబాదుకి పోవాల్సిందే.

ఎన్టీయార్ ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాదుకి ప్రాముఖ్యం మరీ పెరిగింది. పెట్టుబడులన్నీ అక్కడికే! ఆ నిష్పత్తిలో ఆంధ్ర కృశించింది. 1983 నుంచి 2014 వరకు లెక్కేసుకుంటే 31 ఏళ్లలో 16 ఏళ్లన్నర టిడిపి పాలనే నడిచింది. దానిలో తొమ్మిదేళ్లు బాబువే! బాబు పాలనలో హైదరాబాదుకే అన్నీ కట్టబెట్టి, తక్కినవాటిని ఎండగట్టారు. 2014లో ఆంధ్రకు సిఎం కాగానే, ఆంధ్రలో ఏమీ లేదు, దిక్కుమాలిన దానిలా చేశారు అంటూ గగ్గోలు పెట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయకుండా హైదరాబాదును మాత్రమే వృద్ధి చేసిన పాపంలో తనకూ భాగముందని మర్చిపోయారు. విభజన తర్వాత కూడా బాబు పాలన నడిచిన ఐదేళ్లలో ఆంధ్రకు రావలసినవి ఏవీ రాలేదు..

ఇక ఆంధ్ర ప్రజల్లో బాబు పట్ల ప్రేమ ఎందుకుంటుంది? నెమ్మదిగా గతాన్ని మర్చిపోదామని వారు ప్రయత్నించినా బాబు ఊరుకోవటం లేదు. నేను హైదరాబాదుకి యింత చేశాను, అంత చేశాను అని మాటిమాటికీ, మాటమాటకూ చెప్పి ఆ గాయాన్ని రేపుతూనే ఉంటారు. అవును, అంతా అక్కడే చేశావ్, మాకేం ఒరగబెట్టావ్? అని శ్రోతలు పళ్లు నూరుకునేలా చేస్తూంటారు. తెలంగాణకే అంతా చేసి చివరకు అక్కడ ఏమీ లేకుండా చేసుకున్నారు. రాబోయే ఎసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్ల కోసం తక్కిన పార్టీలో హడావుడి కనబడుతోంది తప్ప టిడిపిలో చలనమే లేదు. ఖమ్మం మీటింగు తర్వాత మరో మీటింగు లేదు. రెండిందాలా చెడినట్లయింది. అందువలన యిప్పుడీ ప్రదర్శనలనేవి ‘బాబు వలన బాగుపడ్డాం’ అనే ఫీలింగున్న హైదరాబాదీల మూలంగా విప్రో సర్కిల్‌లో, ఓఆర్ఆర్‌లో జరిగాయి తప్ప తమకు ఏ మేలూ కలగలేదన్న ఫీలింగున్న ఆంధ్రలో జరగటం లేదు. అక్కడంతా నీరసంగానే ఉంది.

ఇక్కడ ఒకటి చెప్పాలి. హైదరాబాదు, బెంగుళూరు, విదేశాలలోని ఐటీ ఉద్యోగుల్లో కూడా కొంతమంది మాత్రమే బాబును నెత్తి కెత్తుకున్నారు. ఎందుకంటే మామూలుగా అయితే ‘ప్రజాస్వామ్యం ఖూనీ అయిన విధానాన్ని ఖండిస్తున్నాం. అరెస్టు చేసిన తీరు బాగా లేదు. ఒక విజనరీతో వ్యవహరించే విధానం అది కాదు.’ వంటి నినాదాలే వినబడాలి. కానీ చాలా ప్రదర్శనల్లో పాల్గొన్నవారు టిడిపి అభిమానులు కూడా అని వెనక్కాల పెట్టిన జండాలు, ‘సైకో పోవాలి, సైకిలు రావాలి’ వంటి నినాదాలు, ఎలుగెత్తి చెప్తున్నాయి. వాళ్లు బాబు విజనరీ అయినా కాకపోయినా యిలాగే స్పందించేవారు. రేపు లోకేశ్ అరెస్టయితే కూడా యిలాటి స్లోగన్లే వినబడతాయి. విజనరీ పదం వాడకపోతే కిక్ ఉండదనుకుంటే ‘విజనరీ గారబ్బాయి’ అంటారేమో! సీతారత్నం గారబ్బాయి, అనసూయమ్మగారి అల్లుడు, సీతారామయ్య గారి మనుమరాలు అనే పేర్లతో సినిమాలు వచ్చాయి చూడండి, అలాగన్నమాట. వీళ్ల వలన స్ఫూర్తి పొందితే తెరాస విదేశీ అభిమానులు కవిత అరెస్టయితే ‘తెలంగాణ విజనరీ గారమ్మాయి’ అనే బిరుదు కట్టబెడతారేమో!

చెప్పవచ్చేదేమిటంటే, రాజకీయ నాయకులకు వృత్తిపరమైన గండాలైన యిలాటి కేసులు, అరెస్టులు వచ్చినపుడు భూమి బద్దలయినట్లు కంగారు పడవలసిన అవసరం లేదు. బాబు లాటి విజనరీ కూడా దీనికి అతీతం కాదు అని అర్థం చేసుకోవాలి. సీతామ్మవారికి కూడా అగ్నిపరీక్ష తప్పలేదు. ఈయన సీతను మించినవాడు, నిప్పుకే నిప్పు, పరీక్ష పెట్టకూడదు అంటే ఒప్పదు. అనుమానాలు రేగినప్పుడు వాటిని ఎదుర్కుని, నివృత్తి చేయడమే మంచిది. ఆ పని ఆయన్ని చేయనీయండి. కేసు పెట్టకూడదు, విచారణ చేయకూడదు, కావాలంటే అధికారులను శిక్షించుకోండి అని గోల చేయకండి. అధికారులను శిక్షించాలన్నా తప్పు జరిగిందని తేలాలి కదా, తేలాలంటే బాబును విచారించాల్సిందే. అందుకే న్యాయమూర్తి జుడిషియల్ కస్టడీకి పంపారు.

విచారణను కాదు, అరెస్టు జరిగిన తీరును మాత్రమే ఖండిస్తున్నాం అని స్పష్టంగా ఎవరూ అనగా నేను వినలేదు. ఎవరైనా అన్నా, అరెస్టు జరిగిన తీరు సవ్యంగా ఉందని ఏ కేసు సందర్భంలోనూ నేను వినలేదు. ఎప్పుడూ ఏదో ఒక అభ్యంతరం చెప్తూనే ఉంటారు. పొద్దున్న ఆరు గంటలకు అరెస్టు చేశారని బాబే స్వయంగా చెప్పినా, అర్ధరాత్రి అరెస్టు చేశారు అంటూ ఎంతోమంది యింకా మాట్లాడుతూనే ఉన్నారు, యూరోప్ టైము ప్రకారం చూస్తున్నారో ఏమో! అలాని పొద్దెక్కాక ఏ మిట్టమధ్యాహ్నమో చేస్తే ఉప్పరి ముహూర్తమే దొరికిందా? అని మండిపడతారు. ఏ అరెస్టయినా సరే, కార్యకర్తలు అడ్డుపడతారు, పోలీసులు వాళ్లను అటూయిటూ తోస్తారు. అంతే, దౌర్జన్యంగా అరెస్టు చేశారని, పోలీసులు మర్యాదగా ప్రవర్తించలేదని విమర్శలు వస్తాయి.

ఆయన వయసును లెక్కలోకి తీసుకోకుండా.. అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. ఆయనేమీ కుక్కిమంచంలో పడి లేరు. శుబ్భరంగా రోజంతా ఎండలో తిరుగుతున్నారు, గంటల తరబడి ఉపన్యాసాలు దంచుతున్నారు. మొన్న పుంగనూరులో చూశాం, ఎంత వీరావేశం ప్రకటించారో! ఎక్కడైనా వృద్ధాప్యపు ఛాయలు కనబడ్డాయా? ఇక బిపి, సుగర్ లంటారా, యీ రోజుల్లో 30 దాటినవారికే వచ్చేస్తున్నాయి. రేపు బయటకు వచ్చాక తన కోసం మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తానంటూ బయలు దేరతారు చూడండి. దోమలు కుడుతున్నాయి, చన్నీళ్లతోనే స్నానం.. వంటివి మిగతావాళ్లు అంటున్నారు కానీ రేపు బాబు కోర్టులో వీటి గురించి ఫిర్యాదు చేస్తారని అనుకోను. ‘ప్రజలకు మేలు కలుగుతుందనుకుంటే యిలాటివి ఎన్నో భరించడానికి సిద్ధం’ వంటి స్టేటుమెంటు యిస్తారు.

ఇక అరెస్టు సక్రమమా? అక్రమమా? గవర్నరు ముందస్తు అనుమతి కావాలా? వద్దా? ఎఫ్ఐఆర్‌లో పేరుంటేనే చేయాలా? ముందుగా నోటీసు యివ్వాలా? వంటి సాంకేతిక విషయాల గురించి నాకేమీ తెలియదు. కానీ న్యాయమూర్తులకు తెలిసి ఉంటుంది. అందుకనే లూథ్రాగారు ఆ పాయింట్లు ఎత్తినపుడు ఆవిడ పరిగణనలోకి తీసుకోలేదు. ఈయన మళ్లీ హైకోర్టులో కూడా అవే చెప్పారు. ఆ న్యాయమూర్తి తీసుకోవచ్చు. ఈ దేశంలో ఒక్కో కోర్టు ఒక్కోలా తీర్పు యిస్తుంది. కింది కోర్టు తీర్పును పైకోర్టు సమర్థించవచ్చు, కొట్టి పారేయవచ్చు. అయినా వీటికేముంది? గవర్నరు అనుమతి కావాలంటారా? సరే పోస్ట్-ఫ్యాక్టో పర్మిషన్ తెస్తామనవచ్చు. లేదా యిప్పుడు విడుదల చేసి, అనుమతి తెచ్చుకుని మరో గంటలో మళ్లీ అరెస్టు చేశామనవచ్చు. గవర్నరుగారు బిజెపి మనిషి. బిజెపి ఆమోదం లేనిదే యీ కథ యింతదాకా వచ్చిందనుకోవడానికి లేదు.

ఈ అరెస్టు వలన ఆంధ్రలో ప్రజాస్వామ్యం మంటగలిసింది అని అప్పటికప్పుడు ఆవిర్భవించిన మేధావి సంస్థలు ప్రకటనలు విడుదల చేయవచ్చు. ప్రజాక్షేత్రంలో అన్ని పార్టీల నాయకులూ హద్దు మీరి అశ్లీలాలు పలుకుతున్నపుడే, ప్రభుత్వాధికారులను బెదిరిస్తున్నపుడే మంట గలిసిందని ప్రజలు అనుకుంటున్నారు. వీళ్లు యిప్పుడే మేలుకొన్నారు. బెయిలు యివ్వవలసిన సందర్భాల్లో కూడా యివ్వకుండా నెలల తరబడి తొక్కి పెట్టిన సందర్భాల్లోనే మంట కలిసింది, ఇప్పటికి కూడా వేలాది మంది అండర్‌ట్రయల్స్ జైళ్లలో మగ్గుతున్నారు. వాటి గురించి కూడా ఉద్యమిస్తే బాగుంటుంది.

చివరగా చెప్పేదేమిటంటే – బాబు విజనరీ కావచ్చు, వంద మంచి పనులు చేయవచ్చు, అయినా ఒక తప్పు చేయలేదన్న గ్యారంటీ లేదు. ఒక డైరక్టరు నాలుగు సినిమాలు బాగా తీసినంత మాత్రాన ఐదో సినిమా కూడా బాగా తీస్తాడన్న గ్యారంటీ లేదు. ఆయన అవినీతికి పాల్పడక పోయి ఉండవచ్చు, కానీ తన పాలనలో అవినీతి జరగనిచ్చినా వైకేరియస్ లయబిలిటీ చుట్టుకుంటుంది. 2018లో యీ కేసు ఆయన దృష్టికి వచ్చినపుడు, వెంటనే విచారణకు ఆదేశించి ఉంటే ఆయన దీనికి అతీతుడు అనే భావన కలిగేది. దాన్ని తొక్కిపెట్టడంతో సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ అనే అంశాలు పరిగణనలోకి తీసుకోబడతాయి. విచారణ ముందుకు సాగే కొద్దీ విషయాల్లో స్పష్టత వస్తుంది. అప్పుడు బాబు ప్రభ మరింత ప్రకాశమానం కావచ్చేమో, ఎవరు చూడవచ్చారు? విచారణే జరగకూడదని ఉద్యమిస్తే ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నట్లే!

విజనరీ అవినీతికి పాల్పడడు అనే మాట అసమంజసమని జయంతి ధర్మతేజ (1922-85) కథ చెప్తుంది. అంతర్జాతీయ జలాలపై భారతీయ పతాకతో నౌకలు తిరిగేట్లా చేసినవాడూ ఆయనే. అవినీతి ఆరోపణలతో కోస్టారికాకు పారిపోయినవాడూ ఆయనే. నా క్రైమ్ రచనల్లో ఆయన గురించి ‘‘(అ)ధర్మతేజం’’ పేర రాసిన వ్యాసం పాఠకుల్లో కొందరికి గుర్తుండి ఉండవచ్చు. చంద్రబాబు గారి విషయంలో కూడా మనం రెండూ విడగొట్టి చూడాలి. నిజం బయట పడేవరకూ కాస్త తమాయించుకోవాలి.

- ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?