సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. ఢల్లీి శివార్లలోని నోయిడాలో ఐదేళ్ళ క్రితం జరిగిన ఆరుషి హత్య కేసులో చిక్కు ముడి వీడిరది.. తల్లిదండ్రులే తమ కుమార్తెను హత్యచేశారని సీబీఐ న్యాయస్థానం తేల్చింది. నిన్ననే ఆరుషి తల్లిదండ్రులు నుపుర్ తల్వార్, రాజేష్ తల్వార్‌లను దోషులుగా తేల్చిన న్యాయస్థానం, వారిద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
2008లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తొలుత ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న హేమ్‌రాజ్, ఆరుషిని చంపేశాడనే ఆరోపణలురాగా, ఇరవై నాలుగ్గంటలు గడవకముందే హేమ్‌రాజ్ కూడా శవమై తేలాడు. ఆరుషి, హేమ్‌రాజ్.. ఇద్దరూ ఒకేసారి చంపబడ్డారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఆ తర్వాత హేమ్‌రాజ్ సన్నిహితులపై ఆరోపణలు రావడం, అదీ ఉత్తదేనని తేలిపోవడం, చివరికి తల్లిదండ్రులపైనే అనుమానాలు వెల్లువెత్తడం తెల్సిన విషయాలే. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో, తల్లిదండ్రులే దోషులుగా తేలడం అత్యంత బాధాకరమైన విషయం. నిజంగానే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఇది.
వృత్తి రీత్యా డాక్టర్లు అయిన రాజేష్, నుపుర్ తమ కుమార్తె ప్రవర్తనపై అనుమానంతో రగిలిపోయి, ‘పరువు హత్యకు’ తెగించారు. అయితే, ఇంకా రాజేష్, నుపుర్ తమ కుమార్తెను తామెందుకు చంపుకుంటామని ప్రశ్నిస్తున్నారు. సీబీఐ అబద్ధాలతో తమను కటకటాల వెనక్కి పంపించిందని ఆరోపిస్తున్నారు తల్వార్ దంపతులు.
అయితే, సాక్ష్యాధారాలు దొరక్కుండా, హత్య జరిగిన అనంతరం.. తల్వార్ దంపతులు తీసుకున్న జాగ్రత్తలే వారిపై అనుమానాలు పెరిగేలా చేశాయి. రక్తపు మరకలు, హత్యకు వాడిన ఆయుధం.. ఇవన్నీ మాయం చేయడంతో, న్యాయస్థానం ఆ కోణంలో దర్యాప్తు చేయమని సీబీఐకి సూచించింది. అప్పటిదాకా వేరేవారిపై అనుమానాలతో కేసు విచారణ షురూ చేసిన సీబీఐ, న్యాయస్థానం సూచనతో తల్లిదండ్రులే నిందితులుగా కేసు విచారణ చేపట్టి, వాస్తవాల్ని వెలికితీసింది.