దేశంలో స్వామీజీలు ఎక్కువైపోయారు.. దొంగ స్వామీజీలకైతే లెక్కే లేదు. అసలు దొంగలెవరు.? దొంగ స్వామీజీలెవరు.? అసలు స్వామీజీలెవరు.? అన్నది తేల్చుకోవడమే కష్టమవుతోందిప్పుడు. వీధికో స్వామీజీ తయారైపోతుండడంతో, స్వామీజీ – దొంగ స్వామీజీ మధ్య తేడాలెవరికీ అర్థం కాని పరిస్థితి.
మొన్న నిత్యానంద స్వామీజీ.. ఇటీవలే రాంపాల్ స్వామీజీ.. ఎవరైతేనేం.. అమాయకుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారంతే. భక్తులకు భక్తితత్వం గురించి చెప్పాల్సిన నిత్యానంద స్వామీజీ, కామాతురాణాం నభయం.. న లజ్జ.. అన్న రీతిలో వ్యవహరించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. స్వామీజీ రాంపాల్ విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే విన్పిస్తుండడం గమనార్హం. నిత్యానందను అరెస్టు చేయడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. రాంపాల్ అరెస్ట్ కోసమైతే ఏకంగా ఇరవై ఆరున్నర కోట్ల రూపాయల్ని ఖర్చు చేయాల్సి వచ్చింది.
హర్యానా ప్రభుత్వ పోలీసు యంత్రాంగం రాంపాల్ అరెస్ట్‌ని ఓ ‘ఆపరేషన్’లా చేపట్టింది. ఇందుకోసం ఇరవై ఆరున్నర కోట్లు వెచ్చించినట్లు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర సహకారంతో, హర్యానా రాష్ట్రంతోపాటు ఛండీఘడ్, పంజాబ్ రాష్ట్రాలూ తలోచెయ్యి వేస్తేనే తప్ప రాంపాల్ అరెస్టు సాధ్యం కాలేదు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారమనీ, చాలా సున్నితమైన విషయమనీ పోలీసులు కోర్టుకు విన్నవించినా, కోర్టు రాంపాల్‌ని అరెస్టు చేయాలనే స్పష్టం చేసింది.
దాంతో, ఎలాగైతేనేం రాంపాల్‌ని అరెస్టు చేశారు. ఈ క్రమంలో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. పలువురు భక్తులు మృత్యువాత పడ్డారు కూడా. కానీ, రాంపాల్ అశ్రమంలో మారణాయుధాలు లభ్యమయ్యేసరికి.. ఈ ఆపరేషన్ ఎంత అవసరమో అందరికీ తెలిసొచ్చింది. కన్యత్వ పరీక్షల కోసం కొన్ని కిట్లు కూడా రాంపాల్ ఆశ్రయంలో దొరకడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేసింది.