దేశ రాజధాని ఢిల్లీ లో ఓ అభాగ్యురాలు అర్థరాత్రి సామూహిక అత్యాచారానికి గురై, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా యువత నడుం బిగించి, మహిళలకు రక్షణ విషయమై ఆందోళనలు చేపట్టారు. అలా ‘నిర్భయ’ చట్టం రూపుదిద్దుకుంది. కానీ, ఏం లాభం.? ‘నిర్భయ’ చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్య పెరిగింది తప్ప, ఈ తరహా ఘటనలు మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు.
మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్న సందర్భంలో ఆయా ఘటనలకు అభయ అనో, నిర్భయ అనో పేర్లు పెట్టడం పరిపాటిగా మారింది. ఆయా నేరాలకు తగిన శిక్షలు విధింపబడ్తున్నాయా.? లేదా.? అన్నదానిపై మాత్రం అనుమానాలు అలానే వున్నాయి. దేశంలో చట్టాల పరిస్థితి అది. పాలకులు మాత్రం, చట్టాల పేరు చెప్పి పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే వున్నాయి.
కోట్లు ఖర్చుపెట్టి సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేయడం.. పోలీసులకు అత్యాధునిక సౌకర్యాలతో వాహనాల్ని సమకూర్చడం.. మహిళా పోలీసు వ్యవస్థను పటిష్ట పర్చడం.. వీటితో ప్రభుత్వాలు కాలక్షేపం చేస్తున్నాయి తప్ప, మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయడంలో చిత్తశుద్ధి చూపడంలేదన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు.
ఆ మధ్య హైద్రాబాద్‌లో పాములతో బెదిరించి ఓ యువతిపై ఆమెకు కాబోయే భర్త యెదుటే అత్యాచారం చేసిన దుండగుల ఉదంతం వెలుగు చూసిన విషయం విదితమే. ‘ఇకపై ఇలాంటి ఘటనలు జరిగితే గుడ్లు పీకేస్తాం..’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటైన హెచ్చరికలు పంపారు. ఏం లాభం.? ఆ తర్వాత కూడా అలాంటి ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా హైద్రాబాద్ శివార్లలోనే ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసులు షరా మామూలుగానే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
స్నేహితుడితో కలిసి వెళుతున్న సమయంలో వారిని వెంబడించిన దుండగులు, స్నేహితుడ్ని చితకబాది.. యువతిపై సామూహిక అత్యాచారం చేసి, దాన్ని సెల్‌ఫోన్లతో వీడియో కూడా తీశారట. విషయం బయటకు పొక్కింది.. పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ, ఇలాంటి ఘటనల్ని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ-టీమ్స్ ఏం చేస్తున్నట్లు.? సీసీ కెమెరాల వ్యవస్థ ఏమయినట్టు.? రహదార్లపై మహిళల భద్రత మాటేమిటి.? అన్నీ ప్రశ్నలే, సమాధానాలే లేని పరిస్థితి.
ఇలాంటి ఘటనలు ఒక్క హైద్రాబాద్‌లోనే జరగడంలేదు.. దేశవ్యాప్తంగా నిత్యం వెలుగు చూస్తూనే వున్నాయి. ఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత లైట్ తీసుకోవడం.. పాలకుల ఈ నిర్లక్ష్యానికి తోడు.. సమాజంలో మారుతున్న సామాజిక పరిస్థితులు, పిల్లలపై తల్లిదండ్రులకు అదుపు లేకపోవడం, వీటన్నిటికీ తోడు.. ఇంటర్నెట్‌లో అశ్లీలచిత్రాలు.. ఒకటేమిటి.? సవాలక్ష కారణాలు. కారణాలు సరే, పరిష్కారమేంటి.? అంటే, ఆ ఒక్కటీ అడక్కూడదంతే.