ద గ్రేట్ కమెడియన్ అల్లు రామలింగయ్య తన నటనలో నేటివిటీని అద్భుతంగా ప్రదర్శించేవారు. బాపుగారి ద్వారా ‘ఆమ్యామ్యా’ అంటూ లంచానికి పర్యాయపదాన్ని అందించాడాయన. అలాగే తన డైలాగ్ చివర్లో ‘అప్పం.. అప్పం’ అంటుండేవారు.
‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో టీ తోటలకు మేనేజర్‌గా అల్లు రామలింగయ్య మంచి వేషం వేశారు. టీ తోటల్లో పనిచేసే స్త్రీగా అప్పటి కామెడీ నటి మమత నటించింది. తన డైలాగ్‌లో అల్లుగారు ‘అప్పం అప్పం’ అని అంటే మమత అభ్యంతరం తెలిపిందట.
‘అప్పం’ అంటే అది బూతు పదాన్ని ధ్వనిస్తుంది.. అని ఆవిడ గోల చేస్తుంటే అది కాదమ్మా.. ‘అప్పం’ అంటే తమిళనాడులో తినుబండారం.. ఇప్పుడు అప్పాలు అన్ని హోటల్స్‌లో దొరుకుతున్నాయి.. అప్పుడు ఒక్క తమిళ వాళ్ళకే అప్పం తెలుసు.. అలా వివరంగా అల్లు రామలింగయ్య, డైరెక్టర్ వి.రామచంద్రరావు నచ్చజెప్పడమే కాకుండా ‘అప్పం’ తెచ్చి చూపించి మమతను ఒప్పించారట.
అది తినే పదార్థం అయినా అల్లువారు పలికే స్టయిల్లో అది బూతులాగే అనిపించి అప్పటి మాస్ ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చెయ్యడం విశేషం.