కొమ్మినేని: పవన్‌ కళ్యాణ్‌ ఊగిసలాట రాజకీయం!

జనసేన వ్యవస్థాపకుడు,ప్రముఖ నటుడు పవన్‌ కళ్యాణ్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి.ఓటుకు నోటు కేసుపై ఆయన ఎందుకు మాట్లాడనిది ఆయన చెబుతున్న తీరు విస్తు కలిగిస్తుంది. ఎందుకు టిడిపి దూరంగా వెళ్లరాదో ముఖ్యమంత్రి,…

జనసేన వ్యవస్థాపకుడు,ప్రముఖ నటుడు పవన్‌ కళ్యాణ్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి.ఓటుకు నోటు కేసుపై ఆయన ఎందుకు మాట్లాడనిది ఆయన చెబుతున్న తీరు విస్తు కలిగిస్తుంది. ఎందుకు టిడిపి దూరంగా వెళ్లరాదో ముఖ్యమంత్రి, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు చెప్పాలని అనడం చిత్రంగా అనిపిస్తుంది.

ప్రతి రాజకీయ పార్టీకి ఒక విధానం అంటూ ఉంటుంది.ఆయా అంశాలపై నిర్దిష్ట వైఖరి తీసుకుంటుంది.కాని పవన్‌ కళ్యాణ్‌ లో మాత్రం ఆ క్లారిటీ వచ్చినట్లు కనిపించలేదు. కాకపోతే బిజెపి పై కాస్త ఘాటు పెంచారు. తెలుగుదేశం పార్టీపై అంత ఘాటు చూపలేదు. ఆ తేడా కనిపిస్తోంది.

బహుశా రెండు పార్టీలకు ఒకేసారి దూరం అవడం, రెండు పార్టీల నేతలతో ఒకేసారి విమర్శిస్తుంటే వాటిని తట్టుకోవడం కష్టం అనుకున్నారేమో తెలియదు కాని ఆయన అరగంట సేపు ప్రసంగంలో ఆ తేడా కనిపించింది. కాకపోతే ప్రత్యేక హోదా అంశంలో మాత్రం ప్రస్తుతానికి ఆయన గట్టిగానే మాట్లాడారు. ఇచ్చిన హామీపై వెనక్కి తగ్గడాన్ని ఆయన ప్రశ్నించడం వరకు బాగానే ఉందని అనాలి.

ప్రధాని మోడీపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతోనే ఆయనకు ఎక్కువ తేడా ఉన్నట్లుగాఉంది. వెంకయ్య నాయుడుకు చెందిన స్వర్ణ భారత ట్రస్టు ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించిన తీరు ఆ అర్ధాన్ని ఇస్తుంది. ఇక చంద్రబాబు మంచివారే కాని, ఆయన చుట్టూ ఉన్నవారు మంచి కారు కారన్నట్లుగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎమ్‌.పి రాయపాటి సాంబశివరావులపై మద్యవర్తి ద్వారా విచారణ జరపాలని పవన్‌ కళ్యాణ్‌ సలహా ఇచ్చారు. అదే సమయంలో ఆయన ఒక జాగ్రత్త తీసుకున్నారు.వారిద్దరిపై కూడా తనకు వ్యక్తిగత కోపం లేదని,స్పేహితులేనని వివరణ ఇచ్చుకున్నారు.

ఇంతకీ ప్రత్యేక హోదా ఉద్యమంలో ఆయన ఏమి చేయదలిచింది.. ఆయన ఎలాంటి కార్యాచరణ తీసుకోదలచింది చెప్పలేదు. పైగా ప్రత్యేక హోదాను జల్లికట్టును కలిపి దక్షిణాది వారి ఆత్మగౌరవం అంటూ కొత్త వాదనతీసుకు రావడం ద్వారా ప్రత్యేక హోదా అంశం ప్రాధాన్యత తగ్గేలా ఆయన మాట్లాడారా అన్న అనుమానం కలుగుతుంది.

జనసేన కార్యకర్తలు పలువురు విశాఖ,విజయవాడలలో పవన్‌ కళ్యాణ్‌ ను నమ్ముకుని ఆందోళనలు చేపట్టి పోలీసుల వేధింపులకు గురైతే,వారికి స్వాంతన చేకూర్చే విధంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడలేకపోవడం ఆయన వైపు లోపంగానే కనిపిస్తుంది. అలాగే వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ అద్యక్షుడు, విపక్ష నేత జగన్‌ ను విశాఖ ఎయిర్‌ పోర్టులో పోలీసులు అడ్డుకున్న తీరు. ఆయన అక్కడే భైటాయించవలసిన పరిస్థితిపై పవన్‌ మాట్లాడలేకపోవడం లో రాజకీయం ఏమిటో తెలియదు.

నిజానికి పవన్‌ కళ్యాణ్‌  అబిమానులు చాలామంది సినిమాలో మాదిరి ఆకాశం నుంచి ఎగిరో, సముద్రమార్గంలో ఎవరికి కనిపించకుండా విశాఖ ఆర్‌.కె.బీచ్‌ కు వచ్చి హీరోచిత పోరాటం చేస్తారని ఆశించారట. కాని అలా చేయకపోగా, జనవరి ఇరవై ఆరు కు ముందు పలుమార్లు ట్వీట్‌ లు చేస్తూ ఉత్సాహపరిచిన ఆయన, ఇరవై ఆరున పోలీసుల అణచివేతను అంత తీవ్రంగా వ్యతిరేకించడపోవడంతో ఆయన అబిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. అందువల్లే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ విపక్ష నేత జగన్‌ సాహసాన్ని మెచ్చుకుని, పవన్‌ కూడా అలా చేసి ఉండాల్సిందని అన్నారు.

అయితే పవన్‌ కళ్యాణ్‌ ఇంకా ఇప్పటికిప్పుడు చంద్రబాబుతో స్నేహాన్ని వదులుకోవడానికి సిద్దంగా లేరేమోనన్న భావన ఆయన మద్దతుదారులలో కూడా ఉంది. బిజెపితో అయితే దూరం అయినట్లేనని రెండువైపులా భావిస్తున్నారు. అందువల్లనే బిజెపి నేతలు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో సహా పవన్‌ ను ట్విటర్‌ బోయ్‌ అని, పార్ట్‌ టైమ్‌ రాజకీయ వేత్త అని, ఆయనకు ఒక సిద్దాంతం లేదని, ధైర్యంగా విశాఖ వెళ్లలేకపోయాడని ఎద్దేవ చేయడం ఆరంభించారు.

పవన్‌ కళ్యాణ్‌ కారణాలు ఏమి చెప్పినా, ఆయన మద్దతుదారులు మాత్రం నిరాశ చెందారని చెప్పకతప్పదు. పవన్‌ కళ్యాణ్‌ జనవరి ఇరవై ఆరున ఏదో  చేసి మొత్తం షో అంతా తనవైపునకు తిప్పుకుంటారని అనుకుంటే, అదంతా జగన్‌ క్రెడిట్‌ లోకి వెళ్లిపోయిందని, తాము యధా ప్రకారం క్వొచ్చిన్‌ మార్క్‌  ఫేస్‌ తో మిగిలిపోవలసి వచ్చిందని వారు వాపోతున్నారు.

కాగా పవన్‌ కళ్యాణ్‌ మరో సందఠంలో తాము వైసిపితో సహా ఏ పార్టీతో అయినా కలిసి ప్రత్యేక హోదాపై ఉద్యమానికి సిద్దం అని ప్రకటించడం మాత్రం కొంతలో కొంత బెటర్‌ .ఎందుకంటే విపక్ష నేత జగన్‌ ను విశాఖ విమానాశ్రయంలో ఎపి ప్రభుత్వం అప్రజాస్వామికంగా నిలిపివేసిన తీరు విమర్శలకు గురైంది.ఆ విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ మాట మాత్రం ఖండించకపోవడం పై ఆక్షేపణ వచ్చింది. ఏది ఏమైనా ప్రత్యేక హోదా ఉద్యమంలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నా, పాల్గొనలేకపోయినా, ఫర్వాలేదు కాని, ఓటుకు నోటు కేసు వంటి వాటిని సమర్ధించి పరువు తీసుకోవడం ఆయనకు అప్రతిష్టే తెచ్చిపెట్టింది. పవన్‌ కళ్యాణ్‌ మొత్తం మీద ఊగిసలాట రాజకీయం నుంచి బయటపడడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.

కొమ్మినేని శ్రీనివాస్ రావు , సీనియర్ జర్నలిస్ట్