జెడి (యస్) లాలూ యాదవ్‌కి శిక్ష పడి జైలుకి వెళ్లారని అందరికీ తెలుసు. అంటే సప్లయిర్ల నుండి డబ్బు తీసుకుని జేబులో పెట్టుకుంటూ పట్టుబడ్డాడా? లేదు కదా! సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడన్స్ (పరిస్థితులే సాక్ష్యంగా నిలిచిన సందర్భం) యిక్కడ పని చేసింది. క్లుప్తంగా పరామర్శిస్తే – లేని పశువులను చూపించి వాటి మేతకు, మందులకు ఖర్చయిందంటూ పదేళ్లపాటు పశుసంవర్ధక శాఖ అధికారులు 950 కోట్ల రూ.లు మేసేశారని అభియోగం. లాలూ 1990లో ముఖ్యమంత్రి అయ్యారు. 1996లో సిబిఐ 53 దాణా కుంభకోణం కేసులు పెట్టింది. వాటిలో 44 కేసులు ముగిసాయి. నిందలు పడినవారిలో చాలామంది శిక్ష అనుభవించారు. తక్కిన 9 కేసుల్లో 5 కేసుల్లో లాలూ నిందితుడు. అక్టోబరులో తీర్పు వచ్చింది – 37.7 కోట్ల రూ.ల కేసు గురించి! ఆ కేసులో నిందితులు 56 మంది. కేసు నడుస్తూండగా 7గురు చనిపోయారు. ఇద్దరు అప్రూవర్లుగా మారారు. ఒకతను నేరాన్ని అంగీకరించేశాడు. ఒకతన్ని నిర్దోషిగా వదిలేశారు. మిగిలిన 45 మందిలో ఐయేయస్‌లు, శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయనాయకులు వున్నారు. రాజకీయనాయకుల్లో – లాలూ, కాంగ్రెసుకు చెందిన మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా, ప్రస్తుతం జెడి(యు)లో వున్న ఎంపీ జగదీశ్ శర్మ, జెడ్ (ఎస్)కు చెందిన మాజీ శాసనసభ్యుడు ఆర్ కె రాణా వున్నారు. లాలూకు, రాణాకు ఐదేళ్ల కఠినశిక్ష, మిశ్రా, శర్మలకు నాలుగేళ్ల శిక్ష పడ్డాయి. పశుసంవర్ధక శాఖకు ప్రాంతీయ డైరక్టరుగా వున్న ఎస్.బి.సిన్హా కుంభకోణానికి సూత్రధారి అని కోర్టు నిర్ధారించింది. కానీ యిప్పటికే చనిపోయాడు కాబట్టి శిక్ష వేయలేకపోయింది.
తీర్పు చెపుతూ న్యాయమూర్తి అన్నమాటలను గమనించాలి – ''రాజకీయనాయకుల, ఉన్నతాధికారుల ప్రమేయం గురించి సూటిగా సాక్ష్యం దొరకదు కాబట్టి యిలాటి కేసుల్లో పరిస్థితులనే సాక్ష్యంగా తీసుకోవాలి. సంఘటనల వరుసను గమనించి, వాటి వెనుక కుట్ర వుందేమో కనిపెట్టాలి.'' పశువుల మేత విషయంలో బజెట్ కేటాయింపులకు, అవసరాలకు మించి పది రెట్లు కొంటూ వుంటే వీరు కళ్లు మూసుకున్నారని నమ్మగలమా? కొన్ని సందర్భాల్లో అది 270 రెట్లు కూడా వుంది. ఈ నేరంలో పాలుపంచుకున్న ఉన్నతోద్యోగుల సర్వీసును పొడిగించవలసిన అవసరం ఏముంది? ఎక్కౌంట్స్ జనరల్ యీ విషయంగా అడిగిన ప్రశ్నలకు వీరెందుకు సమాధానాలు పంపలేదు? ఫైనాన్సు శాఖ లాలూ క్రిందనే వుంది. ఆయనకు తెలియకుండా యింత డబ్బు దుర్వినియోగం అవుతుందా? పైగా అవినీతి మచ్చ అంటిన ఆ శాఖ వుద్యోగులు వేరే ఊళ్లలో చదువుతున్న లాలూ పిల్లలకు లోకల్ గార్డియన్లగా వ్యవహరించారని కూడా కోర్టు గమనించింది. (లోకేశ్‌కు సత్యం రామలింగరాజుకు యిలాటి లింకు వుందా?) ఇవే కాకుండా అప్రూవర్‌గా మారిన దీపేశ్ చండక్ అనే సప్లయిర్ యిచ్చిన స్టేటుమెంటు లాలూకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యంగా మారింది. ''కుంభకోణంలో సూత్రధారి అయిన సిన్హా లాలూకి బాగా క్లోజ్. లాలూ ముఖ్యమంత్రి కావడానికి ముందు నుండీ అతనికి లాలూ అనుచరుడు ఆర్.కె. రాణా ద్వారా డబ్బు పంపుతూ వుండేవాడు. 1989లో ముఖ్యమంత్రి ఎన్నికకు ముందురోజు లాలూ తన వద్దకు వస్తే ఎమ్మెల్యేలను కొనడానికి అతను రూ.5 లక్షలు యిచ్చాడు. అప్పుడు లాలూ గెలవలేదు. 1992లో రాణా ద్వారానే కోటి రూ.లు పంపాడు.'' అని అతను చెప్పాడు.
అధికారులు చెప్పడం చేత తాము ఫైళ్ల మీద సంతకాలు పెట్టామని, తమకు తెలియకుండా తమ వీపు వెనక్కాల ముఖ్యమంత్రి డీల్ కుదుర్చుకుంటే తామేం చేయగలమనీ కొందరు మంత్రులు వాదించడం గమనిస్తున్నాం. అలాటి సందర్భాల్లో లాలూ కేసు మార్గనిర్దేశనం చేయవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్