పవన్ కల్యాణ్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అయితే ఈసారి సినిమా వల్లో, రికార్డుల కలెక్షన్ల వల్లో కాదు. రాజకీయాల వల్ల!పవన్ రాజకీయ తెరంగేట్రం గురించి కొంతకాలం నుంచి రసరవత్తరమైన చర్చ నడుస్తోంది. దానికి పవన్ మాట తీరు మరింత బలాన్నిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో `మీ రాజకీయ పునః ప్రవేశం ఎప్పుడు?` అని అడిగితే `నేను రాజకీయాలకు దూరమైతే కాదా..? మళ్లీ రావడానికి` అన్నాడు. దీని వెనుక అర్థం ఎవరైనా ఇట్టే గ్రహించొచ్చు.
ఎప్పుడైనా ఇక్కడ జెండా పాతేస్తానననే. పవన్ ఎప్పుడైనా సరే, ఏ పార్టీకైనా సరే – ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ఇవ్వడానికి పవన్ రెడీగానే ఉన్నాడన్నమాట. నేను బరిలోనే ఉన్నా – అంటూ తన సన్నిహితులకు, అభిమానులకు సంకేతాలు ఇచ్చినట్టైంది. ఈ స్టేట్ మెంట్ పవన్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. అత్తారింటికి దారేది థ్యాంక్యూ సభలో పవన్ మాటతీరు… ఇప్పటి స్టేట్ మెంట్ కి లింక్ చేసి మాట్లాడుకొంటున్నారంతా. `చిన్న చిన్న విషయాలకు స్పందించాలా?? నేను స్పందించడానికి పెద్ద పెద్ద విషయాలున్నాయి. మనం మళ్లీ ఇలానే కలుస్తుంటాం` అని పవన్ అభిమానులకు ఉద్దేశించి అన్నాడు.
అది కూడా రాజకీయాల గురించే అని అప్పట్లో అభిమానులు చర్చించుకొన్నారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. `నేను రాజకీయాలకు దూరం కాలేదు` అన్నాడంటే దాని అర్థం… నా తలుపులు తెరిచే ఉన్నాయనే కదా..?? 2014 అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ ప్రకటన ఆసక్తిని కలిగించేదే. ఏదేమైనా పవన్ రాజకీయాల్లోకి రావాలి, వస్తాడు – అనుకొన్నవారందరికీ ఇది స్వీట్ న్యూసే!