మనం మర్చిపోయినా, ‘గూగుల్’ మర్చిపోలేదు. మన దేశానికి చెందిన శకుంతలాదేవి హ్యూమన్ కంప్యూటర్‌గా ప్రపంచ ఖ్యాతి గడిరచారన్న విషయం ఇప్పటి తరంలో చాలామందికి తెలియనే తెలియదంటే అది అతిశయోక్తి కాదేమో.
‘శకుంతలా దేవి ఎవరు.?’ అని చదువుకున్నోళ్ళు, పైగా మ్యాథమేటిక్స్ కీలక సబ్జెక్ట్‌గా చదువులు వెలుగబెడ్తున్న ఉన్నత విద్యాధికులు సైతం ప్రశ్నిస్తున్న రోజులివి. అలాంటివారికి జ్ఞానోదయం కల్గించడానికన్నట్టు.. గూగుల్, శకుంతలాదేవిని గుర్తు చేస్తూ.. ‘సెర్చ్’ వెబ్‌సైట్‌లో శకుంతలాదేవి లింక్‌ని ప్రముఖంగా పొందుపర్చింది.
కాలుక్యులేటర్‌లో డిజిటల్ నెంబర్స్ తరహాలో ‘గూగుల్’ అక్షరాల్ని పొందుపర్చడం మరో విశేషం. దేశం గర్వించదగ్గ మహనీయుల్లో శకుంతలాదేవి ఒకరు.
1929 నవంబర్ 4న జన్మించిన శకుంతలాదేవి, 2013 ఏప్రిల్ 21న తుది శ్వాస విడిచారు. శకుంతలాదేవిని ఇప్పటితరమైనా.. రాబోయే తరమైనా ఖచ్చితంగా స్మరించుకోవాల్సిందే.
పదమూడు అంకెలున్న రెండు సంఖ్యల్ని ఒకదానితో ఒకటి గుణించగా వచ్చే ఫలితాన్ని కేవలం 28 సెకెన్లలో చెప్పిన ఘనత శకుంతలాదేవిది. ఆమె పేరుతో చాలా పుస్తకాలే మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. శకుంతలాదేవి, శ్రీనివాసరామానుజం వంటివారు మన దేశంలో మేధావులకు కొదవలేదని నిరూపించిన మహనీయులు.
ప్రభుత్వాలు సైతం మన దేశానికి చెందిన మేధావుల గురించి యువతరానికి తెలిసేలా చేయడంలో విఫలమవుతుండడం బాధాకరం.