హీరో రామ్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ

స్టార్‌ కిడ్‌ కాకపోయినా ‘దేవదాసు’గా తొలి సినిమాతోనే ఫ్యూచర్‌ స్టార్‌ అనే నమ్మకం కలిగించాడు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా హీరోగా తన స్థాయిని పెంచుకుని, ఇప్పుడున్న యువ హీరోల్లో ఒక బ్యాంకబుల్‌ స్టార్‌…

స్టార్‌ కిడ్‌ కాకపోయినా ‘దేవదాసు’గా తొలి సినిమాతోనే ఫ్యూచర్‌ స్టార్‌ అనే నమ్మకం కలిగించాడు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా హీరోగా తన స్థాయిని పెంచుకుని, ఇప్పుడున్న యువ హీరోల్లో ఒక బ్యాంకబుల్‌ స్టార్‌ అనిపించుకునే పొజిషన్‌కి చేరుకున్నాడు. ‘దేవదాసు’, ‘రెడీ’, ‘కందిరీగ’లాంటి హిట్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల్లోను అభిమానుల్ని సంపాదించుకున్న రామ్‌ నవంబర్‌ 14న వెంకటేష్‌తో కలిసి మనకి ‘మసాలా’ రుచులు చూపించడానికి వస్తున్నాడు. విజయభాస్కర్‌ డైరెక్షన్‌లో రూపొందిన ‘బోల్‌బచ్చన్‌’ రీమేక్‌ అయిన ‘మసాలా’ గురించి, తన కెరీర్‌కి సంబంధించిన ఇతర విశేషాల గురించి రామ్‌ ‘గ్రేట్‌ఆంధ్ర’తో ఏం చెప్పాడో చూడండి…

‘మసాలా’ మీ ఫస్ట్‌ మల్టీస్టారర్‌ ఫిల్మ్‌. వెంకటేష్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది?

వెరీ గుడ్‌ ఫీలింగ్‌ అండీ. మల్టీస్టారర్‌ అనగానే కొన్ని కన్‌సర్న్స్‌ ఉంటాయి. కానీ వెంకటేష్‌గారితో చేస్తున్నా కాబట్టి ఎలాంటి టెన్షన్స్‌ లేవు. ఆయన అంతకుముందే పెదనాన్నగారి బ్యానర్‌లో రెండు సినిమాలు చేశారు కాబట్టి ఆ ర్యాపో కూడా హెల్ప్‌ అయింది. ఒక డైరెక్టర్‌ వచ్చి ఇద్దరు హీరోల్ని కంబైన్‌ చేసేలా కాకుండా, వెంకటేష్‌గారు ‘బోల్‌బచ్చన్‌’ చూసి, నాకు ఫోన్‌ చేసి ‘ఇది మనం చేస్తే బాగుంటుంది’ అన్నారు. ఆ ఇనీషియేటివ్‌ ఆయన తీసుకోవడం కూడా చాలా బాగా అనిపించింది. 

వెంకటేషే ‘బోల్‌ బచ్చన్‌’ చేద్దామని అన్నారా?

అవును. నేను అప్పటికి బోల్‌బచ్చన్‌ చూడలేదు. వెంకటేష్‌గారు పెదనాన్నకి కాల్‌ చేసి ‘బోల్‌బచ్చన్‌’ చూడమని చెప్పారంట. ‘నేను, రామ్‌ చేస్తే బాగుంటుంది’ అని సజెస్ట్‌ చేశారంట. ఈ విషయం పెదనాన్నగారు నాకు చెప్పిన తర్వాత ‘బోల్‌బచ్చన్‌’ చూసాను. ఆ సెకండ్‌ క్యారెక్టర్‌ చూసి చేయొచ్చా, లేదా అని కొంచెం డౌట్‌ పడ్డాను (నవ్వుతూ). టూ డేస్‌ ఆలోచించుకుని.. ఓకే చేద్దాం అని డిసైడ్‌ అయ్యాను. అలా ‘మసాలా’ మొదలైంది. 

ఆడ లక్షణాలున్న ఆ పాత్ర చేయడం రిస్క్‌ అనిపించలేదా?

మల్టీస్టారర్‌ అన్నప్పుడు కూడా ఎక్కువ ఆలోచించలేదు కానీ, సినిమా చూశాక… నేను చేయాల్సిన ఆ సెకండ్‌ క్యారెక్టర్‌ ఏంటో తెలిసాక మాత్రం చాలా ఆలోచించాను. మన తెలుగు ఆడియన్స్‌ దానిని ఎలా రిసీవ్‌ చేసుకుంటారనే డౌట్‌ వచ్చింది. బాలీవుడ్‌లో ఏంటంటే ఎంత పెద్ద సూపర్‌స్టార్స్‌ అయినా కానీ కామెడీ కోసం బఫూనరీ ఎక్కువ చేస్తారు. కానీ మన ఆడియన్స్‌ హీరోని చాలా హై లెవల్‌లో చూస్తారు. హీరో అనేవాడు వాళ్ల హార్ట్‌కి బాగా క్లోజ్‌గా ఉంటాడు. కాబట్టి హీరో ఒక బఫూన్‌లా చేస్తే మనవాళ్లకి నచ్చదు. అందుకే ఆ సెకండ్‌ క్యారెక్టర్‌ విషయంలో మరీ ఎక్కువ చేయకుండా స్లైట్‌ బ్యాలెన్స్‌ మెయింటైన్‌ చేశాం. మరీ అభిషేక్‌బచ్చన్‌ చేసిన రేంజ్‌కి వెళ్లకుండా కొంచెం టోన్‌ డౌన్‌ చేసి, ఎక్కువ కామెడీ కోసం ట్రై చేశాం. 

ఆ క్యారెక్టర్‌ చేయడం కోసం, ఆ బాడీ లాంగ్వేజ్‌ కోసం ఏమైనా హోం వర్క్‌ చేసారా?

హోమ్‌ వర్క్‌ అంటూ స్పెషల్‌గా ఏమీ చేయలేదండీ. ఇంటర్వెల్‌ సీన్‌ దగ్గర ఆ క్యారెక్టర్‌ చేసే ఒక డాన్స్‌ సీక్వెన్స్‌ ఉంటుంది. శివశంకర్‌ మాస్టర్‌గారు కొరియోగ్రాఫ్‌ చేశారు. ‘మాస్టర్‌.. మీరు చేయండి. నేను యాజిటీజ్‌గా ఫాలో అయిపోతాను’ అని చెప్పి అది చేసేశాను. ముందే ఆ సీన్‌ చేయడం వల్ల తర్వాత మిగతా సీన్స్‌ చేయడానికి పెద్దగా కష్టపడలేదు. 

మిమ్మల్ని మాస్‌ ఆడియన్స్‌ కూడా ఇష్టపడతారు. వాళ్లకి హీరో ఇలాంటి వేషాలు వేస్తే అస్సలు నచ్చదు కదా. జనరల్‌గా ఇలా డౌట్‌ అనిపించిన క్యారెక్టర్స్‌ చేయకుండా తప్పించుకోవాలనే చూస్తారెవరైనా? మీరెందుకు రిస్క్‌ తీసుకున్నారు?

ఇందాక చెప్పాను కదా… టూ డేస్‌ ఆలోచించానని. ఎక్కువగా ఆలోచించింది ఈ విషయం మీదే. రిసీవ్‌ చేసుకుంటే ఓకే, రిసీవ్‌ చేసుకోకపోతే ఏంటి… అని బాగా ఆలోచించాను. ఎప్పుడూ ఒకేలాంటి క్యారెక్టర్స్‌ చేయడానికి నేను ఇష్టపడను. ఒక్కోసారి ఇలాంటివి కూడా ట్రై చేయాలి. నాకు తెలిసి ఇలాంటి క్యారెక్టర్‌ ఇంతవరకు తెలుగులో ఏ ‘హీరో’ చెయ్యలేదు. ఒక్కోసారి మనల్ని మనమే పుష్‌ చేసుకుని, ఎవరూ చేయనిది ట్రై చేయాలి. అలా నన్ను నేను కన్విన్స్‌ చేసుకుని, ఇది కూడా ఒక ఛాలెంజ్‌ అనుకుని ఓకే చేసాను. ఆ క్యారెక్టర్‌ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించేది. కానీ స్పాట్‌లో అందరూ ఎంజాయ్‌ చేస్తుంటే, కామెడీ బాగా వర్కవుట్‌ అవుతోందని చెప్తుంటే కాన్ఫిడెన్స్‌ పెరిగి చేసేశాను. ఆ క్యారెక్టర్‌ని మాస్‌ కూడా బాగా రిసీవ్‌ చేసుకుంటారని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాను. 

బోల్‌ బచ్చన్‌ హిందీలో 100 కోట్లు కలెక్ట్‌ చేసింది. తెలుగులో ఏ రేంజ్‌ హిట్‌ అవుతుందని అనుకుంటున్నారు?

ఏం రేంజ్‌ హిట్‌ అవుతుందనేది ఎవరూ చెప్పలేరండీ. రేంజ్‌ అనేది అప్పుడున్న సిట్యువేషన్స్‌పై డిపెండ్‌ అయి ఉంటుంది. నేను అనుకోవడం ఏమిటంటే… మసాలా ఒక మినిమం గ్యారెంటీ ఫిల్మ్‌. స్టార్ట్‌ టు ఫినిష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే ట్రై చేసాం. సినిమా చూస్తున్నంతసేపు ఎంజాయ్‌ చేస్తారు. నవ్వించడం కోసం కొన్నిసార్లు లాజిక్స్‌ గురించి కూడా ఆలోచించకుండా చేసేశాం. ఇదేదో కల్ట్‌ ఫిల్మ్‌ అనను కానీ కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. 

కమర్షియల్‌గా హిట్‌ అయినా కానీ క్రిటిక్స్‌ మాత్రం ‘బోల్‌బచ్చన్‌’ని విమర్శించారు…

రోహిత్‌ శెట్టి సినిమాలంతే. క్రిటిక్స్‌ తిడుతూ ఉంటారు. కానీ అవి మాత్రం హండ్రెడ్‌ క్రోర్స్‌ పైగా కలెక్ట్‌ చేసేస్తుంటాయి. 

మరి మసాలాకి క్రిటిక్స్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందని అనుకుంటున్నారు?

సీ.. ఇదొక కామెడీ ఎంటర్‌టైనర్‌. రెండు గంటలు కూర్చోపెట్టి ఏదో కథ చెప్పేద్దాం, మెసేజ్‌ ఇచ్చేద్దాం, కన్నీళ్లు పెట్టించేద్దాం అని ట్రై చెయ్యలేదు. ఓన్లీ మోటివ్‌ ఈజ్‌… ఎంటర్‌టైన్‌ చేయడం. కాబట్టి ఆ దృష్టితో సినిమా చూస్తే ఎవరికైనా నచ్చుతుంది. నవ్వించాలని ఒక సినిమా చేశారు… దాంట్లో ఎంతవరకు సక్సెస్‌ అయ్యారు, ఎంతవరకు అఛీవ్‌ చేశారనేది చూస్తే.. సినిమా జోనర్‌ ఏంటీ, ఆ జోనర్‌కి తగ్గట్టుగా ఉందా లేదా అని చూసి స్టార్స్‌ ఇస్తే ‘మసాలా’కి మంచి రేటింగ్స్‌ వస్తాయని అనుకుంటున్నాను. క్రిటిక్స్‌ ఏ యాంగిల్‌లో చూస్తారు, ఎలా రేట్‌ చేస్తారు అనేది ప్రిడిక్ట్‌ చేయలేను కానీ ఆడియన్స్‌ అయితే మొదట్నుంచీ చివరి వరకు ఎంజాయ్‌ చేస్తారని చెప్పగలను. 

ఇద్దరి హీరోల సినిమా కాబట్టి ఇద్దరి ఫాన్స్‌ శాటిస్‌ఫై అయ్యేలా సీన్స్‌ పంచడం, ఒరిజినల్‌ వెర్షన్‌కి ఛేంజెస్‌ చేయడం చేశారా లేక కథకి అనుగుణంగానే వెళ్లారా?

పర్టిక్యులర్‌గా సీన్స్‌ డివైడ్‌ చేసి ఇద్దరికీ సమానంగా షేర్‌ చెయ్యాలని కొలతలు పెట్టుకుని ఈ సినిమా చెయ్యలేదండీ. కానీ ఇద్దరి క్యారెక్టర్స్‌ బ్యాలెన్స్‌ చేయడానికి మాత్రం భాస్కర్‌ అంకుల్‌ (విజయభాస్కర్‌) ఎక్కువ ఎఫర్ట్స్‌ పెట్టారు.

అంజలి మీకు అక్కగా నటించిందా లేక చెల్లిగానా?

అక్క. ‘బోల్‌బచ్చన్‌’లో అభిషేక్‌కి అసిన్‌ చెల్లిగా నటించింది. కానీ ఇందులో అంజలి నాకు అక్క క్యారెక్టర్‌ చేసింది. 

స్టార్‌ కాస్ట్‌ కాకుండా ‘మసాలా’కి సంబంధించి మీరు అనుకుంటున్న హైలైట్స్‌ ఏమిటి?

చాలా ఉన్నాయి. భాస్కర్‌ అంకుల్‌ డైరెక్షన్‌ పెద్ద ప్లస్‌ పాయింట్‌. కామెడీ సినిమాలు చూడ్డానికి చాలా సింపుల్‌గా అనిపిస్తాయి కానీ తీయడం చాలా కష్టం. ఖచ్చితంగా నవ్వించేలా తీయాలంటే బాగా ఆలోచించాలి,  ఎంతో కష్టపడాలి. ఆయన ఈ సినిమాకి గ్రేట్‌ ఎస్సెట్‌. అలాగే అనిల్‌ రావిపూడి డైలాగ్స్‌ చాలా బాగుంటాయి. ‘కందిరీగ’కి తనే డైలాగ్స్‌ రాసాడు. తన పేరు నేనే సజెస్ట్‌ చేశాను. చాలా మంచి డైలాగ్స్‌ రాసాడు. ట్రెయిలర్‌ చూసిన వాళ్లంతా డైలాగ్స్‌ ఎవరు రాసారని అడుగుతున్నారు. తమన్‌ మ్యూజిక్‌ చాలా బాగుంది. ఈ సినిమా చేద్దామనుకున్నప్పుడే చాలా గ్రాండ్‌గా ఉండాలని, వైబ్రెంట్‌గా ఉండాలని అనుకున్నాం. సో… అలాంటి సినిమాకి తమన్‌ ఈజ్‌ ది బెస్ట్‌ ఛాయిస్‌. సాంగ్స్‌, బిజిఎం అన్నీ వైబ్రెంట్‌గా ఉంటాయి. మొత్తం అందరు టెక్నీషియన్స్‌ చాలా మంచి అవుట్‌పుట్‌ ఇచ్చారు. మసాలా ఈజ్‌ ఏ టీమ్‌ ఎఫర్ట్‌. 

 రామ్‌ ఫాన్స్‌ అంటే మంచి డాన్స్‌ మూవ్‌మెంట్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. మసాలాలో మీ డాన్సులతో వాళ్లు శాటిస్‌ఫై అవుతారా?

‘మీనాక్షి మీనాక్షి’ సాంగ్‌లో కొత్తగా ట్రై చేశాం. వాళ్లు శాటిస్‌ఫై అయ్యారా లేదా అనేది చూసాకే తెలుస్తుంది. లాకింగ్‌ అండ్‌ పాపింగ్‌… అని కొత్త డాన్స్‌ టెక్నిక్‌ ఇప్పుడే ఇంటర్నేషనల్‌గా పాపులర్‌ అవుతోంది. ఇంతవరకు తెలుగులో ఎవరూ ట్రై చేయలేదు. ఈ సినిమాలో దాని బేసిక్స్‌ వరకు పెట్టడం జరిగింది. ఫాన్స్‌కి నచ్చుతుందనే ఆశిస్తున్నాను. 

డాన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారా? రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేస్తుంటారా?

అస్సలు చేయనండీ. సాంగ్‌ షూటింగ్‌ ఉంటే తప్ప డాన్స్‌ చేయను. అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాను… మరీ సంవత్సరానికి ఒకటే సినిమా చేస్తున్నాను. కాస్త డాన్స్‌ ఎక్కువ చేయాలని. అందుకే డాన్స్‌ మాస్టర్స్‌తో ‘కష్టమైన డాన్స్‌ మూవ్‌మెంట్స్‌ కంపోజ్‌ చేయండి మాస్టర్‌’ అని అడుగుతూ ఉంటాను. ఈజీ స్టెప్స్‌ అయితే చేయలేను. కష్టంగా ఉన్నాయనిపిస్తే ఈజీగా చేయగలుగుతాను (నవ్వుతూ). 

‘రెడీ’ తర్వాత మీకు కొన్ని ఫెయిల్యూర్స్‌, యావరేజ్‌ మూవీస్‌ వచ్చాయి. మళ్లీ కందిరీగ తర్వాత రెండు ఫ్లాప్స్‌ వచ్చాయి. హిట్‌ గ్రాఫ్‌ అనేది మెయింటైన్‌ కావడం లేదని మీరెప్పుడైనా ఫీలయ్యారా?

నాకెప్పుడూ కొంచెం డిఫరెంట్‌గా చేయాలని ఉంటుంది. అందుకే ఒక హిట్‌ రాగానే తర్వాత ఏదైనా డిఫరెంట్‌గా చేద్దాం, చిన్న ఎక్స్‌పెరిమెంట్‌ చేద్దాం అని అనుకుంటాను. అలాంటివే చెయ్యాలని ట్రై చేస్తాను. ఒక హిట్‌ వచ్చిన తర్వాత మళ్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై బేస్‌ అయిన సినిమా చేస్తే సక్సెస్‌ రావడం ఈజీనే. రెడీ, కందిరీగ, మసాలా… ఇవన్నీ మినిమం గ్యారెంటీ ఫిలింస్‌. మన టైమ్‌ బాగోకపోతే తప్ప ఇలాంటి సినిమాలు ఆడకుండా ఉండవు. సక్సెస్‌కి గ్యారెంటీ ఎక్కువ కదా అని అన్నీ ఇలాంటి సినిమాలే చేస్తూ ఉండలేం. నా వరకు అయితే నేను అలా ఆలోచించలేను. అందుకే నన్ను మీట్‌ అయిన డైరెక్టర్స్‌తో కూడా ఏదైనా కొత్తగా చేద్దామని అంటాను. చాలా మంది డైరెక్టర్లకి కూడా నాతో సినిమా అనగానే ఎక్స్‌పెరిమెంట్‌ చేద్దామని అనిపిస్తుంటుందేమో (నవ్వుతూ). కరుణాకరన్‌తో సినిమా అనగానే స్వీట్‌ లవ్‌స్టోరీ చేస్తారని ఎక్స్‌పెక్ట్‌ చేశాను. కానీ ఆయన డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చెప్పి, ఇదైతే బాగుంటుందని నన్ను కన్విన్స్‌ చేశారు. అలాగే భాస్కర్‌ డైరెక్షన్‌ అంటే ఎవరైనా క్లాస్‌ సినిమా అనుకుంటారు. కానీ ఆయన నాకు మాస్‌ కథ చెప్పారు. చాలామంది నేను భాస్కర్‌తో మాస్‌ సినిమా చేయించానని అనుకుంటారు. కానీ ఆయన నాకు చెప్పిన కథే అది. ఆయన కథ చెప్పిన తర్వాత ఓకే చేయడానికి నెల రోజులు ఆలోచించాను. బేసిక్‌గా డైరెక్టర్స్‌ నాతో ఎక్స్‌పెరిమెంట్‌ చేద్దామనుకుంటున్నారు. నేను కూడా ఒక హిట్‌ రాగానే నాపై ప్రెజర్‌ తగ్గడం వల్లో, లేక కొత్తగా చేద్దామని నాలో ఉండే ఆ కోరిక వల్లో కొన్ని ట్రై చేసి ఫెయిలయ్యాను. అందుకే నా కెరీర్‌ గ్రాఫ్‌లో కన్సిస్టెన్సీ అంటూ ఉండదు. స్టాక్‌ మార్కెట్‌లాగా అప్‌ అండ్‌ డౌన్‌ వెళ్తూ ఉంటుంది (నవ్వుతూ). 

మీకు ఎంటర్‌టైనర్స్‌తో హిట్స్‌ వచ్చాయి. ఎక్స్‌పెరిమెంట్స్‌ చేసినప్పుడల్లా ఫ్లాప్స్‌ వచ్చాయి. ‘మసాలా’ మీరు అనుకుంటున్నట్టుగా హిట్‌ అయితే మళ్లీ ఎక్స్‌పెరిమెంట్‌ చేస్తారా? లేక కొన్నాళ్లు కన్సిస్టెన్సీ మెయింటైన్‌ చేద్దామని చూస్తారా?

ఇంతకుముందు బ్యాడ్‌ రిజల్ట్స్‌ వచ్చాయి కదా అని కొత్తగా చేయడం మానేయడం కానీ, ఎక్స్‌పెరిమెంట్స్‌ అంటే భయపడ్డం కానీ జరగదు. ఎక్స్‌పెరిమెంట్స్‌ అనేవి క్లిక్‌ అవడం కొంచెం కష్టమే… కానీ అందులోనే కిక్‌ కూడా ఉంది! అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బాగుంది, తప్పకుండా వర్కవుట్‌ అవుతుంది అనిపించే కథలు కూడా అంత త్వరగా దొరకవు. కందిరీగకి ముందు పదిహేను నెలలు నేను ఏ సినిమా చేయలేదు. చాలా కథలు విన్నాను. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌ వదులుకున్నాను. ఫైనల్‌గా ‘కందిరీగ’ చేశాను. 

మీరు చేద్దామనుకున్న సినిమాలు చాలా వరకు చేతులు మారాయి. ఊసరవెల్లి, ఎటో వెళ్లిపోయింది మనసు,  రేయ్‌.. 

మీకు మూడే తెలుసు.. నాకు ముప్పయ్‌ తెలుసు (నవ్వేస్తూ). చేద్దామనుకుని కూడా చేయకపోవడానికి చాలా రీజన్స్‌ ఉంటాయండీ. కొన్ని పర్సనల్‌ రీజన్స్‌, చాలా వరకు ప్రొఫెషనల్‌ రీజన్స్‌ ఉంటాయి. డైరెక్టర్‌ అండ్‌ ప్రొడ్యూసర్‌కి కొన్ని ఇష్యూస్‌ ఉండొచ్చు. అప్పుడు నేను ఎవరో ఒకరి సైడ్‌ తీసుకుని ఆ ప్రాజెక్ట్‌ కంటిన్యూ చేస్తే ప్రాబ్లెమ్స్‌ ఇంకా పెరుగుతాయి. అందుకే స్టారింగ్‌ స్టేజ్‌లోనే వద్దు అనుకుని డ్రాప్‌ అయిపోవడం జరుగుతుంది. ఫర్‌ ఎగ్జాంపుల్‌ ఊసరవెల్లి సినిమా తీసుకుంటే… ఆ సినిమా కథా చర్చల మీదే చాలా ఖర్చు పెట్టేశాం. ఏడాదికి పైగా సిట్టింగ్స్‌ జరిగాయి. షూటింగ్‌ మొదలు పెట్టకముందే కోట్లు ఖర్చయిపోయాయి. మూడు కథలు మారాయి. ఊసరవెల్లి మరో వారంలో సెట్స్‌ మీదకి వెళుతుంది అనగా వద్దనుకున్నాను. ఎందుకంటే ఆ కథ నాకు చాలా హై అనిపించింది. యాక్షన్‌ పార్ట్‌ ఎక్కువ ఉన్నా మేనేజ్‌ చేయవచ్చు కానీ అంత ఎమోషనల్‌ కథ నాకు సూట్‌ అవదనిపించింది. ఆ తర్వాత గౌతమ్‌ మీనన్‌గారి సినిమా వదిలేసుకున్నాను. నేను ఒక సినిమా కోసం వన్‌ ఇయర్‌ టైమ్‌ ఇస్తున్నప్పుడు ‘నా లైఫ్‌లో సంవత్సరం టైమ్‌ స్పెండ్‌ చేసే వర్త్‌ ఈ సినిమాలో ఉందా లేదా అని చూసుకుంటాను. అది లేదు అనిపిస్తే, ఎవరి సినిమా అని కూడా చూడను. డెఫినెట్‌గా ఆ సినిమా చేయను’. 

వర్త్‌ లేదు అనిపిస్తే వన్‌ ఇయర్‌ ఏ సినిమాకీ ఇవ్వను అంటున్నారు. మరి మీకు ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త సినిమాల్లో అంత వర్త్‌ ఏం కనిపించింది?

‘ఎందుకంటే ప్రేమంట’ స్క్రిప్ట్‌ నాకు చాలా నచ్చింది. ఆ పాయింట్‌ని యాక్సెప్ట్‌ చేస్తారా లేదా అని డౌట్‌ ఎక్స్‌ప్రెస్‌ చేసాను. అయితే అది ‘జస్ట్‌ లైక్‌ హెవెన్‌’ సినిమా ఇన్‌స్పిరేషన్‌ కాబట్టి, దానిని వరల్డ్‌ వైడ్‌గా యాక్సెప్ట్‌ చేసారు కాబట్టి, మన ఆడియన్స్‌ కూడా ఇష్టపడతారు అనుకుని నమ్మి చేశాం. పాయింట్‌ కొత్తదైనా ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవకుండా చూసుకున్నాం. అందుకే సినిమా విడుదల కాకముందు కూడా దానిపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అనుకున్న రిజల్ట్‌ రాలేదు కానీ రిగ్రెట్స్‌ ఏమీ లేవు. ఒంగోలు గిత్త విషయానికి వస్తే దానికి ముందు అనుకున్నది వేరు. ఎప్పటికప్పుడు మారిపోతూ వచ్చింది. తండ్రీ కొడుకుల మధ్య సాగే కథ అనుకున్నది కాస్తా హీరో, విలన్‌ మధ్య సినిమా అయింది. కొన్ని కొన్ని అలా ట్రాక్‌ మారిపోతూ ఉంటాయి. 

ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాకి కొన్ని రోజులు షూటింగ్‌ చేసిన తర్వాత వదిలేసుకున్నారు. అది వదులుకున్నందుకు ఏమైనా రిగ్రెట్స్‌ ఉన్నాయా?

రిగ్రెట్స్‌ ఉంటాయనుకుంటే ఏదీ వదులుకోను. ఒక్కసారి వదిలేసిన తర్వాత దాని గురించి ఇంక ఆలోచించను. గౌతమ్‌ మీనన్‌ సినిమాలో ఛాన్స్‌ వచ్చినపుడు చాలా ఎక్సయిట్‌ అయ్యాను. అంతకుముందు కూడా ఒక సినిమా చేద్దామని అనుకున్నాం కానీ కుదర్లేదు. ఈసారి అన్నీ కుదిరాయి కానీ ఆ మేకింగ్‌ ప్రాసెస్‌ నాకు నచ్చలేదు. ఆయన సినిమా అంటేనే ఒక మ్యాజిక్‌. నేను ఒకటి ఎక్స్‌పెక్ట్‌ చేస్తే అక్కడ వేరేలా జరిగింది. మూడు భాషల్లో సినిమా తీస్తూ అన్నీ ఒకేసారి చేయడం వల్ల… నెక్స్‌ట్‌, నెక్స్‌ట్‌… అంటూ ఉంటే అది నాకు కరెక్ట్‌ అనిపించలేదు. అందుకే ఫ్రాంక్‌గా నాకు అనిపించింది చెప్పేసి వచ్చేశాను. ఒకసారి వద్దనుకుని వచ్చేసిన తర్వాత మళ్లీ దాని గురించి ఇక ఎప్పుడూ ఆలోచించలేదు, బాధ పడలేదు.

మీరు వదిలేసుకున్న ప్రాజెక్ట్స్‌ ఏమైనా హిట్‌ అయ్యాయా?

నాకు గుర్తున్నంతవరకు అయితే ‘కొత్త బంగారు లోకం’. ఆ కథ నాకు సూట్‌ అవుతుందని నాకు అనిపించలేదు. అందుకే చేయలేదు. 

హిట్‌ అండ్‌ ఫ్లాప్స్‌కి మీ రియాక్షన్‌ ఎలా ఉంటుంది? ఒక ఇంటర్వ్యూలో చెప్పారు… బర్త్‌డేస్‌ కూడా సెలబ్రేట్‌ చేసుకోను కానీ సక్సెస్‌ వచ్చినప్పుడు సెలబ్రేట్‌ చేసుకుంటా అని.

యా. సక్సెస్‌ వచ్చినప్పుడు ఖచ్చితంగా సెలబ్రేట్‌ చేసుకుంటా. అంటే ఏదో పెద్ద పార్టీలు ఇచ్చేసి సెలబ్రేట్‌ చేసుకోవడం కాదు. సెలబ్రేషన్‌ అనేది మనసులో ఉంటుంది. ఆ సంతోషం కొన్నాళ్లు అలా ఫీలవుతాను. ఫ్లాప్‌ వస్తే బాధ పడను అని చెప్పను. ఒక సంవత్సరం కష్టపడి ఒక బిల్డింగ్‌ కడితే… అది అలా ఒక్కసారే పడిపోయిందనుకోండి, బాధగా ఉంటుంది కదా. ఇదీ అంతే. 

కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అని ఫస్ట్‌ షోకే తెలిసిపోతుంది. ఆ సంగతి మీకు కూడా తెలిసినా కానీ ఛానల్స్‌కి వచ్చి ‘బాగుంది. మంచి రెస్పాన్స్‌ ఉంది’ అని ప్రమోట్‌ చేయాల్సి వస్తుంది. ఆ టైమ్‌లో ఎలా ఉంటుంది?

చాలా వియర్డ్‌ సిట్యువేషనండీ అది. ఫస్ట్‌ షోకి కాదు… కొన్ని సినిమాలకి షూటింగ్‌ చేస్తున్నప్పుడే తెలిసిపోతూ ఉంటుంది. ఇది వర్కవుట్‌ కాదు, కష్టం అని. అలాంటి టైమ్‌లో డ్యామేజ్‌ కంట్రోల్‌ స్టార్ట్‌ చేస్తాం. అలాగే మన జడ్జ్‌మెంట్‌ రాంగ్‌ అవ్వాలని కూడా కోరుకుంటాం. ఫస్ట్‌ కాపీ వచ్చిన దగ్గర్నుంచీ రిలీజ్‌ అయ్యే టైమ్‌ వరకు ఉన్న గ్యాప్‌లో సినిమా ఆడుతుందా, లేదా అనే డౌట్‌ ఒకటి బాగా ఉంటుంది. ఆ టైమ్‌లో ప్రమోషన్స్‌ అవీ చేయాలంటే కూడా కష్టంగా ఉంటుంది. ఎక్కువ అబద్ధాలు ఆడలేం (నవ్వుతూ). సినిమా గురించి ఎక్కువ హైప్‌ ఇవ్వలేం. కానీ తప్పదు, ప్రమోట్‌ చేయడం కూడా బాధ్యతే కాబట్టి కొన్ని చేయాల్సి వస్తుంది. కానీ నేను చెప్పేదానిని బట్టి సినిమా బాగుందో లేదో ఈజీగా చెప్పేయవచ్చు. వైవిఎస్‌ చౌదరి గారు అంటారు… ‘నువ్వు స్క్రీన్‌పై బాగా యాక్ట్‌ చేస్తావు కానీ బయట చెయ్యలేవు. యాక్ట్‌ చేస్తే కనుక ఈజీగా కనిపెట్టొచ్చు’ అని. 

ఎస్టాబ్లిష్డ్‌ డైరెక్టర్స్‌తో సినిమాలు వదిలేసుకుని కొత్త డైరెక్టర్‌తో కందిరీగ చేసారు. ఆ టైమ్‌లో రైట్‌ స్టెప్‌ తీసుకున్నానా లేదా అనే డౌట్‌ రాలేదా?

పెద్ద పెద్ద సినిమాలు వదిలేసుకుని కొత్త డైరెక్టర్‌తో చేస్తున్నానంటే ఫ్రెండ్స్‌ దగ్గర్నుంచి, ఆఫీస్‌ స్టాఫ్‌ వరకు అందరూ ‘ఏంటి ఇలా చేస్తున్నాడు’ అనుకున్నారు. కానీ నేను కాన్ఫిడెంట్‌గా ఆ సినిమా చేశాను. సక్సెస్‌ అయ్యాక ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఎందుకంటే రన్నింగ్‌ రేస్‌లో గెలిచానంటే అందరూ కంగ్రాచ్యులేట్‌ చేస్తారు. కానీ ఆ రేస్‌కి పది అడుగులు వెనకనుంచి వెళ్లానా, ఇరవై అడుగుల వెనకనుంచి వెళ్లానా అనేది నాకు తెలుసు. ఆ విధంగా కందిరీగ సక్సెస్‌ నా కాన్ఫిడెన్స్‌ని బాగా పెంచింది.

కందిరీగ సినిమా టైమ్‌లో ప్రొడ్యూసర్‌తో మీకు ఏవో ఇష్యూస్‌ వచ్చినట్టున్నాయి…

చాలా మందికి తెలిసిందే కదండీ. కాంట్రాక్ట్‌ రాసుకున్న ప్రకారం నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కి వెళ్లాను. ప్రాబ్లెమ్‌ సాల్వ్‌ అయింది.

మరి ‘కందిరీగ 2’ అనౌన్స్‌ చేసి కూడా చేయలేదు ఎందుకని?

అది నాకు, ప్రొడ్యూసర్‌కి ఉన్న ప్రాబ్లెమ్‌ వల్ల కాదు. డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి ఉన్న ప్రాబ్లెమ్స్‌ వల్ల ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాను. సినిమా చేస్తే క్రియేటివ్‌ సైడ్‌ ఎక్కువ డిస్కస్‌ చేసుకోవాలి కానీ వేరే ప్రాబ్లెమ్స్‌ గురించి మాట్లాడుకుంటూ సినిమా సైడ్‌లైన్‌ అయిపోకూడదు. 

మీకు సంబంధించినంత వరకు ఇలాంటి కాంట్రవర్సీస్‌ కాకుండా… జనరల్‌గా మీ ఏజ్‌ హీరోస్‌ గురించి వినిపించే రూమర్స్‌ ఏమీ వినిపించవు, హీరోయిన్స్‌తో లింకప్స్‌ లాంటివి. హీరోయిన్స్‌కి దూరంగా ఉంటారా ఏంటి…

హీరోయిన్స్‌కి దూరంగా ఉండడం ఏమీ కాదండీ. నేను అందరితోను ఫ్రెండ్లీగా ఉంటాను. అందరు హీరోయిన్లతో నాకు ఫ్రెండ్లీ రిలేషన్‌ ఉంది. రూమర్స్‌ ఎందుకు రావూ అంటే… ఎంతవరకు ఉండాలో అంతే ఉంటాను కానీ ఎక్కువ రాసుకు పూసుకు తిరగను (నవ్వులు). 

హీరోల్లో ఫ్రెండ్స్‌ ఉన్నారా?

దాదాపుగా అందరితోను మంచి రిలేషన్‌ ఉంది. ఇండస్ట్రీలో క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఎవరూ లేరు కానీ ఫ్రెండ్స్‌ అయితే చాలా మంది ఉన్నారు. 

మొదట్లో మీ నటనలో పవన్‌కళ్యాణ్‌ ఇన్‌ఫ్లుయెన్స్‌ బాగా కనిపించేది. ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది?

అప్పుడు కావాలని ఆయనని ఇమిటేట్‌ చేయలేదు. ఇప్పుడు కావాలని తగ్గించుకోలేదు. ఏ హీరోలో లేని ఈజ్‌ ఆయనలో ఉంటుంది. ఆయనతో పోలిస్తే అది నాకు కాంప్లిమెంట్‌ అనే అనుకున్నాను. ‘నీ బండి రిక్షాలా ఉందంటే ఫీలవ్వాలి కానీ బిఎండబ్ల్యూలా ఉంది’ అంటే గర్వపడాలి కదా (నవ్వుతూ). మొదట్లో నేను ఆయనలా చేస్తున్నానని అనుకున్నా కానీ తర్వాత నా స్టయిల్‌కి అలవాటు పడిన తర్వాత ఇక ఆ కంపేరిజన్స్‌ రావడం లేదు. 

ట్విట్టర్‌లో నెగెటివ్‌ కామెంట్స్‌ని హ్యాండిల్‌ చేయలేక చాలా మంది సెలబ్రిటీస్‌ అకౌంట్స్‌ డిలీట్‌ చేసుకోవడం, లేదా ఇనాక్టివ్‌ అయిపోవడం చేస్తున్నారు. మీరు అలాంటివి ఎలా హ్యాండిల్‌ చేస్తున్నారు?

నెగెటివ్‌ కామెంట్స్‌ రావు అనను కానీ… వాటి పర్సంటేజ్‌ చాలా తక్కువ. కొన్ని కామెంట్స్‌కి తిరిగి రిటార్ట్‌ ఇవ్వాలనిపిస్తుంది కానీ కంట్రోల్‌ చేసుకుంటాను. వందలో వచ్చే రెండు, మూడు అలాంటి కామెంట్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇవ్వను. 

మసాలా రిలీజ్‌కి రెడీ అయింది కానీ మీ నెక్స్‌ట్‌ సినిమా ఏదీ ఇంకా ఓకే అయినట్టు లేదు?

ఇంకా ఏదీ ఓకే చేయలేదు. ఇప్పుడు కొంచెం ప్రాసెస్‌ మార్చాను. కథ ఏదైనా బాగుంది అనిపిస్తే వెంటనే దానిని కొనేస్తున్నాను. రైటర్స్‌ చెప్పిన కథలు కొనేసి, డైరెక్టర్స్‌ కోసం చూస్తున్నాను. ఆ విధంగా నచ్చిన కథల కోసం వెయిట్‌ చేసే టైమ్‌ తగ్గుతుంది. ఒక కథ బాగా ఎక్సయిటింగ్‌గా అనిపిస్తోంది. త్వరలోనే డెసిషన్‌ తీసుకుంటాను. ఈ ఇయర్‌కి ఇక నా సినిమా ఏదీ స్టార్ట్‌ అవదు. జనవరి తర్వాతే ఉంటుంది. ప్రస్తుతానికి ‘మసాలా’ ప్రమోషన్స్‌పై కాన్సన్‌ట్రేట్‌ చేస్తున్నాను… అంటూ ఇంటర్వ్యూ ముగించారు ఎనర్జిటిక్‌ హీరో రామ్‌. 

– గణేష్‌ రావూరి

Feedback at:

[email protected]

twitter.com/ganeshravuri