ముక్కోతి కొమ్మచ్చి
''నరుడా! ఏమి నీ కోరిక?''
''ఎవర్నువ్వు?''
''పాతాళ భైరవిని''
''ఏం చేస్తుంటావు''
''వరాలిస్తుంటాను''
''నాకు వరాలివ్వడం నీతరం కాదు''
''నేను దేవతని''
''నేను దేవాంతకుడిని – అనగా నరమానవుడిని''
''ఫరవాలేదు-అడుగు''
''నాకేమీ వద్దుగాని – లోకం కోసం అడుగుతాను''
''అడుగు''
''శ్కాముల బెడద జోరుగా ఉంది. అంచేత లోకంలో అవినీతిని తీసేయ్''
''అమ్మో – అవినీతి లేకపోతే బతుకే లేదు- న్యూస్‌పేపర్లు, టీవీలు, పార్లమెంటూ, పోలీసిండస్ట్రీ, మినిస్టరిండస్ట్రీ, దేవుళ్ల ఇండస్ట్రీ, అన్నీ దివాలా ఎత్తిపోతాయి. అయినా లోకంలో అవినీతిని తీసెయ్యడంకన్న సముద్రంలో ఉప్పు లాగి పారెయ్యడం సులువు''.
''పోనీ ఆ పనే చెయ్యి- మంచినీళ్లు చాలక జనం కొట్టుకు ఛస్తున్నారు. అంచేత సముద్రంలో ఉప్పు తీసెయ్!''
''అమ్మో ఉప్పు తీసేస్తే టాటాలకు కోపం వస్తుంది. ఈ దేశపు ఉప్పంతా టాటాలదే.''
''పోనీ గోడవున్లలో కుళ్లిపోతున్న తిండి గింజలు తీసి బీదవాళ్లకు పంచు''
''అమ్మో – మన్మోహన్‌గారి క్కోపం వస్తుంది.''
''అయితే'..'
''అయితేగియితేలు, కింతూపరంతూలు వద్దురోయ్… దేస్సేవ వదిలేసి, నీ సొంతానికి పర్సనల్‌గా నీ కోసం వరాలడుగు.''
''సరే- చావులేని బతుకుగాని పుటకలేని చావుగాని ఛాన్సుంటుందా''
''తికమక పెట్టకురా మగడా- సజావయిన వరం అడగరా నరుడా''
''తల్లీ- నాతో నువ్వు వేగలేవు. ఉచ్చులో ఇరుక్కుపోతావు. ఊబిలో దిగడి పోతావు''
''నీకోసం అయితే ఏదన్నా ఇచ్చేస్తాను. నాకా భయం లేదు''
''సరే- నాకు కుడిపాపిడి కావాలి. సింపుల్''
''అదేవిటి- అదేం పిచ్చివరం?''
''పిచ్చోవెర్రో- నేను వయసులో ఉండగా ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆ పిల్లా సరే అనబోయింది. అంతలో కుడిపాపిడి కుర్రాడిని చూసి వాడి మోజులో పడి వాడితో లేచిపోయింది. అప్పణ్ణించి నాకు కుడి పాపిడిమీద మనసైంది''.
''హోరినీ- ఇంతా జేసి ఇదా నీకోరిక. నువ్వడిగే వరం ఇదా. ఈపాటి దానికేనా. నీకు వరాలివ్వడం నాతరం కాదని విర్రవీగావు-సరి-కుడీ ఎడమే కాదు సెంటరు పాపిడికూడా తీసుకో-ఫో''
''దూకుడొద్దు దూకుడొద్దు పాతాళభైరవీ- నాకిప్పుడు ఎనభయ్యేళ్లు – బట్టతల- దీనిమీద పాపిడెలా తియ్యడం?''
''అవును సుమా! సరే- జుట్టిచ్చేస్తాను- పెంచుకో-ఓకే భై భై''
''వోల్డాన్ వోల్డాన్- ముసిలాడు కదాని నెరిసిన జుట్టిచ్చేవు- నల్లటిజుట్టు- నిగనిగలాడిపోవాలి''
''తథాస్తు''
''ముసలి మొహం మీద నల్లటి జుట్టు ఉంటే సినిమా హీరోల్లా విగ్గు పెట్టానంటారు. అంచాత జుట్టుకు తగ్గ నవనవలాడే మొహం కావాలి''
''తథాస్తు''
''ఆ నవనవలాడే మొహంలో బోసిపళ్లు తొస్సిపళ్లు బాగుండవు గదా -అంచేత కోల్గేట్ వారి డెంటిస్టులచే తళతళలాడే పళ్లసెట్టు- అంటే కట్టుడు పళ్లనుకునేవు-పుట్టుడుపళ్ళు!''
''డబుల్ ఓకే''
''చెరుగ్గడ నవిలేంత గట్టిగా-''
''చెరుగ్గడేం ఖర్మ- వెదురుగడ నవిలి పారేసేంత గట్టివిస్తాను''
''పళ్లసెట్టుకు మాచింగ్‌గా కళ్లసెట్టు''
''ఓస్ అంతేనా?''
''అంతేనా అంటే ఎలా? నేను రోబోలో రజనీలా జోరు మీదుంటే. మా ఆవిడ ఆస్టిన్27 డొక్కుకారులా ముసలిదై ఉంటే ఎలా? మాకు అక్రమ సంబంధం అంటగడతారు. నన్ను జిగొలో అంటారు. అంచాత ఆవిడ నాకు మాచింగా త్రిషా నైనతారాలాటి…''
''నైన్‌తారా టెన్తారా ఇలెవన్‌తారా! హమ్మనరుడా! నీకడుపులో ఎంతలేసి ఆశలున్నాయి. వరదగోదారిలా తెళ్లుకు వచ్చే నీ కోరికల్ని తీర్చడం నాతరం కాదు. నన్ను పుట్టించిన జేజెమ్మతరం కాదు.''
''అమ్మా- ఆ మాట నేను ముందే చెప్పానుగా. ఈ నరుడికోరిక తీర్చడం నీతరం కాదని -పొగరుగా వరాలిచ్చావు. 'నేను పాతాళభైరవినీ… ఏమైనా యివ్వగలనూ' అని విర్రవీగావు. ఇప్పుడైనా తెలుసుకో- పట్టెడన్నం పెడితే ఆకలి మంట చల్లారుతుంది. గుక్కెడు నీళ్లిస్తే దాహతీపం చల్లారుతుంది. అంతెందుకు- డబ్బాడు పెట్రోలుపోసి కులమంటల్ని కూడా చల్లార్చవచ్చునేమో గాని ఎన్నివరాలు గుమ్మరించినా గంగని బోర్లించినా కోరికల అగ్నిని చల్లార్చలేవు. కోరికలే నా ఆరోగ్యం. నా సౌభాగ్యం నా సంతోషం. ఇంకా ఏదో చెయ్యాలని ఏదో రాయాలనీ నవ్వాలనీ నవ్వించాలనీ ఆశ పడుతూనే ఉంటాను… బతుకు పాటలు పాడుతూనే ఉంటాను. బాపూ నేనూ మీరూ మనమూ కోతికొమ్మచ్చి ఆడుతూనే ఉంటాము..'' నేను'కో' అన్నప్పుడు మీరు 'ఓ' అందరుగాని…
అంతవరకూ శ్రీశ్రీ అన్నట్టు
హాలిడే!
సెలవోచ్చి''
ఇది చదివి నేను తృప్తి పడలేదు.
''ఇదే పూర్తి చేయకుండా సీక్వెల్ అంటే పాఠకులు నమ్మరండీ, దే ఫీల్ లెట్ డౌన్'' అంటూ మళ్లీ నస మొదలుపెట్టాను. మొదట్లోనే చెప్పానుగా అభిమానపాఠకులకు ఐడాల్స్‌పై కొన్ని హక్కులుంటాయని!
''పోనీ ''నగ్గెట్స్'' (రమణ కోటబుల్ కోట్స్‌తో తయారవుతున్న పుస్తకం, త్వరలో రాబోతోంది) కలిపి వేస్తే…?'' అన్నారాయన.
''రెండిటి కారక్టరూ వేర్వేరు.'' అని మళ్లీ నా అభ్యంతరం.
ఇంతలో ఆయనకు జ్వరం వచ్చింది. తగ్గగానే దీని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ముందురోజు సాయంత్రమే బాపుగారితో మాట్లాడాను. మర్నాడు రమణగారితో మాట్లాడాలి. ఆ రాత్రే ఆయన వెళ్లిపోయారు.
మహా మొండిమనిషి. ఎంత బతిమాలినా దిగి రాలేదు, రాయలేదు. రాస్తే ఒకటోరకంగా రాయాలి, లేకపోతే రాయనే కూడదు – ఆ ఫిలాసఫీకే కట్టుబడ్డారు.
ఇంకేం చేయగలం? ఉన్న మేటర్‌తోనే ''ముక్కోతి కొమ్మచ్చి'' ప్రచురించి 2011లో ఆయన పుట్టినరోజు జూన్ 28కి విడుదల చేశాం.
ఆయన ''కోతికొమ్మచ్చి''లో వదిలేసిన విషయాలతో యీ ''కొసరు కొమ్మచ్చి'' తయారైంది.
రమణగారు నా జీవితంలో ఒక భాగం అయిపోయారు. కష్టమైనా, సుఖమైనా ఆయనతో చెప్పుకోవడం అలవాటై పోయింది. ఆయనకూ నేను బాగా అలవాటై పోయాను. వారానికి కనీసం రెండు, మూడు సార్లు మాట్లాడుకునేవారం. 'ఆయన లేని లోటు తీరనిది' అన్న మాట వ్యక్తిగతంగా నా వరకూ అతిశయోక్తి కాదు.
తెలుగుసాహిత్యం వున్నంతవరకూ రమణ చిరంజీవే ! పూలహారంతో బాటు దారం కూడా శివుడి మెడను అలంకరించినట్లు, రమణగారి పుస్తకాల సంపాదకుడిగా నా పేరు కూడా కొందరి దృష్టి నాకర్షిస్తే ఆ ఘనతకు మూలం వారే !(సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)