ఎమ్బీయస్‌ : విబి రాజేంద్రప్రసాద్‌ – 1

విబి రాజేంద్రప్రసాద్‌గారు వెళ్లిపోయారు. సినీ నిర్మాత-దర్శకుడిగా ఆయన సాధించిన విజయాలు ఒక యెత్తు – ఫిలింనగర్‌లో ఆయన చైర్మన్‌గా ఉండి దగ్గరుంచి కట్టించిన దైవసన్నిధానం అనే టెంపుల్‌ కాంప్లెక్స్‌ యింకో ఎత్తు. అక్కడి గుళ్లన్నీ…

విబి రాజేంద్రప్రసాద్‌గారు వెళ్లిపోయారు. సినీ నిర్మాత-దర్శకుడిగా ఆయన సాధించిన విజయాలు ఒక యెత్తు – ఫిలింనగర్‌లో ఆయన చైర్మన్‌గా ఉండి దగ్గరుంచి కట్టించిన దైవసన్నిధానం అనే టెంపుల్‌ కాంప్లెక్స్‌ యింకో ఎత్తు. అక్కడి గుళ్లన్నీ శుభ్రంగా, ఈస్తటిక్‌గా ఉంటాయి. మేన్‌టెనెన్స్‌ అద్భుతంగా వుంటుంది. రోజూ సాయంత్రం ఆయన అక్కడే వుండేవారు. చూడ్డానికి ఓ స్వామీజీలా కనబడుతూ, సాధారణ వ్యక్తిలా గుడి నిర్వహణ చూసుకుంటూ వుండేవారు. ఆయన్ని చూస్తే! ఒకప్పుడు సినిమాలు తీసిన స్టార్‌ ప్రొడ్యూసర్‌, డైరక్టరు ఈయనేనా? అన్న సందేహం, ఆశ్చర్యం కలిగేవి. మేం ఆ గుడికి వెళుతూ వుంటాం కాబట్టి ఆయన్ని చూస్తూండేవాణ్ని – ఏదైనా సమస్య వస్తే వెళ్లి మాట్లాడేవాణ్ని. ''ఇదీ అసలు కథ'' కార్యక్రమం చేసేటప్పుడు మిత్రులు ఎస్‌.వి.రామారావుగారు ఫోన్‌ చేసి చెపితే ఆయన ఆ యా కార్యక్రమాలు చూసేవారు. నేను మళ్లీసారి గుడికి వెళ్లినపుడు బాగున్నాయని మెచ్చుకునేవారు. 

జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ అంటేనే మంచిపాటలకు చిరునామా. ఆయన సినిమాల్లో పాటలు ఎంత హిట్‌ అంటే ఆ పాటలన్నీ గుదిగుచ్చి 'చిటపట చినుకులు' అనే సినిమా లు తీస్తే అవీ హిట్టే! ఆయన అన్నీ సాంఘికాలే తీశారు. తెలుగులో 26 సినిమాలు, తమిళంలో 3, హిందీలో 3 సినిమాలు తీసిన హైఫై నిర్మాత ఆయన! నిర్మాత మాత్రమే కాదు, దర్శకుడు కూడా. ఆయన దర్శకుడు కావడం విచిత్రంగా జరిగింది. అంటే నిర్మాత కావడం సహజంగా అయిందని కాదు. అసలాయన హీరో అవుదామని ఫిలింఫీల్డుకి వచ్చారు. నిర్మాత అయ్యారు. కానీ ఆయన కల ఆయన కుమారుడి ద్వారా సాకారం అయింది. ప్రముఖ హీరో జగపతిబాబు ఆయన మూడో కుమారుడు. 

రాజేంద్రప్రసాద్‌గారంత పెద్దాయనకు ఇంత స్టయిలిష్‌ నేమ్‌ ఏమిటా అనుకుంటున్నారా? అప్పటి పద్ధతి ప్రకారం సత్యనారాయణ అనో సుబ్బారావు అనో వెంకటేశ్వరరావు అనో పేర్లు పెట్టుకునే పీరియడ్‌లో ఈయనకు రాజేంద్రప్రసాద్‌ అని పేరు పెట్టడానికి ఓ కారణం వుంది. రాజేంద్రప్రసాద్‌ గారి తాతగారు ఓ జమీందారు. జమీందారైనా కాంగ్రెసు పార్టీ అభిమాని. అందుకని మనుమడికి స్వాతంత్య్ర యోధుడు బాబూ రాజేంద్రప్రసాద్‌ పేరు పెట్టించారు. రాజేంద్రప్రసాద్‌ గారి నాన్నగారికి ఆ పేరు యిష్టం లేదు. ఎందుకంటే ఆయన జస్టిస్‌పార్టీ అభిమాని. తండ్రీ, తాతల మధ్య కొన్నాళ్లు వాదోపవాదాలు జరిగి చివరకు పెద్దాయన మాట నెగ్గింది. 

రాజేంద్రప్రసాద్‌ తండ్రిగారి పేరు జగపతిరావు గారు. ఆ పేరే ఈయన తన ఫిలిం నిర్మాణసంస్థకు, తన  కుమారుడికి పెట్టుకున్నారు – పెద్దకుమారుడికి ఈయన తాతగారి పేరు పెట్టుకున్నారు కాబట్టి. తాతగారి పేరు రామస్వామిగారు. ఆయన పేరుమీద పెద్ద కొడుక్కి రామ్‌కుమార్‌ అని పెట్టుకున్నారు. రామ్‌కుమార్‌ గారు ' వాల్డన్‌' అనే పేర హైదరాబాదులో ఓ చక్కటి బుక్‌షాప్‌ నడుపుతున్నారు. 

అప్పట్లో వచ్చిన ఓ చట్టం కారణంగా రాజేంద్రప్రసాద్‌ తాతగారు జమీందారు స్థాయినుండి అప్పర్‌ మిడిల్‌ క్లాసుస్థాయికి మారవలసి వచ్చింది. కానీ రాజేంద్రప్రసాద్‌లో ఆ జమీందారీ ఫాయా, ఆ అరిస్టోక్రాటిక్‌ టింజ్‌ మిగిలిపోయాయి. సినిమా నిర్మాతగా ఆయన దేనికీ రాజీపడలేదు. షూటింగు సమయాల్లో ఆర్టిస్టులను – చిన్నయినా, పెద్దయినా – బాగా చూసుకునే వారని చెప్పుకుంటారు.

అన్నిటికంటె ముఖ్యంగా చెప్పుకోదగినది – స్టాఫ్‌ గురించి ఆయన ఒక సినిమా ప్రత్యేకంగా తీయడం. ఓ 12 విజయవంతమైన సినిమాలు  తీశాక ఆయనకు ఆలోచన వచ్చింది. ఈ సినిమాలు ఇలా తీయగలుగుతున్నానంటే కారణం – కమిటెడ్‌, డివోటెడ్‌ స్టాఫ్‌ నా వెంట ఉండటం బట్టే కదా! వారికి జీతాలు యిచ్చి సరిపెట్టడం న్యాయమేనా? అని. ఓ సినిమా తీసి దానిమీద వచ్చిన లాభాలు వాళ్లకు పంచితే బాగుంటుంది కదా అనుకున్నారు. సొంత కథతో తీస్తే రిస్క్‌ తీసుకున్నట్టవుతుంది అనుకుని 'అన్‌హోనీ' హిందీ సినిమాను 'పిచ్చిమారాజు' పేరుతో తెలుగులో తీసి, అధిక లాభాలకు అమ్మి, ఆ డబ్బును తన కొలీగ్స్‌ అందరికీ – వాళ్ల జీతాన్ని బట్టి పంచారు. అవసరం బట్టే ఒకర్ని ఒకరు పలకరించే  సినీరంగంలో ఈ వ్యవహారం చూసి అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. 'ఆ సినిమా హీరో కాదు, పాపం ఈయనే పిచ్చిమారాజు' అని జాలిపడ్డారు.

నిజానికి పేరు వల్లనే ఏమోగానీ ఆయనది ముందునుండీ రాజాలాగే బతికారు. ముగ్గురు సోదరుల్లో చిన్నపిల్లవాడన్న కారణంగా ముద్దు చేసేవారు. చిన్నప్పటినుండీ ఆస్తమాతో బాధపడుతున్నాడని జాలి కొద్దీ అల్లరి చేసినా, సరిగ్గా చదవకపోయినా కొట్టడం, తిట్టడం ఏమీ వుండేది కాదు. ఈయన కృష్ణాజిల్లాలో పుట్టినా డిగ్రీ చదువుకోసం కాకినాడ వెళ్లారు. 'మధ్యలో కాలేజీలు లేవా?' అని అనకుండా సరేనన్నారు ఇంట్లోవాళ్లు. కాకినాడలో చేరినది పిఠాపురం మహారాజావారి పిఆర్‌ కాలేజీలో! పిఠాపురం మహారాజావారి పిల్లలతో ఫ్రెండ్‌షిప్‌. రాజాగారికి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వాళ్లు హాస్టల్లో వుండి, కాలేజీలో చదువుతూండేవారు. ప్రతి శుక్రవారం ఇంపోర్టెడ్‌ ఎసి కారులో కాకినాడనుండి పిఠాపురం వెళ్లడం, మళ్లీ సోమవారం కాలేజీ తెరిచాక రావడం. వాళ్లతో బాటు రాజేంద్రప్రసాద్‌ కూడా వెళ్తూండేవారు. 

ఇది ఈయనకు గొప్పగానే వుండేది కానీ కాలేజీలో కుర్రాళ్లకు అసూయగా వుండేది – ఎక్కడో వేరే జిల్లానుండి వచ్చి వీడింత వెలిగిపోవడమేమిట్రా అని. ఈయనకి చదువు తక్కువ, షోకులు ఎక్కువ. వాళ్ల తండ్రిగారినుండి వచ్చే డబ్బే కాక సవతి అన్నగారు కూడా డబ్బు ఇచ్చేవారు. ఇక బ్రహ్మాండంగా జల్సా చేసేవారు. మీకు తెలిసే వుంటుంది. 'దసరా బుల్లోడు' కథ, దర్శకత్వం ఈయనవే. గట్టిగా మాట్లాడితే ఈయన్నే దసరా బుల్లోడు అనవచ్చన్నమాట. కాలేజీలో వుండగానే బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి స్టూడెంట్స్‌ ఎలక్షన్లో పాల్గొని ప్రెసిడెంటు అయ్యారు. రాఘవ కళాసమితి అని ప్రారంభించి నాటకాలు వేసేవారు. ఎవరికైనా అన్యాయం జరిగిందని తోస్తే వెళ్లి పోట్లాట వేసుకోవడానికి ఏమాత్రం జంకేవారు కారు. ఈయన సంగతి ముందే తెలిసినట్టుంది, హాస్టల్లో జేరదామని వెళితే వార్డన్‌ ఓ నమస్కారం పెట్టాడు. 'నీలాంటి విద్యార్థికి సీటు యిచ్చి నేను కష్టాల్లో పడలేను. హాస్టల్లో నీకు సీటు లేదు' అని చెప్పాడు.(సశేషం)

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2015)

[email protected]