స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సీబీఐ, ఈడీ సంస్థలతో విచారణ జరిపించేలా ఆదేశించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉండవల్లి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టులో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకుంది. ఈ నేపథ్యంలో పిటిషన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి రఘునందన్‌రావు బెంచ్‌కు వెళ్లింది.
అయితే జస్టిస్ రఘునందన్‌రావు నాట్ బిఫోర్ మి అనడంతో పాటు మరో బెంచ్‌కు మార్చాలని ఆయన రిజిస్ట్రీని కోరారు. దీంతో ఉండవల్లి పిటిషన్‌ను మరో బెంచ్‌కు మార్చాల్సిన పరిస్థితి నెలకుంది. ఇప్పటికే 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఉండవల్లి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఉండవల్లి పిటిషన్‌లో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ఈడీ, చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు.
ఉండవల్లి పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులపై టీడీపీ వణికిపోతోంది. పొరపాటున సీబీఐ, ఈడీ దర్యాప్తునకు న్యాయ స్థానం ఆదేశిస్తే మాత్రం టీడీపీ బతుకు బస్టాండ్ అవుతుందనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో వుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ చేతల్లోకి చంద్రబాబు జుత్తు పోతుందనే ఆందోళన టీడీపీ నేతల్లో వుంది.
ఇంత వరకూ కేసులేవీ లేకున్నా, మోదీ సర్కార్ అంటే వణికిపోవడం చూస్తున్నాం. ఇక కేసులుంటే చంద్రబాబు పరిస్థితి ఏంటనేది టీడీపీకి అర్థం కాకుండా వుంది. అందుకే సీబీఐ, ఈడీ దర్యాప్తునకు కోర్టు ఆదేశించకపోతే అదే పదివేలని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. ఉండవల్లి పిటిషన్‌ను వచ్చే వారానికి వాయిదా వేసినట్టు సమాచారం. ఏమవుతుందో చూడాలి.