మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలుసుకునేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఎట్టకేలకు అవకాశం దక్కింది. స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. రెండు వారాలకు పైగా ఆయన జైల్లో ఉంటున్నారు. ఇప్పట్లో బెయిల్ రాకపోవచ్చని టీడీపీ నమ్ముతోంది. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి.
ఇదిలా వుండగా టీడీపీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబునాయుడిని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇంత వరకూ కలిసే అవకాశం రాలేదు. అచ్చెన్నాయుడితో సంబంధం లేకుండానే టీడీపీ, జనసేన మధ్య పొత్తుపై పవన్‌కల్యాణ్ ప్రకటన కూడా చేసిన సంగతి తెలిసిందే.
తనను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా పొత్తు ప్రకటన చేయడంపై అచ్చెన్న అసంతృప్తిగా ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబును కుటుంబ సభ్యులు కాకుండా, ఇంత వరకూ పవన్‌కల్యాణ్, యనమల రామకృష్ణుడు మాత్రమే ములాఖత్‌లో కలుసుకున్నారు.
ఇప్పుడు అచ్చెన్నాయుడికి అవకాశం దక్కింది. ఇవాళ సాయంత్రం ములాఖత్‌లో నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు అచ్చెన్నాయుడు కూడా కలుసుకోనున్నారు. ఇప్పటికే టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో బాబుతో అచ్చెన్న భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అచ్చెన్నతో బాబు ఏం చెబుతారో మరి!