చంద్రబాబునాయుడి అరెస్ట్ షాక్ నుంచి టీడీపీ ఇప్పుడిప్పుడు కోలుకుంటోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడ్డారనే కారణంతో ఆయన్ను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ నాయకుడిని టచ్ చేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని ఇంత కాలం టీడీపీ శ్రేణులు అనుకుంటూ వచ్చాయి. ఎందుకంటే ఏ వ్యవస్థనైనా మేనేజ్‌మెంట్ చేయగల చాకచక్యం ఉన్న బాబుకు ఉందని నమ్మారు.
అంతెందుకు తనను అరెస్ట్ చేస్తారని చంద్రబాబునాయుడు కలలో కూడా ఊహించలేదు. తననేం పీకారని పదేపదే ప్రశ్నిస్తూ రెచ్చగొట్టిన చంద్రబాబునాయుడికి …తనను పీకే నాయకుడొకరొచ్చాడని రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు వెళ్లిన తర్వాత అర్థమైంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రెండో దఫా రిమాండ్‌ను అక్టోబర్ ఐదో తేదీ వరకూ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు జడ్జి ఉత్తర్వులిచ్చారు.
మరోవైపు చంద్రబాబునాయుడి అరెస్ట్ గురించి రోజూ ఆవేదనతో ఎల్లో చానళ్లలో కూచుంటే పార్టీ ముందుకు నడవదని ఆ పార్టీ నాయకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు యాక్షన్ టీమ్‌ను ప్రకటించడం విశేషం. ఈ కమిటీలో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, లోకేశ్‌తో పాటు మొత్తం 14 మందికి చోటు కల్పించారు. ఈ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఎలా పని చేస్తుందో చూడాలనే ఉత్కంఠకు తెరలేపింది.
ఒక వారంలో లోకేశ్ పాదయాత్రను కూడా పునఃప్రారంభించాలని టీడీపీ నిర్ణయించింది. బాబును అక్రమ అరెస్ట్ చేశారనే నినాదంతో జనం వద్దకు వెళ్లాలని టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదపనుంది. వైసీపీకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కర్నీ కలుపుకెళ్లాలనే టీడీపీ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ ప్రయత్నాలు అధికారాన్ని తెచ్చి పెడతాయా? లేదా? అనేది కాలమే తేల్చాల్సి వుంది.