అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్ కందా
ఎక్సయిజ్ పాలసీ మార్పుపై ఎన్టీయార్‌తో విభేదించా..
1988 మాట. నేను ఎక్సయిజ్ కమిషనర్‌గా వున్నాను. రామారావుగారు ముఖ్యమంత్రి.
కాబినెట్ మీటింగ్ జరుగుతోంది. చర్చించవలసిన అంశాల్లో సారా దుకాణాల వేలం పద్ధతి మార్చడం ఒకటి.
రామారావుగారు వేలం పద్ధతి మార్చాలన్న పట్టుదలతో వున్నారు. మార్చకూడదన్న గట్టి అభిప్రాయంతో నేనున్నాను.
సమావేశంలో ఎక్సయిజ్ మంత్రి అశోకగజపతిరాజు గారు, చీఫ్ సెక్రటరీ నాయర్‌గారు వున్నారు.
ఎడిషనల్ చీఫ్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ సెక్రటరీ సంతానంగారు కూడా వున్నారు. వాణిజ్యపన్నులు, అబ్కారీ ఆదాయం యీ రెండూ కలిపి ఆ రోజుల్లోనే కాదు, యీ రోజుల్లో కూడా రాష్ట్రప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరు. ఏమైనా తేడా వస్తే అనేక ప్రభుత్వ కార్యక్రమాలు దెబ్బ తింటాయి. వేలం పాట పద్ధతి మారిస్తే ఆదాయంలో హెచ్చుతగ్గులు వచ్చే ప్రమాదం వుంటుందా, వుంటే ఏం చేయాలి అని సలహా చెప్పడానికి ఆయన్ని కూడా పిలిచారు.
సంబంధిత శాఖ యొక్క సెక్రటరీ పి.కె.దొరస్వామిగారిని కూడా కూర్చోబెట్టారు. ఏదైనా డిపార్టుమెంటు గురించి ముఖ్యమైన అంశం చర్చించేటప్పుడు సంబంధిత హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్‌ను పిలుస్తారు. సెక్రటేరియట్‌లో అయితే ఆ సబ్జక్ట్ చూసే సెక్రటరీని పిలుస్తారు. ఒక్కోసారి వాళ్ల నెవరినీ పిలవకుండా మంత్రే నిర్ణయం తీసుకుంటారు కూడా. నేను ఎక్సయిజ్ కమిషనర్‌ని కాబట్టి నన్నూ సమావేశానికి రమ్మన్నారు. నేను నా అభిప్రాయాలు బలంగా వినిపిద్దామన్న దృఢసంకల్పంతో, ఉత్సాహంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.
''ఎక్సయిజ్ ఆక్షన్స్'' అన్నారు రామారావుగారు కాగితాలలోకి చూసి ఎజెండాలోని ఐటమ్ చదువుతూ.
దాని గురించి పార్టీ విధానం ఏమిటో, ప్రభుత్వ విధానం ఏమిటో అందరికీ తెలుసు.
ఏమైనా చెప్తారా? అన్నట్టు చీఫ్ సెక్రటరీ నాయర్‌గారు దొరస్వామిగారి కేసి చూశారు. ఆయనేమీ మాట్లాడలేదు.
సంతానంగారు. ఆయనా ఏమీ మాట్లాడలేదు.
ముఖ్యమంత్రిగారు చీఫ్ సెక్రటరీకేసి చూశారు. ఆయన ఏమీ అనలేదు.
రామారావుగారు అశోకగజపతిరాజు గారి కేసి చూపు తిప్పారు. ఆయనకు పార్టీ తరఫునుండి బ్రీఫింగ్ ముందే అయిపోయిందేమో ఏమీ మాట్లాడలేదు. కొత్త విధానం ఒకవేళ ఆయనకీ నచ్చిందో, అభ్యంతర పెట్టడం ఎందుకనుకున్నారో మరి!
ఎవరూ ఏమీ అనకపోవడంతో ఆ అంశం సర్వామోదం పొందినట్టు భావించి తర్వాతి అంశానికి వెళ్లబోతున్నారు ముఖ్యమంత్రి.
''సర్…'' అంటూ లేచి నిలబడ్డాను.
నేనలా అడ్డుతగలడం రామారావుగారికి నచ్చలేదు. ఎందుకంటే దీని పట్ల నా వ్యతిరేకత ఆయనకు ముందే తెలుసు. రెండోది ఆ అభిప్రాయాన్ని నేను నలుగురిలో చెప్పడం ఆయనకు యిష్టం లేదు. కానీ నేను లేచి నిలబడ్డాక 'మాట్లాడక్కరలేదు, కూర్చో' అంటే అది భావ్యం కాదు.
కనుక నా వైపు తిరక్కుండానే చేయి వూపి ఊఁ అన్నారు.
ప్రభుత్వ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నానో నేను అనర్గళంగా చెప్పడం ప్రారంభించాను.
xxxxxx
అప్పటిదాకా సారా దుకాణాలను వేలం వేసేవారు. 'మేం యింత లిక్కర్ ఖచ్చితంగా అమ్ముతాం, దానికై యింత డబ్బు ప్రభుత్వానికి కడతాం' అని గ్యారంటీ యిచ్చి కాంట్రాక్టర్ల్లు వేలంలో పాల్గొనేవారు. ఎవరు ఎక్కువ వేలంపాట పాడితే వారికి డీలర్‌షిప్ యిచ్చేవారు.
వేలం పాడాక తను అనుకున్నంత మేరకు అమ్ముకోలేకపోతే కాంట్రాక్టరు నష్టపోతాడు. అతని కష్టనష్టాలతో ప్రభుత్వానికి ప్రమేయం లేదు. ప్రభుత్వానికి ఏడాదిలో యింత ఆదాయం అని నిర్ధారణగా వచ్చేది. దాన్ని బట్టి ప్రభుత్వపథకాలకు ఎంత ఖర్చు పెట్టగలం అనేది స్పష్టంగా తెలుస్తుంది. దానికి తగినట్టు విధంగా ప్లాను చేసుకోగలం. అయితే యీ విధానంలో వున్న లోపం ఏమిటంటే – ఒక్కొక్కప్పుడు కాంట్రాక్టర్ల్లు ఒక సిండికేట్‌గా ఏర్పడి ఒక ధరకు మించి వేలంపాట సాగకుండా చేయగలరు. వాళ్లల్లో వాళ్లే షాపులు పంచేసుకుని 'ఈ రేటుకి మించి మనం ప్రభుత్వానికి ఆఫర్ యివ్వవదు' అని చెప్పేసుకుంటారు. కొత్తవాళ్లు ఎవరైనా వచ్చి గిట్టుబాటు ధర ప్రకారం పాడబోతే అడ్డుకుంటారు, ప్రభుత్వానికి తగిన ఆదాయం రాకుండా చేస్తారు. ఇలా చేస్తున్నారన్న అనుమానం తగిలితే ప్రభుత్వం ఆ వేలంను రద్దు చేసి, మళ్లీ యింకోసారి వేలం నిర్వహించవచ్చు. అప్పుడు కూడా యిదే తంతు – అంటే పాతవాళ్లు ముఠాకట్టి కొత్తవాళ్లని రానివ్వకుండా చేస్తే – సాగే ప్రమాదం వుంది. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం కొత్తవారికి ధైర్యం చెప్పి, పాతవాళ్లను అదుపు చేస్తూ వుంటుంది.
నా కంటె ముందు ఎక్సయిజ్ కమిషనర్‌గా పని చేసిన మిత్రుడు పివిఆర్‌కె ప్రసాద్ యీ సిండికేట్లను ఛేదించడానికి యితర రాష్ట్రాల నుండి మూడు గ్రూపులను కొత్తగా రంగంలోకి దింపారు. జంటనగరాల్లో అప్పటిదాకా 50 లక్షలకు మించి పాడుకోమని మొండికేసిన సిండికేటు 90 లక్షల దాకా వెళ్లారు. కానీ చెన్నయ్‌కు చెందిన ఒక గ్రూపు దానికి కోటీ 5 లక్షలకు పాడారు. ఇది చూసి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో సిండికేట్లలో అలజడి పెరిగింది. పోటీపడి పాడకపోతే సారావ్యాపారం నుండి తప్పుకోవలసి వస్తుందని చిన్న చిన్న కాంట్రాక్టర్లు భయపడ్డారు. సిండికేట్ల నుండి విడిపోయి, స్థానికంగా తమతమ ప్రాంతాలలో షాపులు పెట్టి పాడుకోవడం మొదలుపెట్టారు. సిండికేట్లు బద్దలు కావడంతో, పోటీ పెరిగి ఆ పాటల్లో అబ్కారీ ఆదాయం ఒక్కసారిగా రూ. 180 కోట్లు అదనంగా పెరిగింది!
కొత్తగా ఏర్పాటు చేసిన కర్షకపరిషత్‌కు చైర్మన్‌గా క్యాబినెట్ ర్యాంక్‌లో చంద్రబాబు నాయుడు వుండేవారు. ఆయన పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా విధానాల రూపకల్పనలో పెద్దపాత్ర పోషించేవారు. రాష్ట్రాదాయానికి అబ్కారీ నుండి వచ్చే ఆదాయం అతి ముఖ్యం కాబట్టి, ప్రస్తుత పరిస్థితిలో వస్తున్న ఆదాయాన్ని యింకా పెంచడానికి కొత్త పథకం రూపొందింది. దాని ప్రకారం యీ డీలర్ల వ్యవస్థ తీసివేసి, ప్రభుత్వమే డైరక్టుగా సారాయి అమ్మాలి. ప్రభుత్వం అప్పటికే కల్తీ సారా అరికట్టడానికి జిల్లాలలో ఫిల్లింగ్ యూనిట్స్ పెట్టి సారాను పాలిథిన్ సంచీల్లో నింపి 'వారుణి వాహిని' పేరుతో అమ్మేది. గతంలో కాంట్రాక్టర్లు కొంత సారాని ప్రభుత్వం వద్ద కొలతల లెక్కన కొని, దాన్ని కల్తీ చేసి అమ్మేవారు. దానివలన ప్రభుత్వ సారా అమ్మకం తగ్గేది, కల్తీసారా అమ్మకం పెరిగేది. ఈ వారుణి వాహిని పథకం పెట్టిన తర్వాత ప్రజలంతా సీలు వేసిన ఆ కవర్లే కావాలనేవారు. కల్తీకి ఆస్కారం లేక ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. (?)
'వారుణి వాహిని' పాకెట్లు తయారుచేసిన ప్రభుత్వం తనే అమ్మకుండా సారా కాంట్రాక్టర్లకు ఎందుకివ్వాలని చంద్రబాబు ఆలోచన. కోఆపరేటివ్ సొసైటీలు, సామాజిక సంస్థలు, నిరుద్యోగ యువకులు… వూరూరా వుంటారు కదా వాళ్లలో కొందర్ని ఎంపిక చేసి వారినే చిన్న తరహా డీలర్లగా మారిస్తే ప్రభుత్వానికి నేరుగా ఆదాయం వస్తుంది కదాని ఆయన వ్యూహం. దీన్ని ఆయన పార్టీ పెద్దలు, రామారావుగారితో సహా ఆమోదించారు. ఈ ఆలోచన ఎప్పుడైతే మీడియాలో వచ్చిందో యిక ప్రతిపక్షంవారికి అనుమానం వచ్చింది – ఆ ఎంపిక చేసిన యువతకానీ, సొసైటీ కాని అధికారపక్షమైన టిడిపికి చెందినవారే అయి వుంటారని! ప్రభుత్వం ఒక వర్గం వారినే ప్రోత్సహిస్తోందన్న సందేహం కలగడం ఎవరికీ మంచిది కాదు. దానివలన పథకం అమలు కావడానికి ముందే ప్రతిఘటన వినిపించసాగింది. ఇదంతా ప్రభుత్వం యిమేజికి భావ్యం కాదని, యిలా అయితే అతి త్వరలో యిది విఫలమై, మళ్లీ పాతపద్ధతికి వెళ్లవలసి వస్తుందని నా అనుమానం.
చంద్రబాబు ఫోన్ చేసి ''మనం ఒకసారి కలుద్దామండీ, ఎక్కడ?'' అని అడిగారు.
ఆయన అవేళ అలా ఫోన్ చేయగానే ''నేనే వచ్చి కలుస్తానండి.'' అన్నాను.
''ఏమిటి మోహన్ గారు, కొత్త పద్ధతి గురించి మీ అభిప్రాయం ఏమిటి?'' అని అడిగారాయన.
అంతా చెప్పుకుని వచ్చాను. అంతా శ్రద్ధగా విని, నా వాదనలు ఏమీ ఖండించకుండా '''ఇదెలాగో జరుగుతుంది. జరిగి తీరుతుంది. మీరు మాత్రం దీన్ని వ్యతిరేకించినవారిగా మిగిలిపోతారు. …జరిగాక కూడా! అలాటి పేరు తెచ్చుకోవడం తప్ప దీన్ని వ్యతిరేకించి మీరు లాభపడేది ఏమీ లేదు.'' అన్నారాయన స్పష్టంగా.
''..ఇది మా ఐయేయస్‌లకు అకాడమీలో చేరినప్పటి నుంచి నేర్పించే విద్యే కదండి. మాకు ఇది ఒక స్టాండర్ట్ రూల్. మా సలహాల వలన ఏమన్నా మంచి జరిగితే, దానివలన రాజకీయ నాయకులకు మంచిపేరు వస్తే… రావాలనే మా ఆశ కూడా…మాకేమీ అభ్యంతరం వుండదు. సరిగ్గా అమలు కాకపోవడం వలన సలహా వలన ఏదైనా తప్పు జరిగితే జరిగితే ఆ చెడ్డపేరేదో మాకే రావాలి. దీనికి ఒడంబడే మేం ఉద్యోగాల్లో చేరతాం, కొనసాగుతాం. నా సలహా వలన ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం యింత, వృత్తిపరంగా నాకు కలిగే మేలు యిది, దాని కారణంగా నా మీద పడబోయే ప్రభావం యిది.. ఇలాటివి ఆలోచించుకుని సలహాలు చెప్పే ప్రశ్నే వుండదు. అది అసలు నేను ఇప్పటివరకు ఆలోచించలేదు. ఫార్వర్డ్ థింకింగే నాకెప్పుడు అలవాటు. నాకు ఇప్పుడు తోచింది ఇది. నాకున్న అనుభవం ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇది చేస్తే తప్పనిపిస్తోంది. అది చెప్పక తప్పదు. ఆ తర్వాత మరి మీ యిష్టం'' అని చెప్పేసి వచ్చాను.
చంద్రబాబుగారు రామారావుగారికి నా వూహలు చెప్పేశారు. అందుకే ఆయనకు నేను చెప్పబోయేది ఏమిటో ఆయనకు తెలిసి, వినడానికి ఉత్సాహం చూపించలేదు. నేనే లేచి నిలబడడంతో తప్పలేదు.
xxxxxx
నేను అనర్గళంగా ఇరవైనిముషాలు గుక్కతిప్పుకోకుండా నా కడుపులో వున్న ఆ బాధంతా వెల్లబోశాను. 'ఈ కొత్త ప్రతిపాదన వలన యీ అనర్థం జరగవచ్చు. ఫలానా జాగ్రత్త తీసుకుంటే జరక్కపోవచ్చు కానీ జరిగేందుకు అవకాశం లేదని కొట్టి పారేయలేం. సవ్యంగా అమలు కాకపోతే లక్ష్యం నెరవేరకపోవచ్చు, అనుక్నుంత ఆదాయం రాకపోవచ్చు, మనం ఆశలు చూపించి కొత్తగా రంగంలోకి దింపినవారు నష్టపోవచ్చు, ప్రభుత్వానికి చెడ్డపేరు రావచ్చు. ఎక్సయిజ్ శాఖలో వున్న పరిమితుల రీత్యా, యిబ్బందుల రీత్యా దీన్ని సమర్థవంతంగా చేసే శక్తి మనకు లేకపోవచ్చు. అనుకోని విపర్య పరిమాణాలు సంభవిస్తే తట్టుకునే శక్తి మనకు లేకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో యిలాటి ప్రయోగం చేయడం సమంజసం కాదు. ఇప్పుడు సుమారు రూ. 500 కోట్లు వస్తోంది. 150 కోట్ల దాకా పడిపోయి ఏ 350 కోట్లో వస్తే ప్రభుత్వ పరిస్థితి ఏమిటి?' అని నేను మాట్లాడాను. అంతా బాగా ప్రిపేరయి వెళ్లానేమో గబగబా చెప్పుకుపోయాను.
అంతా శ్రద్ధగా విన్నారు. నిశ్శబ్దం. ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
రామారావుగారు నా వైపు చూడలేదు.
జి ఆర్ నాయర్‌గారి కేసి చూశారు – 'అతను చెప్పేది అయిపోయిందా?' అని అడిగారు
నాయర్‌గారు నావైపు చూశారు. చెప్పాల్సిందంతా చెప్పేశాను అన్నట్టు తలవూపాను.
ఆయన రామారావుగారి కేసి చూసి 'ఎస్, సర్' అన్నారు.
రామారావుగారు ఏమీ వ్యాఖ్యానించలేదు. ''నెక్స్‌ట్ ఐటం'' అంటూ పేజీ తిప్పారు.
అంటే అర్థమేమిటి? 'నువ్వు మాట్లాడదలచుకున్నది మాట్లాడావు. యూ హేడ్ యువర్ సే. విని అమలు చేయాలో, మానాలో తేల్చుకునే అధికారం నాది కదా. నా అధికారాన్ని నేను వినియోగిస్తున్నాను. విధానం మార్చే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాను – అని ఆయన చెప్పకనే చెప్పారు.
xxxxxx
ఎక్సయిజ్ విధానం మార్చాక ఆ ఏడాది ఆదాయం రూ. 500 కోట్లనుండి రూ. 650 కోట్లు అయింది. నా అంచనా తప్పింది.
అయినా ఆనాటి నా సందేహాలు, భయమని, అంచనాలు తప్పని నేను యిప్పటికీ ఒప్పుకోను. ఆనాటి పరిస్థితి అది. అంతే!
xxxxxx
తాజాకలం – కొన్నాళ్లకు ప్రభుత్వం నేరుగా సారా అమ్మే పద్ధతి ఎత్తేసింది. ఇప్పటికీ సారాయి దుకాణాల వేలం పద్ధతే అమల్లో వుంది.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version