1962లో చైనా మనపై దాడి చేసింది. ఆ దాడిలో మన భారతసైన్యాలు ఓడిపోయాయి. మనల్ని ఓడించినా చైనా ముందుకు చొచ్చుకుని వచ్చి ఢిల్లీని ఆక్రమించలేదు. నెల్లాళ్ల యుద్ధం తర్వాత దానంతట అదే వెనక్కి వెళ్లిపోయింది. ఇది జరిగి 50 ఏళ్లు దాటినా యింకా దానిపై చర్చ సాగుతూనే వుంటుంది. ఆ యుద్ధవైఫల్యం నెహ్రూ చేతకానితనం వలననే జరిగిందని అందరూ దుమ్మెత్తి పోస్తూ వుంటారు. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత యుద్ధం వలన ఎంత ఘోరమైన నష్టాలు జరుగుతాయో ప్రపంచదేశాలన్నీ గుర్తించాయి. యుద్ధనివారణకు ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. కొత్తగా ఆవిర్భవించిన భారతదేశానికి ప్రధానిగా అయిన నెహ్రూ దేశరక్షణ పేరుతో సైన్యానికే నిధులన్నీ వెచ్చిస్తే అభివృద్ధి చేపట్టలేమనుకున్నారు. పారిశ్రామికీ కరణ, గ్రామీణాభివృద్ధి, పంచవర్ష ప్రణాళికలు యిలా ఎన్నో డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్‌కు ఖర్చు పెట్టవలసిన ధనాన్ని తుపాకులపై ఖర్చు పెడితే వృథా అనుకున్నారు. ఇరుగుపొరుగులతో సఖ్యతగా వుంటే డిఫెన్సు బజెట్ తగ్గించవచ్చనుకున్నారు. పంచశీల ప్రతిపాదించారు. చైనాకు స్నేహహస్తాన్ని చాచారు. వారు టిబెట్‌ను ఆక్రమించినా దలైలామాకు మన దేశంలో శరణు యిచ్చి వూరుకున్నారు తప్ప చైనాను మందలించి, వారితో కయ్యానికి కాలు దువ్వలేదు. పాకిస్తాన్‌తో ఆక్రమిత కశ్మీర్ వివాదం వున్నా యుద్ధం చేయకుండా సహనం వహించారు.
ఇదంతా అప్పట్లో భారతప్రజలు హర్షించారు. నెహ్రూను శాంతిదూత అన్నారు. ఇంతలో 1962లో నెహ్రూ నమ్మకాన్ని వమ్ము చేస్తూ చైనా దాడి చేసింది. 15, 20 ఏళ్ల పాత ట్యాంకులతో, జీపులతో భారతసైన్యం వారిని ఎదుర్కోలేకపోయింది. నెహ్రూకు, రక్షణమంత్రి కృష్ణ మేనోన్‌కు మతిపోయింది. ప్రతిపక్ష పార్టీలు నెహ్రూను అపహాస్యం చేశాయి. సైన్యానికి సరైన బట్టలు కూడా సమకూర్చకుండా వారి ప్రాణాలు తీశాయని విమర్శించాయి. నెహ్రూ అహం దెబ్బ తింది. అతి కొద్దికాలానికే ఆయన మరణించాడు. చైనాతో యుద్ధంలో భారత నాయకత్వం, సైన్యం చేసిన పొరబాట్లపై అనేక పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో పుస్తకం వచ్చింది. నెవిల్ మాక్సెల్ అనే జర్నలిస్టు భారతప్రభుత్వం యిన్నాళ్లూ దాచిన రహస్యపత్రాలలో దొరికిన సమాచారం అంటూ ''ఇండియాస్ చైనా వార్'' అనే పుస్తకం రాశాడు. దాని ప్రకారం దాడి చేసినది ఇండియాయేట! చైనా తరఫు మెటీరియల్‌తో దాన్ని సరిచూసుకున్నాడా అంటే అది లేదు. వాళ్లు రహస్యపత్రాలు ఏమీ యివ్వలేదట.
ఈయన అభిప్రాయంతో విభేదిస్తూ బెర్టిల్ లింట్‌నర్ అనే స్వీడిష్ చరిత్రకారుడు వ్యాసాలు ప్రచురించాడు. ఆనాటి దాడికి చైనా అంతర్గత రాజకీయాలే కారణమన్నాడు. 1958లో మావో చైనాలో 'గ్రేట్ లీప్ ఫార్వర్డ్' ఉద్యమం చేపట్టాడు. మూడేళ్లు పాటు సాగిన ఆ ఉద్యమంలో ఆకలిదప్పులతో దాదాపు 30 లక్షలమంది చనిపోయారు. అందరూ మావోను నిందించసాగారు. 1960లో రష్యాతో విడిపోవడం వలన కూడా చైనా బలహీనపడింది. ప్రజల దృష్టిని మరల్చడానికి , సాటి నాయకుల విమర్శలు తట్టుకోవడానికి మావో యితర దేశాలపై దాడి చేశాడు. దేశాధినేతలు యిలా చేస్తూనే వుంటారు. వింతేమీ లేదు. తమ ప్రతిపక్షం కొమిన్‌టాంగ్ బర్మాలో క్యాంపులు నడుపుతూ, అమెరికా మద్దతుతో చైనాపై అప్పుడప్పుడు దాడులు జరుపుతూ వుంటే 1961లో 20 వేల మంది సైనికులను పంపి ఆ క్యాంప్‌ను నాశనం చేయించాడు. తర్వాతి ఏడాది భారత్‌పై యిదే రకమైన దాడి చేశాడు. కొమిన్‌టాంగ్ లాగే దలైలామా కూడా ఇండియాలో కాంపులు నడుపుతూ చైనాపై దాడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని, దాడి చేసి దలైలామాకు, అతనికి ఆశ్రయం యిచ్చిన ఇండియాకు బుద్ధి చెప్పామని ప్రజలకు చెప్పి వుంటాడు. అందుకే ఆ యుద్ధకారణం గురించి అప్పుడు కానీ, యిప్పుడు కానీ చైనా పెదవి విప్పలేదు. దాడి తర్వాత మావో ప్రతికకక్షులు నోరు మూసుకున్నారు. అందువలన మావో ప్రయోజనం సిద్ధించిందనే చెప్పాలి. రెండు వాదనలూ వింటే లింట్‌నర్ వాదనే ఎక్కువ సబబుగా అనిపిస్తుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2014)