23 ఏళ్ల నాటి వివాదాస్పద టైటిల్.. మళ్లీ ఇప్పుడెందుకు?

సండియార్ అంటే రౌడీ, గూండా, ఫైటర్, రౌడీ మూక నే లాంటి అర్థాలున్నాయి. కమల్ హాసన్ సినిమా టైటిల్ ఇదే.

సండియార్ అంటే రౌడీ, గూండా, ఫైటర్, రౌడీ మూక నే లాంటి అర్థాలున్నాయి. కమల్ హాసన్ సినిమా టైటిల్ ఇదే. ఇప్పుడిలాంటి టైటిల్ పెట్టడం చాలా కామన్. చాలా సినిమాలకు ఇలాంటి నెగెటివ్ టైటిల్స్ పెడుతున్నారు.

కానీ సండియార్ టైటిల్ వెనక అర్థం కేవలం ఇది మాత్రమే కాదు. ఇది ఒక తెగను సూచిస్తుంది. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీస్తుంది. అందుకే 23 ఏళ్ల కిందట ఈ టైటిల్ పెట్టలేకపోయారు కమల్ హాసన్.

ఇంకాస్త వెనక్కు వెళ్దాం. దక్షిణ తమిళనాడులోని మధురై, తేని జిల్లాల్లో బలమైన దేవర్ వర్గానికి, దళితులకు మధ్య కుల ఘర్షణలు జరిగాయి. అప్పట్లో ఈ ఘర్షణల్లో దాదాపు 250 మంది మృతి చెందారు. వేలాది మంది దళితులు తమ ఊళ్లు వదిలి పారిపోయారు.

దేవార్ లో ఓ వర్గం సికిల్ (ఓ రకమైన కత్తి) పట్టుకొని ఊచకొత కోసినట్టు నివేదికలున్నాయి. సికిల్ పట్టుకునే దేవర్ వర్గానికి చెందిన కొంతమందిని సండియార్ అని పిలిచేవారు. ఒక విధంగా చెప్పాలంటే, ఈ పేరు చెబితే, దళితుల్ని రెచ్చగొట్టినట్టే.

ఇలాంటి వివాదాస్పదమైన పేరును తన సినిమాకు అప్పట్లో టైటిల్ గా పెట్టుకున్నారు కమల్ హాసన్. దీన్ని దళిత నాయుడు డాక్టర్ కె.కృష్ణస్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. కమల్ మరోసారి కుల ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీంతో తన సినిమా షూటింగ్ కు పోలీసు రక్షణ కావాలంటూ కమల్, అప్పటి సీఎం జయలలితకు విన్నవించుకున్నారు. అయితే ఆ అభ్యర్థనను జయలలిత తోసిపుచ్చారు. మరోవైపు తేని, మధురై, విరుధనగర్, తిరునల్వేలి, తూత్తుకుడి ప్రాంతాల్లో మెల్లగా కలకలం మొదలైంది.

దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య కమల్ తన సినిమా టైటిల్ మార్చుకున్నారు. విరుమాండి పేరిట విడుదల చేశారు. ఆ తర్వాత ఇదే సినిమా తెలుగులో పోతురాజు పేరిట డబ్ అయింది.

అలా కనుమరుగైన సండియార్ టైటిల్ మళ్లీ ఇన్నేళ్లకు తెరపైకొచ్చింది. ఈసారి కూడా కమల్ హాసనే ఈ టైటిల్ ను ఎత్తుకున్నారు. తన కొత్త సినిమాకు ఆ పేరు పెట్టారు. మరి ఈసారి వివాదాలు తలెత్తే అవకాశం ఉందా?

చారిత్రకంగా ఆ టైటిల్ సున్నితమైనది కాబట్టి, కొంతమంది సామాజిక లేదా రాజకీయ వర్గాలు మళ్లీ అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. కానీ అప్పటికీ ఇప్పటికీ రాజకీయంగా, సామాజికంగా పరిస్థితులు చాలా మారాయి. కాబట్టి పెద్దగా అభ్యంతరాలు ఉండవనే ఉద్దేశంతో కమల్ ఈ టైటిల్ ఎంపిక చేసుకున్నట్టున్నారు.

One Reply to “23 ఏళ్ల నాటి వివాదాస్పద టైటిల్.. మళ్లీ ఇప్పుడెందుకు?”

Comments are closed.