విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి.
అందులో భాగంగా ఆయన సొంత మేనల్లుడు చిన్న శ్రీను వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లారు. ఇక బంధువైన నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు టీడీపీ గూటికి చేరారు.
మరోవైపు అధికార కూటమిలోని మూడు పార్టీలు అంగబలం, అర్థబలంతో దూసుకొచ్చాయి. బొత్స సత్యనారాయణకు, వైసీపీకి అన్ని విధాలా సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో జిల్లా పరిషత్ ఎన్నికల్లో అనుకున్నట్లుగానే ఫలితాలు వచ్చాయి.
మొత్తం 27 జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ మూడు చోట్ల మాత్రమే ఆధిక్యం చూపగలిగింది. అందులో ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది.
విజయనగరం జిల్లాలోని గరివిడి జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి, బొత్స సత్యనారాయణ కోడలు బొత్స పూజిత విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కిమిడి సంధ్యపై 1,599 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయాన్ని కూడా అపురూపమైనదిగా భావిస్తున్నారు.
చీపురుపల్లి ఎమ్మెల్యే, సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు కోడలు సంధ్య. ఆమెపై బొత్స కోడలు విజయం సాధించడం విశేషంగా చూస్తున్నారు. పైగా చీపురుపల్లి బొత్స సొంత నియోజకవర్గం. అక్కడ తన పట్టు జారిపోలేదని బొత్స నిరూపించుకున్నారని అంటున్నారు.
అయితే, బొత్స రాజకీయ వారసురాలిగా చాలా కాలంగా ప్రచారంలో, ప్రజల్లో ఉన్న ఆయన కుమార్తె అనూష గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గంలోని బొండపల్లి జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసి భారీ ఓటమిని చవిచూశారు. ఆమె 5,136 ఓట్ల భారీ తేడాతో ఓడిపోవడం బొత్స కుటుంబానికి షాక్‌గా మారింది.
అయితే, బొత్స వారసురాలిగా కోడలు పూజిత గెలిచి చూపించారని అంటున్నారు. ఆమె అనూహ్యంగా బరిలోకి దిగారు. చివరి నిమిషంలో పోటీ చేసినా, తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. దీంతో కోడలినే రాజకీయ వారసురాలిగా ప్రజలు గుర్తించారని చెబుతున్నారు.

కూతురు ని గెలిపించుకోలేక పోయాడు… ఇంకా పట్టు నిలుపుకోవడం ఏంటి?
నిన్నటి దాకా అనుషని లేపి… భీమిలి లో గంట శ్రీనివాస్ కి చెక్ అని రాసి…ఇప్పుడు విడిపోగానే ..ఈవడని బొత్సా వారసురాలు అని మడత పెట్టావా