విజయం ఒక వ్యసనం

ప్రాక్టీస్ మ్యాచ్ లో ఫిక్సింగులకు పాల్పడి గెలిస్తే.. అసలు మ్యాచ్ నాశనమైపోవడం గ్యారంటీ. ప్రజల పల్స్ తెలుసుకోవడానికి స్థానిక ఎన్నికలను వాడుకోవాలి.

‘విజయం ఇచ్చే కిక్ తో సమానమైనది వేరే ఏదీ ఉండదు’- సాధారణంగా అందరూ అనుకునే మాట ఇది. గెలుపు నీలో ఉత్సాహాన్ని నింపుతుందని, చైతన్యవంతంగా ఉంచుతుందని కూడా వారు భావిస్తుంటారు. అదే సమయంలో.. పర్సనాలిటీ డెవలప్మెంటు పాఠాలు బోధించేవాళ్లు మాత్రం.. అప్పుడప్పుడూ ఓడిపోతుండడం కూడా అవసరమే అని అంటారు.

ఓటమి నీలో చైతన్యాన్ని తీసుకువస్తుందని, నిన్ను నువ్వు మెరుగుపరచుకోవడానికి కష్టపడాలనే పట్టుదలను పెంచుతుందని, క్రియేటివ్ గా ఉంచుతుందని, గెలుపుకోసం తపనను పెంచుతుందని అంటూ ఉంటారు.

ఈ రెండు వాదనలూ కరెక్టే కావొచ్చు. కానీ లోతుగా గమనించినప్పుడు.. విజయం అనేది అసలైన వ్యసనం అని మనకు అర్థమవుతుంది. విజయకాంక్ష అనేదే మనుషుల్లోని వీక్ పాయింట్! ఆ వీక్ పాయింట్ వారితో రకరకాలుగా ఆడుకుంటుంది.

బొమ్మలను చేసి ఆడిస్తుంది. వారితో తప్పులు చేయిస్తుంది. అడ్డదారులు తొక్కిస్తుంది. సర్వభ్రష్టత్వం చెందేలా మారుస్తుంది. విజయం దక్కిన కిక్కులో.. ఆ వీక్ పాయింట్ తమను ఎన్ని రకాలుగా భ్రష్టుపట్టించిందో వారు మరచిపోతుంటారు.

విజయం ఎంత ప్రమాదకరమైన వ్యసనమో.. వరుసగా గెలిచేవారిని భ్రమల్లోనే ఉంచుతూ ఒక్కసారిగా ఎలా కుప్పకూల్చేస్తుందో.. ముందుచూపుతో తెలుసుకోగలగాలి.

ఇప్పుడు అంత ఓపిక ఎవరికుంది? ఏ క్షణాన దక్కిన విజయాలను ఆ క్షణానికి సెలబ్రేట్ చేసుకుంటూ.. విజయోత్సాహంలో మైమరచిపోవడమే కదా.. ఆధునిక యుగపు లోకరీతి! ఈ వీక్ పాయింట్ గురించి పురపాలక, స్థానిక ఎన్నికలు మనకు మరోసారి గుర్తుచేస్తున్నాయి.

రాజకీయ నాయకుల్లో ప్రతి ఒక్కరికీ ఇది సమానంగా అనుభవంలోకి వచ్చే విషయం కాకపోవచ్చు. కానీ చంద్రబాబునాయుడు వంటి సుదీర్ఘ అనుభవం గడించిన రాజకీయ వేత్తకు ఇది తెలియని సంగతి కానే కాదు. ఎందుకంటే ఆయన- రాజకీయాన్ని వేరు చేసి విడిగా చూడలేని తన జీవితంలో ఉత్థానపతనాలు ఎన్నింటినో చవిచూశారు.

విజయం ఎలాంటి మత్తును ఇస్తుందో, పరాజయం ఎలాంటి పోరాట స్ఫూర్తిని నూరిపోస్తుందో ఆయనకు బాగా తెలుసు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు జరిగిన ఎన్నికలను ఇంతగా ఎందుకు పక్కదారి పట్టించారు? ఆయనలో ఆచరణాత్మక స్పృహ ఎందుకు లేకుండాపోయింది.

అధికారం చేతిలో ఉన్నది కదా అని తమ కూటమి పార్టీలు అనుసరించిన దుర్మార్గపు పోకడలు.. రాష్ట్రానికి ఎంతగా చేటుచేస్తాయో ఆయనకు తెలియదా?

సరిదిద్దడానికి కొన్ని దశాబ్దాలు అవసరమయ్యే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక జీవనం మొత్తం రూపురేఖలు మారిపోతుందనే అంచనా ఆయనకు లేకుండాపోయిందా? అనేది ఒక సందేహం.

కూటమి పార్టీలు ఈ ఎన్నికల్లో ఘన విజయాలను నమోదు చేశాయి. తమ రెండున్నరేళ్ల పరిపాలనను ప్రజలు ఘనంగా ఆశీర్వదించారని వారు ఆత్మవంచనతో కూడిన మాటలు వల్లిస్తున్నారు. వాస్తవం అదేనా? ఈ విజయాలు ఎలా దక్కినవో వారికి తెలుసు కదా?

ఏకాంతంగా ఉన్న ఏ ప్రసన్నమైన సమయంలోనో తన గుండెల మీద చేయి వేసుకుని.. ‘ప్రజలు ఆశీర్వదించా’రనే ఈ మాటను చంద్రబాబు తనకు తాను చెప్పుకోగలరా? ఆయన ఆత్మసాక్షి అందుకు అంగీకరిస్తుందా?

తిరుమల వేంకటేశ్వరస్వామిని ఎంతగానే నమ్మే చంద్రబాబునాయుడు.. ఆయన ఎదుట నిల్చుని ‘స్వామీ.. నా పాలనను ప్రజలు మెచ్చేలా చేసినందుకు నీకు కృతజ్ఞతలు’ అని చెప్పగలరా? ఆయన ఆత్మసాక్షి అందుకు అంగీకరిస్తుందా? అనేవి మిలియన్ డాలర్ ప్రశ్నలు.

ప్రతి విజయమూ వ్యసనమే అవుతుందని, ప్రతి విజయమూ మనిషిని శిథిలం చేసేస్తుందని సార్వత్రీకరించలేం. ప్రత్యేకించి ఇలాంటి విజయాలు, అనుచితమైన మార్గాల్లో దక్కించుకున్న తమవి కాని విజయాలు.. ఒక గిల్ట్ గా మనిషిని ఎన్నటికీ వెంటాడుతూనే ఉంటాయి.

అవి ఖచ్చితంగా మనిషిలోకి ఒక మత్తును, ఒక వైరస్ ను తప్పకుండా ఎక్కిస్తాయి. ఆ వైరస్ అంతిమక్షణాలు వచ్చేవరకు బయటపడకుండా లోపలినుంచి సాంతం కబళించేస్తుంది.

అనేక అక్రమాలకు పాల్పడ్డారు. దౌర్జన్యాలు చేశారు. పోలీసుల్ని బానిసల్లాగా వాడుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగాల్ని తొత్తుల్లా పరిగణించారు. మొత్తానికి ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేశారు. ఏం సాధించారు? విజయాలు మాత్రమే కదా? ఇన్ని అకృత్యాలకు పాల్పడినా దక్కినది 94 శాతం విజయాలే కదా?

ఇక్కడ ఒక సంగతి ప్రధానంగా గమనించాలి. 2024 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబునాయుడు సారథ్యంలోని కూటమిని ఆశీర్వదించారు. అప్పుడు దక్కిన విజయాల శాతం కూడా 94! అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఆదరించి పట్టంకట్టిన ఎన్నికల్లోనూ, ఇంత దుర్మార్గంగా, అరాచకంగా జరిగిన ఎన్నికల్లోనూ కూటమి సాధించిన విజయాల శాతం మారలేదు.

మరి, ఈ ఫలితాలను చూసి వారు భయపడాలి కదా? ఇన్ని తప్పుడు పనులు చేసినా కూడా కొన్నిచోట్ల వైసీపీ గెలిచింది.. ఎన్నికలను నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహించి ఉంటే తమ కూటమి సర్వనాశనం అయిపోయి ఉండేదేమో అనే స్పృహ వారికి కలగాలి కదా? కనీసం ఆ ఆలోచన అయినా చేస్తున్నారా? లేదు!

ఒకవేళ వారు చెప్పుకుంటున్నట్టుగా ఈ ఎన్నికలు ప్రజలు ఆశీర్వదించిన ఫలితమే అనుకుందాం. చాలా నిజాయితీగా జరిగిన ఎన్నికల్లోనే వారు గెలిచారని కూడా అనుకుందాం.

గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెండున్నరేళ్ల పాలనలో వారు సాధించింది ఏమిటి? అప్పుడూ ఇప్పుడూ కూడా విజయాలు 94 శాతం వద్దనే ఆగిపోయినందుకు వారు సిగ్గుపడాలి కదా?

గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని వారు, వారి ప్రేమను ఇనుమడింపజేసుకోవడానికి వాడుకోవాలి కదా? ఒక్క శాతం ప్రజాదరణ కూడా పెంచుకోలేకపోయిన పరిపాలన అసలెందుకు? అది వైఫల్యమే కదా? (యిక్కడ మనం విజయాల శాతాల్ని మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఓటు శాతాలను ఆధారం చేసుకుని చర్చించడానికి అర్హతలేని ఎన్నికలు కనుక)

ఇది ప్రజల ఆశీర్వాదమేనని, వారు తమకు నీరాజనం పడుతున్నారని బయటకు చెబుతున్న కూటమి పాలకులు, నిజంగానే ఆ మాటలు నమ్మితే గనుక.. విజయం అందించే వైరస్ వారిని పతనానికి చేరువ చేస్తున్నట్టు పరిగణించాలి. ఈ పోకడ వారికి ఆత్మహత్యాసదృశం ఉంది. ఈ ఎన్నికలు ఇలా జరగకపోయి ఉంటే అసలైన ప్రజల తీర్పు తెలిసేది.

నిజానికి ఎక్కడైనా సరే.. స్థానిక సంస్థల ఎన్నికలను అధికారంలో ఉండే పార్టీలు తమ తర్వాతి విజయం కోసం కావడానికి ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఆడాలి. ప్రాక్టీస్ మ్యాచ్ లో ఫిక్సింగులకు పాల్పడి గెలిస్తే.. అసలు మ్యాచ్ నాశనమైపోవడం గ్యారంటీ. ప్రజల పల్స్ తెలుసుకోవడానికి స్థానిక ఎన్నికలను వాడుకోవాలి.

నిజాయితీగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే.. మెజారిటీ ఓటములు దక్కినా కూడా నిజమైన లాభం చేకూరేది పాలక పక్షానికి మాత్రమే. ఎందుకంటే.. ప్రజల్లో వెల్లువెత్తిన వ్యతిరేకతకు సరైన కారణాల్ని అన్వేషించుకోవడానికి వారికి వ్యవధి ఉంటుంది. తద్వారా.. తమ మిగిలిన కాలపు పరిపాలనలో మార్పుచేర్పులు చేసుకోడానికి అవకాశమూ ఉంటుంది.

తిరిగి ప్రజల ప్రేమను పొంది వారు తర్వాతి సార్వత్రి ఎన్నికల్లో కూడా నెగ్గవచ్చు. అలాంటి సానుకూల ఆలోచనతో ప్రయత్నం చేయకుండా.. ఇలాంటి దుర్మార్గపు ఎన్నికలు నిర్వహించి, దక్కిన విజయాల వైరస్ ను తలకెక్కించుకుని మురిసిపోతే వారే నష్టపోతారు.

..వెంకట్ ఆరికట్ల

9 Replies to “విజయం ఒక వ్యసనం”

    1. అయితే ఈ ఎన్నికల్లో కొంత పుంజుకుంది వైసీపీ. అక్రమాలు జరగలేదు, ఈవీఎంలు, బ్యాలెట్ తో జరిగిన పెద్ద తేడా లేదు 😂🤣

  1. అప్పట్లో y not కుప్పం ani అన్నప్పుడు చెప్పకపోతివి… Ala చేయకూడదు ani. ఇప్పుడు హాహాకారాలు తప్పేవి.. 

Comments are closed.