కెన్యా దేశానికి చెందిన పాల్ మెకెంజీ అనే మతబోధకుడు తన భక్తులకు, తన బోధనలు అనుసరించేవారికి విపరీతమైన మత బోధనలు చేశాడు.
తన బోధనలతో ప్రజలను నమ్మించి చేసిన క్రూరమైన చర్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది. తనను అనుసరించే వారు ఆహారం మానేసి కఠినంగా పస్తులుంటే నేరుగా యేసుక్రీస్తును కలుసుకోవచ్చని అతను బ్రెయిన్‌వాష్ చేసి వారిని నమ్మించాడు.
ఇది నమ్మిన వందలాది మంది ప్రజలు ఆహారం తీసుకోకుండా బలవంతపు ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. దీంతో 191 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న ఈ అత్యంత క్రూరమైన నేరానికి గాను, ఈ కేసును విచారించిన మొంబాసా హైకోర్టు.. మతబోధకుడు పాల్ మెకెంజీకి నిన్న అంటే నవంబర్ఆరో తేదీన ఏకంగా 200 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
మతం పేరుతో అమాయక ప్రజలను మోసగించి మరణ మార్గంలోకి తీసుకెళ్లిన ఇలాంటి వ్యక్తులకు న్యాయస్థానం విధించిన ఈ కఠిన శిక్ష ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షకహోలా (Shakahola) సామూహిక మరణాల ఘటనకు సంబంధించినది. పాల్ న్తెంగే మెకెంజీ కెన్యాకు చెందిన స్వయంఘోషిత క్రైస్తవ మతబోధకుడు.
ఆయన 2003లో ‘గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చి’ (Good News International Church)ను స్థాపించాడు. తన ప్రసంగాలు, మతబోధనల ద్వారా అనేకమందిని తన అనుచరులుగా మార్చుకున్నాడు. మెకెంజీ తన అనుచరులకు కొన్ని విపరీతమైన బోధనలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ప్రపంచం అంతం కాబోతోందని ప్రచారం చేశాడు. యేసుక్రీస్తును కలుసుకోవాలంటే ఆహారం, నీళ్లు తీసుకోకుండా ఉపవాసం ఉండాలని బోధించాడు.
అలా ఆకలితో చనిపోతే స్వర్గానికి వెళ్లవచ్చని నమ్మించాడు. చిన్నపిల్లలను కూడా ఆహారం తీసుకోకుండా ఉంచాలని అనుచరులను ప్రేరేపించాడు. కొందరు అనుచరులు ఉపవాసం పాటించేందుకు నిరాకరించడంతో వారిపై దాడులు చేసి, గొంతు నులిమి చంపినట్లు కూడా ఆరోపణలు రుజువయ్యాయి.
ఈ ఘటనలు కెన్యాలోని తీర ప్రాంతమైన కిలిఫీ కౌంటీలోని షకహోలా అడవుల సమీపంలో జరిగాయి. 2023లో పోలీసుల దర్యాప్తులో అడవిలో సామూహిక సమాధులు బయటపడ్డాయి. 400 మందికి పైగా మరణించినట్లు అధికారులు గుర్తించారు. మృతుల్లో ఎక్కువమంది మెకెంజీ అనుచరులే.
తాజా హత్యల కేసులో 190 మంది చిన్నారులు, ఒక పెద్ద వ్యక్తి కలిపి 191 మంది మరణాలకు సంబంధించి ఆయన దోషిగా తేలాడు. 183 మంది ఆకలితో మరణించగా, మరో ఎనిమిది మంది ప్రత్యక్ష హత్యలకు గురయ్యారు.
ఈ ఘటనను ప్రపంచవ్యాప్తంగా ‘షకహోలా మారణకాండ’గా పిలుస్తారు. మెకెంజీతో పాటు మరో 28 మంది సహనిందితులకు కూడా కోర్టు వివిధ కాలపరిమితులతో జైలు శిక్షలు విధించింది. ఆయన సహాయక మతబోధకుడు స్మార్ట్ మ్వాకలమాకు 160 ఏళ్ల శిక్ష విధించింది. మెకెంజీ తరఫు న్యాయవాదులు ఈ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు.
