
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పాలకులకు అత్యంత సన్నిహితులైన నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న పార్టీల రియాక్షన్స్ భిన్నంగా, విచిత్రంగా ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్నారు. ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కవిత విచారణను కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ కక్ష సాధింపు, వేధింపులకు పాల్పడుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే ఏపీలో చూస్తే... కేంద్రంపై ఈగ కూడా వాలనివ్వడం లేదు. ఎంతసేపూ సీబీఐని మాత్రమే టార్గెట్ చేయడం ఒక విచిత్రమైన పరిస్థితి. వైసీపీ దయనీయ స్థితిని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అధికార పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి, అలాగే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్‌చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఈ అరెస్టులపై ఏపీ నేతలు మాట్లాడే దిక్కే లేదు. అసలేమీ జరగనట్టే వ్యవహారం నడుస్తోంది.
ఇదే కవితకు ఈడీ నోటీసులు పంపిన మొదలు సీఎం కేసీఆర్ మొదలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా బీజేపీపై ఎదురు దాడికి దిగారు. పరస్పరం విమర్శల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈడీ నోటీసులు కాదు, మోదీ నోటీసులని మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు జరిగే రాష్ట్రంలో మోదీ రాకకు ముందు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ వస్తుంటాయని బీఆర్ఎస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు సెటైర్స్ విసురుతున్నారు. విచారణ సంస్థలను కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఉసిగొల్పుతోందని తెలంగాణ అధికార పార్టీ నేతలు విమర్శలు చేయడాన్ని గమనించొచ్చు.
ఇదే ఏపీకి వెళితే...కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తాజా విమర్శలను పరిశీలిద్దాం. సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాంసింగ్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన వాంగ్మూలం ఆడియో, వీడియో రికార్డు చేయడం లేదన్నారు. తన వెంట న్యాయవాదిని అనుమతించడం లేదని విమర్శించారు. రెండుసార్లు ఆడియో, వీడియో రికార్డు చేయాలని అడిగానని, వాళ్లు పట్టించుకోకపోతే హైకోర్టును ఆశ్రయించానన్నారు. ఈ కేసులో సీబీఐ విచారణ తప్పుదోవపడుతోందని మండిపడ్డారు. తప్పుడు సాక్ష్యాలతో అమాయకులను ఇబ్బంది పెడుతున్నారని అవినాష్ వాపోయారు.
విచారణ సమయంలో ఒక ల్యాప్‌టాప్ మాత్రమే పెడుతున్నారన్నారు. ల్యాప్‌టాప్‌లో రికార్డింగ్ చేస్తున్నారో లేదో తెలియదన్నారు. సీబీఐ వాళ్లే తమ సోదరి సునీతమ్మకు సమాచారం ఇస్తున్నారన్నారని ఆరోపించారు. కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తు న్నారని విమర్శించారు. తాను లంచ్‌మోషన్ వేసిన వెంటనే సోదరి సునీతకు సీబీఐ సమాచారం ఇచ్చిందన్నారు. దీని వెనుక పెద్ద కుట్రలున్నాయన్నారు. కంచె చేనుమేసే విధంగా సీబీఐ వ్యవహరిస్తోందని, ఇక తామెవరికి చెప్పుకోవాలని ఆయన నిస్సహాయ స్థితిలో ప్రశ్నించడం గమనార్హం.
సీబీఐ విచారణాధికారి కక్ష పూరితంగా వ్యవహరిస్తుంటే, ఆ విషయమై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేదా? అవినాష్‌రెడ్డికి మద్దతుగా వైసీపీ నిలబడడం అంటే.. అర్థం ఏంటి? అవినాష్‌రెడ్డిపై కుట్రలను భగ్నం చేయడం కాదా? మరెందుకని ఆ దిశగా వైసీపీ చర్యలు తీసుకోవడం లేదు. సీబీఐ ఏకపక్ష విచారణపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి వైసీపీ ఎందుకు ముందుకు రావడం లేదనే ప్రశ్నలకు సమాధానం ఏంటి? సీబీఐ దూకుడు వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం వుండదని ఎలా అనుకోవాలి? ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలేం జరుగుతున్నదో వాస్తవాలు ఎప్పుడు, ఎలా తెలుస్తాయి?.
ఒకవైపు వివేకా హత్య కేసులో సీబీఐ తన పని తాను చేసుకుపోతుంటే, వైసీపీ మాత్రం ఆ సంస్థపై విమర్శలతో సరిపెడుతోంది. ప్రశ్నించాల్సిన, నిలదీయాల్సిన వారిని మాత్రం మాట మాత్రమైనా వైసీపీ అనడం లేదు. ఇదేం రాజకీయం? తెలంగాణాలో అలా, ఏపీలో ఇలా....ఎంత వైరుధ్యం?