స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ పాలిట యుద్ధమే. సార్వత్రిక ఎన్నికల్ని యుద్ధంగా జగన్ పదేపదే అభివర్ణిస్తుంటారు. కానీ సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే, స్థానిక సంస్థల ఎన్నికలు సమరాన్ని తలపించాయి.
కూటమి పాలనలో గ్రామ, మండలస్థాయి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఎదురైన కష్టనష్టాలు అన్నీఇన్నీకావు. వైసీపీ ప్రతిష్టను కాపాడేందుకు ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు కేసుల్లో జైళ్లకు వెళ్లి వచ్చారు.
ప్రత్యర్థి పార్టీల రౌడీమూకల చేతుల్లో చావుదెబ్బలు తిన్నారు. వైసీపీ మహిళా కార్యకర్తలు, నాయకులు మానప్రాణాల్ని సైతం పణంగా పెట్టారంటే అతిశయోక్తి కాదు.
ఇవాళ వైసీపీకి కొద్దోగొప్పో సీట్లు వచ్చాయంటే, అదంతా కేడర్ వీరోచిత పోరాట ఘనతే. వైఎస్ జగన్‌పై అభిమానమే పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికైనా వెనుకాడని త్యాగాన్ని నింపింది.
అయితే ఏ జగన్ కోసమైతే క్షేత్రస్థాయిలో ఇంతగా పోరాడుతున్నారో, వారికి కనీసం ఆయన దర్శన భాగ్యం కూడా కలగడం లేదు. ఈ విషయంలో వైసీపీ నాయకత్వం సిగ్గుతో తలదించుకోవాలి.
ఎంతసేపూ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు మాత్రమే జగన్ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తూ, వారితోనే మాట్లాడించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకమాటలో చెప్పాలంటే ఎక్కువ మంది దొంగ నాయకులే వైఎస్ జగన్‌ను కలుస్తుండడం వల్లే పార్టీకి రాజకీయంగా నష్టం.
జగన్‌ను నిజంగా ప్రేమించే, అవసరమైతే ప్రాణాలు కూడా ఇవ్వడానికి వెనుకాడని కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల్ని కనీసం జగన్‌ను చూసేందుకు కలవనివ్వడం లేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన వారే కాకుండా, పోటీ చేసిన ప్రతి గ్రామ, పట్టణ నాయకులను జగన్ దగ్గరికి తీసుకెళ్లాలి. జగన్‌ను కలిసి, ఫొటో తీయించుకోవాలనే తీరని కలలతో సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు.
వైఎస్ జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన గెలుపు కోసం పని చేస్తున్నారు. కానీ ఇంత వరకూ అత్యధికులు జగన్‌తో కనీసం ఫొటో కూడా తీయించుకోని వారు లక్షల్లో ఉన్నారు.
ఎవరి కోసమైతే పని చేస్తున్నామో, వారితో జీవిత కాలం జ్ఞాపకంగా కలిసి ఫొటో తీసుకోవాలని అనుకుంటున్నారు. కూటమి తీవ్ర వేధింపులు, దౌర్జన్యాలను లెక్క చేయకుండా కార్పొరేటర్లగా, కౌన్సిలర్లగా, జెడ్పీ, ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేశారు.
నామినేషన్ల నాడు మొదలైన దాడులు, కౌంటింగ్ వరకూ ఎలా సాగాయో స్వయంగా జగనే వివరించారు. అలాంటి వాళ్లతో మాట్లాడ్డానికి జగన్ ప్రాధాన్యం ఇవ్వాలి. నియోజకవర్గ ఇన్‌చార్ట్‌ల్లో చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకుల్ని జగన్‌తో కలపడానికి అసలు ఇష్టపడడం లేదు.
తమలోనే జగన్, వైఎస్సార్‌ను చూసుకోవాలనే రీతిలో నాయకులు, కార్యకర్తలకు పరోక్షంగా చెబుతున్నారు. అయితే టీడీపీలో ఇలాంటి పరిస్థితి లేకపోవడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురి అవుతున్నాయి.
టీడీపీలో ప్రతి కార్యకర్త చంద్రబాబు, లోకేశ్‌ను ఏదో ఒక సందర్భంలో కలిసి, ఫొటో తీయించుకుని, జ్ఞాపకంగా మనసులో భద్రంగా దాచుకుంటున్నారు.
రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం టీడీపీ కేడర్ పని చేస్తోంది. అయితే జగన్‌పై అభిమానంతో టీడీపీ కేడర్ కంటే ఎక్కువగా పని చేస్తున్నా, డబ్బు ఖర్చుకాని చిన్నచిన్న కోరికల్ని కూడా తమ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు తీర్చడం లేదనే ఆవేదనలో వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు.
ఈ విషయమై వైఎస్ జగన్ స్వయంగా చొరవ తీసుకుని, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన వారిని రప్పించుకుని మాట్లాడాల్సిన అవసరం వుంది. ఆ పని చేస్తే, రెట్టించిన ఉత్సాహంతో వైసీపీ శ్రేణులు సార్వత్రిక ఎన్నికల్లో పని చేస్తాయి.
