నెగ్గాలంటే తగ్గడం కూడా తెలిసి వుండాలి. ఒక అడుగు వెనక్కి వేశామంటే, అది పది అడుగుల దూరాన్ని చేరుకునే ఆలోచన దాగి వుండాలి. ముఖ్యంగా రాజకీయాల్లో పట్టువిడుపులు ఎంతో అవసరం. కాలం కలిసి రానప్పుడు, పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించడం తెలివైన నాయకుల లక్షణం.
ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఎంతో తెలివిగా ప్రవర్తిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇదంతా వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ విడాకుల విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత విషయాలకు దూరంగా వుండాలని వైసీపీ ఆదేశాలు ఇవ్వడం, ఆ పార్టీలో వచ్చిన మార్పునకు సంకేతంగా చెబుతున్నారు.
నిజానికి వైఎస్ జగన్ కుటుంబ వ్యవహారాలపై వారి రాజకీయ ప్రత్యర్థులు పదేపదే దాడులు చేస్తున్నారు. జగన్‌ను బద్నాం చేయడానికి ఆయన కుటుంబ సభ్యులను తెరపైకి తీసుకొచ్చి, ఇదీ జగన్ క్యారెక్టర్ అంటూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు లాంటి వారు కూడా పదేపదే మాట్లాడుతున్నారు. తద్వారా చంద్రబాబు తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారనే విమర్శ కూడా వుంది.
రాజకీయంగా ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని ఇటీవల కాలంలో వైఎస్ జగన్ ప్రతిదీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తమ కుటుంబానికి కంచుకోటలైన పులివెందులతో పాటు సొంత జిల్లాలో టీడీపీ ఉద్దేశ పూర్వకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలకు తెగబడిందన్న అభిప్రాయంలో వైసీపీ ఉంది.
ఒక పోలీస్ ఉన్నతాధికారి పర్యవేక్షణలో ప్రతి చోటా పోలీసుల్ని ముందు పెట్టి, గతంలో ఎప్పుడూ లేనంతగా పాలక పార్టీ అరాచకాలకు పాల్పడిందని జాతీయస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని పులివెందులలో ఓటు వేసి, నేరుగా ఇంటికి వెళ్లాలే తప్ప, ఇతరత్రా వెళ్లడానికి కుదరదని పోలీస్ ఉన్నతాధికారి అన్నారు. ఈ విషయమై జగన్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆయన ఎంతో సంయమనంతో సమాధానం ఇచ్చారు.
ఎన్నికల అధికారిని కలవడం తన హక్కు అంటూ జగన్ కూల్‌గా సమాధానం ఇచ్చారు. అలాగే పులివెందులలో కళ్లెదుటే, ఇతర ప్రాంతాల నుంచి వెళ్లిన రౌడీమూకలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా, ఎక్కడా ప్రత్యక్ష చర్యలకు జగన్ పిలుపు ఇవ్వలేదు.
ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని మాత్రమే ఎన్నికల అధికారుల్ని జగన్ కోరారు. ఆవేశకావేశాలకు జగన్ వెళ్లకపోవడంతో టీడీపీ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యింది.
తాజాగా పవన్‌కల్యాణ్ మూడో భార్యకు విడాకులు ఇవ్వడంపై వైసీపీ నుంచి అనూహ్యమైన ప్రకటన వెలువడింది. ఇతరుల వ్యక్తిగత విషయాలపై ఎవరూ మాట్లాడొద్దని వైసీపీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో పవన్‌కల్యాణ్ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఒడిదుడుకులపై వైసీపీ అధికార ప్రతినిధులు, ఇతరత్రా నేతలంతా స్పందించలేదు.
ప్రజాసమస్యలే ముఖ్యమని, విడాకులు పవన్ వ్యక్తిగతం అని వైసీపీ నేతలు మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెప్పడాన్ని గమనించొచ్చు.
గతంలో వైసీపీలో ఇలాంటి పరిస్థితి వుండేది కాదు. ముఖ్యంగా పవన్ బహుభార్యత్వంపై వైఎస్ జగనే నేరుగా పదేపదే విమర్శలు చేసేవారు. ఇవన్నీ కూడా రాజకీయంగా పార్టీకి నష్టం తీసుకొచ్చాయని వైఎస్ జగన్ గ్రహించారు.
ప్రధానంగా వ్యక్తిగత విమర్శలకు దిగితే, అసలు అంశాలు పక్కదారి పడతాయనే మేల్కొలుపు జగన్‌లో రావడం వైసీపీకి శుభపరిణామం.
అయితే వైసీపీలో మార్పు, టీడీపీ, ఆ పార్టీ మీడియాకి అసలు రుచించడం లేదు. అబ్బే, తాము ఒప్పుకునేది లేదంటూ రెచ్చగొట్టడానికి వైసీపీ ప్రత్యర్థులు ప్రయత్నించారు. కానీ వారి పప్పులు ఉడకలేదు.
ఏ రకంగా చూసినా జనసేన తమకు ప్రధాన ప్రత్యర్థి కాదని వైఎస్ జగన్, ఆయన పార్టీ నాయకులు గ్రహించారు. అందుకే టీడీపీ, చంద్రబాబు, నారా లోకేశ్‌ను మాత్రమే జగన్‌తో పాటు వైసీపీ నాయకులు తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు.
కూటమిలో టీడీపీతో పాటు ప్రభుత్వంలో భాగస్వామ్యం వహిస్తున్న జనసేన, బీజేపీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అందుకు తగ్గట్టుగా జగన్, ఆయన పార్టీ నాయకులు ముందుకెళ్లడం రాజకీయంగా వైసీపీకి మంచి పరిణామం.
వైఎస్ జగన్‌లో ఓటమి తీసుకొచ్చిన మార్పుగా భావించాల్సి వుంటుంది. ఒక పెద్ద శత్రువుతో పోరాడేందుకు, అన్ని రకాలుగా సిద్ధంగా వుండాలి. చివరికి శత్రువుకు వారి మిత్రుల నుంచి సహకారం అందకుండా చేయడం యుద్ధ తంత్రంలో ఒక ఎత్తుగడ.
వైఎస్ జగన్ వ్యూహంతో టీడీపీ మిత్రుల్లో కూడా అంతర్మథనం మొదలయ్యే అవకాశం వుంది. తమను శత్రువుగా భావించిన వారి విషయంలో వ్యవహరించే తీరులో తప్పక మార్పు వస్తుంది. ఎందుకంటే, టీడీపీ కోసం ప్రత్యర్థులను శత్రువులుగా భావించేంత మూర్ఖత్వం ఎవరికీ వుండదు.
వైఎస్ జగన్‌లో తగ్గే మనస్తత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో సంతోషాన్ని కలిగిస్తోంది. నెగ్గాలంటే, ఇలా అందరినీ కలుపుకుని వెళ్లాలని, ప్రత్యర్థులు కాని వారి విషయంలో జాగ్రత్తగా నడవాలన్న ఆలోచన మంచిగా తోస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
రానున్న రోజుల్లో వైసీపీకి మంచి రోజులు వస్తాయనేందుకు, తమ నాయకుడిలో కనిపిస్తున్న మార్పే సంకేతమని వారు అంటున్నారు.

ఇంకొంచెం ఇలానే 2049 వరకు తగ్గి ఉండమను అన్నియని.
ఇదంతా నిజమని నమ్మితే నట్టేట్లో మునిగినట్టే.😄😄
అలాగే మొన్న పెళ్లి ఫంక్షన్ వీడియోస్ లో ఆ షిక్కటి శురునవ్వు కూడా చాలా ఆడ్ గా ఉంది అని కూడా ఎవరన్న చెపితే బాగుండు. లేకపోతే బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్ తీసుకొంటే ఇంకా మంచిది..
తగ్గడా వంగాడ