జ‌మ్మ‌ల‌మ‌డుగులో హ‌ద్దులు దాటిన ఆది!

వైఎస్సార్ క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే, బీజేపీ సీనియ‌ర్ నేత చ‌దిపిరాళ్ల ఆదినారాయ‌ణ‌రెడ్డి కేంద్రంగా విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది.

వైఎస్సార్ క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే, బీజేపీ సీనియ‌ర్ నేత చ‌దిపిరాళ్ల ఆదినారాయ‌ణ‌రెడ్డి కేంద్రంగా విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది.

అధికారంలో ఉన్న‌ప్పుడు ఆదినారాయ‌ణ‌రెడ్డి ఇష్టానుసారం పెత్త‌నం చెలాయిస్తుంటార‌నే పేరు వుంది. అధికారంలో లేక‌పోతే, జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో ఐదేళ్ల ప‌త్తా లేకుండా పోయాడ‌ని స్థానికులు గుర్తు చేస్తున్నారు.

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి మాట‌లు వివాదాస్ప‌దం అవుతూనే వున్నాయి.

ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్‌తో పాటు రాజకీయాల‌తో ఏ మాత్రం సంబంధం లేని ఆయ‌న స‌తీమ‌ణి భార‌తిని కూడా ఆదినారాయ‌ణ‌రెడ్డి విమ‌ర్శించ‌డాన్ని రాజ‌కీయాల‌కు అతీతంగా ప‌లువురు గుర్తు చేస్తున్నారు.

ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఆదినారాయ‌ణ‌రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై కేవ‌లం వైసీపీ శ్రేణులే కాదు, టీడీపీ, బీజేపీ నాయ‌కులు కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

అధికారంలో ఉన్నంత మాత్రాన‌.. ఇంత‌గా అతి చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి గురించి ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్పు ప‌ట్టే ప‌రిస్థితి.

తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని జ‌మ్మ‌ల‌మ‌డుగు మున్సిపాలిటీలోనూ, అలాగే ఎర్ర‌గుంట్ల న‌గ‌ర పంచాయ‌తీలో వైసీపీ అభ్య‌ర్థుల‌తో నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకోవ‌డంపై ప్ర‌తిప‌క్ష కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ర‌గిలిపోతున్నారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ అదే జ‌రిగింది.

తాజాగా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌ద్ద‌తుదారుల‌తో నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున గూండాల‌ను రంగంలోకి దింప‌డంపై సామాన్య ప్ర‌జ‌లు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రౌడీయిజం చేయ‌డానికేనా తాము ఎన్నుకున్న‌ద‌ని పౌర స‌మాజం ప్ర‌శ్నిస్తోంది.

జ‌మ్మ‌ల‌మ‌డుగే కాకుండా, ప‌క్క‌నే ఉన్న పులివెందుల నియోజ‌క వ‌ర్గంలోనూ అడుగు పెట్టి, తీవ్ర విద్వేషాల్ని ర‌గ‌ల్చ‌డంలో ఆదినారాయ‌ణ‌రెడ్డి కీల‌క పాత్ర పోషించారు. ఈ విష‌యాన్నే తానే రెండు రోజులుగా మీడియా స‌మావేశాల్లో కూడా ఆదినారాయ‌ణ‌రెడ్డి చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఆదినారాయ‌ణ‌రెడ్డి చాలా అతి చేస్తున్నార‌ని, ఈ ప‌రిణామాలు భ‌విష్య‌త్‌లో ఎలాంటి ప‌రిస్థితికి దారి తీస్తాయో అనే చ‌ర్చ కూడా పెద్ద ఎత్తున వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో జ‌రుగుతోంది.

ఆదినారాయ‌ణ‌రెడ్డి చ‌ర్య‌ల కంటే, ఆయ‌న మాట‌లు మ‌రింత ఆగ్ర‌హాన్ని, ఆవేశాన్ని క‌లిగిస్తున్నాయ‌ని ప‌లువురు అంటున్నారు. నిజానికి ఆదినారాయ‌ణ‌రెడ్డిలో మంచి గుణాలు లేక‌పోలేదు. న‌మ్మిన వారి కోసం ఎందాకైనా అండ‌గా నిలిచే మంచి స్వ‌భావం ఆయ‌న‌లో వుంద‌ని చెబుతున్నారు. అలాంటి నాయ‌కుడు ప్ర‌జాస్వామ్య బద్ధంగా వ్య‌వ‌హ‌రించి వుంటే, మంచి పేరుతో పాటు రాజ‌కీయాల్లో మ‌రికొంత కాలం కొన‌సాగే అవ‌కాశం వుండేది.

కానీ ఈ ద‌ఫా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై అక్క‌డి పౌర స‌మాజం ఏ మాత్రం సంతృప్తిగా లేదు. పైగా తీవ్ర ఆగ్ర‌హంతో ఆయ‌న‌పై ర‌గిలిపోతోంది. దాని ఫ‌లితం ఇప్పుడు అధికారంలో ఉండ‌డంతో ఆదికి తెలిసే అవ‌కాశం వుండ‌దు. అన్నింటికీ కాల‌మే జ‌వాబు చెబుతుంద‌నే మాట స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.