జనసేన వాటాలు పెంచాలంటే.. బాబుకు చిక్కే!

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఎన్డీయే కూటమి పార్టీల మధ్య ప్రాథమిక కసరత్తు మొదలైంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఎన్డీయే కూటమి పార్టీల మధ్య ప్రాథమిక కసరత్తు మొదలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చికాకులు లేవు. వారు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోగల స్థితిలోనే ఉన్నారు. ఎటొచ్చీ కూటమి పార్టీల మధ్య వాటాల పంపకం విషయంలో పేచీలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.

ఈ సంగతి తేల్చుకోవడానికి ప్రాథమికంగా మూడు పార్టీల నాయకుల సమావేశం.. పల్లా శ్రీనివాసరావు ఇంట్లోనే జరిగింది. వాటాలకు సంబంధించి ఏమీ తేల్చకపోగా.. ఈ భేటీలో కూడా.. జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లడంలోనే నేతలు ప్రధానంగా దృష్టి పెట్టారు. కాకపోతే.. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ మాటలను గమనిస్తోంటే.. వాటాల పంపకం అంత సాఫీగా సాగకపోవచ్చుననే అనుమానం పలువురికి కలుగుతోంది.

జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ కీలక నిర్ణయాత్మక శక్తి అనే సంగతి అందరికీ తెలిసిందే. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీకి దక్కగల వాటా గురించి ఆయన ఇండైరక్టుగా సంకేతాలు ఇస్తున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు.. జనసేన- బిజెపి రెండు పార్టీలకు కలిపి 175 సీట్లకు గాను కేవలం 31 సీట్లు మాత్రమే కేటాయించిన సంగతి తెలిసిందే.

అధికారంలోకి వచ్చిన తర్వాత.. నామినేటెడ్ పదవుల పంపకం గట్రా అన్ని వ్యవహారాల్లోనూ అదే దామాషా కొనసాగుతుందని చంద్రబాబు వేర్వేరు సందర్భాల్లో తెగేసి చెప్పారు. అదే విధంగా ఆ రెండు పార్టీలకు కలిపి నామమాత్రపు పదవులు పంచుతున్నారు.

నిజానికి అటు జనసేన, ఇటు బిజెపి రెండు పార్టీలు కూడా.. రాష్ట్రంలో తమకు ఉన్న వాస్తవ బలం కంటె చాలా తక్కువగా అసెంబ్లీ సీట్లు పొందామని, ఆమేరకు జగన్ ను ఓడించడానికి తాము చాలా త్యాగాలు చేసామనే అభిప్రాయంతోనే ఉన్నాయి. నాదెండ్ల కూడా తన మాటల్లో అదే ధ్వనింపజేస్తున్నారు.

2024 నాటి పొత్తు అప్పటి పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రయోజనాలకోసం పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయమని, అప్పట్లో తాము ఒక అడుగు వెనక్కు తగ్గామని అంటున్నారు. అప్పటి వాటాల ఫార్ములా స్థానిక ఎన్నికల్లో కూడా ఉంటుందనే ప్రచారం కరెక్టు కాదని అంటున్నారు. స్థానిక పరిస్థితులు బలాబలాల్ని బట్టి.. ఎవరికెన్ని అనే నిర్ణయం ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

జనసేన తమకు దక్కే సీట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తే.. బిజెపి ఊరుకుంటుందని అనుకోలేం. అసలే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తామే సొంతంగా అధికారంలోకి రాగల పరిస్థితి కోసం బిజెపి ఎదురుచూస్తుంటుంది. అలాంటిది.. స్థానిక ఎన్నికల రూపంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే అవకాశాల్ని వారు వదులుకోరు. మరి ఈ రెండు పార్టీలకు సీట్లు పెంచితే.. తెలుగుదేశంలో స్థానికంగా కుమ్ములాటలు మొదలవుతాయి.

ఈ రెండు పార్టీలు లేకపోయినా కూడా.. 2024లో తాము గెలిచి అధికారంలోకి వచ్చి ఉండేవారం అనే నాయకులు ఇప్పటికీ ఆ పార్టీలో ఉన్నారు. వారంతా స్థానిక ఎన్నికల సీట్లు తగ్గితే చంద్రబాబుపై గట్టిగా ఒత్తిడి తెస్తారు. ఈనేపథ్యంలో స్థానిక ఎన్నికల పరిణామాలు.. కూటమిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

2 Replies to “జనసేన వాటాలు పెంచాలంటే.. బాబుకు చిక్కే!”

Comments are closed.