చేతులు కాలాక… ఆకులు ప‌ట్టుకున్న జ‌న‌సేన‌!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీరు సొంత పార్టీలో తీవ్ర వ్య‌తిరేక‌త‌కు దారి తీసింది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీరు సొంత పార్టీలో తీవ్ర వ్య‌తిరేక‌త‌కు దారి తీసింది. ఈ నేప‌థ్యంలో చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న సామెత‌ను… తాజాగా పంచాయతీ ఎన్నిక‌ల్లో పోటీపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆదేశాలు గుర్తు చేస్తున్నాయి. మూడో విడ‌త‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్లు వేసేందుకు ఇక ఒక్క రోజు మాత్ర‌మే గ‌డువు వుంది.

ఈ నేప‌థ్యంలో కూట‌మిలో ఎవ‌రికి వారు య‌మునా తీరే అనే రీతిలో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మూడు పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, జ‌న‌సేన నాయ‌కుల్ని టీడీపీ అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు.

జ‌న‌సేన మ‌ద్ద‌తుతో స‌ర్పంచ్ ఎన్నిక‌ల బ‌రిలో దిగిన అభ్య‌ర్థుల్ని సైతం టీడీపీ గూండాలు విడిచిపెట్ట‌డం లేదు. వైఎస్సార్ క‌డ‌ప జిల్లా చ‌క్రాయ‌పేట మండ‌లంలో నామినేష‌న్ల ప‌రిశీల‌న సంద‌ర్భంగా జ‌న‌సేన అభ్య‌ర్థితో పాటు ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని టీడీపీ గూండాలు వెంట‌ప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన కార్య‌క‌ర్త గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో జ‌న‌సేన అధిష్టానంలో చిన్న క‌ద‌లిక వున్న‌ట్టు… ఇవాళ్టి ఆ పార్టీ ట్వీట్ చూస్తే ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశార‌ని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను, జనసేన నాయకులు అడ్డుకోకూడదనే ఆదేశాలు ప‌వ‌న్ జారీ చేసిన‌ట్టు వెల్ల‌డించారు.

మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవని ఆల‌స్యంగా జ‌న‌సేన స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు పార్టీ ర‌హితంగా జ‌రుగుతాయ‌ని అంద‌రికీ తెలుసు. ఈ ఎన్నిక‌ల్లో ఎలాంటి సీట్ల పంప‌కాలు వుండ‌వ‌ని, ఎవ‌రికి వారు పోటీ చేయొచ్చ‌ని… ఇదే ప్ర‌క‌ట‌న ప‌ది రోజుల క్రితం ప్ర‌క‌టించే వుంటే, వేరేగా వుండేది. కానీ ఆ ప‌ని జ‌న‌సేన అధిష్టానం ఎందుకు చేయ‌లేదో ఆ పార్టీ పెద్ద‌ల‌కే తెలియాలి.

ఇప్పుడు రాయ‌ల‌సీమ‌లో త‌మ వారిని సైతం టీడీపీ రౌడీలు కొడుతున్నార‌ని ఫిర్యాదులు వ‌చ్చాక మాత్ర‌మే… ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించ‌డం గ‌మ‌నార్హం. అది కూడా నామినేష‌న్ల‌కు కేవ‌లం ఒక్క రోజు గ‌డువు ఉన్న స‌మ‌యంలో చెప్ప‌డం విశేషం.

One Reply to “చేతులు కాలాక… ఆకులు ప‌ట్టుకున్న జ‌న‌సేన‌!”

  1. నాగుల చవితి పండగ ఉండడం వల్ల కాస్త లేట్ అయింది.. లేకపోతే ఎప్పుడో ఇచ్చేవారు..

Comments are closed.