చింత‌కాయ‌ల‌ విజ‌య్‌పై జ‌న‌సేన ఫైర్‌.. ఎందుకంటే?

టీడీపీ యువ నేత‌, రాజ్యస‌భ స‌భ్యుడు చింత‌కాయ‌ల విజ‌య్‌పై జ‌న‌సేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

టీడీపీ యువ నేత‌, రాజ్యస‌భ స‌భ్యుడు చింత‌కాయ‌ల విజ‌య్‌పై జ‌న‌సేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. న‌ర్సీప‌ట్నం మున్సిపాలిటీలో వైస్ చైర్మ‌న్ ప‌ద‌విని జ‌న‌సేన‌కు కేటాయించారు. న‌ర్సీప‌ట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మ‌న్‌గా అద్దేప‌ల్లి సౌజ‌న్య పేరును ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఖ‌రారు చేశారు.

న‌ర్సీప‌ట్నం మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్‌గా స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి ఎన్నిక‌య్యారు. ఇవాళ చైర్‌ప‌ర్స‌న్‌తో పాటు కౌన్సిల‌ర్ల ప్ర‌మాణ స్వీకారంతో పాటు వైస్ చైర్మ‌న్ ఎన్నిక కూడా చేప‌ట్టాల్సి వుండింది. అయితే వైస్ చైర్మ‌న్ ఎన్నిక త‌ప్ప‌, మిగిలిన అన్ని కార్య‌క్ర‌మాలు స‌వ్యంగా సాగడం విశేషం.

వైస్ చైర్మ‌న్ ప‌ద‌వికి జ‌న‌సేన అధిష్టానం నిర్ణ‌యించిన అద్దేప‌ల్లి సౌజ‌న్య‌ను ఎన్నుకోడానికి చింత‌కాయ‌ల కుటుంబం సిద్ధంగా లేన‌ట్టు తెలుస్తోంది. దీనికి బ‌ల‌మైన కారణం లేక‌పోలేదు.

నిజానికి మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ అభ్య‌ర్థిత్వాన్ని జ‌న‌సేన ఆశించింది. అందుకే చైర్‌ప‌ర్స‌న్ అభ్య‌ర్థిగా సౌజ‌న్య జ‌న‌సేన త‌ర‌పున రెబ‌ల్‌గా నామినేష‌న్ వేశారు. దీంతో న‌ర్సీప‌ట్నం మున్సిపాలిటీలో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య విభేదాలు ర‌చ్చ‌కెక్కాయి.

అయితే ఇరుపార్టీల పెద్ద‌ల జోక్యంతో చివ‌రికి సౌజ‌న్య వెన‌క్కి త‌గ్గారు. అయితే కౌన్సిల‌ర్‌గా ఆమె ఎన్నిక‌య్యారు. ఇవాళ వైస్ చైర్మ‌న్‌గా ఆమెను ఎన్నుకోవాల‌ని జ‌న‌సేన అధిష్టానం ఆదేశించింది. అయితే వైస్ చైర్మ‌న్‌గా సౌజ‌న్య‌ను ఎన్నుకోవ‌డంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

సౌజ‌న్య‌కు సంబంధించి ఏ, బీ ఫామ్‌లు ఆల‌స్యంగా అందాయ‌నే కార‌ణంతో వైస్ చైర్మ‌న్ ఎన్నిక వాయిదా వేసిన‌ట్టు ఆర్డీవో వీవీ ర‌మ‌ణ తెలిపారు. నిజానికి ఉద‌యం ప‌ది గంట‌ల్లోపు ఏ, బీ ఫామ్‌లు ఇవ్వ‌లేద‌న్న‌ది కేవ‌లం సాకు మాత్ర‌మే అని జ‌న‌సేన నాయ‌కులు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.

మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్‌గా సౌజ‌న్య రెబ‌ల్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిల‌బ‌డ‌డాన్ని మ‌న‌సులో పెట్టుకుని, ఆమెను అడ్డుకోడానికి ఎంపీ చింత‌కాయ‌ల విజ‌య్ కుట్ర‌లు చేశార‌ని జ‌న‌సేన నేత‌లు మండిప‌డుతున్నారు.

అందుకే వైస్ చైర్మ‌న్ ఎన్నిక అనే మాట వ‌చ్చే స‌రికి కౌన్సిల్ స‌మావేశం నుంచి టీడీపీ స‌భ్యులు బ‌య‌టికి వెళ్ల‌డాన్ని జ‌న‌సేన నేత‌లు గుర్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇప్ప‌టికే ప‌లుచోట్ల వైస్ చైర్మ‌న్ల ఎన్నిక విష‌యంలో జ‌న‌సేన‌కు టీడీపీ షాక్ ఇచ్చింది. న‌ర్సీప‌ట్నంలో కూడా అదే పున‌రావృతం అవుతుంద‌న్న ఆందోళ‌న వారిలో క‌నిపిస్తోంది.