మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అంటే ఏపీలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్‌గా చూస్తారు. 120 వార్డులు ఉన్న కార్పొరేషన్ ఏపీలో మరొకటి లేదు.
వంద వార్డులు ఉన్న రెండో కార్పొరేషన్ కూడా లేదు. దేశంలోని టాప్ పది కార్పొరేషన్లలో జీవీఎంసీ ఒకటి. ఆదాయపరంగా చూసినా ఏటా ఐదు వేల కోట్ల బడ్జెట్‌తో అగ్రస్థానంలో ఉంది.
అలాంటి జీవీఎంసీకి మేయర్ పదవి అంటే మంత్రి పదవితో సమానంగా కూడా అంచనా వేస్తారు. అలాంటి చోట మేయర్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంటే ప్రచారం మాత్రం మొక్కుబడిగానే సాగుతోంది. అగ్ర నేతలు ఎవరూ ఈ వైపునకు చూడటం లేదని చర్చ సాగుతోంది.
విశాఖ మేయర్ ఎన్నికలకు సంబంధించి కూటమి నుంచి పెద్ద నాయకులు వస్తారని అంతా అనుకున్నారు. 2021లో ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నా కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చారు.
అప్పట్లో ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. కానీ ఆయన ప్రచారం చేయలేదు. ప్రస్తుతం చూస్తే ప్రచార పర్వంలో కూటమి నుంచి పెద్ద నాయకులు ఎవరూ పాలుపంచుకోవడం లేదు.
వైసీపీ విషయం కూడా అలాగే ఉంది. ఉత్తరాంధ్ర సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పూర్తిగా విజయనగరం జిల్లా మీదనే దృష్టిని పెట్టారు. దాంతో రెండు వైపుల నుంచి చప్పగానే ప్రచారం సాగుతోంది.
మధ్యలో ఆర్నాబ్ తుఫాన్ కూడా రావడంతో ప్రచారం అనుకున్న స్థాయిలో సాగడం లేదు. సమయం తక్కువగా ఉండడం మరో కారణం. దాంతో రెండు దశాబ్దాల తర్వాత ప్రత్యక్ష ఎన్నికల విధానంలో మేయర్ ఎన్నిక జరుగుతుంటే ఆ స్థాయిలో సందడి అయితే లేదని అంటున్నారు.
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి కంటే పెద్దది అయిన మేయర్ ఎన్నిక ఇది. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఈ కీలకమైన ఎన్నిక ప్రచారం మాత్రం చడీచప్పుడు లేకుండా సాగుతోంది.

ఏమి ఉంది ఎటు అధికారం ఉంటే అటు పోతారు మళ్ళీ వైస్సార్సీపీ వస్తే అటు పోతారు అలాంటి వారికోసం మా మనం పోరాడేది