తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలు, ప్రాంతాలున్నా కడపకు ఓ ప్రత్యేకత ఉంది. దానికి కారణాలేమైనా కావచ్చు. కడప అంటే ఓ క్రేజీ. వివిధ రంగాలకు చెందిన మహానుభావులకు కడప గడ్డ జన్మనిచ్చింది. ఎన్నో విశిష్టతలకు కడప కేంద్రంగా నిలిచింది. కానీ కడప గొప్పతనాన్ని చెప్పడానికి కొందరికి మనస్కరించదు. ఇందుకు రాజకీయాలే కారణమని చెప్పక తప్పదు.
కడప జిల్లా పులివెందుల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే గిట్టని వాళ్లు, చివరికి ఆ ప్రాంతంపై విషం చిమ్మడానికి వెనుకాడడం లేదు. ఒక్క పులివెందుల, కడప వరకే నెగెటివ్ ప్రచారం చేయడానికి పరిమితం కాలేదు. రాయలసీమ అంతటిని దుర్మార్గ ప్రాంతంగా చిత్రీకరించడం వెనుక రాజకీయ స్వార్థం దాగి వుందనేది జగమెరిగిన సత్యం. కడపలో జూదరులు దొరికినా సీఎం సొంత జిల్లా అనడం ప్యాషనైంది.
ఇదంతా చెప్పడం ఎందుకంటే ఈ నెల 20న ఆ ప్రాంతంలో జనసేనాని పవన్‌కల్యాణ్ పర్యటిస్తుండడమే కారణం. కడపకు వెళుతున్నారంటే చాలు… అదేదో సాహసేపోత పర్యటన అన్నట్టు ప్రత్యర్థులు భావిస్తున్నారని వారి మాటలు, నడవడిక చెబుతున్నాయి. ఇదే చిత్తూరు జిల్లాకు వెళితే మాత్రం చంద్రబాబు ఊరికి వెళుతున్నారనే ఫీలింగ్ ఏ ఒక్కరికీ కలగదు. ఈ ధోరణి వైఎస్ కుటుంబానికి సొంత జిల్లాతో ఏర్పరచుకున్న విడదీయలేని అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. అసలు చంద్రబాబు ఏనాడూ తనది రాయలసీమ, చిత్తూరు జిల్లా అని మాతృస్థలంపై మమకారం ప్రదర్శించరు.
ఆయనకు రాజకీయంగా ఏది ఉపయోగపడుతుందని నమ్ముతారో అదే తన అడ్డా అని నమ్ముతారు. తన సామాజిక వర్గం బలంగా ఉన్న అత్తింటివారి ప్రాంతమే తన పుట్టింటిగా చంద్రబాబు భావిస్తున్నట్టున్నారు. చివరికి తనకు జన్మనిచ్చిన రాయలసీమపై విషం చిమ్మడానికి కూడా చంద్రబాబు వెనుకాడని నైజాన్ని పలు సందర్భాల్లో చూశాం. ఇప్పుడు పవన్‌కల్యాణ్‌లోనూ అదే ధోరణి.
పవన్‌కల్యాణ్‌ది ఏ జిల్లానో ఆయనకే స్పష్టత లేదు. నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు తానిక్కడి వాడినే అని ఆయన చెబుతుంటారు. కానీ బలమైన ముద్ర తాను పుట్టిన ప్రాంతంపై వేయలేదన్నది నిజం. ఎందుకంటే భీమవరంలో పవన్ గెలవకపోవడమే నిదర్శనం.
అందుకే కోస్తా జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే, మీ జిల్లాకు ఎందుకు పెట్టలేదని జగన్‌ను పవన్ ప్రశ్నించడాన్ని గమనించొచ్చు. ఇప్పుడు సీఎం సొంత జిల్లాకు తమ నాయకుడు వెళుతున్నారని జనసేన నేతలు ఉద్వేగంతో చెప్పడం విశేషం. ఇది వైఎస్ కుటుంబం తన ప్రాంతంపై వేసిన బలమైన ముద్ర. జనసేన కౌలురైతు భరోసా యాత్రలో భాగంగా పవన్ పర్యటన ఉమ్మడి కడప జిల్లాలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో రచ్చబండ కార్యక్రమంలో పవన్ ఏం మాట్లాడ్తారో చూద్దాం.