శ‌బ‌రిని ఎంపీగా గుర్తించ‌ని టీడీపీ ఎమ్మెల్యేలు!

బైరెడ్డి శ‌బ‌రి…నంద్యాల ఎంపీ. కానీ ఈమెను క‌నీసం ఎంపీగా గుర్తించ‌డానికి టీడీపీ ఎమ్మెల్యేలు నిరాక‌రిస్తున్నారు.

బైరెడ్డి శ‌బ‌రి…నంద్యాల ఎంపీ. కానీ ఈమెను క‌నీసం ఎంపీగా గుర్తించ‌డానికి టీడీపీ ఎమ్మెల్యేలు నిరాక‌రిస్తున్నారు. పోనీ శ‌బ‌రి ఏమైనా ప్ర‌తిప‌క్ష పార్టీ ఎంపీనా? అంటే , కానే కాదు. టీడీపీ త‌ర‌పునే ఆమె నంద్యాల లోక్‌స‌భ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. నంద్యాల లోక్‌స‌భ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి టీడీపీ అభ్య‌ర్థులే గెలుపొందారు. నంద్యాల ఎమ్మెల్యే, మంత్రి ఫ‌రూక్‌తో మిన‌హా మిగిలిన ఏ ఒక్క‌రితోనూ ఆమెకు స‌త్సంబంధాలు లేవు.

నంద్యాల లోక్‌స‌భ ప‌రిధిలో ఆళ్ల‌గ‌డ్డ‌, డోన్‌, నందికొట్కూరు, నంద్యాల‌, పాణ్యం, బ‌న‌గాన‌ప‌ల్లె, శ్రీ‌శైలం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. నంద్యాల పార్ల‌మెంట్ ప‌రిధిలో శ‌బ‌రి ప‌ర్య‌టిస్తే, ఆమె కార్య‌క్ర‌మంలో పాల్గొన‌కూడ‌ద‌ని టీడీపీ ఎమ్మెల్యేలు త‌మ అనుచ‌రుల‌కు వార్నింగ్ ఇస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అందుకే శ‌బ‌రి నంద్యాల పార్ల‌మెంట్ ప‌రిధిలో ప‌ర్య‌టించినా టీడీపీ నాయ‌కులెవ‌రూ క‌నిపించ‌డం లేదు.

గ‌తంలో నంద్యాల జిల్లా బీజేపీ అధ్య‌క్షురాలిగా శ‌బ‌రి ప‌ని చేశారు. ఆ త‌ర్వాత టీడీపీలో చేరి నంద్యాల లోక్‌స‌భ స్థానాన్ని ద‌క్కించుకున్నారు. కూట‌మి సునామీలో ఆమె అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌కు ఎన్నిక‌య్యే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నారు. ఎంపీ అయిన త‌ర్వాత లోక్‌స‌భ ప‌రిధిలో ఎక్క‌డికెళ్లినా, క‌నీసం ఆమెను ప‌ల‌క‌రించే ప‌రిస్థితి లేదంటే, విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

శ‌బ‌రికి స్థానం ఇస్తే, నెత్తినెక్కి కూచుంటార‌నే భ‌య‌మే ఆమెను సొంత పార్టీ నేత‌లు దూరం పెట్టేలా చేసింద‌నే వాద‌న వినిపిస్తోంది. కానీ ఎన్నిక‌ల సంద‌ర్భంలో తామిచ్చిన డ‌బ్బు మాత్రం నిర్మొహ‌మాటంగా తీసుకున్నార‌ని, అప్పుడు ఈ పౌరుషం ఏమైంద‌ని శ‌బ‌రి అనుచ‌రులు నిల‌దీస్తున్నారు. టీడీపీకి ఎన్నిక‌ల ఫండ్ కింద రూ.70 కోట్లు, ఇది కాకుండా ఎన్నిక‌ల్లో రూ.80 కోట్లు …మొత్తం రూ.150 కోట్లు పెట్టి ఎంపీ సీటును కొనుక్కున్న‌ట్టైంద‌ని శ‌బ‌రి అనుచ‌రులు వాపోతున్నారు.

భారీ మొత్తంలో ఖ‌ర్చు పెట్టి, ఎంపీగా గెలుపొంది ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రిద్దామ‌ని క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తుంటే ఏ ఒక్క ప్ర‌జాప్ర‌తినిధి రావ‌డం లేద‌ని మండిప‌డుతున్నారు. నందికొట్కూరులో మాండ్ర శివానంద‌రెడ్డి అనుచ‌రుడు గిత్తా జ‌య‌సూర్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్క‌డ బైరెడ్డి, ఎమ్మెల్యే వ‌ర్గాలు వేర్వేరుగానే రాజ‌కీయాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. నంద్యాల‌లో మాత్రం మంత్రి ఫ‌రూక్ క‌లుపుకుని వెళ్తున్నారు.

మిగిలిన ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో శ‌బ‌రిని ప్ర‌త్య‌ర్థిగానే టీడీపీ ఎమ్మెల్యేలు చూసే ప‌రిస్థితి. వామ్మో బైరెడ్డి వాళ్ల‌ను భ‌రించ‌లేం బాబోయ్ అని దూరం జ‌రుగుతున్నారు. అదే నిజ‌మైతే ఎన్నిక‌ల్లో తామిచ్చిన డ‌బ్బును ఎందుకు తీసుకున్నార‌నేది శ‌బ‌రి, ఆమె అనుచ‌రుల ప్ర‌శ్న‌. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి వార‌సురాలిగా శ‌బ‌రి రాజకీయాల్లోకి వ‌చ్చారు. తండ్రి మాదిరిగానే శ‌బ‌రిలో వెట‌కారం ఎక్కువే. ప‌బ్లిసిటీ అటెన్ష‌న్ ఎక్కువ‌నే విమ‌ర్శ వుంది. కాస్త చోటిస్తే అంద‌రినీ తొక్కేస్తార‌నే భ‌యం టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధుల్ని వెంటాడుతోంది. అందుకే ఆమెను ఎంపీ కోటా నిధుల్ని కూడా అడిగే దిక్కులేద‌నే మాట వినిపిస్తోంది.

ఒక‌వేళ నిధులు కేటాయించినా, జోక్యం చేసుకోకూడ‌ద‌ని, అంతా తామే చూసుకుంటామ‌ని ఎంపీకి ఎమ్మెల్యే త‌ర‌పు వారు తెగేసి చెబుతున్నార‌ని తెలిసింది. నంద్యాల పార్ల‌మెంట్ ప‌రిధిలో కూట‌మి రాజ‌కీయం ఆ ర‌కంగా ముందుకెళుతోంది.

4 Replies to “శ‌బ‌రిని ఎంపీగా గుర్తించ‌ని టీడీపీ ఎమ్మెల్యేలు!”

Comments are closed.