Advertisement

Advertisement


Home > Politics - Andhra

గుంటూరు వెస్ట్ లో కూట‌మి క‌కావిక‌లం!

గుంటూరు వెస్ట్ లో కూట‌మి క‌కావిక‌లం!

గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం కూట‌మి పాలిటిక్స్ చిత్రాతిచిత్రంగా ఉన్నాయి! ఒక‌రుకాదు ఇద్ద‌రు కాదు.. అనేక మంది ఆశావ‌హులు ఇక్క‌డ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిని ప‌ట్టించుకోవ‌డం మానేశారు! ఎన్నిక‌ల‌కు అర‌వై రోజుల ముందు ఇక్క‌డ‌కు దిగిన తెలుగుదేశం అభ్య‌ర్థికి పాత వాళ్లంతా ఎవ‌రికి వారుగా ఝ‌ల‌క్ లు ఇస్తున్నారు!

ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున మ‌ద్దాలి గిరిధ‌ర్ ఎమ్మెల్యేగా నెగ్గి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారు! ఆయ‌న గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న క్యాడ‌ర్ ను పార్టీ కోసం ప‌ని చేయించుకుంటూ ఉన్నారు. అలా టీడీపీకి మొద‌టి మైన‌స్ పడింది!

ఇక గిరిధ‌ర్ అనంత‌రం కోవెల‌మూడి నానిని ఇన్ చార్జిగా ప్ర‌క‌టించారు. ఆయ‌న నాలుగున్న‌రేళ్లు ఇన్ చార్జిగా ప‌ని చేశారు! అయితే ఆయ‌న‌కు టీడీపీ టికెట్ ఇవ్వ‌లేదు! అదేమంటే ఆయ‌న‌ను రాయ‌ల‌సీమ టీడీపీ ఇన్ చార్జిగా పంపేశారు! నాలుగున్న‌రేళ్ల పాటు ఇక్క‌డ ఇన్ చార్జిగా పనిచేసిన వ్య‌క్తిని నియోజ‌క‌వ‌ర్గానికి దూరం చేసేయ‌డంతో.. ఆయ‌న ఇదే అవ‌కాశం అని టీడీపీ అభ్య‌ర్థి గ‌ల్లా మాధ‌విని ప‌ట్టించుకోవ‌డం మానేశారు! అదేమంటే రాయ‌ల‌సీమ పార్టీ బాధ్య‌త‌ల‌తో బిజీ అంటున్నార‌ట‌!

క‌ట్ చేస్తే.. రెండు నెల‌ల కింద‌ట ఇక్క‌డ అడుగుపెట్టిన మాధ‌విని ప‌ట్టించుకునే స్థానిక నాయ‌క‌త్వం లేకుండా పోయింది. నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రేంటో, ఎవ‌రి స్థాయి ఏమిటో, ఎవ‌రి ప‌లుకుబ‌డి ఏమిటో, ఇన్నాళ్లూ వాళ్లంతా ఏ స్థాయిలో ప‌ని చేశారో కూడా అవ‌గాహ‌న సంపాదించుకోవ‌డానికి కూడా ఆమెకు స‌మ‌యం స‌రిపోవ‌డం లేదు! దీంతో క్యాడ‌ర్ లో స‌హ‌జంగానే అస‌హ‌నం రేగుతూ ఉంది!  ఇంక కోవెలమూడి నానీకి చెబుదామంటే ఆయన రాయలసీమలో బిజీగా ఉన్నట్టు నటిస్తున్నాడని అంటున్నారు. 

ఇక జ‌న‌సేన‌, బీజేపీల నుంచి ఆమెకు ఏమైనా స‌హ‌కారం అందుతోందా అంటే అదో చిత్ర‌మైన క‌థ‌! ముఖ్యంగా గుంటూరు పశ్చిమ సీటు ఆశించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ సైలంట్ అయిపోయారు. ప్రస్తుతం బయటకు రావడం లేదు. జనసేన కార్యకర్తలను ఒకచోటుకి పిలవడం, వారితో మీటింగులు పెట్టడం ఏమీ చేయడం లేదు. అంతా నిర్లిప్తంగా నడిపిస్తున్నారు. అలాగే వైసీపీ మీద మాట్లాడితే ఒంటికాలి మీద లేచే బోనబోయిన నేడు మౌనవ్రతంలో ఉండిపోయాడు.

మరోవైపు బీజేపీ నేత, జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న వల్లూరి జయప్రకాష్ నారాయణ ప్రస్తుతం ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. ఆయనకి జాతీయ స్థాయి నాయకులు జేపీ నడ్డాలాంటి కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. అందుకని అక్కడే ఆయన కాలక్షేపం చేస్తున్నారు. గుంటూరు పశ్చిమవైపు ఒంగి తొంగి చూడటం లేదు. 

ఇక తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ ఆల‌పాటి రాజా మీద కూడా గ‌ల్లా మాధ‌వి కొన్ని ఆశ‌లు పెట్టుకున్నారు! అయితే ఆయ‌న కూడా తెలుగుదేశం పార్టీకి దూరంగానే ఉన్నాడు. ఆర్థికంగా, కమ్మ సామాజికవర్గం పరంగా మంచి సపోర్టుగా ఉండే ఆయ‌న‌కు అటు తెనాలి ఇవ్వలేదు. ప్ర‌త్యామ్నాయంగా ఆయ‌న ఈ సీటు ఆశించారు, కానీ ఇక్క‌డా ఇవ్వ‌లేదు! ఎక్కడి నుంచో కొత్తగా వచ్చిన అభ్య‌ర్థికి టికెట్ కేటాయించారు.  ఏ ప్రాతిపదికన చంద్రబాబు సీటు ఇచ్చారో అర్థం కావడం లేదని, ఆయన  ముభావంగానే ఉన్నాడు, దూరంగా ఉన్నాడని అంటున్నారు.

గుంటూరు పశ్చిమలో ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న తెలుగుదేశం నేతలకి చంద్రబాబు టిక్కెట్లు ఇవ్వలేదనే ప్రచారం అన్నింటా వెళ్లిపోయింది. ఎంతసేపు టిక్కెట్లు ఇచ్చేవాళ్లకి డబ్బులున్నాయా? లేవా? ఎన్నికల్లో ఖర్చుపెట్టగలరా? లేదా?  ఇదే చంద్రబాబు ఆలోచించాడని అంటున్నారు. 

ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున యాక్టివ్ గా ప‌ని చేసిన వారు అలిగి వెళ్లిపోవ‌డం, నిర్లిప్తంగా ఉండ‌టం, ఇక జ‌న‌సేన‌, బీజేపీ వాళ్లు తెలుగుదేశం అభ్య‌ర్థిని పూర్తి లైట్ తీసుకోవ‌డం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి విడ‌ద‌ల ర‌జ‌నీకి పూర్తి సానుకూలాంశంగా మారింది! స్థానిక ప‌రిస్థితుల‌ను ప‌ట్టించుకోకుండా కేవ‌లం డ‌బ్బులు ఉంటే చాల‌న్న‌ట్టుగా చంద్ర‌బాబు నాయుడు టీడీపీ అభ్య‌ర్థిని డిసైడ్ చేశార‌ని, అటు తెలుగుదేశం నేత‌ల‌ను కానీ, కూట‌మి నేత‌ల‌ను కానీ స‌మ‌న్వ‌యం చేయ‌డంలో ఆయ‌న ఫెయిల్ అయ్యార‌నే మాట పోలింగ్ కు ముందు గ‌ట్టిగా వినిపిస్తూ ఉంది.

సాయంత్రం నాలుగ‌య్యాకా ఓపెన్ టాప్ ఎక్కి అదే ప్రచారం అన్న‌ట్టుగా గ‌ల్లా మాధ‌వి వ్య‌వ‌హ‌రిస్తున్నారు! ఇక గుంటూరు ఎంపీ అభ్య‌ర్థిగా తెలుగుదేశం తెచ్చుకున్న వ్య‌క్తి ప‌ట్ల కూడా టీడీపీలో చిచ్చు ఉండ‌నే ఉంది! ప‌చ్చ‌మీడియానే ఒక ద‌శ‌లో ఎక్క‌డ్నుంచి తెస్తారు ఇలాంటి వాళ్ల‌నంతా అన్న‌ట్టుగా క‌థ‌నాల‌ను రాసింది! ఏతావాతా.. తెలుగుదేశం పార్టీ కూట‌మిలో చోటు చేసుకున్న నిర్లిప్త‌త విడ‌ద‌ల‌కు వ‌రంగా మారే ప‌రిస్థితి క‌నిపిస్తూ ఉంది!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?